
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 7.8 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి నైరుతి వైపునకు వంగి ఉంది. దీని ప్రభావంతో ఆదివారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం నివేదికలో వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అదే సమయంలో ఉరుములు, మెరుపులు కూడా సంభవించవచ్చని, ఉత్తర కోస్తాంధ్రలో గంటకు 45–55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. అల్పపీడనం నేపథ్యంలో సముద్రం అలజడిగా మారుతుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment