బెంగళూరు: కృష్ణా నదీజలాల పంపకం మళ్లీ కొత్తగా జరగాలని, ఇందుకోసం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణ వాదనను తిప్పికొట్టడానికి ఏం చర్యలు తీసుకోవాలనే విషయంపై సమాలోచనలు జరుపుతోంది. ఇందులో భాగంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం నీటిపారుదల రంగ నిపుణులు, న్యాయకోవిదులతో సమావేశమయ్యారు. తాము తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై చర్చించారు. ఈ నెల 14వ తేదీన మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో తెలంగాణ ప్రతినిధి బృందం కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉమాభారతిని కలిసి కృష్ణా నీటిలో వాటాలను తేల్చడానికి కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కోరిన విషయం తెలిసిందే.
ఇదివరకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు కేటాయింపులు జరిగాయని... అప్పుడు ‘తెలంగాణ’ ప్రత్యేక రాష్ట్రంగా లేనందువల్ల ఈ ప్రాంతానికి ఎంత వాటా అనేది తేల్చలేదని... ఈ రకంగా బచావత్, బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునళ్ల కేటాయింపుల్లో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందని హరీశ్ పేర్కొన్నారు. తెలంగాణ వాదనపై మీ వైఖరేమిటో తెలపాలంటూ కృష్ణా ట్రిబ్యునల్ కర్ణాటక ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీకి నోటీసు జారీచేసింది. ఈ నేపథ్యంలోనే సోమవారం సమావేశం జరిగింది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పులో మార్పులు జరిగే ప్రసక్తేలేదని, అది తమకు సమ్మతం కాబోదని కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి ఎం.బి. పాటిల్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కూడా కృష్ణా జలాల్లో ఉమ్మడి రాష్ట్ర వాటాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు పంచాలని పేర్కొన్నారని... అందువల్ల ఇందులోకి కర్ణాటకను లాగడం సబబు కాదని ఆయన అన్నారు. అది వారు (తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు) తేల్చుకోవాల్సిన అంశమన్నారు.
ఎవరి వాటా ఎంతో మీరే తేల్చుకోండి
Published Tue, Jul 22 2014 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM
Advertisement
Advertisement