అధైర్య పడొద్దు అండగా ఉంటాం | The government will support every farmer who has lost his crop | Sakshi
Sakshi News home page

అధైర్య పడొద్దు అండగా ఉంటాం

Published Thu, Dec 7 2023 1:56 AM | Last Updated on Thu, Dec 7 2023 7:45 AM

The government will support every farmer who has lost his crop - Sakshi

సాక్షి, అమరావతి: తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. తుపాను బాధితుల పట్ల ఉదారంగా ఉండాలని, పరిహారం అందించే విషయంలో సానుభూతితో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసకురావడంపై అధికార యంత్రాంగం దృష్టిపెట్టాలని చెప్పారు. బాధితులకు రేషన్‌ పరిహారం పంపిణీలో ఎలాంటి లోపం ఉండకూడదని స్పష్టం చేశారు.

తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పీలు, ఇతర ఉన్నతాధికా­రులతో బుధవారం ఆయన తన క్యాంపు కార్యాల­యం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా తుపాను సహాయ, పునరుద్ధరణ చర్యలు, రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లపై వారికి మార్గ నిర్దేశం చేశారు. ‘వర్షాలకు తెరిపి వచ్చింది. ప్రస్తుతం తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారింది.

తుపాను వల్ల వర్షాలు విస్తృతంగా పడ్డాయి. కలెక్టర్లు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు స్పెషల్‌ ఆఫీసర్లుగా క్షేత్ర స్థాయిలో బాగా పని చేశారు. అధికారులంతా మీ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై దృష్టి పెట్టాలి. చిన్న చిన్న విషయాలు కూడా మిస్‌ కాకుండా చూసుకోవాలి’ అని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

సాయంలో లోటు రాకూడదు 
♦ వర్షాల వల్ల ఇళ్లు దెబ్బ తిన్న వారికి రూ.10 వేలు ఇచ్చే విషయంలో, వర్షాల కారణంగా ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల వారిని క్యాంపులకు తీసుకొచ్చి వారిని చూసుకునే విషయంలో, క్యాంపుల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్తున్న సందర్భంలో వారికి ఇవ్వాల్సిన ఆర్థిక సాయం తప్పకుండా ఇవ్వాలి.  రేషన్‌ పరిహారం పంపిణీలో కూడా ఎలాంటి లోపం ఉండకూడదు.

ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. పంట పొలాల్లో ఉన్న వరద నీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టి పెట్టాలి. అన్ని రకాల మానవ వనరులను ఉపయోగించుకోవాలి. ఇది అత్యంత ప్రాధాన్య అంశం. పంటల సంరక్షణకు ప్రతి ఆర్బీకే పరిధిలో ఇప్పటికే ఎస్‌ఓపీ (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌) జారీ చేశారు. ౮౦ శాతం సబ్సిడీపై విత్తనాల సరఫరాకు కార్యాచరణ రూపొందించాలి.

♦దురదృష్టవశాత్తు విధి నిర్వహణలో ఉండగా చెట్టుకూలి ఓ కానిస్టేబుల్‌ చనిపోయాడు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది. ఆ కుటుంబానికి రూ.30 లక్షలు సాయం అందిస్తాం. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగుల స్థైర్యం నిలబడేలా ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. గ్రామాల్లో ఉన్న వలంటీర్‌ దగ్గర నుంచి సచివాలయ సిబ్బంది మొదలుకుని, ప్రభుత్వంలో పై స్థాయిలో ఉన్న ఉద్యోగి వరకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా.. ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది. వారిలో ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

♦ ఈ సమీక్షలో సీఎం క్యాంపు కార్యాలయం నుంచి హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్‌ సీఎస్‌ జి సాయి ప్రసాద్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, ఇంధన శాఖ స్పెషల్‌ సీఎస్‌ కె విజయానంద్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎం టీ కృష్ణబాబు, హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌ కుమార్‌ గుప్తా, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఏ.సూర్యకుమారి, ఏపీ స్టేట్‌ సివిల్‌ సఫ్లైస్‌ కార్పొరేషన్‌ వీసీ అండ్‌ ఎండీ జి వీరపాండియన్, గృహ నిర్మాణ శాఖ స్పెషల్‌ సెక్రటరీ బి మహమ్మద్‌ దీవాన్, విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ బీ ఆర్‌ అంబేడ్కర్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 


♦ యుద్ధ ప్రాతిపదికన అత్యధిక ప్రాధాన్యతతో విద్యుత్‌ను పునరుద్ధరించాలి. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రవాణా పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోవాలి. దీనిని కూడా ప్రాధాన్యత కార్యక్రమంగా తీసుకోండి. వర్షాలు తగ్గు ముఖం పట్టిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై కూడా దృష్టి పెట్టండి. అధికారులంతా బాగా పని చేస్తున్నారు. మేమందరం మీకు తోడుగా ఉన్నాం. ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో ఉన్నాం. ఈ విషయాన్ని 
దృష్టిలో పెట్టుకోండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement