క్వార్డ్‌జ్‌ గనుల్లో.. ఘనుల లూటీ! | TDP Leader White stone mines Illegal mining in Saidapuram Andhra Pradesh | Sakshi
Sakshi News home page

క్వార్డ్‌జ్‌ గనుల్లో.. ఘనుల లూటీ!

Published Wed, Dec 4 2024 4:01 AM | Last Updated on Wed, Dec 4 2024 4:01 AM

TDP Leader White stone mines Illegal mining in Saidapuram Andhra Pradesh

నెల్లూరు జిల్లా సైదాపురంలో ‘ముఖ్య’ నేత ముడుపుల డీల్‌

రూ.వేల కోట్ల విలువైన ఖనిజ సంపద లూటీకి భారీ స్కెచ్‌

స్థానిక సీనియర్‌ ప్రజాప్రతినిధిని ముందుపెట్టి నడిపిస్తున్న ప్రభుత్వ పెద్దలు

చట్టబద్ధమైన గనులు సైతం తమకు అప్పగించాలంటూ బెదిరింపులు

గనులు ఎవరివైనా సరే క్వార్ట్జ్‌ ఖనిజం అంతా మాదే.. మేం చెప్పిన ధరకు ఇవ్వాల్సిందే.. 

ముఖ్య నేత సూచనలతో బెదిరింపులకు దిగుతున్న ప్రజాప్రతినిధి 

ఆరు నెలలుగా అందరి గనులు నిలిపివేసి 4 గనులకే అనుమతుల వెనుక మతలబు ఏమిటి?

వారిని బెదిరించి దారికి తెచ్చుకుని రూ.వేల కోట్లు కొట్టేసే వ్యూహం

చట్టబద్ధమైన గనులు దుర్మార్గంగా నిలిపివేయడంపై యజమానుల ఆవేదన

ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా కొత్త పరిశ్రమ ఏర్పాటు పేరుతో పావులు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా ‘ముఖ్య’ నేత పర్యవేక్షణలో జరుగుతున్న ‘తెల్ల’బోయే లూటీ కథ ఇదీ! పరిశ్రమ ఏర్పాటు ముసుగులో ప్రకృతి సంపదను పిండి చేసే ఘనాపాటీల వ్యూహం దీని వెనుక దాగి ఉంది. ‘ముఖ్య’నేత ఆదేశాలతో స్వయంగా ఆయన కార్యాలయమే రంగంలోకి దిగి ఈ వ్యవహా­రాలను చక్కబెడుతోంది. ఇక ఈ మైనింగ్‌ దోపిడీలో అధికారికం.. అనధికారికం అనే తేడాలే లేవు. అను­మతుల పట్టింపే లేదు. గనులు ఎవరివైనా సరే.. ఖనిజాన్ని మాత్రం వారు చెప్పిన ధరకు అప్పగించాల్సిందే. ఇస్తావా..? లేదంటే చస్తావా?.. అంతే!! ఐదేళ్లలో రూ.వేల కోట్లను ఆర్జించే ఎత్తుగడ ఇదీ. 

రాష్ట్రంలోని క్వార్ట్జ్‌ (తెల్లరాయి) గనుల్లో నిక్షిప్తమైన అపార ఖనిజ సంపద దోపిడీ కుట్రలు టీడీపీ పెద్దల కనుసన్నల్లో సాగుతుండగా.. నెల్లూరుకు చెందిన ఓ సీనియర్‌ ప్రజాప్రతినిధిని ముందుపెట్టి ‘ముఖ్య’నేత కార్యాలయం అనునిత్యం దీన్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. సైదాపురం పరిసరాల్లో క్వార్ట్‌జ్‌ ఆధారిత పరిశ్రమ ఏర్పాటు ముసుగులో ఈ దందాకు తెర తీశారు. 

ఇందుకు సీనియర్‌ ప్రజాప్రతినిధి 50 శాతం పెట్టుబడి పెడితే ఆయనకు వాటాలు దక్కేలా డీల్‌ కుదిరినట్లు సమాచారం. దీంతో సైదాపురం పరిసర ప్రాంతాల నుంచి నిత్యం రాత్రి పూట వందల లారీల్లో ఖనిజాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. తమకు ముడిసరుకు మొత్తం అప్పగించకుంటే గనుల నుంచి మీ లారీలు వెళ్లలేవని, కేసులు బనాయించి లీజులు రద్దు చేయిస్తామని బెదిరించినట్లు అన్ని అనుమతులున్న గనుల యజమానులు వాపోతున్నారు. తమ మైన్లకు అన్ని అనుమతులు ఉన్నాయని, గత 50 ఏళ్లుగా ‘డెడ్‌ రెంట్‌’ సైతం చెల్లిస్తున్నామని, గత ఆర్నెళ్లుగా మైనింగ్‌ను అడ్డుకుని బెదిరింపులకు దిగుతున్నారని పేర్కొంటున్నారు.

వేస్ట్‌ మెటల్‌తో కోట్లు..
స్థానిక సీనియర్‌ ప్రజాప్రతినిధి కీలక అనుచరుడి చేతిలో నాలుగు మైన్లు ఉన్నాయి. సైదాపురం సమీపంలోని శ్రీనివాస పద్మావతి, చాగణం సమీపంలో ఉన్న సిద్ధి వినాయక, తుమ్మలతలుపూరులో ఉన్న జయలక్ష్మి కనకదుర్గా, కలిచేడు సమీపంలో ఉన్న రాఘవేంద్ర గనులు ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఈ గనుల్లో గతంలో ఎందుకు పనికి రాదని గుట్టలు గుట్టలుగా వదిలేసిన వేస్ట్‌ ఖనిజమే మైకా క్వార్డ్‌జ్‌. ఈ ఖనిజానికి ప్రస్తుతం విపరీతమైన డిమాండ్‌ ఉండడంతో ఆ వేస్ట్‌ మెటల్‌తోనే కోట్లు ఆర్జించే దందాలో భాగస్వాములయ్యారు.

తాజాగా మరో 4 గనులకు..! 
స్థానిక ప్రజాప్రతినిధి బంధువులు, అనుచరులకు రెండు రోజుల క్రితం మరో నాలుగు గనులకు అనుమతి ఇచ్చారు. ఆయన బంధువుకు రెండు, జోగుపల్లికి చెందిన దళారీకి పొక్కందల సమీపంలో ఒక గని, చాకలికొండ వద్ద ఉన్న మరో గనికి అనుమతి ఇచ్చారు. సైదాపురం మండలంలోని రామసాగరం, చిల్లకూరు మండలంలోని రెట్టపల్లిలో ఉన్న గనికి కూడా అనుమతులు మంజూరు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధికి వ్యతిరేకంగా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు పావులు కదపడంతో తాత్కాలికంగా నిలుపుదల చేశారు.

క్వార్ట్‌జ్‌ ఆధారిత పరిశ్రమ పేరుతో..
సైదాపురం పరిసరాల్లో క్వార్ట్‌జ్‌ ఆధారిత పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదన తెరపైకి తెచ్చి మొత్తం మైనింగ్‌పై పెత్తనాన్ని ప్రభుత్వ పెద్దలు స్థానిక సీనియర్‌ ప్రజాప్రతినిధికి అప్పగించారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల సైదాపురం వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలతో చర్చించేందుకు వెళ్లిన ఆయన... ప్రస్తుతం చైనాలో ఉన్న క్వార్ట్‌జ్‌ ఆధారిత పరిశ్రమను మన రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేస్తామని ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

ఈ క్రమంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా 50 శాతం పెట్టుబడి పెడితే వాటాలు ఇచ్చే ఒప్పందంతో సైదాపురం గనులను ఆయనకు అప్పగించారనే ప్రచారం సాగుతోంది. దీంతో క్వార్ట్‌జ్‌ మెటల్‌ను వ్యాపారులు ఇకపై ఆయన అనుచరులు నిర్ణయించిన ధరకే ఇచ్చేలా చూడాలని అధికారులకు ఆదేశాలు అందినట్లు చెబుతున్నారు. 

‘ముఖ్య’నేత కార్యాలయం నుంచి అధికారులకు ఈమేరకు ఆదేశాలు రావడంతో జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, మరో కీలకనేత దీనిపై మైనింగ్‌ మంత్రితో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం అంతా ‘ముఖ్య’నేత కార్యాలయం పర్యవేక్షిస్తోందని, ఇకపై ఎవరూ కూడా ఈ దందా విషయంలో కలగజేసుకోవద్దని మంత్రి కార్యాలయం చేతులెత్తేసినట్లు సమాచారం.

మైకా క్వార్ట్‌జ్‌ ఖనిజం టన్ను రూ.2 లక్షలు!
సైదాపురం మండలంలో దొరికే  మైకా క్వార్ట్‌జ్‌ ఖనిజం టన్ను రూ.20 వేల నుంచి మొదలై రూ.2 లక్షల వరకు పలుకుతోంది. దీంతో కాలం చెల్లిన గనుల్లో ఉన్న ఈ ఖనిజాన్ని దోచుకునేందుకు, మిగిలిన గనులను సొంతం చేసుకునేందుకు కూటమి నేతలు రాజకీయ పైరవీలు సాగిస్తున్నారు.  ఇప్పటికే అనధికారికంగా మైనింగ్‌ చేస్తున్న కూటమి నేతలు చీకటి పడితే చాలు దండులా వాహనాలతో తెల్లరాయి అక్రమ రవాణా సాగిస్తున్నారు. 

టన్నుల లెక్కన అనధికారికంగా వసూలు చేస్తున్నారు. ఇందులో  ప్రధానంగా ముగ్గురు అధికారుల పాత్ర కూడా ఉండడంతో అక్రమ రవాణాకు ఎక్కడా అడ్డు చెప్పడం లేదని తెలుస్తోంది. దీనిపై ముగ్గురు ఎమ్మెల్యేలు, మరో కీలక నేత రగిలిపోతున్నారు. తమ జేబులోకి వచ్చి పడే సొమ్మును లాక్కెళ్లిపోతున్నారని గుర్రుమంటున్నారు.

80 గనులు ఓపెన్‌?
– ఖనిజం విలువ రూ.10 వేల కోట్లు..
గత ఆర్నెళ్లుగా నిలిచిపోయిన 80 గనులకు రాష్ట్ర గనుల శాఖ నుంచి అనుమతులు మంజూరు చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల గనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రాష్ట్ర అధికారులకు నివేదిక పంపారు. అన్ని గనుల్లో ఉన్న  ఖనిజం విలువ రూ.10 వేల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. 

ఈ మేరకు ప్రభుత్వ పెద్దలకు రహస్య నివేదిక ఇవ్వడంతో కప్పం వసూలుకు సిద్ధమయ్యారు. లీగల్‌ మైన్లు తాము నిర్దేశించిన వారి చేతికి అప్పగిస్తేనే వాటికి పర్మిషన్లు ఇస్తామంటున్నారు. దీంతో గత 40 – 50 ఏళ్లుగా ‘డెడ్‌ రెంట్‌’ కడుతున్న గనుల యజమానులు లబోదిబో అంటున్నారు. ఇంత దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? అని వాపోతున్నారు.

నెలకు 30 – 50 వేల టన్నులు..
ఈ ప్రాంతంలో దొరికే మైకా క్వార్ట్‌జ్‌ ఖనిజాన్ని ప్రతి నెలా 30 వేల నుంచి 50 వేల టన్నులను తవ్వి ఎగుమతులు చేసే అవకాశాలున్నాయి. ప్రభుత్వానికి టన్నుకు కేవలం రూ.230 చొప్పున రాయల్టీ చెల్లించాల్సి ఉంది. నిత్యం సైదాపురం మండలంలో 1,000 టన్నులు, ఇతర ప్రాంతాల్లో మరో 500 టన్నులు దొరికే అవకాశం ఉంది.

అధికారిక మైనింగ్‌దారులకు బెదిరింపులు
జిల్లాలో మైనింగ్‌ దందాను చేజిక్కించుకున్న స్థానిక సీనియర్‌ ప్రజాప్రతినిధి అనుచరులు అధికారికంగా అనుమతులున్న గనులు యజమానులపై బెదిరింపులకు దిగుతున్నారు. అధికారిక గనుల్లో ఉన్న ముడిసరుకును సైతం తమకే ఇవ్వాలని, తాము చెప్పిన ధరకే అప్పగించాలని నెల్లూరులో ఓ చోటా నేత బెదిరింపులకు దిగారు. 

ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఉన్న కార్యాలయానికి గనుల యజమానులను పిలిపించుకుని తీవ్ర స్థాయిలో హెచ్చరికలకు దిగినట్లు సమాచారం. ముడిసరుకు ఇవ్వకుంటే గనుల నుంచి మీ లారీలు వెళ్లలేవని, పలు రకాల కేసులు నమోదు చేయించి లీజులు రద్దు చేయిస్తామంటూ బెదిరించినట్లు ఓ గని యజమాని వాపోయాడు.

రాత్రి వేళ అక్రమ రవాణా..
స్థానిక ప్రజాప్రతినిధి అనుచర వర్గం గత రెండు నెలలుగా రాత్రి వేళల్లో సైదాపురం నుంచి అనుమతులు లేకుండా తెల్ల క్వార్ట్‌జ్‌ను నిత్యం భారీ స్థాయిలో అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటోంది. మండలంలో 40 గనుల్లో నిల్వలున్న క్వార్ట్‌జ్‌ను స్థానిక వ్యాపారులతో మాట్లాడుకుని అక్రమ రవాణా చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మైన్ల పర్మిట్లతో సైదాపురం క్వార్ట్‌జ్‌ను చెన్నైకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. 

స్థానిక వ్యాపారుల నుంచి టన్ను రూ.2 వేల నుంచి రూ.5 వేలు వంతున కొనుగోలు చేసి చెన్నై మార్కెట్‌లో రూ.50 వేలు వంతున విక్రయిస్తున్నారు. ఇందులో స్థానిక ప్రజాప్రతినిధి కీలకంగా వ్యవహరిస్తుండడంతో రెవెన్యూ, పోలీస్, మైనింగ్‌ అధికారులు అటువైపు కన్నెత్తి చూసేందుకు సాహసించడం లేదు. నెలవారీ మామూళ్లతో కళ్లకు గంతలు కట్టుకున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

విస్తార గనులు.. అపార సంపద 
సైదాపురం, పొదలకూరు, చేజర్ల, ఉదయగిరితోపాటు తిరుపతి జిల్లాలోని గూడూరు ప్రాంతాల్లో దొరికే మైకా, మైకా క్వార్ట్‌జ్, క్వార్ట్‌జ్, పల్స్‌పర్, వర్‌ముఖ్‌లైట్‌ ఖనిజాలకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఇక్కడ ఏడు భూగర్భ గనులు, 130 ఓపెన్‌ మైనింగ్‌ క్వారీలు, 26 కాలం చెల్లిన గనులున్నాయి. ఒక్క సైదాపురంలోనే 70 ఓపెన్‌ క్వారీలు ఉండగా మిగతావి ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. 

వీటిలో మరో వందేళ్ల పాటు మైనింగ్‌ చేసినా తరగని అపార మైకా క్వార్ట్‌జ్‌ నిల్వలు ఉన్నాయి. ప్రధానంగా సైదాపురం మండలంలో దొరికే మైకా క్వార్ట్‌జ్‌ ఖనిజానికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్‌ ఉంది. ఇక్కడ ఖనిజ సంపద అపారంగా ఉండడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ గనులపై కన్నేసింది. ఆర్నెళ్లుగా అన్ని రకాల మైనింగ్‌ అనుమతులను నిలిపివేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement