వారం రోజులుగా హోరెత్తుతున్న ‘గోదారోళ్ల సంక్రాంతి’ మానియా
ఫేస్‌బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్, వాట్సాప్‌లలో పండుగ ముచ్చట్లు
ఆకట్టుకుంటున్న రీల్స్, మీమ్స్
కోడి పందేలు, ప్రభల తీర్థాలు, వంటకాలపై విస్తృత ప్రచారం
సోషల్ మీడియాలో వారం రోజులుగా ‘గోదారోళ్ల సంక్రాంతి’ మానియాగా మారింది. ‘సందళ్లే.. సందళ్లే.. సంక్రాంతి సందళ్లే.. అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్లే...’ పాట ఇప్పుడు సోషల్ మీడియా ఫాలోవర్స్ చెవుల్లో మార్మోగుతోంది. సంక్రాంతి పండుగ పూర్తయ్యేంత వరకూ ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్, యూట్యూబ్‌లలో గోదావరి జిల్లాల్లో జరిగే సంక్రాంతి పండుగ సందడి ట్రెండింగ్‌లో నిలవనుంది. రీల్స్, పోస్టింగ్స్‌లో సంక్రాంతి పండుగను హోరెత్తిస్తున్నారు.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాలలో ఏ రీల్స్ చూసినా ‘గోదావరి జిల్లాలకు పోదాం.. సంక్రాంతి చూద్దాం’ అనే క్యాంపెయిన్ ఎక్కువగా జరుగుతోంది. పండుగ సమీపిస్తున్న కొద్దీ ‘మరో పది రోజులు... మరో తొమ్మిది రోజులు...’ అంటూ కౌంట్ డౌన్ రీల్స్ కూడా చేస్తున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ మూడు రోజులు జరిగే విశేషాలు, సంస్కృతి, సంప్రదాయాలు, ప్రభల తీర్థాలు, వంటకాలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. – సాక్షి, అమలాపురం
దేశ, విదేశాల నుంచి రాక...
సంక్రాంతి పండుగను గోదావరి జిల్లాల్లో ప్రత్యేకంగా జరుపుకొంటారు. అందుకే ఉపాధి, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు పెద్ద పండుగ జరుపుకొనేందుకు రెక్కలు కట్టుకుని ఇక్కడ వాలిపోతున్నారు. వీరితోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రలకు చెందిన వారు కూడా ఈ పండుగకు అతిథులుగా వస్తారు.
విదేశాల్లో ఉపాధి పొందుతున్న వారు సైతం పండుగ సమయానికి ఇక్కడికి వచ్చేలా ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. సంక్రాంతి పండుగ దగ్గర పడుతున్న సమయంలో సోషల్ మీడియాలో పండుగ జోష్ మరింత పెరిగింది.
రకరకాల రీల్స్ హల్‌చల్
సంక్రాంతి సందర్భంగా గోదావరి జిల్లాలో జరిగే ప్రతి కార్యక్రమంపై ఇప్పుడు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నారు. ఇళ్లల్లో పిండి వంటలు.. ఇళ్ల ముందు రంగవల్లులు... వీధుల్లో గంగిరెద్దులు, హరిదాసుల సందళ్లు.. భోగి మంటలు... పిల్లలకు పోసే భోగి పళ్లు.. పట్టు పరికిణిల్లో పడుచు పిల్లల సందడి.. గోవు పిడకలు... ప్రభల తీర్థాలు... అమ్మవారి ఆలయాల వద్ద మొక్కులు తీర్చుకోవడం... ఇలా ప్రతి ఒక్కటీ రీల్స్‌గా మారి సోషల్ మీడియాను ముంచెత్తున్నాయి.
కోడిపందేలు.. గుండాట.. వంటి జూద క్రీడలు, రికార్డింగ్ డ్యాన్సులు సైతం రీల్స్‌గా మారిపోతున్నాయి. రీల్స్‌కు తగిన విధంగా తెలుగు సినిమా పాటలు.. హాస్యనటులతో గోదావరి జిల్లాల సంక్రాంతి మీమ్స్ కూడా నవ్వులు పూయిస్తున్నాయి.
ఇతర దేశాల్లో సైతం..
ఇతర దేశాల్లో సైతం సంక్రాంతి సందడి మొదలైంది. గోదారోళ్లు యూకే టీం ‘గోదారోళ్ల సంక్రాంతి సంబరాలు–2025’ పేరుతో వెబ్ పేజీ డిజైన్ చేసింది. సంక్రాంతి పండుగ ఇక ఎన్ని రోజులు.. ఎన్ని గంటలు.. ఎన్ని నిమిషాలు... అంటూ కౌంట్‌డౌన్ మొదలు పెట్టారు. సంక్రాంతి సంబరాలకు సంబంధించి ఆహ్వాన పత్రికలను కూడా ముద్రించారు.
Comments
Please login to add a commentAdd a comment