IMD Predicts Cyclonic Circulation Over Bay Of Bengal On May 6 - Sakshi
Sakshi News home page

వస్తోంది తుపాను.. రాష్ట్రంపైనా ప్రభావం, మరికొద్ది రోజులు భారీ వర్షాలు

Published Thu, May 4 2023 4:26 AM | Last Updated on Thu, May 4 2023 11:50 AM

First cyclone of this season is going to form in Bay of Bengal - Sakshi

సాక్షి, విశాఖపట్నం/సాక్షి,అమరావతి: బంగాళా­ఖాతంలో ఈ సీజన్‌లో తొలి తుపాను ఏర్పడ­బోతోంది. ముందుగా ఈనెల 6న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. అదే ప్రాంతంలో 7న అల్పపీడనంగా మారి, 8న వాయుగుండంగా బలపడనుంది. ఆ వాయు­గుండం మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఉత్తర దిశగా పయనిస్తూ తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం వెల్లడించింది.

అల్పపీడనం ఏర్పడ్డాక తుపాను దిశ, కదలిక, వేగం, తీవ్రత వంటి వాటిపై తెలిపింది. ఈ తుపాను మరింతగా బలపడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని వాతావరణ నిపు­­ణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే తుపాను పశ్చిమ బెంగాల్, మయన్మార్‌ల వైపు పయనిస్తుందని చెబు­తు­న్నారు. అయితే ఈ తుపాను కోస్తాంధ్ర వైపు కూడా రావొచ్చని చెబుతున్నారు.

గతంలో మే నెలలో సంభవించిన తుపానులు ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు రావడాన్ని వీరు ఉదహరిస్తున్నారు. తుపాను ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురు­స్తా­యని వాతావరణ శాఖ రిటైర్డ్‌ అధికారి రాళ్లపల్లి మురళీ­కృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. ఫలితంగా రాష్ట్ర ప్రజలకు వారం రోజులపాటు ఉష్ణతాపం/­వడగా­డ్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని తెలిపారు.



మే నెలలో తుపానులు సహజమే
ప్రతి ఏటా మే నెలలో ఒకట్రెండు తుపానులు సహ­జమే. గత సంవత్సరం బంగాళాఖాతంలో మే మొదటి వారంలో ‘అసని’ తుపాను ఏర్పడింది. నైరుతి రుతుపవనాలు నాలుగు రోజులు ముందుగా కేరళలోకి ప్రవేశించడానికి ఇది దోహదపడింది. ఇది రాష్ట్రంలోని మచిలీపట్నం – నర్సాపురంల మధ్య తీరాన్ని దాటింది. 2021 మే రెండో వారంలో అరే­బియా సముద్రంలో ‘టౌక్టే’ తుపాను ఏర్పడి బంగా­ళాఖాతంలో రుతుపవనాల ఆగమనానికి తోడ్ప­డింది.

అదే సంవత్సరం మే 23న బంగాళా­ఖాతంలో ‘యాస్‌’ తుపాను సంభవించి సత్వరమే రుతు­పవ­నాల ఆగమనానికి సహకరించింది. ఇది ఒడిశా­లోని బాలసోర్‌ వద్ద తీరం దాటింది. 2020 మే 16న బంగాళాఖాతంలోనే ‘అంఫన్‌’ తుపాను ఏర్పడింది. ఇది పశ్చిమ బెంగాల్‌లో తీరాన్ని దాటింది. వీట­న్ని­టినీ పరిశీలిస్తే త్వరలో ఏర్పడనున్న తుపాను ప్రభా­­వం ఏపీపై కూడా ఉంటుందని నిపు­ణులు వివరి­స్తున్నారు. ఇది నైరుతి రుతుపవ­నాల ఆగ­మనంపై కూడా ప్రభావం చూపుతుందని చెబు­తు­న్నారు. 

కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
మరోవైపు భూమిపై సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో తమిళనాడు, కర్ణాటక మీదుగా మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అరేబియన్‌ సముద్రం వైపు నుంచి గాలులు తోడ­వడంతో మరికొద్ది రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ (ఏపీఎస్‌డీపీఎస్‌) డైరెక్టర్‌ శివ­శంకర్‌ తెలిపారు. గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురు­స్తాయని తెలిపారు. అనేక చోట్ల ఉరు­ములతో కూడిన జల్లులు పడతాయని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు
రాష్ట్రవ్యాప్తంగా ఎడతె­గని వర్షాలు కురు­స్తూనే ఉన్నాయి. మండు వేసవిలో వర్షా కాలాన్ని మించి వానలు పడుతు­న్నా­యి. విశాఖ, అనకా­పల్లి, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీకాకుళం, ఏలూరు, తూర్పుగో­దావరి జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో అత్యధికంగా 104 మిల్లీమీటర్ల వర్షపాతం నమో­దైంది.

తూర్పు గోదావరి జిల్లా బిక్కవో­లులో 95.75 మిల్లీ మీటర్లు, గుంటూరు జిల్లా తాడేపల్లిలో 95.2, శ్రీకాకుళం జిల్లా హరి­పురంలో 90.25 మిల్లీ­మీటర్లు, కృష్ణా జిల్లా పెద­పారుపూడిలో 88.4, ఘంటసాలలో 80.5 పల్నా­డు జిల్లా పిడుగు­రాళ్లలో 80.2, శ్రీకాకుళం జిల్లా పలాసలో 76.75, నిమ్మాడలో71, పల్నా­డు జిల్లా కారంపూడిలో 63.6, గుంటూరు జిల్లా మంగళ­గిరిలో 53.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement