రేపటికల్లా వాయుగుండంగా మార్పు
ఆపై తుపానుగా బలపడే అవకాశం
మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో బుధవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు ఆనుకుని ఉంది. ఈ అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం ఈ వాయుగుండం అదే దిశలో పయనిస్తూ 25 సాయంత్రం ఈశాన్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలోకి చేరుకోనుంది.
ఆపై అది తుపానుగా మారే అవకాశం ఉంది. మధ్య బంగాళాఖాతం నుంచి దారి మళ్లి బంగ్లాదేశ్ వైపు కదిలే అవకాశం ఉన్నందున దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై నామమాత్రంగానే ఉండనుంది. ఫలితంగా రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి నివేదికలో తెలిపింది.
గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ, శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోనూ, శనివారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది.
అల్పపీడనం, వాయుగుండాల ప్రభావంతో రానున్న ఐదు రోజులు కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 30–40 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా మారుతుందని, అందువల్ల మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.
నేడు 26 మండలాల్లో వడగాడ్పులు..
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఫలితంగా మళ్లీ అక్కడక్కడ వడగాడ్పులు వీయనున్నాయి. గురువారం శ్రీకాకుళం జిల్లాలో 9, విజయనగరం 5, పార్వతీపురం మన్యం 11, అల్లూరి సీతారామరాజు 1 (కూనవరం) వెరసి 26 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో 5, విజయనగరం 5, పార్వతీపురం మన్యం 7 మండలాల్లోనూ వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment