ఎత్తు పెంచాలన్న ప్రతిపాదనకు ఆమోదం
పెంచినా డ్యాం నిల్వ సామర్థ్యం పెంచకూడదన్న తెలంగాణ
నవలి రిజర్వాయర్ నిర్మాణానికి అనుమతివ్వాలన్న కర్ణాటక.. వ్యతిరేకించిన ఏపీ, తెలంగాణ
హెచ్చెల్సీకి సమాంతరంగా వరద కాలువ తవ్వడానికి అనుమతివ్వాలన్న ఏపీ.. వ్యతిరేకించిన తెలంగాణ
వాడివేడిగా తుంగభద్ర బోర్డు సమావేశం
సాక్షి, అమరావతి//సాక్షి, బళ్లారి: తుంగభద్ర డ్యాం గేట్లను మార్చాలన్న తుంగభద్ర బోర్డు ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ అధికారులు అంగీకరించారు. డ్యాం భద్రత దృష్ట్యా గేట్ల ఎత్తును పెంచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. కానీ, గేట్ల ఎత్తు పెంచడంవల్ల డ్యాం నిల్వ సామర్థ్యం పెరగకుండా చూడాలని తెలంగాణ అధికారులు చేసిన ప్రతిపాదనకు బోర్డు అంగీకరించింది.
కర్ణాటక హోస్పేటలోని తుంగభద్ర బోర్డు కార్యాలయంలో శుక్రవారం 222వ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. బోర్డు చైర్మన్ డీఎం రాయ్‌పురే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వం తరఫున అనంతపురం సీఈ నాగరాజు, కర్ణాటక అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ఈఎన్‌సీ అనిల్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
ఇటీవల వరదలకు తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో డ్యాం భద్రతపై నిపుణుల కమిటీతో బోర్డు తనిఖీ చేయించింది. గేట్ల కాల పరిమితి ముగిసిందని.. వాటి స్థానంలో కొత్త గేట్లు అమర్చాలని నిపుణుల కమిటీ ఇచి్చన నివేదికను బోర్డు సమావేశంలో సభ్య కార్యదర్శి ఓఆర్కే రెడ్డి ప్రవేశపెట్టారు. దీనిని మూడు రాష్ట్రాల అధికారులు ఆమోదించారు. దశల వారీగా గేట్లను మార్చాలని నిర్ణయించారు.
ఏకాభిప్రాయంతోనే నమలి రిజర్వాయర్..
ఇక పూడికవల్ల తుంగభద్ర డ్యాం నిల్వ సామర్థ్యం తగ్గిన నేపథ్యంలో.. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన జలాలను పూర్తిస్థాయిలో వాడుకోవడానికి నవలి వద్ద 30 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి అనుమతివ్వాలని కర్ణాటక సర్కారు చేసిన ప్రతిపాదనను ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. మూడు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వస్తేనే నవలి రిజర్వాయర్ నిర్మాణంపై చర్చిద్దామని బోర్డు చైర్మన్ రాయ్‌పురే స్పష్టంచేశారు.
పూడికవల్ల డ్యాం నిల్వ సామర్థ్యం తగ్గిన నేపథ్యంలో.. హెచ్చెల్సీకి సమాంతరంగా వరద కాలువ తవ్వి, హెచ్చెల్సీ వాటా జలాలను తీసుకెళ్తామని.. డ్యాంలో నిల్వ ఉన్న నీటిని మిగతా ఆయకట్టుకు సరఫరా చేయడం ద్వారా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన జలాలను వాడుకోవచ్చని ఏపీ అధికారులు చేసిన ప్రతిపాదనను తెలంగాణ ఈఎన్‌సీ వ్యతిరేకించారు. డ్యాంలో పూడికతీతకు కేంద్రం ఇటీవల ప్రకటించిన జాతీయ విధానాన్ని అమలుచేయాలని సూచించారు.
పూడిక తీయడం ద్వారా తుంగభద్ర డ్యాం నిల్వ సామర్థ్యం పెంచుకోవచ్చని ప్రతిపాదించారు. తుంగభద్రలో నీటి లభ్యత లేనప్పుడు కేసీ కెనాల్ ఆయకట్టులో పంటలను రక్షించుకోవడానికి కృష్ణా జలాలను వాడుకోవడానికి అనుమతివ్వాలన్న ఏపీ అధికారుల ప్రతిపాదనపై తెలంగాణ ఈఎన్‌సీ అభ్యంతరం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment