పండగ అయిపోయింది.. భీమవరం నుంచి భార్య రేవతి.. పిల్లలు భరత్.. భావనతో కలిసి పార్వతీపురం పండక్కి వెళ్లిన శ్రీకాంత్ మళ్ళీ తిరుగు ప్రయాణమయ్యాడు.. బస్సులు ఎక్కలేని పరిస్ధితి.. ఏదోలా సంచులు అందుకుని తల్లి, నలుగురు ఎక్కేశారు. లక్కీగా బొబ్బిలిలో సీట్ దొరికింది.. కిటికీ పక్కన శ్రీకాంత్ కూర్చోగా ఆ పక్కనే తల్లి ముగ్గురు సర్దుకున్నారు. మూడు రోజుల పాటు అక్కడే ఉన్న శ్రీకాంత్ చిన్ననాటి మిత్రుల్లాంటి వాళ్ళు.. బంధువుల గెటప్పుల్లో ఉన్న అంతర్గత విలన్లు.. సొంతవాళ్ల ముసుగులో ఉన్న పరాయివాళ్లతోనూ గడిపిన సంఘటనలు.. కళ్ళ ముందు గిర్రున తిరిగాయి.
భోగినాడు రాత్రి తాను తెచ్చిన ఫుల్ బాటిల్ ఇంకా మంచింగ్ కోసం వెయ్యి పట్టుకెళ్లిన బావ శ్రీను తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కల్లంలో సిట్టింగ్ వేశాడు. పిల్లలను ఊళ్ళో అటు ఇటు తిప్పి మొత్తానికి మనోళ్ల సిట్టింగ్ స్పాట్ దగ్గరకు వెతుక్కుని వెళ్లిన శ్రీకాంత్ కు వాళ్ళ మాటలు వినబడ్డాయి. ఒరేయ్.. ఆ శ్రీకాంత్ గాడు మహా ముదుర్రా.. అక్కడ ఎన్నెన్ని చేస్తున్నాడో ఏందో.. బాగా సంపాదించాడు. మొత్తానికి ఏదో ఉందిరా అంటున్నాడు బావ శ్రీను పెగ్గు కలుపుతూ.. అదేం లేదులేరా.. పదిహేనేళ్లుగా భార్యా భర్త అక్కడ పంజేస్తున్నారు. పైగా వాడు జాగ్రత్తపరుడు.. వ్యసనాల్లేవు.. అందుకే పదో పరకో దాచుకున్నాడు అన్నాడు ఇంకో బ్రదర్ నాగరాజు.
అదేం లేదురా వాడు ఏదో చేస్తున్నాడు.. నాకు అనుమానమే.. లేకుంటే ఇంత ఎక్కువ ధర ఉన్న మందు మనకు ఎందుకు ఇస్తాడు.. వాడికి ఉబ్బర్న వచ్చింది కాబట్టే ఇచ్చాడు.. బావ శ్రీను ముక్తాయింపు ఇచ్చాడు. శ్రీకాంత్ కు కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ ముందు బాటిల్ ను బట్టల మాటున బ్యాగులో తాను రేవతిని ఎంతలా ఒప్పించాల్సి వచ్చిందో.. దేవుడికి చూపే బట్టల్లో అది వద్దని తానూ ఎంతలా వాదించిందో గుర్తొచ్చి శ్రీకాంత్ ఇంకక్కడ ఉండలేక భారమైన మనసుతో చల్లగా అక్కణ్ణుంచి జారుకున్నాడు.
చీరలు పెట్టే సమయంలో పెద్దక్క భవాని చేసిన కామెంట్లు మళ్లోసారి జ్ఞాపకం వచ్చాయి. చూసావా అమ్మా.. వాడి పెళ్ళానికి మంచిది కొన్నాడు.. మనకు ఏదో ఆఫర్లో వచ్చిన గుడ్డ ముక్కలు కొని పడేసాడు అంటూ పొయ్యిదగ్గర మాట్లాడుకున్న మాటలు తన చెవిన పడ్డాయి. అదేం లేదులేవే అని సర్ది చెప్పాల్సిన తల్లి వరాహలమ్మ కూడా.. వాడు పెళ్ళైన రోజునుంచే మారిపోయాడు కధేటి.. అనడం శ్రీకాంత్ ను మరింత బాధించింది. కానీ భవానికి చీర సెలక్షన్ కోసం రేవతి ఎన్ని షాపులు తిరిగిందీ.. దానికి మ్యాచింగ్ గాజులు.. జాకెట్ ముక్కలను ఎలా విశ్లేషించి సెలెక్ట్ చేసిందీ శ్రీకాంత్ కు గుర్తొచ్చింది. ఎవరికీ అవతలి వారి కష్టం పట్టదు.. తమ సౌఖ్యం మాత్రమే ముఖ్యం.. అందులో తల్లీ చెల్లీ కూడా మినహాయింపు కాదని తెలిసొచ్చింది. అయినా వాళ్ళను ఏమీ అనలేక తమాయించుకున్నడు
ఓహ్.. ఎవరికీ ఎంత చేసినా అందులో లోపాలు వెతకడమే కాకుండా అవహేళన చేయడమే నైజంగా ఉన్న బంధువులను సంతోషపరచడం ఇసుక నుంచి నూనెను పిండటం లాంటిదే అని శ్రీకాంత్ కు వందోసారి తెలిసొచ్చింది. కానీ సంప్రదాయలపేరిట.. నకిలీ అనుబంధాల మాటున వాటిని భరిస్తూ వస్తున్నాడు. ఇంతలో రేవతి యాండీ ఇదేటి.. ఈ షర్ట్ మనం కొనలేదు కదా.. ఇదేక్కడిది అంది కవర్లోంచి తీస్తూ.. అర్రే చూసేసిందా అని నాలుక్కరుచుకున్న శ్రీకాంత్.. ఓహ్.. అదా.. అదా.. మా క్లాస్మేట్ టైలర్ రమణగాడు కుట్టి ఇచ్చాడులే అని డైవర్ట్ చేశాడు.
కానీ సంక్రాంతి నాడు సాయంత్రం టెంట్ కింద పిల్లలంతా డాన్సులు చేస్తుంటే అక్క కూతురు సుమిత్ర వచ్చి మామయ్యా సుజాత బాప్ప రమ్మంది .. ఆ రామ్మందిరం పక్కనే ఉంది అని చెప్పేసి తుర్రుమంది. సుజాత.. ఒకనాటి నెచ్చెలి.. డిగ్రీ వరకు క్లాస్‌మేట్. ఎన్నెన్ని ఊసులు.. ఎన్నెన్ని బాసలు.. ఎక్కడా ఇద్దరం గీత దాటింది లేదు.. పెళ్లి చేసుకున్నాకే అన్నీ అనుకున్నాం.. కానీ విధి ఆమెను తన మేన బావకిచ్చి పెళ్ళిచేసింది.
నేను ఏం చేయలేక.. అసలు ఎందుకు బతకాలో తెలియక.. అలా ఊరొదిలి వెళ్ళిపోయా.. తరువాత సుజాత పంచాయతీరాజ్‌లో ఉద్యోగం తెచ్చుకుని ఊళ్ళోనే ఉంది. ఊరొచ్చిన ప్రతీసారీ దూరం నుంచి చూడటం.. కన్నీళ్లతో ప్రేమను చూపడం.. అంతే ఉండేది.. కానీ ఈసారి ఎందుకో సుజాతను చూడాలనిపించింది.. తనే పిలిచింది.. గోడ పక్కకు వెళ్ళగానే... ఇలారా అంటూ పిలిచింది.
ఏదేదో మాట్లాడాలనుకున్నాను కానీ నోరు పెగల్లేదు.. మాట రాలేదు.. తనకూ నాకూ మధ్య నిశ్శబ్దమే మాట్లాడింది. ఆ నిశ్శబ్దంలో ఎన్నో భావాలూ.. బాసలూ.. నీకోసం చొక్కా తీసుకున్నాను.. అంటూ ఇచ్చింది.. వణుకుతున్న చేత్తో తీసుకున్నాను.. అదే ఈ చొక్కా.. చూస్తుంటే దానిలో క్రీనీడ మధ్య నీడలా కనిపించిన సుజాత మొహం గుర్తొచ్చింది... దాన్ని ప్రేమగా ఒళ్ళోకి తీసుకున్నాను.. మొత్తం సంక్రాంతి ఎపిసోడ్లో నాకు నచ్చింది.. ఇష్టమైన ఘట్టం ఏదైనా ఉందంటే.. ఆ రెండు నిముషాల నిశ్శబ్ద సంభాషణ మాత్రమే.
-సిమ్మాదిరప్పన్న.
Comments
Please login to add a commentAdd a comment