సంక్రాంతి వేళ అదనపు చార్జీలతో ఇష్టారాజ్యంగా దోపిడీ
దాదాపు 40 లక్షల మంది వీటి ద్వారానే సొంతూళ్లకు పయనం
ఇదే అదనుగా మూడు, నాలుగు రెట్లు చార్జీలు పెంచేసి దందా
ఒక్కో టికెట్‌పై సగటున రూ.1,500కు పైగా అదనపు బాదుడు
సంక్రాంతి పేరుతో రూ.1,200 కోట్ల దోపిడీకి స్కెచ్
కీలక నేతకు ట్రావెల్స్ సిండికేట్ ముడుపులు!?
దీంతో ప్రైవేట్ దోపిడీని పట్టించుకోని రవాణా శాఖ
రాష్ట్రంలో ఎక్కడా అమలుకాని మంత్రి హామీ
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు/సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం/నెల్లూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చిన తొలి సంక్రాంతికి ‘ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నాం.. ప్రైవేట్ సర్వీసులు కూడా ఆర్టీసీతో సమానంగా టికెట్ రేట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం..’ ఇది సాక్షాత్తు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పదే పదే మీడియాలో చెబుతున్న మాట.. కానీ, వాస్తవం ఏమిటంటే.. ప్రైవేట్ బస్సుల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండాపోయింది. ఆన్‌లైన్‌లో ధరలను మూడు, నాలుగింతలు పెంచేసి నిలువు దోపిడీ చేసేస్తున్నారు. పైగా.. టికెట్లను బ్లాక్‌చేసి కృత్రిమ కొరత సృష్టించి రూ.వందల కోట్ల భారీ దోపిడీకి స్కెచ్ వేశారు.
ఎందుకంటే పండుగ రద్దీకి తగ్గట్లుగా ఆర్డీసీ బస్సు సర్వీసుల్లేవు. దీంతో మధ్యతరగతి, పేద వర్గాలకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులే దిక్కయ్యాయి. ఇదే అదనుగా రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్ సిండికేట్ ప్రజల ఉత్సాహాన్ని నీరుగార్చేస్తోంది. చార్జీలను ఏకంగా మూడు నాలుగు రెట్లు పెంచేసి ఎడాపెడా దోచేస్తోంది. అయినా ప్రభుత్వ యంత్రాంగం చోద్యం చూస్తోంది. ఎందుకంటే రవాణా శాఖలో ఓ కీలక నేతకు ఈ సిండికేట్ ముందుగానే రూ.50 కోట్లకు పైగా ముడుపులు అందించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా.. ప్రైవేట్ ట్రావెల్స్‌లో ఆఫ్‌లైన్‌లో టికెట్ల అమ్మకం తక్కువ. ఒకవేళ ఉన్నా వారు డబ్బులు తీసుకుని టికెట్ బుక్చేసినట్లు మెసేజ్ ఇస్తున్నారు. అందులో వ్యూహాత్మకంగా టికెట్ ధర పేర్కొనడంలేదు. కానీ, ఆన్‌లైన్‌లో మాత్రం పెంచిన ధరలను ప్రదర్శిస్తున్నారు.
మూడు, నాలుగురెట్లు అధికంగా చార్జీలు..
ఏటా సంక్రాంతికి దాదాపు 75 లక్షల మంది సొంతూళ్లకు వెళ్తారని అంచనా. వీరిలో సొంత వాహనాలు, రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో దాదాపు 35 లక్షల మంది ప్రయాణిస్తారు. మిగిలిన దాదాపు 40 లక్షల మందికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులే దిక్కు. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ సిండికేట్‌ది ఆడింది ఆట.. పాడింది పాటగా సాగుతోంది. ఈ నేపథ్యంలో.. తమ సర్వీసుల్లో జనవరి 11 నుంచి 18 వరకు రానూపోనూ టికెట్లను జనవరి 1 నాటికే బ్లాక్ చేసేశాయి. ఆ తర్వాత చార్జీలను ఏకంగా మూడు నాలుగు రెట్లు పెంచేశాయి. ఉదా..
⇒ సాధారణ రోజుల్లో విజయవాడ నుంచి విశాఖపట్నానికి నాన్ ఏసీ బస్సు రూ.750, ఏసీ బస్సు రూ.1,200, స్లీపర్ బస్సు రూ.1,500 టికెట్ వసూలుచేసేవారు. కానీ, ఈ పండుగ సీజన్‌లో నాన్ ఏసీ బస్సు రూ.2 వేలు, ఏసీ బస్సు రూ.3 వేలు, ఏసీ స్లీపర్ బస్సు రూ.5 వేలు వరకు అమాంతంగా పెంచేశారు. ఇక విజయనగరం, శ్రీకాకుళం వెళ్లేందుకైతే మరో రూ.500 వరకు అదనంగా చెల్లించాలి.
⇒ విజయవాడ నుంచి హైదరాబాద్‌కు సాధారణ రోజుల్లో ఏసీ బస్సులో రూ.వెయ్యి వసూలుచేసేవారు. ఇప్పుడు దానిని రూ.2,500కు పెంచేశారు.
⇒ విజయవాడ నుంచి రాయలసీమలోని కడప, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాలకు సాధారణ రోజుల్లో ఏసీ బస్సు రూ.1,200 చార్జీ ఉండగా, ప్రస్తుతం రూ.3,500 నుంచి రూ.4వేల వరకు పెంచేయడం గమనార్హం.
⇒ కాకినాడ, రాజమహేంద్రవరం తదితర జిల్లా కేంద్రాలకు కూడా చార్జీలను ప్రైవేట్ ట్రావెల్స్ సిండికేట్ భారీగా పెంచేసింది.
⇒ ఇక సాధారణ రోజుల్లో హైదరాబాదు నుంచి నెల్లూరుకు ఏసీ స్లీపర్ 1,500 ఉంటే ఇప్పుడు రూ.3వేల వరకు ఉంది. నాన్–ఏసీ స్లీపర్ ధర రూ.1,000 నుంచి రూ.2,500కు పెరిగింది. అదే నాన్–ఏసీ బస్సు అయితే రూ.850 ఉన్న దానిని రూ.2 వేల వరకు పెంచారు.
⇒ బెంగుళూరు నుంచి నెల్లూరుకు ఏసీ స్లీపర్ సాధారణ రోజుల్లో రూ.1,000 ఉంటే ప్రస్తుతం రూ.2,500 వరకు ఉంది. అదే నాన్–ఏసీ స్లీపర్‌కు రూ.900 నుంచి రూ.2వేలు, నాన్–ఏసీకి రూ.800 నుంచి రూ.1,700 వరకు పెంచారు.
⇒ గుంటూరు నుంచి హైదరాబాద్‌కు మామూలు రోజుల్లో నాన్ ఏసీ బస్సుకు రూ.450, ఏసీ బస్సుకు రూ.500, స్లీపర్ ఏసీ బస్సుకు రూ.650–750, హైదరాబాద్ నుంచి గుంటూరుకు నాన్‌ఏసీ రూ.500, ఏసీ రూ.550, స్లీపర్ ఏసీ రూ.600–రూ.700 రూపాయలు.. కానీ, పండుగ సీజన్‌తో ఒక్కో టికెట్‌పై అదనంగా రూ.1,000 నుంచి రూ.2,000 వరకు రేటును పెంచేశారు.
⇒ అదే బెంగళూరుకు ఆర్టీసీలో రూ.900 నుంచి రూ.18 వందల వరకూ ధర ఉండగా, ప్రైవేట్ ట్రావెల్స్ రూ.2 వేల నుంచి రూ.2 వేల వరకూ వసూలుచేస్తున్నారు. ఈ రేట్లను అధికారికంగా వెబ్‌సైట్లలో పెట్టి మరీ అమ్ముతున్నారు.
రూ.1,200 కోట్ల దోపిడీ..
దాదాపు 40 లక్షల మంది ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారానే ప్రయాణించనుండటం సిండికేట్ దోపిడీకి మార్గం సుగమమైంది. సగటున ఒక్కో టికెట్‌పై సరాసరిన రూ.1,500 వరకు అదనపు బాదుడుకు పాల్పడుతోంది. ఇలా 40 లక్షల మంది రానూపోనూ ప్రయాణం అంటే 80 లక్షల మంది ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లోనే ప్రయాణించాలి. ఆ ప్రకారం రూ.1,200 కోట్లు దోపిడీకి ప్రైవేట్ బస్సుల ముఠా పాల్పడుతోంది.
⇒ ఈమె పేరు బొత్స పద్మప్రియ. శ్రీకాకుళానికి చెందిన విద్యార్థిని. హైదరాబాద్‌లో ఓ పరీక్ష రాసేందుకు వెళ్లాల్సి వచ్చింది. ఇటువైపు నుంచి రైలు టికెట్ దొరికింది. కానీ, తిరుగు ప్రయాణానికి దొరకలేదు. దీంతో.. 20 రోజుల ముందే ప్రైవేట్ ట్రావెల్స్‌లో టికెట్ బుక్ చేసుకుంది. అయినా ఆ ట్రావెల్స్ ఆపరేటర్ సంక్రాంతి సీజన్ పేరుతో రూ.4,220.95 చార్జీ అని, జీఎస్టీ పేరుతో మరో రూ.780 వసూలుచేశారు. విచిత్రమేమిటంటే టికెట్‌లో జీఎస్టీ కోసం మినహాయించిన మొత్తాన్ని చూపించలేదు. ముందు బుక్ చేయకపోతే నా పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండేదో అని పద్మప్రియ వాపోయింది.
కీలక నేతకు ముడుపుల మేత?
ప్రైవేట్ ట్రావెల్స్ సిండికేట్ అమాంతంగా చార్జీలు పెంచేసి దోపిడీకి పాల్పడుతున్నా రవాణా శాఖ యంత్రాంగం ఎందుకు పట్టించుకోవడంలేదన్నది అందరి అనుమానం. కానీ, అసలు విషయం ఏమిటంటే.. ప్రైవేట్ ట్రావెల్స్ దందాకు రాయలసీమకు చెందిన రవాణా శాఖ కీలక నేతే పచ్చజెండా ఊపారు. ఎందుకంటే.. ట్రావెల్స్ సిండికేట్ ముందుగానే ఆయనతో డీల్ కుదుర్చుకుంది. విజయవాడలోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో చక్రం తిప్పుతున్న ఓ కీలక అధికారి, ఆ కీలక నేత పేషీలోని ఓ ముఖ్య ఉద్యోగే ఈ డీల్‌లో కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. అందుకే.. వీటివైపు కన్నెత్తి చూడడంలేదు.
చార్జీలను అమాంతంగా పెంచేశారు..
సంక్రాంతి పేరుతో ప్రైవేట్ బస్సుల్లో చార్జీలను అమాంతంగా పెంచేశారు. కుటుంబ సమేతంగా హైదరాబాద్ నుంచి సొంతూరు వచ్చి వెళ్లాలంటే చార్జీలకు రూ.25 వేలు అవుతోంది. సరిపడా బస్సులను ప్రభుత్వం ఏర్పాటుచేయకపోవడం వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పెంచిన చార్జీలను వెబ్‌సైట్‌లో పెడుతున్నా, ప్రభుత్వం స్పందించడంలేదు. – కార్తీక్ రామిరెడ్డి, నెల్లూరు
విమాన టికెట్ ధరలకూ రెక్కలు..
గన్నవరం: సంక్రాంతి సందర్భంగా విమాన టికెట్ల ధరలకూ రెక్కాలొచ్చాయి. సాధారణ రోజులతో పోల్చితే ఈనెల 11, 12, 13 తేదీల్లో ఈ ధరలు మూడు నుంచి నాలుగు రెట్లు భారీగా పెరిగాయి. ప్రయాణికుల రద్దీ అత్యంత ఎక్కువగా ఉండే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చే విమానాల్లో ధరల దరువు ఎక్కువగా ఉంది. రైళ్లు, బస్సులు టికెట్లు దొరక్కపోవడంతో పండక్కి స్వగ్రామాలకు వచ్చే ప్రజలు ప్రత్యామ్నాయంగా విమాన ప్రయాణంపై మొగ్గు చూపుతున్నారు. దీంతో విమాన టికెట్ ధరలు కొండెక్కాయి.
ముఖ్యంగా.. బెంగళూరు నుంచి విజయవాడకు సాధారణ రోజుల్లో రూ.3,500 నుంచి రూ.3,750 ఉండే విమాన టికెట్ ధరలు ఈ మూడు రోజులు రూ.13,350 నుంచి రూ.16,058 వరకు పలుకుతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే విమానాల టికెట్ ధరలు సాధారణ రోజుల్లో రూ.3 వేల లోపు ఉండగా ప్రస్తుతం రూ.11,615 నుంచి రూ.16,716 వరకు పెరిగాయి. ఇక న్యూఢిల్లీ–విజయవాడ మధ్య టికెట్ ధర రూ.6,500 నుంచి రూ. 20,986కు చేరుకోవడం గమనర్హం. అలాగే, చెన్నై నుంచి విజయవాడకు టికెట్ ధర నాలుగు రేట్లు పెరిగి రూ. 13,407కు, ముంబై నుంచి విజయవాడకు రూ.4 వేలులోపు ఉండే టికెట్ ధర రూ. 11,975కు చేరింది. పండుగ తర్వాత కూడా ఈ ధరలు దాదాపు ఇలాగే ఉండే అవకాశముందని ఎయిర్‌పోర్ట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment