saidapuram
-
వైద్య సేవలందక వ్యక్తి మృతి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సకాలంలో వైద్య సేవలు అందక నెల్లూరు జిల్లా సైదాపురంలో ఆదివారం ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆగ్రహించిన ప్రజలు పీహెచ్సీ ఎదుట ధర్నాకు దిగారు. సైదాపురం దళితవాడకు చెందిన మల్లారపు వీరరాఘవయ్య (49) ఆటో నడుపుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం అతడి నోట్లో నుంచి నురుగు రావడంతో సమీపంలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ కేవలం స్టాఫ్ నర్సు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రథమ చికిత్స కూడా చేయకుండానే గూడూరు ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సలహా ఇవ్వడంతో గూడూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతడు మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు దళితవాడకు చెందిన యువత పీహెచ్‌సీకి చేరుకుని ధర్నాకు దిగారు. కనీస వైద్య సేవలు అందకపోవడం వల్లే వీరరాఘవయ్య మృతి చెందాడని వాపోయారు. వివిధ పార్టీల నేతలు ఆందోళనకారులకు మద్దతు ప్రకటించారు. ఉన్నతాధికారులు వచ్చేంత వరకు ఆందోళన విరమించమని భీషి్మంచుకు కూర్చున్నారు. ఎస్ఐ డీఎస్ విజయ్‌కుమార్ అక్కడకు చేరుకుని సమగ్ర విచారణ జరిపారు. ఇక్కడి పరిస్థితిని రాపూరు సీఐ విజయకృష్ణకు వివరించారు. అక్కడి నుంచే సీఐ ఆందోళనకారులను శాంతింపజేశారు. – సైదాపురం -
పోలీసులకు విదేశీ వనిత కృతజ్ఞతలు
నెల్లూరు (క్రైమ్): ‘ఫిర్యాదు చేసిన తక్షణమే స్పందించారు. గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టుచేసి నాకు రక్షణ కల్పించిన జిల్లా పోలీసులకు రుణపడి ఉంటా’ అని విదేశీ వనిత పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో మంగళవారం లిథువేనియా దేశానికి చెందిన మహిళ (27)పై ఇద్దరు యువకులు లైంగికదాడికి యత్నించడం.. ఆమె తప్పించుకుని వాహనచోదకుల సహాయంతో పోలీసుల రక్షణ పొందడం విదితమే. బుధవారం ఆమె నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సీహెచ్ విజయారావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు స్పందన చాలా బాగుందని కొనియాడారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తాను ఒంటరిగా అనేక దేశాలు పర్యటించినా.. ఎప్పుడు ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కోలేదన్నారు. గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేశారని, జిల్లా ఎస్పీకి, పోలీసు అధికారులకు రుణపడి ఉంటానంటూ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
ఇంటి పర్మిషన్ ఇవ్వలేదని కిరోసిన్ పోసుకున్న మహిళ
సైదాపూర్(కరీంనగర్) : సైదాపూర్ మండలం వెన్కెపల్లికి చెందిన ఆలేటి రజితకు పంచాయతీ కార్యదర్శి ఇంటి ఫర్మిషన్ ఇవ్వడం లేదని గ్రామపంచాయతీలోనే ఒంటిపై కిరోసిన్ పోసుకొని మంగళవారం ఆందోళనకు దిగింది.వెన్కెపల్లిలో ఆలేటి రాములు–రజిత దంపతులు టైలరింగ్ షాపు నడుపుకుంటూ జీవిస్తున్నారు. నూతనంగా నిర్మించుకున్న ఇంటికి గ్రామపంచాయతీ పర్మిషన్ కావాలని గ్రామపంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసి ఎనిమిది నెలలు గడుస్తున్నా పర్మీషన్ ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ గ్రామపంచాయతీలో కిరోసిన్ పోసుకొని తలుపులు వేసుకుంది. స్థానిక పోలీసులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు వచ్చి సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేసుకుంటే పర్మిషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో తలుపులు తీసి అక్కడ నుంచి రజిత ఇంటికి వెళ్లిపోయింది. -
విద్యుదాఘాతానికి యువరైతు బలి
సైదాపురం : విద్యుదాఘాతానికి ఓ యువరైతు బలైపోయాడు. చేతికెక్కి వచ్చిన కొడుకును పాడెక్కించాల్సిన పరిస్థితి రావడంతో తల్లిదండ్రుల కళ్లల్లో కన్నీటి ప్రవాహానికి అడ్డేలేకుండా పోయింది. ఈ విషాద సంఘటన ఆదివారం సైదాపురంలో జరిగింది. సైదాపురానికి చెందిన పాలవారి నారాయణ జీవాలను మేపుకుంటూ జీవనం సాగించేవాడు. ఆయనకు ఒక కొడుకు ప్రతాప్ (26), కుమార్తె ఉన్నారు. ప్రతాప్ కొంత వరకు చదువుకుని ఆపేసి తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. మూడేళ్ల క్రితం ఽరాగనరామాపురం గ్రామానికి చెందిన వాణితో ప్రతాప్‌కు వివాహమైంది. వారికి రెండేళ్ల కుమార్తె ఉంది. ప్రతాప్ ఇటీవల సైదాపురం సమీపంలో రెండున్నర ఎకరాల బీడు భూమిని కొనుగోలు చేసి కొత్తగా బోరును ఏర్పాటు చేసుకున్నాడు. వ్యవసాయానికి రాత్రిపూట విద్యుత్ ఇస్తున్న నేపథ్యంలో బోరు నుంచి నీరు ఎలా వస్తుందో చూడటానికి శనివారం రాత్రి పొలానికి వెళ్లాడు. ఆదివారం తెల్లవారు జామున విద్యుత్ సరఫరా రావడంతో మోటారు ఆడలేదు. దీంతో తోట సమీపంలోనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్దకు చేరుకుని పరిశీలించాడు. ఎటువంటి అవగాహన లేకపోవడంతో 11 కేవీ ట్రాన్స్ఫార్మర్ వద్ద టెస్టర్‌తో విద్యుత్ సప్లయ్‌ను పరిశీలించే క్రమంలో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రతాప్ తోటలో ఉన్న కాపలాదారుడు గమనించి మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. మృతదేహాన్ని ఇంటికి తరలించారు. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండే ప్రతాప్ విద్యుదాఘాతానికి బలైపోవడంతో అతని కుటుంబ సభ్యులు గుండెలావిసేలా రోదించారు. నాకు కొరివి పెడతాడు అనుకుంటే.. నేను నా బిడ్డకు కొరివి పెట్టాల్సి వచ్చిందంటూ ప్రతాప్ తండ్రి నారాయణ హృదయవిదారకంగా విలపించాడు. చిన్న తనంలో భర్తను కోల్పోయానంటూ..నాకు దిక్కెవరంటూ భార్య వాణి కన్నీరు మున్నీరుగా విలపించింది. -
బాధ్యతలు విస్మరిస్తే ఉపేక్షించేదిలేదు
ఉపాధి సిబ్బంది పనితీరుపై డ్వామా పీడీ ఆగ్రహం సైదాపురం: బాధ్యతలు విస్మరిస్తే సస్పెండ్ చేయకుండా ఇంటికే పంపుతానని డ్వామా పీడీ హరిత ఉపాధి సిబ్బందిని హెచ్చరించారు. సైదాపురం ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ఉపాధి పనులపై క్షేత్రస్థాయిలో ఆమె సిబ్బందితో సమీక్షించారు. ఉపాధి సిబ్బంది పనితీరుపై పీడీ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. కనీసం జాబ్‌కార్డులు ఎన్ని ఉన్నాయి.. గ్రామంలో ఎంత మంది ఫారంఫాండ్స్ తవ్వకాలు సాగిస్తున్నారు.. ఎంత మందికి ఇంకుడు గుంతకు సంబంధించిన నిధులు మంజూరు చేశారు.. అనే విషయాలు కూడా తెలియకుండా పనులు ఎలా చేస్తున్నారంటూ సిబ్బందిని మందలించారు. మరుగుదొడ్ల నిర్మాణ పనుల విషయంలో ఐకేపీ, ఉపాధి సిబ్బంది మధ్య సమన్వయం కొరవడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల స్థాయిలో పనిచేసే సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. మండల స్థాయిలో ఏ అధికారి పనిచేస్తున్నారనే విషయాలు తనకు తెలుసునని తెలిపారు. పర్యవేక్షించే అధికారులు కూడా తమ బాధ్యతలను పూర్తిగా విస్మరిస్తున్నారని పేర్కొన్నారు. సిబ్బంది కొరత ఉన్న చోట్ల అధికారులే పనులు జరిగేలా చర్యలు తీసుకోవాల్సింది పోయి ఒకరిపై ఒకరు పొంతన లేని సమాధానాలు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఎఫ్‌ఏలు తమ పద్ధతిని మార్చుకోకపోతే క్రిమినల్ కేసులు పెడతామని స్పష్టం చేశారు. మొక్కల పెంపకంపై ఎఫ్‌ఏలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లాలో సిబ్బంది లేని చోట్ల పనులు చక్కగా సాగుతున్నాయని, పూర్తి స్థాయిలో ఉన్న చోట్ల మాత్రం జరగడం లేదన్నారు. కొందరు ఏపీఓలు పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇకనైనా తమ పద్ధతిని మార్చుకోకపోతే ఏపీఓలే అవసరమే లేదని ప్రభుత్వానికి నివేదిక పంపుతామని హెచ్చరించారు. ఏపీడీ శ్రీహరి, ఎంపీడీఓ విజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
అక్రమార్కులకు ‘తెల్ల’బంగారం
సైదాపురం, న్యూస్‌లైన్: అక్రమార్కులకు క్వార్ట్జ్, పల్స్‌ఫర్, వర్ముఖ్లైట్ ఖనిజం ‘తెల్లరాయి’ బంగారంగా మారింది. ఈ ఖనిజానికి దేశంతో పాటు విదేశాల్లో కూడా మంచి గిరాకీ ఉంది. దీంతో అక్రమార్కులు అడ్డూఅదుపు లేకుండా నిరాటంకంగా అక్రమ తవ్వకాలు చేపట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అనుమతులు ఒకచోట తీసుకుని మరొక చోట తవ్వకాలు చేపట్టి నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. అక్రమ మార్గంలో సేకరించిన క్వార్ట్జ్, పల్స్‌ఫర్, వర్ముఖ్లైట్ ఖనిజాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ లక్షల రూపాయలు గడిస్తున్నారు. ఇటీవల కాలంలో ఖనిజాన్ని లారీల్లో రూటు మార్చి తరలిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీకి గండిపడుతోంది. మైనింగ్ అధికారులు తమకేమీ పట్టనట్టు నిద్రమత్తులో ఉన్నారు. సైదాపురం పరిసర ప్రాంతాల్లో క్వార్ట్జ్ తవ్వకాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ భూముల్లో క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు నిరాటంకంగా సాగుతున్నాయి. నిత్యం వందలాది టన్నుల క్వార్ట్జ్, పల్స్‌ఫర్, వర్ముఖ్లైట్ ఖనిజాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. సంబంధిత అధికారులకు ముడుపులు అందుతుండడంతో వారు మౌనం వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పెరుమాళ్లపాడు, ఊటుకూరు, తిప్పిరెడ్డిపల్లి, చాగ ణం, తలుపూరు గ్రామాల్లో క్వార్ట్జ్, పల్స్‌ఫర్, వర్ముఖ్లైట్ ఖనిజం కోసం యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. ఎక్కడా ప్రభుత్వ అనుమతి ఉన్న దాఖలాలు లేవు. క్వార్ట్జ్ ఖనిజం తవ్వకాలకు వెళ్లే పేదల బతుకులు దుర్భరంగా మారుతున్నాయి. పనులకు వెళ్లే పేదలకు ప్రమాదం జరిగితే పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో జరుగుతున్న అక్రమ క్వార్ట్జ్, పల్స్‌ఫర్, వర్ముఖ్లైట్ అక్రమ తవ్వకాలను నిరోధించాలని, రూటు మార్చి తరలిస్తున్న రవాణాదారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం అక్రమ క్వార్ట్జ్, పల్స్‌ఫర్, వర్ముఖ్లైట్ ఖనిజాన్ని ఇతర ప్రాంతాలకు తరలించే వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. అక్రమ తవ్వకాలు రవాణాపై పూర్తిస్థాయిలో నిఘా ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా క్వార్ట్జ్ ఖనిజం అక్రమ రవాణా జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటాం. పెంచలయ్య, తహశీల్దార్ -
ఉన్మాది వీరంగం
రాపూరు, న్యూస్‌లైన్ : మతిస్థిమితం కోల్పో యి.. ఉన్మాదిగా మారిన వ్యక్తి మండలంలోని శానాయిపాళెంలో వీరంగం చేశాడు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. గొడ్డలి పట్టుకుని చెలరేగిపోయి పలువురిపై దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్న ట్లు స్థానికులు చెబుతున్నారు. ఎట్టకేలకు ఉన్మాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. సైదాపురం మండలం పాలూరు గ్రామానికి చెందిన సూదలగుంట శేషయ్య కొంత కాలంగా మతిస్థిమితం కోల్పోయి ఉన్మాదంతో వ్యవహరిస్తున్నాడు. ఏడేళ్ల క్రితం శేషయ్య పెట్టే బాధలు భరించలేక భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి శేషయ్య మద్యానికి బానిసై ఉన్మాదిగా మారాడు. గ్రామంలో తరచూ ఒంటిపై ఉన్న దుస్తులు విప్పేసి అడ్డొచ్చిన వారిపై దాడికి పాల్పడేవాడు. దీంతో శేషయ్యను నాలుగేళ్ల క్రితం శానాయిపాళెంలో ఉన్న తన అక్క, బావ రాణెమ్మ, నారాయణ తీసుకెళ్లి తమ దగ్గర ఉంచుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి శేషయ్య గ్రామంలో కేకలు వేస్తూ తిరుగుతున్నాడు. మధ్యాహ్న సమయంలో శానాయిపాళెం రోడ్డు వద్ద కట్టెలు కొట్టుకునేందుకు గొడ్డలి తీసుకెళుతున్న రత్నమ్మను అటకాయించాడు. ఆమె వద్ద ఉన్న గొడ్డలి తీసుకున్నాడు. అనంతరం ఆమెపై దాడి చేసి గాయపరిచాడు. అక్కడే ఉన్న చెల్లటూరుకు చెందిన ఆదెయ్యపై దాడికి ప్రయత్నించగా అతను తప్పించుకుని పరారయ్యాడు. అక్కడి నుంచి శేషయ్య గ్రామంలోనిదేవాలయం వద్దకు వెళ్లి అక్కడ అరుగుపై పడుకుని ఉన్న వెంకటేశ్వర్లుపై గొడ్డలితో దాడి చేశాడు. అక్కడే ఉన్న శివయ్య, రాగ మ్మపై విచక్షణా రహితంగా దాడి చేయడంతో వీరికి తీవ్రగాయాలు అయ్యాయి. పొదలకూరు 108 సిబ్బంది నె ల్లూరుకు తరలించారు. వీరిలో శివయ్య,రాగమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసుల అదుపులో ఉన్మాది శానాయిపాళెంలో పలువురిపై దాడిచేసి గాయపరిచిన ఉన్మాది శేషయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గొడ్డలిని గ్రామంలోని రచ్చ బండవద్ద పడేశాడు. కండలేరు వైపు వెళుతుండగా కండలేరు డ్యామ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారించగా తనకేమీ తెలియదని శేషయ్య చెబుతున్నట్టు కండలేరు డ్యాం ఎస్ఐ నరసింహారావు తెలిపారు. ఉన్మాదిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.