
ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు
పీజీఆర్‌ఎస్‌కు 115 ఫిర్యాదులు
కర్నూలు: అదనపు కట్నం కోసం అత్త, మామ, బావ కలిసి వేధిస్తున్నారని పత్తికొండకు చెందిన వి.రమాదేవి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పక్కనున్న క్యాంపు కార్యాలయంలో ఎస్పీ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 115 ఫిర్యాదులొచ్చాయి. వాటన్నిటిపై చట్ట పరిధిలో విచారించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు పాల్గొన్నారు.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని..
⇒ కర్నూలు ఫుడ్ కార్పొరేషన్‌లో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బు తీసుకుని మోసం చేసిన కేసులో కర్నూలుకు చెందిన జాకీర్ బాషా, అయేషా బాను, జహీర్ బాషా అరెస్టయి కండీషన్ బెయిల్‌పై విడుదలయ్యారని, ఈ కేసు దర్యాప్తును పకడ్బందీగా చేసి న్యాయం చేయాలని వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన సుబ్బయ్య ఫిర్యాదు చేశారు.
⇒ తన కుమారుడు పెద్ద మద్దిలేటి, మనవడు మధు కలిసి తన పొలాన్ని వారి పేరు మీద ఆన్‌లైన్‌లో అడంగల్‌లో ఎక్కించుకున్నారని, పొలం తప్ప తనకు వేరే జీవనాధారం లేదని, విచారణ జరిపి న్యాయం చేయాలని కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామానికి చెందిన వెంకన్న ఫిర్యాదు చేశాడు.
⇒ డీఆర్‌డీఏ వెలుగు డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న వెంకటరత్నం ప్రభుత్వ స్కీముల ద్వారా లబ్ధి పొందేలా చేస్తానని ఆశ పెట్టి డబ్బు తీసుకుని మోసం చేశాడని హాలహర్వికి చెందిన శీలం నాగమ్మ ఫిర్యాదు చేశారు.
⇒ పిల్లల చదువుల కోసం చీటీలు వేసి దాచుకున్న డబ్బు ఇవ్వకుండా జొహరాపురం గ్రామానికి చెందిన మహమ్మద్ తప్పించుకుని తిరుగుతున్నాడని ఇందిరమ్మ గృహాలకు చెందిన చాకలి రామచంద్రుడు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment