మా వాహనాన్నే ఆపుతావా.. | SI Hulchul At Nannur Toll Gate In Nandyala District, Check More Details Inside | Sakshi
Sakshi News home page

మా వాహనాన్నే ఆపుతావా..

Published Thu, Mar 20 2025 12:19 PM | Last Updated on Thu, Mar 20 2025 1:19 PM

SI Hulchul In Nandyala District

మా వాహనాన్నే ఆపుతావా  అంటూ బూతులు 

దురుసు డ్రైవింగ్‌తో దెబ్బతిన్న బూమ్‌ బ్యారియర్‌ 

ఓ ఉద్యోగిని వాహనంలో స్టేషన్‌కు తరలింపు

సాక్షి టాస్‌్కఫోర్స్‌: ఓర్వకల్లు మండలం నన్నూరు టోల్‌గేట్‌ వద్ద ఓ ఎస్‌ఐ హల్‌చల్‌ చేశారు. మా వాహనాన్నే ఆపుతావా అని అక్కడి సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు. ఒక్కసారిగా వాహనాన్ని ముందుకు కదిలించడంతో టోల్‌బూత్‌లో ఏర్పాటు చేసిన బూమ్‌ బ్యారియర్‌ దెబ్బతినింది. ఈ ఘటన బుధవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. సదరు ఎస్‌ఐ కర్నూలు ఉపకారాగారం నుంచి ఓ ముద్దాయిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. 

స్వయంగా ఆయనే కారు నడుపుతున్నారు. వాహనం నన్నూరు టోల్‌గేట్‌కు చేరుకోగా ముందున్న మరో వాహనం ఫాస్‌టాగ్‌ స్కాన్‌ కాకపోవడంతో సిబ్బంది మాన్యువల్‌గా టోల్‌ రుసుము వసూలు చేశారు. ఆ వెంటనే బూమ్‌ బ్యారియర్‌ యథాస్థితికి వస్తుండగా ఎస్‌ఐ నడుపుతున్న వాహనం ఒక్కసారిగా ముందుకు కదిలింది. ఆ సమయంలో బూమ్‌ బ్యారియర్‌ దెబ్బతినింది. ఇంతలో టోల్‌ సిబ్బంది వాహనం చుట్టూ గుమికూడటంతో ఎస్‌ఐ బూతు పురాణం మొదలుపెట్టారు. తమ వాహనాన్నే ఆపుతారా అంటూ గద్దించారు. 

అంతటితో ఆగకుండా టోల్‌ కలెక్టర్‌ మహబూబ్‌బాషాను బలవంతంగా అదే వాహనంలో ఎక్కించుకొని స్టేషన్‌కు తీసుకెళ్లారు. టోల్‌ సిబ్బంది బతిమాలినా ఫలితం లేకపోయింది. ఉద్యోగిని తీసుకెళ్లి స్టేషన్‌లో ఉంచారు. అయితే విషయం ఆనోటా ఈనోటా బయటకు పొక్కడంతో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో టోల్‌ ఉద్యోగిని విడిచిపెట్టడం గమనార్హం. ఇదిలాఉంటే గతంలోనూ ఈ ఎస్‌ఐ టోల్‌గేట్‌ సిబ్బంది పట్ల దురుసుగా వ్యవహరించినట్లు సమాచారం. ఆ సమయంలో ఆయన మఫ్టీలో కారు నడుపుతుండగా సిబ్బంది ఐడీ కార్డు అడిగినట్లు తెలిసింది. నన్నే కార్డు అడుగుతావా అని సిబ్బందిపై విరుచుకుపడినట్లు సమాచారం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement