కాకినాడ జిల్లాలో అలల తాకిడికి దెబ్బ తింటున్న ఉప్పాడ గ్రామం
సాక్షి, అమరావతి/సాక్షి,విశాఖపట్నం/తిరుపతి సిటీ/సాక్షి ప్రతినిధి నెల్లూరు/బాపట్ల/రేపల్లె: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుపాను (మిచాంగ్)గా మారింది. ఆదివారం రాత్రికి ఇది నెల్లూరుకు ఆగ్నేయంగా 330, బాపట్లకు దక్షిణ ఆగ్నేయంగా 440, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 450 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 8 కి.మీ.ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఇదే దిశలో పయనిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర సమీపానికి చేరువవుంది. అనంతరం, ఉత్తర దిశగా తీరానికి సమాంతరంగా పయనిస్తూ సోమవారం ఉదయానికి తీవ్ర తుపానుగా బలపడనుంది.
ఆపై అదే తీవ్రతతో మంగళవారం ఉదయం బాపట్ల–మచిలీపట్నంల మధ్య తీరాన్ని దాటవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఆపై తుపాను క్రమంగా బలహీన పడుతూ ఉత్తరాంధ్ర వైపు పయనిస్తుందని తెలిపింది. తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, అందువల్ల ఈ నెల ఆరో తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో సోమవారం నుంచి బుధవారం వరకు గంటకు 60–70 కి.మీ.లు, గరిష్టంగా 90 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తాయని వివరించింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు గంటకు 90–100 కి.మీ., గరిష్టంగా 110 కి.మీ.ల వేగంతో పెనుగాలులకు ఆస్కారం ఉందని వివరించింది.
తుపాను నేపథ్యంలో విశాఖపట్నం పోర్టులో రెండో నంబరు, బందరు, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో మూడో నంబరు, కాకినాడ, గంగవరం పోర్టుల్లో నాలుగో నంబరు ప్రమాద హెచ్చరికలను జారీచేశారు. అలాగే.. సోమవారం దక్షిణ కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలోని ఆగ్నేయ ప్రాంతంలోనూ అక్కడక్కడ ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం కూడా ఉందని ఐఎండీ హెచ్చరించింది. కృష్ణాజిల్లా మచిలీపట్నం, అవనిగడ్డ, గుంటూరు జిల్లా రేపల్లెలలో కడలి కెరటాలు భారీగా ఎగసిపడతాయని, 250 మీటర్ల దూరం వరకు సముద్రం ముందుకు రావచ్చని, ఫలితంగా అక్కడ లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశాలున్నాయని తెలిపింది.
నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 10 సెం.మీ. వర్షం
తుపాను ప్రభావంతో శనివారం నుంచి రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నెల్లూరులో 10.3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. నెల్లూరు కలెక్టర్ ఎం. హరినారాయణన్ జిల్లాలో పూర్తి అప్రమత్తతను ప్రకటించారు. నెల్లూరు నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాలు వాగులను తలపిస్తున్నాయి. పలుచోట్ల ఈదురుగాలుల ధాటికి విరిగిపడిన చెట్ల వల్ల 178 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
ఎక్కడికక్కడ అధికారులు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. కలెక్టర్ ఎం.హరినారాయణన్, ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, జేసీ రోణంకి కూర్మనాథ్‌లు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇక తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం పూలతోటలో 10 సెం.మీ., సూళ్లూరుపేట మండలం మన్నార్‌పోలురులో 8.7, నాయుడుపేట 8.2, అల్లంపాడులో 8 సెం.మీ. వర్షం కురిసింది.
తిరుపతి జిల్లా ఏర్పేడు, శ్రీకాళహస్తి, పెళ్లకూరు, బుచ్చినాయుడు కండ్రిగ, తొట్టెంబేడు, పిచ్చాటూరు, రేణిగుంట, సత్యవేడు, చిత్తూరు జిల్లా నగరి, కార్వేటినగరం, నిండ్ర తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. సాగరమిత్రల సిబ్బందితో ఎప్పటికప్పుడు తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.
నిండుకుండల్లా రిజర్వాయర్లు..
తిరుపతి జిల్లాలో ఇప్పటికే మల్లెమడుగు, కాళంగి రిజర్వాయర్లు నిండుకుండలా మారాయి. పెద్దఎత్తున వీటిల్లోకి ఇన్‌ఫ్లో రావడంతో శనివారం రాత్రి నుంచి 50% గేట్లను అధికారులు ఎత్తివేశారు. అరణియార్ ప్రాజెక్టుకు వరదనీరు ఉధృతంగా రావడంతో ఆదివారం ఉదయం గేట్లు ఎత్తివేశారు. కళ్యాణి డ్యామ్ ఆదివారం అర్ధరాత్రికి నిండనుండడంతో దీని గేట్లను సైతం ఎత్తివేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా చంద్రగిరి నుంచి శ్రీకాళహస్తి మీదుగా పెళ్లకూరు, చెంబేడు వైపు నుంచి వాకాడు వరకు స్వర్ణముఖీ నది ఆదివారం ఉదయం నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆ ప్రాంత రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
మత్స్యకార గ్రామాల్లో ప్రత్యేక గస్తీ
బాపట్ల తీరంలో ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచే సముద్రం వద్దకు పర్యాటకులను పోలీనులు అనుమతించలేదు. జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా రక్షణ చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీచేశారు. నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచాలన్నారు. రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. రహదారులు, విద్యుత్ తదితర శాఖలతో సమీక్షించారు. మత్స్యకార గ్రామాల నుంచి ఎవరూ బయటకు రాకుండా ప్రత్యేక గస్తీ ఏర్పాటుచేశారు. పడవలను సముద్రం ఒడ్డుకు చేర్చారు. ఆలలు ఎక్కువగా రావటంతో ఒడ్డునున్న పడవులు కూడా దెబ్బతినే ప్రమాదం కనిపిస్తోందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
వైద్య, ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
మరోవైపు.. తుపాను దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వోలకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్ ఆదేశాలు జారీచేశారు. మారుమూల ప్రాంతాలు, హెల్త్ వెల్‌నెస్ సెంటర్లలో సరిపడా మందులను ముందుగానే నిల్వచేసుకోవాలని సూచించారు. ఈ వారంలో ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణులను ముందుగానే ఆసుపత్రులకు తరలించాలని, అన్ని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది హెడ్ క్వార్టర్లలో అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని రాష్ట్ర కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు.
సీఎం జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్
తుపానుపై ఆరా.. అన్ని విధాల సహకరిస్తామని హామీ
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్ర«ధాని నరేంద్ర మోదీ ఆదివారం ఫోన్ చేశారు. ఏపీలో ‘మిచాంగ్’ తుపాను పరిస్థితిపై ఆయన ఆరా తీసి అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. తుపాను ప్రభావిత ఎనిమిది జిల్లాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని, అందుకు సంబంధించిన సహాయక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కేంద్రం నుంచి అన్ని విధాల సహాకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఐదు జిల్లాలకు రెడ్‌అలర్ట్..
తుపాను ప్రభావం సోమవారం నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై ఇంకా తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాలకు రెడ్‌అలెర్ట్ ప్రకటించింది. 4వ తేదీన కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, ఎస్పీఎస్సార్ నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు... కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల, సత్యసాయి జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది.
ఇక మంగళవారం పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు.. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, నెల్లూరు, వైఎస్సార్, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్సార్, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురవవచ్చని తెలిపింది. బుధవారం పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్సార్, కాకినాడ జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని ఐఎండీ పేర్కొంది. 5వ తేదీ వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని హెచ్చరించింది.
ప్రభుత్వం అప్రమత్తం.. పర్యవేక్షణ నిరంతరం..
తుపాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై వెంటనే తగిన చర్యలు చేపట్టింది. రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తాడేపల్లిలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం తుపాను గమనం, తీసుకోవాల్సిన చర్యలను పర్యవేక్షిస్తున్నారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు కలెక్టర్లకు సూచనలు ఇస్తున్నారు. ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యల కోసం నాలుగు ఎన్డీఆర్‌ఎఫ్, ఆరు ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను ఆయా ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు తుపాను హెచ్చరిక సందేశాలను పంపుతున్నారు. ప్రజలకు అత్యవసర సహాయం, సమాచారం కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు 1070, 112, 18004250101 ఏర్పాటుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment