కేసీ కింద రబీ ఆయకట్టు పంటలను ఆదుకునేందుకు శనివారం రాత్రి నుంచి రోజుకు 1500 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేస్తున్నామన్నారు.
కర్నూలు(రూరల్), న్యూస్‌లైన్: సుంకేసుల జలాశయం నుంచి కర్నూలు-కడప కాలువకు సాగునీరు విడుదల చేసినట్లు కేసీ కెనాల్ ఈఈ పుల్లారావు ఆదివారం ‘న్యూస్‌లైన్’కి తెలిపారు. కేసీ కింద రబీ ఆయకట్టు పంటలను ఆదుకునేందుకు శనివారం రాత్రి నుంచి రోజుకు 1500 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేస్తున్నామన్నారు. మొదటి రెండు రోజులు 1500 క్యూసెక్కులు, ఆ తర్వాత రెండు రోజులు 1200 క్యూసెక్కులు, 1000 క్యూసెక్కులు చొప్పున మరో రెండు రోజుల పాటు నీరందిస్తామన్నారు.
తుంగభద్ర డ్యాం నుంచి వదిలిన నీరు రెండు రోజుల్లో ఆర్డీఎస్ చేరుకుంటుందని.. ఈ నీరు సుంకేసులకు చేరుకునేందుకు మరో మూడు రోజుల సమయం పడుతుందన్నారు. ఉన్నతాధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధుల ఆదేశాలతో సుంకేసులలో 0.6 టీఎంసీ నీటిని నిల్వ చేసి కర్నూలు నగర ప్రజల తాగునీటి అవసరాలకు అందిస్తామన్నారు. 0 కి.మీ నుంచి 150 కి.మీ వరకు రబీలో దాదాపు 25,600 ఎకరాల్లో ప్రస్తుతం మిరప, వేరుశెనగ, మొక్కజొన్న పంటలు సాగయ్యాయన్నారు. ఈ పంటలకు మాత్రమే నీటిని వినియోగించుకోవాలన్నారు. రైతులు సర్దుబాటుతో వ్యవహరించాలని ఆయన కోరారు.