
నెల్లూరు: సెకీ(SECI) ఒప్పందం సక్రమమేనని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(APERC) చెప్పడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెంప పెట్టులాంటిదని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి విమర్శించారు. సెకీతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపై ఎల్లో మీడియా నిస్సిగ్గుగా వార్తలు రాసిందని, ముందు చూపుతో వైఎస్ జగన్(YS Jagan) చేసిన ఒప్పందంతో రాష్ట్రానికి తక్కువ ధరకే విద్యుత్ లభించిందన్నారు.
నెల్లూరులో మీడియాతో మాట్లాడిన కాకాణి.. ‘ఏపీ(AP) చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తక్కువ ధరకే విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్నాం. జగన్ కు మరక అంటించేందుకు ఎల్లో మీడియా, చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. డిస్కమ్ లు కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎన్నడూ కుదుర్చుకోలేదుజగన్ ఒప్పందం వల్ల లక్షా పదివేల కోట్ల ఆదాయం వస్తే.. చంద్రబాబు వల్ల 87వేల 500 కోట్ల సంపద ఆవిరైపోయింది. ఎల్లో మీడియాకు క్రెడిబులిటీ ఉంటే.. తప్పుడు రాతలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. విద్యుత్ రంగాన్ని చంద్రబాబునాయుడు తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశారు. చంద్రబాబు తప్పులను కప్పిపుచ్చుకునేందుకు జగన్ పై బురద చల్లుతున్నారు’అని ధ్వజమెత్తారు.
కాగా, రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దూరదృష్టితో కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’తో కారుచౌకగా యూనిట్ రూ.2.49కే సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా రూ.1.10 లక్షల కోట్లను ఆదా చేసి సంపద సృష్టించే దిశగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అడుగులు వేసిందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) సాక్షిగా రుజువైంది. గత ప్రభుత్వ హయాంలో సెకీతో జరిగిన ఒప్పందంలో ఎలాంటి లోపాలు లేవని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) క్లీన్ చిట్ ఇచ్చింది.

7 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందం పూర్తిగా నిబంధనల మేరకే జరిగిందంటూ ఆదాయ అవసరాల నివేదిక (అగ్రిగేట్ రెవిన్యూ రిక్వైర్‌మెంట్–ఏఆర్‌ఆర్)లో ఏపీఈఆర్‌సీ స్పష్టం చేసింది. విద్యుత్ సేకరణపై తాజాగా విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్స్) చేసిన ప్రతిపాదనల్లో సెకీ విద్యుత్ కూడా ఉంది. 2025–26లో సెకీ నుంచి 4 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను తీసుకోవడానికి అనుమతించాల్సిందిగా ఏపీఈఆర్‌సీని డిస్కంలు కోరాయి. దీనిపై స్పందించిన కమిషన్ ‘సెకీ’ విద్యుత్ ఒప్పందంపై తాజాగా పూర్తి స్పష్టత ఇచ్చింది.
‘‘సెకీ నుంచి తీసుకునే 7 వేల మెగావాట్లలో ఈ ఏడాది (2025–26)లో 4 వేల మెగావాట్లను విద్యుత్ సేకరణ ప్రణాళిక (పవర్ ప్రొక్యూర్‌మెంట్ ప్లాన్)లో చేర్చకపోవడానికి కమిషన్‌కు ఎటువంటి కారణం కనిపించడం లేదు’’ అని ఏపీఈఆర్‌సీ పేర్కొంది.
‘సెకీ’ ఒప్పందం సక్రమమే
Comments
Please login to add a commentAdd a comment