ఏపీ, కర్ణాటక అధికారులు, నిపుణుల సూచనతో తుంగభద్ర బోర్డు నిర్ణయం
20 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పుతో గేటు తయారీ పనులు కాంట్రాక్టర్లకు అప్పగింత
5 భాగాలుగా.. ఒక ఎలిమెంట్‌పై మరో ఎలిమెంట్ ద్వారా అమరిక
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్, కర్ణాటక జల వనరుల శాఖ అధికారులు, నిపుణులతో చర్చించాక.. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ 19వ గేటు స్థానంలో అత్యవసర గేటు ఏర్పాటు చేయాలని తుంగభద్ర బోర్డు నిర్ణయించింది. సాధారణంగా ప్రాజెక్టులపై క్రస్ట్ గేటు.. స్టాప్ లాక్ గేటు దించడానికి వీలుగా రెండు గాడి(గ్రూవ్)లు పియర్స్ (సిమెంటు దిమ్మెలు)కు ఏర్పాటు చేస్తారు. కానీ.. తుంగభద్ర డ్యామ్ పాత డిజైన్ కావడంతో క్రస్ట్ గేటు ఏర్పాటుకు ఒకే గాడిని ఏర్పాటు చేశారు. దీని వల్ల స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేయలేని పరిస్థితి.
దీనిపై సోమవారం తుంగభద్ర డ్యామ్ వద్ద బోర్డు కార్యదర్శి ఓఆర్కే రెడ్డి.. నిపుణులు, గేట్ల సలహాదారు కన్నయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ జల వనరుల విభాగం సీఈ (హైడ్రాలజీ) రత్నకుమార్, కర్ణాటక జల వనవరుల శాఖ సలహాదారు మల్లికార్జున గుంబ్లీ తదితరులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో క్రస్ట్ గేటు గాడిలోనే అత్యవసర గేటును అమర్చాలని నిర్ణయించారు. అత్యవసర గేటు తయారీ పనులను హిందూస్థాన్ ఇంజినీరింగ్ వర్క్స్, నారాయణ ఇంజినీరింగ్ వర్క్స్‌కు అప్పగించారు. ఈ గేటును 20 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేయనున్నారు.
అత్యవసర గేటును 5 భాగాలు (ఎలిమెంట్లు)గా తయారు చేస్తారు. మొదటి ఎలిమెంట్‌ను 2 అడుగుల ఎత్తు, రెండో ఎలిమెంట్‌ను 4 అడుగులు, మూడో ఎలిమెంట్ 6 అడుగుల ఎత్తు.. నాలుగు, ఐదు ఎలిమెంట్లు 4 అడుగుల ఎత్తు, 60 మీటర్ల వెడల్పుతో తయారు చేస్తారు. ఆ ఎలిమెంట్లకు ఇరు వైపులా రోలర్లను అమర్చుతారు. ఆ తర్వాత 19వ గేటు ఉన్న 18, 19 పియర్లకు ఉన్న గాడి(గ్రూవ్)లో మొదటి ఎలిమెంటును దించుతారు.
ఆ తర్వాత రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు ఎలిమెంట్లను దించడం ద్వారా అత్యవసర గేటు ఏర్పాటు చేస్తారు. గేటు తయారీ ప్రక్రియకు ఐదారు రోజులు పడుతుందని.. రోలర్లు అందుబాటులో ఉంటే.. డ్యామ్‌లో ఎప్పుడు నీటి మట్టం 1,613 అడుగులు (కనీస నీటి మట్టం) స్థాయికి తగ్గినప్పుడు అత్యవసర గేటు అమర్చుతామని అధికారులు చెబుతున్నారు.
నీటి వృథాకు అడ్డుకట్ట వేసేందుకు..
తుంగభద్ర డ్యామ్ గరిష్ట నీటి మట్టం 1633 అడుగులు. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 105.79 టీఎంసీలు. డ్యామ్ కనీస నీటి మట్టం 1613 అడుగులు. అదే స్థాయి నుంచి 1633 అడుగుల వరకు 20 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పుతో స్పిల్ వేకు 33 గేట్లను బిగించారు. ఇప్పుడు అత్యవసర గేటు ఏర్పాటు చేయాలంటే 1613 అడుగుల స్థాయికి అంటే డ్యామ్‌లో నీటి నిల్వను 43.83 టీఎంసీలకు తగ్గించాలి.
దాంతో శనివారం నుంచే డ్యామ్‌లో నీటిని ఖాళీ చేస్తున్నారు. సోమవారం నాటికి డ్యామ్‌లో 97.75 టీఎంసీలు ఉండగా.. డ్యామ్‌లోకి 25,571 క్యూసెక్కులు చేరుతుండగా.. 99,567 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. డ్యామ్‌లో నీటి నిల్వను 1613 అడుగులకు తగ్గిస్తే సుమారు 61 టీఎంసీల మేర నీరు వృథా అవుతుంది.
నీటి వృథాను అరికట్టడానికి నీటి మట్టం 1613 అడుగుల కంటే ఎగువన ఉన్నప్పటికీ అత్యవసర గేటును దించే ప్రయత్నం చేద్దామని నిపుణులు కన్నయ్యనాయుడు సూచించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.నిపుణుల సలహాల మేరకు గేటును అమర్చేందుకు ప్రయత్నిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, వేసవిలో పూర్తి స్థాయి క్రస్ట్ గేటును అమర్చాలని బోర్డు నిర్ణయించింది.
సక్రమంగా దించకపోవడం వల్లే..
గేట్ల నిర్వహణలో నిపుణులైన అధికారులు, సిబ్బంది అధిక శాతం పదవీ విరమణ చేశారు. వారి స్థానంలో కాంట్రాక్టు పద్ధతిలో సిబ్బందిని నియమించారు. వారికి గేట్ల నిర్వహణలో అనుభవం లేదు. స్పిల్ వే 19వ గేటును సక్రమంగా దించపోవడం వల్లే.. అంటే ఒక కొస దిగువకు దిగి, మరొక కొస ఎగువన ఉండటం వల్ల (ఎగుడు దిగుడు) వరద ఉధృతికి గేటు కొట్టుకుపోయిందని చైన్ తెగడం వల్ల గేటు కొట్టుకుపోయే అవకాశమే లేదని నిపుణులు తేల్చి చెబుతున్నారు.
మిగతా 32 గేట్లపై సీఈసీఆర్‌ఐతో అధ్యయనం
తుంగభద్ర డ్యామ్ నిర్మాణం పూర్తయి దాదాపుగా 71 ఏళ్లు పూర్తయింది. గేట్ల నిర్వహణ ప్రారంభమై 66 ఏళ్లు పూర్తయింది. ఈ 66 ఏళ్లలో 2.5 మిలియన్ సైకిల్ ద్వారా ఎత్తడం, దించడం చేశారు. ఇప్పుడు కొట్టుకుపోయిన గేటు కాకుండా, మిగతా 32 గేట్ల పనితీరు సవ్యంగా ఉన్నట్లు ఏపీ, కర్ణాటక అధికారులు, నిపుణులు కన్నయ్య నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. వరద ఉధృతితో గేట్లపై ఒత్తిడి పడి, బలహీనపడే అవకాశం ఉంటుంది. అందుకే గేట్ల కాల పరిమితిని 45 ఏళ్లు, కాంక్రీట్ కట్టడాల కాల పరిమితి 100 ఏళ్లుగా సీడబ్ల్యూసీ నిర్దేశించింది.
కానీ.. 66 ఏళ్లవుతున్నా గేట్లను ఎందుకు మార్చలేదని కన్నయ్య నాయుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మిగతా 32 గేట్లు సవ్యంగా పని చేస్తున్నప్పటికీ.. వాటి సామర్థ్యంపై తమిళనాడులో కరైకుడిలోని సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఈసీఆర్‌ఐ)తో అధ్యయనం చేయించాలని బోర్డుకు సూచించారు. సీఈసీఆర్‌ఐ నివేదిక ఆధారంగా గేట్లకు మరమ్మతులు లేదా కొత్త గేట్ల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.
టీబీ డ్యాం సర్కారు నియంత్రణలో లేదు
సాక్షి, బళ్లారి: తుంగభద్ర జలాశయాన్ని కర్ణాటక ప్రభుత్వం నిర్వహించడం లేదని, అందుకు ప్రత్యేక బోర్డు ఉందని, అందులో తాము సభ్యులం మాత్రమేనని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో సోమవారం ఆయన తుంగభద్ర డ్యాంను సందర్శించారు. అనంతరం బెంగళూరుకు వెళ్లి నీటి పారుదల నిపుణులతో సమావేశమైన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
‘డ్యాంను పరిశీలించాను. గేట్ కొట్టుకుపోవడంపై సంబంధిత అధికారులతో, కాంట్రాక్టర్లతో చర్చించాను. నూతన క్రస్ట్ గేట్‌ను పునరుద్ధరించడానికి ఐదు రోజులు పట్టొచ్చు. ఖరీఫ్ పంటకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. మంగళవారం ముఖ్యమంత్రి సిద్దరామయ్య డ్యాంను సందర్శించి నిపుణులతో మాట్లాడతారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని చెప్పారు. కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్
Comments
Please login to add a commentAdd a comment