tungabhadra dam
-
తుంగభద్ర డ్యాం గేట్ల మార్పునకు ఓకే
సాక్షి, అమరావతి//సాక్షి, బళ్లారి: తుంగభద్ర డ్యాం గేట్లను మార్చాలన్న తుంగభద్ర బోర్డు ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ అధికారులు అంగీకరించారు. డ్యాం భద్రత దృష్ట్యా గేట్ల ఎత్తును పెంచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. కానీ, గేట్ల ఎత్తు పెంచడంవల్ల డ్యాం నిల్వ సామర్థ్యం పెరగకుండా చూడాలని తెలంగాణ అధికారులు చేసిన ప్రతిపాదనకు బోర్డు అంగీకరించింది. కర్ణాటక హోస్పేటలోని తుంగభద్ర బోర్డు కార్యాలయంలో శుక్రవారం 222వ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. బోర్డు చైర్మన్ డీఎం రాయ్‌పురే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వం తరఫున అనంతపురం సీఈ నాగరాజు, కర్ణాటక అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఇటీవల వరదలకు తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో డ్యాం భద్రతపై నిపుణుల కమిటీతో బోర్డు తనిఖీ చేయించింది. గేట్ల కాల పరిమితి ముగిసిందని.. వాటి స్థానంలో కొత్త గేట్లు అమర్చాలని నిపుణుల కమిటీ ఇచి్చన నివేదికను బోర్డు సమావేశంలో సభ్య కార్యదర్శి ఓఆర్కే రెడ్డి ప్రవేశపెట్టారు. దీనిని మూడు రాష్ట్రాల అధికారులు ఆమోదించారు. దశల వారీగా గేట్లను మార్చాలని నిర్ణయించారు. ఏకాభిప్రాయంతోనే నమలి రిజర్వాయర్.. ఇక పూడికవల్ల తుంగభద్ర డ్యాం నిల్వ సామర్థ్యం తగ్గిన నేపథ్యంలో.. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన జలాలను పూర్తిస్థాయిలో వాడుకోవడానికి నవలి వద్ద 30 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి అనుమతివ్వాలని కర్ణాటక సర్కారు చేసిన ప్రతిపాదనను ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. మూడు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వస్తేనే నవలి రిజర్వాయర్ నిర్మాణంపై చర్చిద్దామని బోర్డు చైర్మన్ రాయ్‌పురే స్పష్టంచేశారు. పూడికవల్ల డ్యాం నిల్వ సామర్థ్యం తగ్గిన నేపథ్యంలో.. హెచ్చెల్సీకి సమాంతరంగా వరద కాలువ తవ్వి, హెచ్చెల్సీ వాటా జలాలను తీసుకెళ్తామని.. డ్యాంలో నిల్వ ఉన్న నీటిని మిగతా ఆయకట్టుకు సరఫరా చేయడం ద్వారా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన జలాలను వాడుకోవచ్చని ఏపీ అధికారులు చేసిన ప్రతిపాదనను తెలంగాణ ఈఎన్సీ వ్యతిరేకించారు. డ్యాంలో పూడికతీతకు కేంద్రం ఇటీవల ప్రకటించిన జాతీయ విధానాన్ని అమలుచేయాలని సూచించారు. పూడిక తీయడం ద్వారా తుంగభద్ర డ్యాం నిల్వ సామర్థ్యం పెంచుకోవచ్చని ప్రతిపాదించారు. తుంగభద్రలో నీటి లభ్యత లేనప్పుడు కేసీ కెనాల్ ఆయకట్టులో పంటలను రక్షించుకోవడానికి కృష్ణా జలాలను వాడుకోవడానికి అనుమతివ్వాలన్న ఏపీ అధికారుల ప్రతిపాదనపై తెలంగాణ ఈఎన్సీ అభ్యంతరం వ్యక్తంచేశారు. -
తుంగభద్ర గేట్లన్నీ మార్చాల్సిందే
సాక్షి, అమరావతి/సాక్షి, బళ్లారి/హొసపేటె: తుంగభద్ర డ్యామ్ గేట్లన్నీ మార్చాల్సిందేనని సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం) మాజీ చైర్మన్ ఏకే బజాజ్ నేతృత్వంలోని కమిటీ బోర్డుకు స్పష్టం చేసింది. ఏ డ్యాం గేట్లైనా 45 ఏళ్లు మాత్రమే సమర్థంగా పనిచేస్తాయని పేర్కొంది. తుంగభద్ర డ్యామ్ గేట్లు 70 ఏళ్లుగా పనిచేస్తున్నాయని.. తుప్పుపట్టినప్పుడు దాన్ని తొలగించి రంగులు వేస్తుండటం వల్ల వాటి మందం తగ్గిందని, బలహీనంగా మారాయని తెలిపింది. దీనివల్లే ఆగస్టు 10న డ్యాం 19వ గేటు కొట్టుకుపోయిందని తేల్చిచెప్పింది. డ్యామ్ భద్రత దృష్ట్యా 33 గేట్లనూ మార్చి.. వాటి స్థానంలో కొత్త గేట్లు అమర్చాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను బుధవారం నేషనల్ డ్యామ్ సేఫ్టీ కమిటీ, సీడబ్ల్యూసీకి ఏకే బజాజ్ అందించనున్నారు. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు గేట్ల మార్పుపై తుంగభద్ర బోర్డు నిర్ణయం తీసుకోనుంది. కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటుచేయడానికే రూ.5 కోట్లకుపైగా బోర్డు వ్యయం చేసింది. ఈలెక్కన పూర్తి స్థాయిలో ఒక్క గేటు ఏర్పాటుకు రూ.8 కోట్లపైగా వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన 33 గేట్లు ఏర్పాటుచేయాలంటే రూ.264 కోట్లకుపైగా వ్యయం అవుతుందని చెబుతున్నారు. గేట్లు ఎత్తడానికి దించడానికి వీలుగా హైడ్రాలిక్ హాయిస్ట్ వంటి అధునాతన వ్యవస్థను ఏర్పాటుచేయాలంటే అదనంగా మరో రూ.వంద కోట్ల వరకూ వ్యయం అవుతుందని లెక్కలు వేస్తున్నారు. ఈ వ్యయాన్ని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నీటి కేటాయింపులు, ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో భరించాల్సి ఉంటుంది. బజాజ్ కమిటీ సమగ్ర అధ్యయనంతుంగభద్ర డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో డ్యామ్ గేట్లు, భద్రతపై సమగ్రంగా అధ్యయనం చేయాలని కేంద్రానికి కర్ణాటక ప్రభుత్వం లేఖ రాసింది. దాంతో తుంగభద్ర డ్యామ్ గేట్లపై అధ్యయానికి సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏకే బజాజ్ అధ్యక్షతన గేట్ల నిపుణులు హర్కేశ్ కుమార్, తారాపురం సుధాకర్ సభ్యులుగా కేంద్రం త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ ఆదివారం, సోమవారం డ్యామ్‌ను సమగ్రంగా పరిశీలించి.. గేట్ల పనితీరుపై అధ్యయనం చేసింది. -
విజయవంతంగా స్టాప్‌లాగ్ గేటు ఏర్పాటు
సాక్షి, బళ్లారి/ హొసపేటె/హొళగుంద: తుంగభద్ర డ్యాంలో కొట్టుకుపోయిన 19వ క్రస్ట్ గేటు స్థానంలో స్టాప్‌లాగ్ గేటు ఏర్పాటు పూర్తయింది. శుక్రవారం రాత్రి ఈ గేటు తొలి భాగాన్ని బిగించిన సిబ్బంది.. శనివారం ఉదయం నుంచి సాయంత్రంలోగా మరో నాలుగు భాగాలను బిగించారు. దీంతో గేటు ఏర్పాటు విజయవంతంగా పూర్తయింది. ఓపక్క 71 టీఎంసీల నీరు జలాశయంలో ఉన్నప్పటికీ.. ప్రత్యేక నిపుణుడు కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో ఇంజినీర్లు, సిబ్బంది సాహసోపేతంగా ఐదు భాగాలను బిగించారు. దీంతో డ్యాం గేట్లను మూసివేశారు. స్టాప్‌లాగ్ గేటు నుంచి మాత్రం కొద్దిపాటి నీరు లీకవుతోంది. దానిని కూడా ఆదివారానికి సరిచేస్తామని అధికారులు తెలిపారు. ఈ ఖరీఫ్ పంటలకు ఇబ్బంది లేదని తెలిపారు. ఈ నెల 9వ తేదీన కొట్టుకుపోయిన 19వ గేటు భాగాలు డ్యాంకు దిగువన కొంత దూరంలో శనివారం కనిపించాయి.నీరు వృథా కాకుండా..కొట్టుకుపోయిన గేటు స్థానంలో స్టాప్‌లాగ్ గేటు ఏర్పాటులో ప్రభుత్వం, అధికారులు చూపిన చొరవ 35 టీఎంసీల జలాలు వృథాగా పోకుండా కాపాడగలిగారు. గేటు కొట్టుకుపోయిన వెంటనే డ్యాం అధికారులు రక్షణ చర్యల్లో భాగంగా 33 గేట్లలో 29 గేట్ల వరకు ఎత్తి దాదాపు లక్షా ఇరవై వేల క్యూసెక్కుల నీటిని వారం పాటు నదిలోకి వదిలాల్సి వచ్చింది. జలాశయంలో ముందుగా 65 టీఎంసీల నీరును ఖాళీ చేస్తే గేట్లు అమర్చవచ్చని అనుకున్నప్పటికీ, అధికారులు కేవలం 30 టీఎంసీలే నీరు నదిలోకి వదిలి గేట్లను పెట్టడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గేట్ల నిపుణుడు 81 ఏళ్ల కన్నయ్యనాయుడు కృషితో 71 టీఎంసీల వద్ద గేట్లు ఏర్పాటు చేశారు. దీంతో 35 టీఎంసీల నీటిని ఆదా చేయగలిగారు. గేటు కొట్టుకుపోవడంతో పంటలు నష్టపోతామని రైతులు ఆందోళన చెందారని, స్టాప్‌లాగ్ గేటు ఏర్పాటుతో వారంతా ఊపిరి పీల్చుకున్నారని ఏపీ తుంగభద్ర రైతు సంఘం నేత తప్పెట రామిరెడ్డి అన్నారు. -
కొట్టుకుపోయిన గేటు స్థానంలో అత్యవసర గేటు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్, కర్ణాటక జల వనరుల శాఖ అధికారులు, నిపుణులతో చర్చించాక.. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ 19వ గేటు స్థానంలో అత్యవసర గేటు ఏర్పాటు చేయాలని తుంగభద్ర బోర్డు నిర్ణయించింది. సాధారణంగా ప్రాజెక్టులపై క్రస్ట్ గేటు.. స్టాప్ లాక్ గేటు దించడానికి వీలుగా రెండు గాడి(గ్రూవ్)లు పియర్స్ (సిమెంటు దిమ్మెలు)కు ఏర్పాటు చేస్తారు. కానీ.. తుంగభద్ర డ్యామ్ పాత డిజైన్ కావడంతో క్రస్ట్ గేటు ఏర్పాటుకు ఒకే గాడిని ఏర్పాటు చేశారు. దీని వల్ల స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేయలేని పరిస్థితి. దీనిపై సోమవారం తుంగభద్ర డ్యామ్ వద్ద బోర్డు కార్యదర్శి ఓఆర్కే రెడ్డి.. నిపుణులు, గేట్ల సలహాదారు కన్నయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ జల వనరుల విభాగం సీఈ (హైడ్రాలజీ) రత్నకుమార్, కర్ణాటక జల వనవరుల శాఖ సలహాదారు మల్లికార్జున గుంబ్లీ తదితరులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో క్రస్ట్ గేటు గాడిలోనే అత్యవసర గేటును అమర్చాలని నిర్ణయించారు. అత్యవసర గేటు తయారీ పనులను హిందూస్థాన్ ఇంజినీరింగ్ వర్క్స్, నారాయణ ఇంజినీరింగ్ వర్క్స్‌కు అప్పగించారు. ఈ గేటును 20 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేయనున్నారు. అత్యవసర గేటును 5 భాగాలు (ఎలిమెంట్లు)గా తయారు చేస్తారు. మొదటి ఎలిమెంట్‌ను 2 అడుగుల ఎత్తు, రెండో ఎలిమెంట్‌ను 4 అడుగులు, మూడో ఎలిమెంట్ 6 అడుగుల ఎత్తు.. నాలుగు, ఐదు ఎలిమెంట్లు 4 అడుగుల ఎత్తు, 60 మీటర్ల వెడల్పుతో తయారు చేస్తారు. ఆ ఎలిమెంట్లకు ఇరు వైపులా రోలర్లను అమర్చుతారు. ఆ తర్వాత 19వ గేటు ఉన్న 18, 19 పియర్లకు ఉన్న గాడి(గ్రూవ్)లో మొదటి ఎలిమెంటును దించుతారు. ఆ తర్వాత రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు ఎలిమెంట్లను దించడం ద్వారా అత్యవసర గేటు ఏర్పాటు చేస్తారు. గేటు తయారీ ప్రక్రియకు ఐదారు రోజులు పడుతుందని.. రోలర్లు అందుబాటులో ఉంటే.. డ్యామ్‌లో ఎప్పుడు నీటి మట్టం 1,613 అడుగులు (కనీస నీటి మట్టం) స్థాయికి తగ్గినప్పుడు అత్యవసర గేటు అమర్చుతామని అధికారులు చెబుతున్నారు.నీటి వృథాకు అడ్డుకట్ట వేసేందుకు.. తుంగభద్ర డ్యామ్ గరిష్ట నీటి మట్టం 1633 అడుగులు. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 105.79 టీఎంసీలు. డ్యామ్ కనీస నీటి మట్టం 1613 అడుగులు. అదే స్థాయి నుంచి 1633 అడుగుల వరకు 20 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పుతో స్పిల్ వేకు 33 గేట్లను బిగించారు. ఇప్పుడు అత్యవసర గేటు ఏర్పాటు చేయాలంటే 1613 అడుగుల స్థాయికి అంటే డ్యామ్‌లో నీటి నిల్వను 43.83 టీఎంసీలకు తగ్గించాలి. దాంతో శనివారం నుంచే డ్యామ్‌లో నీటిని ఖాళీ చేస్తున్నారు. సోమవారం నాటికి డ్యామ్‌లో 97.75 టీఎంసీలు ఉండగా.. డ్యామ్‌లోకి 25,571 క్యూసెక్కులు చేరుతుండగా.. 99,567 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. డ్యామ్‌లో నీటి నిల్వను 1613 అడుగులకు తగ్గిస్తే సుమారు 61 టీఎంసీల మేర నీరు వృథా అవుతుంది. నీటి వృథాను అరికట్టడానికి నీటి మట్టం 1613 అడుగుల కంటే ఎగువన ఉన్నప్పటికీ అత్యవసర గేటును దించే ప్రయత్నం చేద్దామని నిపుణులు కన్నయ్యనాయుడు సూచించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.నిపుణుల సలహాల మేరకు గేటును అమర్చేందుకు ప్రయత్నిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, వేసవిలో పూర్తి స్థాయి క్రస్ట్ గేటును అమర్చాలని బోర్డు నిర్ణయించింది.సక్రమంగా దించకపోవడం వల్లే.. గేట్ల నిర్వహణలో నిపుణులైన అధికారులు, సిబ్బంది అధిక శాతం పదవీ విరమణ చేశారు. వారి స్థానంలో కాంట్రాక్టు పద్ధతిలో సిబ్బందిని నియమించారు. వారికి గేట్ల నిర్వహణలో అనుభవం లేదు. స్పిల్ వే 19వ గేటును సక్రమంగా దించపోవడం వల్లే.. అంటే ఒక కొస దిగువకు దిగి, మరొక కొస ఎగువన ఉండటం వల్ల (ఎగుడు దిగుడు) వరద ఉధృతికి గేటు కొట్టుకుపోయిందని చైన్ తెగడం వల్ల గేటు కొట్టుకుపోయే అవకాశమే లేదని నిపుణులు తేల్చి చెబుతున్నారు. మిగతా 32 గేట్లపై సీఈసీఆర్ఐతో అధ్యయనం తుంగభద్ర డ్యామ్ నిర్మాణం పూర్తయి దాదాపుగా 71 ఏళ్లు పూర్తయింది. గేట్ల నిర్వహణ ప్రారంభమై 66 ఏళ్లు పూర్తయింది. ఈ 66 ఏళ్లలో 2.5 మిలియన్ సైకిల్ ద్వారా ఎత్తడం, దించడం చేశారు. ఇప్పుడు కొట్టుకుపోయిన గేటు కాకుండా, మిగతా 32 గేట్ల పనితీరు సవ్యంగా ఉన్నట్లు ఏపీ, కర్ణాటక అధికారులు, నిపుణులు కన్నయ్య నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. వరద ఉధృతితో గేట్లపై ఒత్తిడి పడి, బలహీనపడే అవకాశం ఉంటుంది. అందుకే గేట్ల కాల పరిమితిని 45 ఏళ్లు, కాంక్రీట్ కట్టడాల కాల పరిమితి 100 ఏళ్లుగా సీడబ్ల్యూసీ నిర్దేశించింది. కానీ.. 66 ఏళ్లవుతున్నా గేట్లను ఎందుకు మార్చలేదని కన్నయ్య నాయుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మిగతా 32 గేట్లు సవ్యంగా పని చేస్తున్నప్పటికీ.. వాటి సామర్థ్యంపై తమిళనాడులో కరైకుడిలోని సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఈసీఆర్ఐ)తో అధ్యయనం చేయించాలని బోర్డుకు సూచించారు. సీఈసీఆర్ఐ నివేదిక ఆధారంగా గేట్లకు మరమ్మతులు లేదా కొత్త గేట్ల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. టీబీ డ్యాం సర్కారు నియంత్రణలో లేదు సాక్షి, బళ్లారి: తుంగభద్ర జలాశయాన్ని కర్ణాటక ప్రభుత్వం నిర్వహించడం లేదని, అందుకు ప్రత్యేక బోర్డు ఉందని, అందులో తాము సభ్యులం మాత్రమేనని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో సోమవారం ఆయన తుంగభద్ర డ్యాంను సందర్శించారు. అనంతరం బెంగళూరుకు వెళ్లి నీటి పారుదల నిపుణులతో సమావేశమైన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘డ్యాంను పరిశీలించాను. గేట్ కొట్టుకుపోవడంపై సంబంధిత అధికారులతో, కాంట్రాక్టర్లతో చర్చించాను. నూతన క్రస్ట్ గేట్‌ను పునరుద్ధరించడానికి ఐదు రోజులు పట్టొచ్చు. ఖరీఫ్ పంటకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. మంగళవారం ముఖ్యమంత్రి సిద్దరామయ్య డ్యాంను సందర్శించి నిపుణులతో మాట్లాడతారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని చెప్పారు. కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ -
నేడు రెండోరోజు తుంగభద్ర డ్యామ్ కు ఎక్స్ పర్ట్ టీమ్
-
లక్ష క్యూసెక్కుల నీరు వృథా.. రైతుల ఆశ నిరాశే...
-
తుంగభద్ర డ్యామ్ కు రెడ్ అలర్ట్..
-
తుంగభద్ర డ్యామ్ కు పోటెత్తిన వరద.. కొట్టుకుపోయిన గేటు
-
తుంగభద్రలో అంచనాలకు మించి నీరు
సాక్షి, అమరావతి: ప్రస్తుత నీటి సంవత్సరం ప్రారంభంలో తుంగభద్ర బోర్డు అంచనా వేసిన 173 టీఎంసీల కంటే తుంగభద్ర డ్యామ్‌లో నీటి లభ్యత అధికంగా ఉండే అవకాశం ఉందని సాగునీటిరంగ నిపుణులు చెబుతుండటంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2019, 2020, 2021, 2022 తరహాలోనే రాష్ట్రానికి దక్కాల్సిన వాటా నీటిని విడుదల చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. గతేడాది డ్యామ్‌లోకి కేవలం 114.58 టీఎంసీల ప్రవాహమే వచ్చినా.. రాష్ట్రానికి గరిష్ఠ స్థాయిలో నీటిని రాబట్టి ఆయకట్టు రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం పరిరక్షించిందని గుర్తుచేస్తున్నారు. జూన్ 1 నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు తుంగభద్ర డ్యామ్‌లోకి 249.02 టీఎంసీల ప్రవాహం వచ్చి0ది. ఇందులో 104.70 టీఎంసీలను డ్యామ్‌లో నిల్వచేసి.. కాలువలకు 25 టీఎంసీలు విడుదల చేసి.. మిగిలిన 120 టీఎంసీలను గేట్లు ఎత్తి దిగువకు వదిలేశారు. తుంగభద్ర డ్యామ్‌లోకి నవంబర్ చివరి వరకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈలెక్కన డ్యామ్‌లో నీటి లభ్యత బోర్డు అంచనా వేసిన 173 టీఎంసీల కంటే అధికంగా ఉంటుందని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. కోటా నీటిని రాబడితేనే రైతులకు ప్రయోజనం తుంగభద్ర డ్యామ్‌లో 230 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్.. కర్ణాటకకు 151.49, ఏపీకి 72 (హెచ్చెల్సీ 32.50, ఎల్లెల్సీ 29.50, కేసీ 10.00), తెలంగాణకు 6.51 (రాజోలిబండ డైవర్షన్ స్కీం) టీఎంసీల చొప్పున కేటాయించింది. ఏటా పూడిక పేరుకుపోతుండటంతో డ్యామ్ నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. 2016లో నిర్వహించిన సర్వేలో డ్యామ్ సామర్థ్యం 105.78 టీఎంసీలని తేలింది. తగ్గిన నిల్వ సామర్థ్యం, నీటిలభ్యత ఆధారంగా దామాషా పద్ధతిలో మూడు రాష్ట్రాలకు తుంగభద్ర బోర్డు పంపిణీ చేస్తూ వస్తోంది.2019–20, 2020–21, 2021–22, 2022–23, 2023–24ల్లో తుంగభద్ర బోర్డు చరిత్రలో అత్యధిక స్థాయిలో రాష్ట్ర కోటా కింద హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, కేసీ కెనాల్ వాటాను రాబట్టిన ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను పరిరక్షించింది. నాలుగేళ్లు ఏటా సగటున 69 టీఎంసీలను బోర్డు నుంచి ప్రభుత్వం విడుదల చేయించింది. గతేడాది తుంగభద్ర డ్యామ్‌లోకి కేవలం 114.58 టీఎంసీల ప్రవాహమే వచ్చినా.. 40 టీఎంసీలు రాష్ట్రానికి దక్కేలా చేసి రైతుల ప్రయోజనాలను పరిరక్షించింది. ఈ ఏడాది నీటి లభ్యత పెరిగిన నేపథ్యంలో 2019–23 మధ్య తరహాలోనే ఇప్పుడూ గరిష్ఠంగా నీటి వాటాను రాబట్టి ప్రయోజనాలను పరిరక్షించాలని రైతులు కోరుతున్నారు. -
రేపు శ్రీశైలం గేట్లు ఎత్తివేత!
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 3.79 లక్షల క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 18 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులను తరలిస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 61,111 క్యూసెక్కులు విడదుల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 873.4 అడుగుల్లో 156.39 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 59 టీఎంసీలు అవసరం. ప్రస్తుతం ఎగువ నుంచి భారీ వరద రావడంతో పాటు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం ఉదయానికి ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. దీంతో మంగళవారం ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తామని అధికారవర్గాలు వెల్లడించాయి. నాగార్జునసాగర్‌లోకి 53,774 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 510.2 అడుగుల్లో 132.01 టీఎంసీలకు చేరుకుంది.మహారాష్ట్ర, కర్ణాటకలలో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో కృష్ణా నది ఎగువన వరద ఉధృతి కొనసాగుతోంది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 2.68 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, దిగువకు 3.25 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోకి 3.20 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, 3.27 లక్షల క్యూసెక్కులను వదిలేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులోకి 3.04 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 2.98 లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. తగ్గని తుంగభద్ర తుంగభద్ర డ్యామ్‌లోకి వరద ఉధృతి కొనసాగుతోంది. డ్యామ్‌లోకి 1.24 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.51 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. దాంతో మంత్రాలయం వద్ద వరద ఉధృతి మరింతగా పెరిగి, ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో అధికారులు ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. సుంకేశుల బరాజ్‌లోకి 1.49 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. కేసీ కెనాల్‌కు 1,540 క్యూసెక్కులను వదులుతూ, 1.46 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నా రు. అటు జూరాల నుంచి కృష్ణా వరద, ఇటు సుంకేశుల నుంచి తుంగభద్ర వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులో చేరుతున్న వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. -
శ్రీశైలంలోకి 96,369 క్యూసెక్కులు
సాక్షి, అమరాతి/శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 96,369 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 822.5 అడుగులకు చేరింది. జలాశయంలో నీరు 42.73 టీఎంసీలకు చేరుకుంది. కట్టలేరు, మున్నేరు పరవళ్లు తొక్కుతుండటంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 13,634 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇక్కడ 17 గేట్లు ఒక అడుగుమేర ఎత్తి 12,325 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉద్ధృతి మరింత పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1,17,647 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 78.67 టీఎంసీలకు చేరింది. మూడురోజుల్లో తుంగభద్ర డ్యామ్ నిండే అవకాశం ఉంది. అప్పుడు గేట్లు ఎత్తి దిగువకు వరదను విడుదల చేస్తారు. -
శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 96, 369 క్యూసెక్కుల నీరు రావడంతో నీటినిల్వ 822.5 అడు గుల్లో 42.73 టీఎంసీలకు చేరుకుంది. నాగార్జునసాగర్ లోకి ఎలాంటి వరద చేరకపోగా.. పులిచింతల ప్రాజెక్టు లోకి కేవలం 640 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. కాగా పులిచింతలకు దిగువన నదిపరీవాహక ప్రాంతం(బేసిన్)లో విస్తారంగా కురిసిన వర్షాలకు కట్టలేరు, మున్నేరు పరవళ్లు తొక్కగా, ఏపీలోని ప్రకాశం బ్యారేజీలోకి 13,634 క్యూసెక్కుల నీరు చేరింది.ఇందులో కృష్ణా డెల్టా కు 1,309 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 12,325 క్యూసెక్కులను 17 గేట్లు ఒక అడుగు మేర ఎత్తి సముద్రంలోకి అధికారులు వదిలేస్తున్నారు. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల కృష్ణా ప్రధానపాయలో ఎగువన వరద ప్రవాహం కొంత పెరిగింది. ఆల్మట్టిలోకి 1.24 లక్షల క్యూసెక్కుల నీరు చేరగా, గేట్లు ఎత్తి 1.50 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలారు.దాని దిగువన నారాయణపూర్ డ్యామ్‌లోకి 1.25 లక్షల క్యూసెక్కుల నీరు చేరగా, గేట్లు ఎత్తి 1,45,750 క్యూసెక్కుల నీటికి వదలడంతో జూరాల ప్రాజెక్టులోకి చేరుతున్న వరద క్రమేపి పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టులోకి 1,29,000 లక్షల క్యూసెక్కుల నీరు చేరగా.. విద్యుదుత్పత్తి చేస్తూ, గేట్లు ఎత్తి 1,34,161 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. మూడు రోజుల్లో తుంగభద్ర గేట్లు ఎత్తేసే అవకాశంఇక కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉధృతి మరింత పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1,17,647 క్యూసెక్కుల నీటిరాకతో నీటినిల్వ 78.67 టీఎంసీలకు చే రుకుంది. నిండుకుండను తలపిస్తున్న తుంగభద్ర డ్యామ్ లో ఆదివారం విద్యుదుత్పత్తిని ప్రారంభించిన అధికారు లు.. 4,754 క్యూసెక్కులను దిగువకు వదిలారు. తుంగభద్రలో మరో మూడు రోజులు ఇదే రీతిలో వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 27 టీఎంసీలు చేరితే తుంగభద్ర డ్యామ్ నిండుతుంది. మూడు రోజుల్లో తుంగభద్ర డ్యామ్ నిండే అవకాశముంది. సాగర్ నీటిమట్టం 504.30 అడుగులునాగార్జునసాగర్/మునగాల: నాగార్జునసాగర్ నీటిమట్టం ప్రస్తుతం 504.30 అడుగులుగా ఉంది. తాగునీటికి అవసరాల కోసం కుడి కాల్వ ద్వారా 5,700 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 3,146 క్యూసెక్కులు, ఏఎమ్మార్పీ ద్వారా 800 క్యూసెక్కులు ఇలా మొత్తం 9,646 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాగర్‌కు ఇన్‌ఫ్లో ఏమాత్రం లేదు.ఎడమకాల్వ లాకుల వద్ద పహారా: సూర్యాపేట జిల్లా మునగాలలోని సాగర్ ఎడమకాల్వ ప్రధాన లాకుల వద్ద రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పహారా కాస్తున్నారు. తాగునీటి అవసరాల కోసం సాగర్ ఎడమకాల్వకు నీటిని విడుదల చేస్తుండగా, రైతులు ఈ నీటిని పంటల సాగుకు మళ్లించకుండా ఉండేందుకు పహారా ఏర్పాటు చేశారు. -
నేడు మల్లన్న చెంతకు కృష్ణమ్మ
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం/నాగార్జునసాగర్: శ్రీశైలం మల్లన్న చెంతకు కృష్ణమ్మ శనివారం చేరుకోనుంది. కృష్ణా ప్రధాన పాయపై కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యా మ్ల నుంచి విడుదల చేస్తున్న వరద ప్రవాహం శుక్రవారం జూరాల ప్రాజెక్టుకు చేరుకుంది. జూరాలలో విద్యుత్ కేంద్రం, గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శనివారం వర ద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంటుంది. పశి్చమ క నుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణా ప్రధాన పా యలో శుక్రవారం వరద మరింత తగ్గింది.ఆల్మట్టి డ్యామ్‌లోకి 43,478 క్యూసెక్కుల నీరు రాగా, గేట్లు ఎత్తి 65,480 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. నారాయణపూర్ డ్యామ్‌లోకి 65,801 క్యూసెక్కుల నీరు చేరగా, గేట్లు ఎత్తి 70,780 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఎగువ నుంచి వరద వస్తుండటంతో జూరాల ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి చేస్తూ.. గేట్లు ఎత్తి దిగువకు 34,818 క్యూసెక్కులను వదిలేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ కేంద్రంలో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ 7,063 క్యూసెక్కుల నీటిని దిగువకు తరలిస్తుండటంతో నీటి నిల్వ 33.11 టీఎంసీలకు తగ్గింది. నాగార్జునసాగర్‌లోకి వరద ప్రవాహం చేరడం లేదు. సాగర్ కుడి కాలువ, ఏఎమ్మార్పీ ద్వారా 8,165 క్యూసెక్కులను విడుదల చేస్తుండటంతో నీటి నిల్వ 123.5 టీఎంసీలకు తగ్గింది. నేడు తుంగభద్ర డ్యామ్‌లోకి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశంకృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉధృతి మరింత పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1,08,270 క్యూసెక్కుల రా కతో నీటి నిల్వ 58.67 టీఎంసీలకు చేరుకుంది. తుంగభద్ర బే సిన్ పరిధిలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శనివారం తుంగభద్ర డ్యామ్‌లోకి వరద ఉధృతి మరింత పెరుగుతుందని సీడబ్ల్యూసీ ) అంచనా వేసింది. వరద ఇలానే కొనసాగితే నాలుగు రోజుల్లో తుంగభద్ర ప్రాజెక్టు నిండుతుంది. సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదలనాగార్జునసాగర్ జలాశయం నుంచి ఎడమకాల్వ ద్వారా అధికారులు శుక్రవారం 4వేల క్యూసెక్కులకు నీటిని విడుదల చేశారు. సాగర్ కుడి కాల్వ ద్వారా ఏపీలోని వివిధ జిల్లాలకు గత రెండు రోజుల నుంచి నిత్యం 5,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాళేశ్వరం వద్ద 8.500 మీటర్ల ఎత్తులో నీటిప్రవాహంతెలంగాణలోని గోదావరి, మహారాష్ట్రలో ప్రాణహిత నదికి వరద తాకిడి పెరిగింది. అన్నారం(సరస్వతీ) బరాజ్ వద్ద మానేరు వాగు నుంచి 15 వేల క్యూసెక్కుల వరద రాగా, బరాజ్‌లోని మొత్తం 66 గేట్లు పూర్తిగా పైకి ఎత్తి నీటిని దిగు వకు వదిలారు. ఆ వరద నీరు దిగువన కాళేశ్వరం వద్ద కలు స్తోంది. గడ్చిరోలి జిల్లా మీదుగా ప్రాణహిత నదికి వరద పోటెత్తింది. ఆ నీరంతా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద కలుస్తుండడంతో పుష్కరఘాట్లను తాకుతూ వరద దిగువకు తరలిపోతోంది. పుష్కర ఘాట్ల వద్ద 8.500 మీటర్లు ఎత్తులో నీటిప్రవాహం కొనసాగుతోంది. అక్కడినుంచి మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌కు వరద తాకిడి పెరుగుతోంది. బరాజ్ వద్ద 3.73 లక్ష ల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుతోంది.బరాజ్‌లో మొ త్తం 85 గేట్లు పైకి ఎత్తి వచి్చన వరదను వచి్చనట్టు దిగువకు తరలిస్తున్నారు. దిగువన తుపాకులగూడెం బరాజ్‌లోకి 3,75, 430 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో దిగువకు వదిలారు. దుమ్ముగూడెం(సీతమ్మసాగర్)లోకి 3,47,511 క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. దాంతో భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్దకు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 3.75 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం(సముద్ర మట్టానికి) 40.2 మీటర్లకు వరద చేరింది. -
తుంగభద్ర ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లు అందేనా?
సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ(ఐఎండీ) అంచనాల నేపథ్యంలో ఈ ఏడాది తుంగభద్ర డ్యామ్‌లో 170 టీఎంసీల లభ్యత ఉంటుందని తుంగభద్ర బోర్డు, ఏపీ, కర్ణాటక, తెలంగాణ జలవనరుల అధికారులు అంచనా వేస్తున్నారు.ప్రస్తుత నీటి సంవత్సరంలో అంటే ఈనెల 1 నుంచి తుంగభద్ర బేసిన్లో కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల ఇప్పటికి 0.67 టీఎంసీలు తుంగభద్ర డ్యామ్‌లోకి చేరాయి. ఇక శనివారం డ్యామ్‌లోకి 1,490 క్యూసెక్కులు చేరాయి. గతేడాది ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు సక్రమంగా కురవలేదు. దాంతో తుంగభద్ర డ్యామ్‌లోకి కేవలం 114.58 టీఎంసీల ప్రవాహం వచ్చింది. తాగునీటి అవసరాలకుపోను మిగతా నీటితో ఆరుతడి పంటలను ఆయకట్టు రైతులు సాగుచేశారు. ఈ ఏడాదైనా తుంగభద్ర డ్యామ్‌లో నీటి లభ్యత పుష్కలంగా పెరుగుతుందని.. ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందాలని రైతులు ఆశిస్తున్నారు. కేటాయింపుల మేరకైనా లభ్యత ఉండేనా.. తుంగభద్ర డ్యామ్‌లో 230 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్.. కర్ణాటకకు 151.49, ఏపీకి 72 (హెచ్చెల్సీ 32.50, ఎల్లెల్సీ 29.50, కేసీ 10.00), తెలంగాణకు 6.51 (రాజోలిబండ డైవర్షన్ స్కీం) టీఎంసీల చొప్పున కేటాయించింది. ఏటా పూడిక పేరుకుపోతుండటంతో డ్యామ్ నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. 2016లో నిర్వహించిన సర్వేలో డ్యామ్ సామర్థ్యం 105.78 టీఎంసీలని తేలింది. తగ్గిన నిల్వ సామర్థ్యం.. నీటిలభ్యత ఆధారంగా దామాషా పద్ధతిలో మూడు రాష్ట్రాలకు తుంగభద్ర బోర్డు పంపిణీ చేస్తూ వస్తోంది. గతేడాది తుంగభద్ర డ్యామ్‌లోకి కేవలం 114.58 టీఎంసీల ప్రవాహమే వచ్చింది. అంటే.. బచావత్ ట్రిబ్యునల్ అంచనా వేసిన దాంట్లో కేవలం 49.81 శాతం మేర మాత్రమే తుంగభద్ర డ్యామ్‌లో నీటి లభ్యత ఉన్నట్లు స్పష్టమవుతోంది.తుంగభద్ర డ్యామ్‌లోకి 2016–17లో కేవలం 85.719 టీఎంసీలే చేరాయి. డ్యామ్ చరిత్రలో అదే కనిష్ట వరద ప్రవాహం కావడం గమనార్హం. ఈ ఏడాదైనా బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకైనా నీటి లభ్యత ఉంటుందని రైతులు ఆశిస్తున్నారు. నాలుగేళ్లూ పుష్కలంగా నీటి లభ్యత.. తుంగభద్ర డ్యామ్‌లోకి 2015 నుంచి 2018 వరకు అరకొరగానే ప్రవాహం వచ్చింది. ఇక 2019–20 నుంచి 2022–23 వరకు నాలుగేళ్లు టీబీ డ్యామ్‌లో బచావత్ ట్రిబ్యునల్ అంచనా వేసిన దానికంటే అధికంగా లభ్యత నమోదైంది. బేసిన్లో భారీ వర్షాలు కురవడంతో డ్యామ్‌లోకి వరద ప్రవాహం కొనసాగింది. నీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో రాయలసీమ, కర్ణాటక, తెలంగాణలోని ఆయకట్టు రైతులు భారీ ఎత్తున పంటలు సాగుచేయడంతో సస్యశ్యామలమైంది. దిగుబడులు భారీగా రావడం.. గిట్టుబాటు ధర దక్కడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. -
‘తుంగభద్ర’ సామర్థ్యంపై కర్ణాటకాలు
సాక్షి, అమరావతి: తుంగభద్ర డ్యామ్ వేదికగా కర్ణాటక సరికొత్త నాటకానికి తెరలేపింది. డ్యామ్ నీటినిల్వ సామర్థ్యం 100.85 టీఎంసీలు కాదు.. 105.78 టీఎంసీలని తుంగభద్ర బోర్డు 218వ సర్వసభ్య సమావేశంలో అంగీకరించిన కర్ణాటక 219వ సమావేశంలో అడ్డంతిరిగింది. డ్యామ్ నిల్వ సామర్థ్యం 105.78 టీఎంసీలు ఉండదని.. అంతకంటే తక్కువే ఉంటుందని.. మళ్లీ హైడ్రోగ్రాఫిక్ సర్వేచేసి, తేల్చాలని పట్టుబట్టింది. పూడికవల్ల డ్యామ్ నిల్వ సామర్థ్యం తగ్గిందనే సాకుచూపి.. జలవిస్తరణ ప్రాంతంలో చిన్నచిన్న ఎత్తిపోతలు, తాగునీటి పథకాలను చేపట్టి కర్ణాటక యథేచ్ఛగా జలచౌర్యానికి పాల్పడుతుండటంపై బోర్డును ఏపీ ప్రభుత్వం నిలదీసింది. దీనిపై సంయుక్త సర్వేచేసిన బోర్డు.. కర్ణాటక జలచౌర్యానికి పాల్పడుతోందని తేల్చడంతో కర్ణాటకానికి చెక్‌పడింది. దీంతో డ్యామ్ నీటినిల్వ సామర్థ్యంపై ఆ రాష్ట్రం పాత పల్లవి అందుకుందని బోర్డు వర్గాలు వెల్లడించాయి. పూడికతో 33 టీఎంసీలు తగ్గిన నిల్వ కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ల ఉమ్మడి ప్రాజెక్టు అయిన తుంగభద్ర డ్యామ్‌ను 1952లో 133 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. అప్పట్లో ఈ డ్యామ్ నిల్వ సామర్థ్యం 132.47 టీఎంసీలని సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) తేల్చింది. దీని నిల్వ సామర్థ్యం, ఏడాదిలో వచ్చే ప్రవాహాల ఆధారంగా అక్కడ 230 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్.. కర్ణాటకకు 151.49, ఏపీకి 72 (హెచ్చెల్సీ 32.50, ఎల్లెల్సీ 29.50, కేసీ 10.00), తెలంగాణకు 6.51 (రాజోలిబండ డైవర్షన్ స్కీం–ఆర్డీఎస్) టీఎంసీల చొప్పున కేటాయించింది. పూడిక కారణంగా నిల్వ సామర్థ్యం 100.85 టీఎంసీలుగా 2008లో నిర్వహించిన సర్వేలో తేలింది. దీంతో.. నీటి లభ్యత ఆధారంగా దామాషా పద్ధతిలో మూడు రాష్ట్రాలకు తుంగభద్ర బోర్డు నీటిని పంపిణీ చేస్తోంది. 133 నుంచి 105.78 టీఎంసీలకు.. తుంగభద్ర డ్యామ్‌లో నీటినిల్వ సామర్థ్యంపై ఆర్వీ అసోసియేట్స్ అనే సంస్థతో తుంగభద్ర బోర్డు 2016లో టోపోగ్రాఫికల్ సర్వేను చేయించింది. అందులో డ్యామ్ సామర్థ్యం 105.78 టీఎంసీలని తేలింది. ఆ సర్వేను కర్ణాటక అంగీకరించకపోవడంతో ఈ అంశంపై మూడు రాష్ట్రాల అధికారులతో జాయింట్ సర్వేను ఈ ఏడాది బోర్డు చేయించింది. ఇందులో డ్యామ్ నిల్వసామర్థ్యం 105.78 టీఎంసీలుగా తేలింది. ఈ క్రమంలోనే చిన్నచిన్న ఎత్తిపోతలు, తాగునీటి పథకాల ద్వారా కర్ణాటక జలచౌర్యానికి పాల్పడుతుండటం బయటపడింది. ఇదే అంశాన్ని ఏపీ ప్రభుత్వం ఎత్తిచూపడంతో గత బోర్డు సమావేశంలో డ్యామ్ నీటి సామర్థ్యాన్ని 105.78 టీఎంసీలుగా కర్ణాటక అంగీకరించింది. 2022–23లో దాన్నే పరిగణలోకి తీసుకున్న బోర్డు.. ఆ నీటిని మూడు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. -
నవలి రిజర్వాయర్ మళ్లీ తెరపైకి..
సాక్షి, అమరావతి: తుంగభద్ర డ్యామ్‌లో పూడికవల్ల తగ్గిన నీటినిల్వ సామర్థ్యం మేరకు.. డ్యామ్‌కు ఎగువన నవలి వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి అనుమతివ్వాలని తుంగభద్ర బోర్డుకు మరోసారి కర్ణాటక సర్కార్ ప్రతిపాదించింది. నవలి రిజర్వాయర్‌ను నిర్మిస్తే తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కర్ణాటక ప్రతిపాదనను తోసిపుచ్చాయి. కానీ, కర్ణాటక సర్కార్ మళ్లీ చేసిన ఆ రిజర్వాయర్ ప్రతిపాదనపై హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించనున్న 219వ సర్వసభ్య సమావేశంలో చర్చించాలని తుంగభద్ర బోర్డు చైర్మన్ డీఎం రాయ్‌పురే నిర్ణయించారు. కొత్త నీటి సంవత్సరం (2023–24)లో తుంగభద్ర డ్యామ్‌లో నీటి పంపిణీ ప్రధాన అజెండాగా తుంగభద్ర బోర్డు సమావేశమవుతోంది. రాయ్‌పురే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణల ఈఎన్సీలు సి. నారాయణరెడ్డి, మురళీధర్ పాల్గొననున్నారు. దామాషా పద్ధతిలో నీటి పంపిణీ.. అంతర్రాష్ట్ర ప్రాజెక్టు తుంగభద్ర డ్యామ్‌ను 133 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 1953లో నిర్మించారు. డ్యామ్ వద్ద 75 శాతం నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్.. కర్ణాటకకు 151.49, ఆంధ్రప్రదేశ్‌కు 72, తెలంగాణకు 6.51 టీఎంసీలను కేటాయించింది. పూడిక పేరుకుపోవడంవల్ల డ్యామ్‌లో నీటినిల్వ 105.78 టీఎంసీలకు తగ్గింది. దాంతో నీటి లభ్యత కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో డ్యామ్‌లో నీటి లభ్యత ఆధారంగా మూడు రాష్ట్రాలకు దామాషా పద్ధతిలో జలాలను తుంగభద్ర బోర్డు పంపిణీ చేస్తోంది. వాటా జలాలను వాడుకోవడం పేరుతో.. డ్యామ్‌లో పూడిక పేరుకుపోవడంవల్ల మూడు రాష్ట్రాలు ఏటా సగటున 167–175 టీఎంసీలకు మించి వాడుకోలేకపోతున్నామని కర్ణాటక సర్కార్ చెబుతోంది. పూడిక తీయడానికి రూ.12,500 కోట్లు వ్యయమవుతుందని లెక్కలువేస్తోంది. దీనికి బదులు తుంగభద్ర డ్యామ్‌కు ఎగువన నది నుంచి వరద కాలువ తవ్వి నవలి వద్ద కొత్తగా 52 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తామని చెబుతోంది. దీంతోపాటు విఠల్‌పుర చెరువు సామర్థ్యాన్ని 4.52 టీఎంసీలకు, శివపుర చెరువు సామర్థ్యాన్ని 1.56 టీఎంసీలకు పెంచి ఎడమ కాలువ కింద ఆయకట్టును స్థిరీకరిస్తామని.. తుంగభద్ర డ్యామ్‌లో నిల్వఉన్న నీటితో మిగతా వాటా జలాలను వాడుకోవచ్చునని కర్ణాటక ప్రతిపాదిస్తోంది. ఈ రిజర్వాయర్ పనులకు రూ.9,500 కోట్ల వ్యయం అవుతుందని.. దామాషా పద్ధతిలో మూడు రాష్ట్రాలు భరించాలని తుంగభద్ర బోర్డు సమావేశాల్లో కోరుతూ వస్తోంది. వ్యతిరేకిస్తున్న రెండు రాష్ట్రాలు.. నవలి రిజర్వాయర్‌ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యతిరేకిస్తున్నాయి. అప్పర్ భద్ర, సింగటలూరు ఎత్తిపోతల ద్వారా ఇప్పటికే కేటాయించిన నీటికంటే అధికంగా కర్ణాటక వాడుకుంటోందని.. నవలి వద్ద రిజర్వాయర్ నిర్మిస్తే తమ హక్కులకు విఘాతం కలుగుతుందని స్పష్టంచేస్తున్నాయి. తుంగభద్ర హెచ్చెల్సీ (ఎగువ కాలువ)కు సమాంతరంగా వరద కాలువ తవ్వి.. వరద రోజుల్లో వాటా (32.5 టీఎంసీలు) తరలిస్తామని.. డ్యామ్‌లో నిల్వ నీటిని మూడు రాష్ట్రాలు పంచుకోవడం ద్వారా పూర్తిస్థాయిలో వాటా జలాలను వాడుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతూ వస్తోంది. -
తుంగభద్ర డ్యామ్‌కు భారీ వరద
సాక్షి, అమరావతి: కృష్ణా ప్రధాన ఉపనది అయిన తుంగభద్ర గతంలో ఎన్నడూ లేనిరీతిలో ఈ ఏడాది వరద ప్రవాహంతో పరవళ్లు తొక్కుతోంది. తుంగభద్ర వరద ఉద్ధృతికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణల ఉమ్మడి ప్రాజెక్టు అయిన తుంగభద్ర డ్యామ్ జూలై 13 నాటికే నిండిపోవడంతో గేట్లు ఎత్తేసి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. అప్పటి నుంచి శుక్రవారం వరకు అంటే 66 రోజులుగా గేట్లను దించలేదు. జూన్ 1 నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు డ్యామ్‌లోకి 487.76 టీఎంసీల ప్రవాహం వచ్చింది. ఇందులో 1,632.74 అడుగుల్లో 104.74 టీఎంసీలను నిల్వచేస్తూ (గత నీటిసంవత్సరం ముగిసేనాటికి అంటే మే 31 నాటికి డ్యామ్‌లో 37.63 టీఎంసీల నీరు ఉంది).. ఆయకట్టుకు నీళ్లందిస్తూ, దిగువకు 390 టీఎంసీల మేర విడుదల చేశారు. తుంగభద్ర డ్యామ్‌లోకి సహజసిద్ధ ప్రవాహం డిసెంబర్ వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో డ్యామ్‌లో ఈ ఏడాది బచావత్ ట్రిబ్యునల్ అంచనా వేసిన మేరకు 230 టీఎంసీల లభ్యత ఉంటుందని, మూడు రాష్ట్రాలకు వాటా మేరకు నీటిని సరఫరా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని తుంగభద్ర బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. నీటి లభ్యతపై ఆనందోత్సాహాలు తుంగభద్ర డ్యామ్‌లో 230 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్‌కు72 (హెచ్చెల్సీ 32.5, ఎల్లెల్సీ 29.5, కేసీ కెనాల్‌కు అసిస్టెన్స్), తెలంగాణకు 6.51 (ఆర్డీఎస్కు అసిస్టెన్స్), కర్ణాటకకు 151.49 టీఎంసీలను పంపిణీ చేసింది. 1980లో మాత్రమే బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన దానికంటే 1.383 టీఎంసీలు అధికంగా అంటే 231.383 టీఎంసీలను తుంగభద్ర డ్యామ్ ద్వారా మూడు రాష్ట్రాలు వినియోగించుకున్నాయి. డ్యామ్‌లో పూడిక పేరుకుపోతుండటంవల్ల నిల్వ సామర్థ్యం తగ్గడంతో.. నీటిలభ్యత ఆధారంగా దామాషా పద్ధతిలో మూడు రాష్ట్రాలకు తుంగభద్ర బోర్డు వాటా జలాలను పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది 1980 తరహాలోనే నీటిలభ్యత ఉంటుందని తుంగభద్ర బోర్డు వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనిపై మూడు రాష్ట్రాల ఆయకట్టు రైతులు ఆనందోత్సాహాలను వ్యక్తం చేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్‌పై నేరుగా ఆధారపడి ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లెల్సీ (దిగువ కాలువ) 1,57,062, హెచ్చెల్సీ (ఎగువ కాలువ) 2,84,992.. కర్ణాటకలో 8,96,456.. కలిపి 13,38,510 ఎకరాల ఆయకట్టు ఉంది. డ్యామ్ దిగువన రాయబసవన చానల్స్, విజయనగర చానల్స్ కింద కర్ణాటకలో 30,368, ఆంధ్రప్రదేశ్‌లో కేసీ కెనాల్ కింద 2,78,000, తెలంగాణలో ఆర్డీఎస్ కింద 87,000.. కలిపి 3,95,368 ఎకరాల ఆయకట్టు ఉంది. అంటే.. డ్యామ్‌పై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన 17,33,878 ఎకరాల ఆయకట్టు ఈ ఏడాది సస్యశ్యామలం కానుంది. నాలుగో అతిపెద్ద వరద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల ఉమ్మడి ప్రాజెక్టు తుంగభద్ర 1958లో పూర్తయింది. డ్యామ్ చరిత్రలో 1978లో 558.775 టీఎంసీల ప్రవాహమే అతి పెద్ద వరద. ఆ తర్వాత 1980లో వచ్చిన 553.1 టీఎంసీల ప్రవాహం రెండో అతిపెద్ద వరదగా నమోదైంది. 1992లో డ్యామ్‌లోకి వచ్చిన 519.60 టీఎంసీల ప్రవాహం మూడో అతిపెద్ద వరద. మూడు దశాబ్దాల తర్వాత ఈ ఏడాది తుంగభద్ర డ్యామ్‌లోకి శుక్రవారం వరకు వచ్చిన 487.76 టీఎంసీల ప్రవాహం నాలుగో అతిపెద్ద వరద. డిసెంబర్ వరకు డ్యామ్‌లోకి వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో.. 1992 కంటే ఎక్కువ ప్రవాహం వస్తుందని అంచనా వేస్తున్నారు. -
శ్రీశైలం, సాగర్ గేట్లు మళ్లీ ఎత్తివేత
సాక్షి, అమరావతి/విజయపురిసౌత్: ఎగువన విస్తారంగా వర్షాలు కురవడంతో కృష్ణా, తుంగభద్ర నదుల్లో మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. దీంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల రేడియల్ క్రస్ట్ గేట్లు మళ్లీ తెరుచుకున్నాయి. జూరాల, సుంకేసుల నుంచి 1,26,428 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయం 3 గేట్లు 10 అడుగులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా సాగర్ జలాశయంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి 99,064 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరువలో 589.40 (310.2522టీఎంసీలు) అడుగులకు చేరడంతో బుధవారం సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు 4 రేడియల్ క్రస్ట్‌గేట్లు, 8 గంటలకు 6 గేట్లు 5 అడుగులు ఎత్తి 48,222 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. క్రస్ట్‌గేట్లు, విద్యుదుత్పాదనతో కలిసి సాగర్ వద్ద నదిలోకి 84,864 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గరిష్ట స్థాయి నీటిమట్టం 590.00 అడుగులు 312.0450 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీలోకి సాయంత్రం 6 గంటలకు 18,067 క్యూసెక్కులు చేరుతుండగా.. 15,847 క్యూసెక్కులను కృష్ణా డెల్టాకు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 2,220 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. గోదావరిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 4,35,132 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 12,700 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 4,15,664 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
Heavy Rains-Telugu States: ఉగ్ర కృష్ణ.. మహోగ్ర గోదావరి
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: నైరుతి రుతు పవనాలు, బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల పరీవాహక ప్రాంతాల్లో (బేసిన్లో) విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నది ఉగ్రరూపం దాల్చితే.. గోదావరి మళ్లీ మహోగ్రరూపం దాల్చింది. వంశధారలోనూ వరద ఉధృతి కొనసాగుతోంది. కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్ర, గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో తీర ప్రాంతాల గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, తుంగభద్ర పోటాపోటీగా ప్రవహిస్తున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్‌లలోకి వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి 1,81,246 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తుండటంతో బుధవారం మంత్రాలయం వద్ద ప్రమాదకర రీతిలో 312.04 మీటర్లు వద్ద తుంగభద్ర ప్రవహిస్తోంది. కర్నూలు వద్ద 272.76 మీటర్లకు చేరుకుంది. దాంతో మంత్రాలయం, కర్నూలు నగరాలలో ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లు ఎత్తివేత ఎగువ నుంచి వస్తున్న వరదకు స్థానికంగా కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకల ద్వారా చేరుతున్న జలాలు తోడవడంతో శ్రీశైలంలోకి 3,60,436 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో నీరు నిల్వ ఉండటంతో పది గేట్లను 12 అడుగుల మేర ఎత్తి 3,17,460 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. విద్యుదుత్పత్తి చేస్తూ కుడి కేంద్రం ద్వారా 29,833, ఎడమ కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కులు వదులుతున్నారు. నేడు సాగర్ గేట్లు ఎత్తివేత శ్రీశైలం నుంచి భారీగా వస్తున్న జలాలతో నాగార్జునసాగర్ నిండుకుండలా మారింది. సాగర్‌లోకి 3,61,296 క్యూసెక్కులు వస్తున్నాయి. నీటి నిల్వ 583.5 అడుగుల్లో 293.4 టీఎంసీలకు చేరుకుంది. మరో 19 టీఎంసీలు వస్తే ప్రాజెక్టు నిండిపోతుంది. గురువారం ఉదయం 6 గంటలకు సాగర్ ఒక గేటును ఎత్తివేయనున్నారు. ఆ తర్వాత ప్రతి గంటకూ ఒక గేటు చొప్పున ఎత్తుతూ 2 లక్షల నుంచి 2.50 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేయనున్నారు. గత మూడేళ్లుగా ఆగస్టులోనే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిండుతోంది. సాగర్ డ్యాం గేట్ల నిర్వహణ పనులను అధికారులు ఇప్పటికే పూర్తిచేశారు. డ్యాం 26 క్రస్టు గేట్లకు కొత్త ఇనుప రోప్‌లను బిగించారు. గేట్లకు గ్రీజింగ్, ఇతర మరమ్మతులు పూర్తి చేశారు. వరద నియంత్రణపై అధికారుల దృష్టి ఎగువ నుంచి భారీగా ప్రవాహం వస్తుండటంతో వరద నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జలవనరుల శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ నుంచి 75,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నందన పులిచింతలలో నీటి నిల్వ 40 టీఎంసీల లోపు ఉంచాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దాంతో పులిచింతల ప్రాజెక్టును ఖాళీ చేస్తున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 80,737 క్యూసెక్కులు చేరుతోంది. ఆ నీటినంతా ప్రకాశం బ్యారేజి నుంచి సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రమాదకరంగా గోదావరి బేసిన్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. బుధవారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్దకు 11 లక్షల క్యూసెక్కులు వస్తోంది. నీటి మట్టం 50.6 అడుగులకు చేరుకుంది. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గురువారం 55 అడుగులకు చేరుతుందని కేంద్ర జల వనరుల శాఖ వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు వద్దకు 10,10,387 క్యూసెక్కులు చేరుతుండటంతో స్పిల్‌వే ఎగువన 33.37 మీటర్లు, దిగువన 24.76 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టులోకి వచ్చిన వరదను 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. దాంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం వద్ద రాత్రి 10 గంటలకు నీటి మట్టం 13.40 అడుగులకు చేరింది. కాటన్ బ్యారేజ్‌లోని మొత్తం 175 గేట్లను పూర్తిగా పైకి లేపి 12,43,405 క్యూసెక్కులు సముద్రంలోకి వదులుతున్నారు. గోదావరి డెల్టాకు 6,500 క్యూసెక్కులు వదులుతున్నారు. వంశధారలో వరద ఉద్ధృతి బేసిన్లో కురుస్తున్న వర్షాలతో వంశధార వరద ఉద్ధృతి కొనసాగుతోంది. గొట్టా బ్యారేజ్‌లోకి 24,124 క్యూసెక్కులు చేరుతుండగా.. ఆయకట్టుకు 2849 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 21,275 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
నాగార్జునసాగర్‌లోకి 1.56 లక్షల క్యూసెక్కుల వరద
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ/శ్రీశైలం ప్రాజెక్ట్: నాగార్జునసాగర్‌లోకి ఎగువ నుంచి వరద ఉద్ధృతి పెరిగింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 1,56,766 క్యూసెక్కులు చేరుతుండగా కుడి, ఎడమ కాలువలు, ఏఎమ్మార్పీలకు 7,048 క్యూసెక్కులు వదులుతున్నారు. విద్యుదుత్పత్తి చేస్తూ నదిలోకి 4,774 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 572.10 అడుగుల్లో 261.84 టీఎంసీల నీరు ఉంది. సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు. పూర్తి నీటినిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు. సాగర్ నిండాలంటే ఇంకా 50 టీఎంసీలు కావాలి. ఆదివారం పశ్చిమ కనుమల్లో కుద్రేముఖ్ పర్వతశ్రేణుల్లో విస్తారంగా కురిసిన వర్షాలకు తుంగభద్రలో ఎగువన వరద ఉద్ధృతి పెరిగింది. ప్రకాశం బ్యారేజ్‌లోకి వరద సాగర్‌లో విద్యుదుత్పత్తి దిగువకు విడుదల చేస్తున్న నీటికి, మూసీ, హాలియా నదుల ప్రవాహం తోడవడంతో పులిచింతల్లోకి 35 వేల క్యూసెక్కులు చేరుతుండగా స్పిల్‌వే గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా అంతేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. వాటికి పాలేరు, మున్నేరు తదితర వాగులు, వంకల వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 50,276 క్యూసెక్కుల నీరు చేరుతోంది. కృష్ణాడెల్టాకు 9,741 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిగిలిన 40,535 క్యూసెక్కులను బ్యారేజ్ 55 గేట్లు ఒక్క అడుగుమేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్ 30 గేట్లు ఎత్తివేత శనివారం రాత్రి, ఆదివారం పశ్చిమ కనుమల్లో తుంగ, భద్ర నదులు పురుడుపోసుకునే కుద్రేముఖ్ పర్వతశ్రేణుల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో తుంగభద్ర డ్యామ్‌లోకి వరద ఉద్ధృతి పెరిగింది. ఆదివారం రాత్రి 7 గంటలకు తుంగభద్ర డ్యామ్‌లోకి 98,519 క్యూసెక్కుల నీరు చేరుతోంది. నీటి నిల్వ గరిష్టస్థాయిలో 101.27 టీఎంసీలు ఉండటంతో 30 గేట్లను ఎత్తి 98,561 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 3 లక్షల క్యూసెక్కులు కడలిలోకి పరీవాహక ప్రాంతంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద ప్రవాహం కాస్త పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి ఆదివారం సాయంత్రం 6 గంటలకు 3,10,843 క్యూసెక్కులు చేరుతుండగా గోదావరి డెల్టాకు 9,700 క్యూసెక్కులు వదులుతూ మిగిలిన 3,01,143 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. గొట్టా బ్యారేజ్, నారాయణపురం ఆనకట్టల నుంచి సముద్రంలోకి.. ఒడిశా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వంశధార, నాగావళి పరవళ్లు తొక్కుతున్నాయి. వంశధార నుంచి గొట్టా బ్యారేజ్‌లోకి 7,470 క్యూసెక్కులు చేరుతుండగా కాలువలకు 1,392 క్యూసెక్కులు వదులుతూ మిగిలిన 6,078 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. నాగావళి వరద ఉద్ధృతితో నారాయణపురం ఆనకట్టలోకి 6,200 క్యూసెక్కులు చేరుతుండగా అంతేస్థాయిలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఈ సీజన్లో శ్రీశైలం గేట్లు ఎత్తడం ఇది మూడోసారి శనివారం రాత్రి శ్రీశైలంలోకి వరద ప్రవాహం తగ్గడంతో గేట్లను మూసివేశారు. కానీ.. శనివారం రాత్రి, ఆదివారం నారాయణపూర్ డ్యామ్‌కు దిగువన కృష్ణా ప్రధాన పాయ, తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల శ్రీశైలంలోకి వరద ఉద్ధృతి పెరిగింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,52,670 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండటంతో మూడుగేట్లను పదడుగుల మేర ఎత్తి 83,673 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమగట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 63,442 క్యూసెక్కులను దిగువకు వదలుతున్నారు. దీంతో 1,47,115 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నట్లయింది. ప్రస్తుతం శ్రీశైలంలో 884.6 అడుగుల్లో 213.40 టీఎంసీల నీరు ఉంది. శ్రీశైలం నుంచి దిగువకు విడుదల చేస్తున్న ప్రవాహం సాగర్ వైపు పరుగులు పెడుతోంది. సోమవారం శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉంది. -
మూడేళ్లుగా.. అదే జోరుగా..
సాక్షి, అమరావతి: నీటి లభ్యతలో కృష్ణాతో ఉప నది తుంగభద్ర పోటీ పడుతోంది. చరిత్రలో లేని విధంగా జూలై మూడో వారానికే తుంగభద్ర డ్యామ్‌లోకి 172.89 టీఎంసీల ప్రవాహం వచ్చింది. నైరుతి రుతు పవనాల ప్రభావం వల్ల కురిసే వర్షాలతో అక్టోబర్ వరకు డ్యామ్‌లోకి వరద కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత మూడేళ్లతో పోల్చితే ఈ ఏడాది తుంగభద్రలో నీటి లభ్యత అధికంగా ఉంటుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది తుంగభద్ర డ్యామ్, దిగువన ప్రాజెక్టులపై ఆధారపడ్డ మూడు రాష్ట్రాల్లోని 17,33,878 ఎకరాల ఆయకట్టు రైతులకు మేలు చేస్తుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల ఉమ్మడి ప్రాజెక్టు తుంగభద్ర 1958లో పూర్తయింది. డ్యామ్‌లో 230 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్ ఆంధ్రపద్రేశ్‌కు 72 టీఎంసీలు (హెచ్చెల్సీ 32.5, ఎల్లెల్సీ 29.5, కేసీ కెనాల్‌కు అసిస్టెన్స్), తెలంగాణకు 6.51 (ఆర్డీఎస్కు అసిస్టెన్స్), కర్ణాటకకు 151.49 టీఎంసీలు పంపిణీ చేసింది. 1980–81లో మాత్రమే ట్రిబ్యునల్ కేటాయించిన దానికంటే 1.383 టీఎంసీలు అధికంగా అంటే 231.383 టీఎంసీలను డ్యామ్ ద్వారా మూడు రాష్ట్రాలు వినియోగించుకొన్నాయి. డ్యామ్‌లో పూడిక పేరుకుపోతుండటంతో నిల్వ సామర్థ్యం తగ్గింది. దీంతో బోర్డు నీటి లభ్యత ఆధారంగా దామాషా పద్ధతిలో మూడు రాష్ట్రాలకు జలాలను పంపిణీ చేస్తోంది. గత మూడేళ్లుగా తుంగభద్ర డ్యామ్, దాని దిగువన ఉన్న రాయబసవన, విజయనగర చానల్స్, ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీం), కేసీ కెనాల్‌కు నీటిని సరఫరా చేసే సుంకేశుల బ్యారేజీ వద్ద నీటి లభ్యత మెరుగ్గా ఉంది. డ్యామ్ చరిత్రలో ఈ ఏడాదే అధికంగా ప్రవాహం వచ్చింది. డ్యామ్‌లో గరిష్ట స్థాయిలో 104.5 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న సుమారు వంద టీఎంసీలను దిగువకు విడుదల చేశారు. ఈ జలాలు సుంకేశుల బ్యారేజ్ మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతున్నాయి. పంటల సాగులో రైతులు నిమగ్నం తుంగభద్ర డ్యామ్‌పై నేరుగా ఆధారపడి ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లెల్సీ (దిగువ కాలువ) 1,57,062 ఎకరాలు, హెచ్చెల్సీ (ఎగువ కాలువ) కింద 2,84,992 ఎకరాలు, కర్ణాటకలో 8,96,456 ఎకరాలు.. మొత్తం 13,38,510 ఎకరాల ఆయకట్టు ఉంది. డ్యామ్ దిగువన రాయబసవన, విజయనగర చానల్స్ కింద కర్ణాటకలో 30,368 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్‌లో కేసీ కెనాల్ కింద 2,78,000 ఎకరాలు, తెలంగాణలో ఆర్డీఎస్ కింద 87,000 ఎకరాలు వెరసి 3,95,368 ఎకరాల ఆయకట్టు ఉంది. అంటే.. డ్యామ్‌పై ఆధారపడిన మొత్తం ఆయకట్టు 17,33,878 ఎకరాలు. డ్యామ్ ద్వారా నీటిని విడుదల చేస్తుండటంతో ఆయకట్టు రైతులు పంటల సాగులో నిమగ్నమయ్యారు. -
తుంగభద్ర డ్యామ్‌కు పెరిగిన వరద
హొళగుంద (కర్నూలు): కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రాజెక్ట్ అయిన తుంగభద్ర డ్యామ్‌లో ఇన్‌ఫ్లో ఆదివారం మరింత మెరుగు పడింది. శనివారం 72,592 క్యూసెక్కులుగా ఉన్న ప్రవాహ జలాలు ఆదివారం 89,664 క్యూసెక్కులకు పెరిగాయి. తుంగభద్ర రిజర్వాయర్ పూర్తి నీటిమట్టం 1,633 అడుగులు కాగా.. ఆదివారం ఉదయం 8 గంటలకు 1,605.56 అడుగులుగా నమోదైంది. 100.855 టీఎంసీల నీటి సామర్థ్యానికి గాను 27.481 టీఎంసీలుండగా సాయంత్రానికి 32 టీఎంసీలకు పైగా నీరు నిల్వ అయ్యాయి. అందులో 255 క్యూసెక్కులను రాయబసవన కెనాల్‌కు వదులుతున్నారు. గతేడాది ఇదే సమయానికి 1,585.77 అడుగులతో 7.033 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఉపరితల ద్రోణి, అకాల వర్షాల కారణంగా డ్యామ్ ఎగువ ప్రాంతాలైన శివమొగ్గ, ఆగుంబే, శృంగేరి, చిక్‌మగళూరు, వరనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇన్‌ఫ్లో బాగా పెరిగింది. -
ఆర్డీఎస్‌పై అధ్యయనం
సాక్షి, అమరావతి: రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) లక్ష్యాలు నెరవేరుతున్నాయా? లక్ష్యాలు సాధించలేకపోతే దానికి కారణం నిర్వహణ లోపమా? డిజైన్ లోపమా? అనే అంశాలను తేల్చనున్నారు. ఈ అధ్యయనం బాధ్యతలను పుణెలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్ )కు అప్పగించనున్నారు. ఈమేరకు కృష్ణా బోర్డు సభ్యుడు ఆర్కే పిళ్లై చేసిన ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. అధ్యయనానికి ఆర్నెళ్ల గడువు ఇచ్చారు. వచ్చే రబీ నాటికి ఆ నివేదికను అమలు చేస్తామని ఆర్కే పిళ్లై చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో కృష్ణా బోర్డు కార్యాలయంలో పిళ్లై అధ్యక్షతన ఆర్డీఎస్‌పై ప్రత్యేక సమావేశం జరిగింది. తుంగభద్ర బోర్డు సభ్య కార్యదర్శి నాగమోహన్, ఏపీ సీఈ సి.మురళీనాథ్‌రెడ్డి, తెలంగాణ సీఈ మోహన్‌కుమార్, కర్ణాటక సీఈ ఈ సమావేశంలో పాల్గొన్నారు. తుంగభద్ర జలాశయం నుంచి ఏపీకి చెందిన కేసీ కెనాల్ కోటా కింద విడుదల చేసిన నీటిని కర్ణాటక, తెలంగాణ మళ్లిస్తున్నట్లుగా జనవరి 28న బోర్డు జాయింట్ కమిటీ నిర్వహిం చిన క్షేత్రస్థాయి తనిఖీల్లో వెల్లడైంది. ఈ అంశాన్ని పిళ్లై ప్రస్తావించారు. దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను హరించడం సరికాదన్నారు. దీనిపై తెలంగాణ సీఈ స్పందిస్తూ.. ఆర్డీఎస్కు బచావత్ ట్రిబ్యునల్ 17.1 టీఎంసీలను కేటాయించిందని, ఇందులో తుంగభద్ర డ్యామ్ నుంచి 7 టీఎంసీలను విడుదల చేయాలని పేర్కొందని అన్నారు. ఆర్డీఎస్ ఎడమ కాలువ కింద ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 87,500 ఎకరాల ఆయకట్టు ఉందని, ఏపీ జల చౌర్యం కారణంగా నీళ్లందక ఆ రైతులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. దీనిపై ఏపీ సీఈ మురళీనాథ్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ దశలో పిళ్లై స్పందిస్తూ... కేసీ కెనాల్ కోటా కింద వి డుదల చేసిన నీటినే ఆర్డీఎస్ ఎడమ కాలువ ద్వారా కర్ణాటక, తెలంగాణ మళ్లిస్తున్నాయని తేల్చిచెప్పారు. దీంతో తెలంగాణ సీఈ మిన్నకుండిపోయారు. బచావత్ ట్రిబ్యునల్ తమకు కేటాయించిన జలాలు దక్కడం లేదని తెలంగాణ సీఈ వాదించడంతో దాన్ని తేల్చేందుకు సీడబ్ల్యూపీఆర్ఎస్తో అధ్యయనం చేయిస్తామని కృష్ణా బోర్డు తెలిపింది. తుమ్మిళ్ల ఆపేయాల్సిందే.. తుంగభద్ర డ్యామ్ నుంచి కేసీ కెనాల్‌కు 10, ఆర్డీ ఎస్‌కు 7 టీఎంసీల కోటా ఉన్నందున నదిలో సహజప్రవాహం లేనప్పుడు.. తుంగభద్ర నుంచి 10:7 నిష్పత్తిలో నీటిని విడుదల చేసి.. దామాషా పద్ధతి లో ఆర్డీఎస్ వద్ద మూడు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేయాలని ఏపీ సీఈ మురళీనాథ్‌రెడ్డి చేసిన ప్రతిపాదనను కృష్ణా బోర్డు అంగీకరించింది. ఆర్డీఎస్కు దిగువన సుంకేశుల బ్యారేజీ జల విస్తరణ ప్రాంతంలో తెలంగాణ సర్కారు అక్రమంగా నిర్మించిన తుమ్మిళ్ల ఎత్తిపోతలను నిలిపివేయాలన్న డిమాండ్‌తోనూ కృష్ణాబోర్డు ఏకీభవించింది. తుమ్మిళ్ల ఎత్తిపోతలను ఆపేయాలని ఆర్కేపిళ్లై ఆదేశించారు. -
నిండుగా తుంగభద్ర.. రికార్డు స్థాయిలో నీటి నిల్వలు
సాక్షి, అమరావతి: తుంగభద్ర డ్యామ్‌లో డిసెంబరు నాలుగోవారానికి రికార్డు స్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయి. డ్యామ్ చరిత్రలో తొలిసారిగా శనివారం 1632.14 అడుగుల్లో 97.55 టీఎంసీల నీరు ఉంది. దీంతో ఆయకట్టు రైతుల్లో నూతనోత్సాహం నెలకొంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఖరీఫ్ పంటల కోతలు దాదాపుగా పూర్తయినా, డ్యామ్‌లో ఈ స్థాయిలో నీరు ఉండటం లేట్ ఖరీఫ్‌తో పాటు రబీకీ ఉపయోగకరమని రైతులు, అధికారులు చెబుతున్నారు. తుంగభద్ర డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,633 అడుగులు. పూర్తి నీటి నిల్వ 100.86 టీఎంసీలు. చదవండి: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు గతేడాది ఇదే రోజు (డిసెంబరు 25కి) 1625.26 అడుగుల్లో 73.74 టీఎంసీలు నిల్వ ఉంది. ఈ ఏడాది అంతకంటే ఎక్కువ నీరుంది. గత పదేళ్లలో ఇదే రోజుకి సగటున 55.20 టీఎంసీలు మాత్రమే. అంటే డ్యామ్‌లో గత పదేళ్ల కంటే ఈ ఏడాది 42.35 టీఎంసీలు అధికంగా నిల్వ ఉంది. దీంతో లేట్ ఖరీఫ్, రబీ పంటలకు సమృద్ధిగా నీటిని సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఒక్క సారే కేటాయించిన మేరకు వినియోగం తుంగభద్ర డ్యామ్‌లో 230 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్ కర్ణాటకకు 151.49 (ఆవిరి నష్టాలు 12.50), ఆంధ్రప్రదేశ్‌కు 72 (ఆవిరి నష్టాలు 5.50), తెలంగాణకు 6.51 టీఎంసీలు కేటాయించింది. రాష్ట్రానికి కేటాయించిన నీటిలో హెచ్చెల్సీకి 32.5, ఎల్లెల్సీకి 29.5, కేసీ కెనాల్ ద్వారా 10 టీఎంసీలు సరఫరా చేస్తారు. నీటి లభ్యత సరిగా లేకపోవడంతో 1980–81లో మినహా మిగిలిన ఏ సంవత్సరాల్లోనూ కేటాయించిన మేరకు మూడు రాష్ట్రాలూ నీటిని వాడుకోలేదు. డ్యామ్‌లో పూడిక పేరుకుపోవడం, వర్షాభావం కారణంగా నీటి లభ్యత తగ్గింది. దీంతో దామాషా పద్ధతిలో మూడు రాష్ట్రాలకు తుంగభద్ర బోర్డు నీటిని కేటాయిస్తోంది. అయితే, ఈ ఏడాది తుంగభద్ర పరివాహక ప్రాంతంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో డ్యామ్‌లోకి శనివారం వరకు 382.47 టీఎంసీల నీరు వచ్చింది. దీంతో తుంగభద్ర బోర్డు మూడు రాష్ట్రాలకూ 109 టీఎంసీలు విడుదల చేసింది. ఇందులో హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ద్వారా 35 టీఎంసీలను రాష్ట్రం వినియోగించుకుంది. స్పిల్ వే గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 135 టీఎంసీలను బోర్డు దిగువకు వదిలేసింది. డ్యామ్‌లో ఇప్పటికీ 97.55 టీఎంసీలు ఉండటంతో అందులో కనీస నీటి మట్టానికి పైన లభ్యతగా ఉన్న నీటిలో రాష్ట్ర వాటా కింద కనీసం 18 టీఎంసీలు వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనివల్ల తుంగభద్ర హెచ్చెల్సీ కింద అనంతపురం జిల్లాలో లేట్ ఖరీఫ్, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాల్లో రబీ, ఎల్లెల్సీ కింద కర్నూలులో ఆరుతడి పంటలకు సమృద్ధిగా నీళ్లందించవచ్చని అధికారులు చెబుతున్నారు. -
గోదావరిలో వరద తగ్గుముఖం
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/కొవ్వూరు: నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో గోదావరిలో వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 9,09,385 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. గోదావరి డెల్టా కాలువలకు 9,200 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 9,00,185 క్యూసెక్కుల (77.78 టీఎంసీలు)ను సముద్రంలోకి వదిలేస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా, ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో ఉప నదులు ఉప్పొంగి గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం భద్రాచలం, ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శనివారం ఉదయం నుంచి గోదావరిలో వరద ప్రవాహం తగ్గింది. దాంతో భద్రాచలం, ధవళేశ్వరం వద్ద ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. పోలవరం వద్దకు చేరుతున్న 9.10 లక్షల క్యూసెక్కులను 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ఆ జలాలు ధవళేశ్వరం బ్యారేజీలోకి చేరుతున్నాయి. కృష్ణా, ప్రధాన ఉప నది, తుంగభద్రల్లో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 45 వేల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 880.1 అడుగులకు చేరుకుంది. ఆగని తెలంగాణ విద్యుదుత్పత్తి ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ సర్కార్ నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ 11 వేల క్యూసెక్కులు తరలిస్తోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 188.58 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నాగార్జునసాగర్‌లోకి 14,757 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో కాలువలకు, విద్యుదుత్పత్తి ద్వారా విడుదల చేస్తున్నారు. సాగర్‌లో 305.51 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టులోకి 6 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్ వే గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 25 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి 35,150 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా కాలువలకు 12,755 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 22,260 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. 2,600 కుటుంబాలు తరలింపు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం క్రమం తగ్గుతూ సాయంత్రానికి 11.10 అడుగులకు చేరింది. ఆనకట్టకు దిగువన యలమంచిలి మండలం కనకాయలంక గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. వరద నీరు పెరగడంతో వేలేరుపాడు మండలంలో పెద్ద వాగు, ఎద్దెలవాగు, మేళ్ల వాగులోకి వరదనీరు చేరింది. మండలంలోని 32 ఏజెన్సీ గ్రామాలు, పోలవరం మండలంలోని 19 ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అధికారులు ముందుజాగ్రత్త చర్యగా 2,600 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు.