
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు మహిళల గురించి మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందంటూ వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చాక మహిళలను నిలువునా మోసం చేశారని నిలదీశారు. ఏ ఒక్క సంక్షేమ పథకాన్నీ అమలు చేయటంలేదని దుయ్యబట్టారు.
‘‘ఉచిత బస్సు తెలంగాణలో కొనసాగుతున్నా ఏపీలో ఇంకా ప్రవేశ పెట్టలేదు. ఆడబిడ్డ నిధి కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఉచిత గ్యాస్ సిలిండర్ ఒకటికే పరిమితం చేశారు. అది కూడా సగం మందికే ఇచ్చి మరో మోసం చేశారు. టీడీపీ అంటే తెలుగింటి ఆడపిల్లలను మోసం చేసే పార్టీ. 2014-19లో కూడా డ్వాక్రా మహిళలను మోసం చేశారు. జగన్ తెచ్చిన దిశ యాప్‌ని కాపీ కొట్టి.. శక్తియాప్ అని పెట్టారు. జగన్ తెచ్చిన వ్యవస్థలను చంద్రబాబు కాపీ కొడుతున్నారు’’ అని వరుదు కల్యాణి మండిపడ్డారు.
‘‘జగన్ మహిళలకు రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నత స్థానం కల్పించారు. మహిళాభ్యుదయం జగన్ వలనే సాధ్యమైంది. ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చంద్రబాబు చెప్పకుండా జగన్ గురించి విమర్శలు చేయటం బాధాకరం. చంద్రబాబు తన ఆస్తిలో చెల్లెళ్లకు ఎంత ఇచ్చారో సమాధానం చెప్పాలి. తల్లికి ఏం ఇచ్చారో చెప్పాలి. చంద్రబాబు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి వ్యక్తిగత ఆరోపణలు చేయటం సిగ్గుచేటు’’ అంటూ వరుదు కల్యాణి దుయ్యబట్టారు.

Comments
Please login to add a commentAdd a comment