రాపూరు, న్యూస్‌లైన్ : మతిస్థిమితం కోల్పో యి.. ఉన్మాదిగా మారిన వ్యక్తి మండలంలోని శానాయిపాళెంలో వీరంగం చేశాడు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. గొడ్డలి పట్టుకుని చెలరేగిపోయి పలువురిపై దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్న ట్లు స్థానికులు చెబుతున్నారు. ఎట్టకేలకు ఉన్మాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. సైదాపురం మండలం పాలూరు గ్రామానికి చెందిన సూదలగుంట శేషయ్య కొంత కాలంగా మతిస్థిమితం కోల్పోయి ఉన్మాదంతో వ్యవహరిస్తున్నాడు.
ఏడేళ్ల క్రితం శేషయ్య పెట్టే బాధలు భరించలేక భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి శేషయ్య మద్యానికి బానిసై ఉన్మాదిగా మారాడు. గ్రామంలో తరచూ ఒంటిపై ఉన్న దుస్తులు విప్పేసి అడ్డొచ్చిన వారిపై దాడికి పాల్పడేవాడు. దీంతో శేషయ్యను నాలుగేళ్ల క్రితం శానాయిపాళెంలో ఉన్న తన అక్క, బావ రాణెమ్మ, నారాయణ తీసుకెళ్లి తమ దగ్గర ఉంచుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి శేషయ్య గ్రామంలో కేకలు వేస్తూ తిరుగుతున్నాడు. మధ్యాహ్న సమయంలో శానాయిపాళెం రోడ్డు వద్ద కట్టెలు కొట్టుకునేందుకు గొడ్డలి తీసుకెళుతున్న రత్నమ్మను అటకాయించాడు. ఆమె వద్ద ఉన్న గొడ్డలి తీసుకున్నాడు. అనంతరం ఆమెపై దాడి చేసి గాయపరిచాడు.
అక్కడే ఉన్న చెల్లటూరుకు చెందిన ఆదెయ్యపై దాడికి ప్రయత్నించగా అతను తప్పించుకుని పరారయ్యాడు. అక్కడి నుంచి శేషయ్య గ్రామంలోనిదేవాలయం వద్దకు వెళ్లి అక్కడ అరుగుపై పడుకుని ఉన్న వెంకటేశ్వర్లుపై గొడ్డలితో దాడి చేశాడు. అక్కడే ఉన్న శివయ్య, రాగ మ్మపై విచక్షణా రహితంగా దాడి చేయడంతో వీరికి తీవ్రగాయాలు అయ్యాయి. పొదలకూరు 108 సిబ్బంది నె ల్లూరుకు తరలించారు. వీరిలో శివయ్య,రాగమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
పోలీసుల అదుపులో ఉన్మాది
శానాయిపాళెంలో పలువురిపై దాడిచేసి గాయపరిచిన ఉన్మాది శేషయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గొడ్డలిని గ్రామంలోని రచ్చ బండవద్ద పడేశాడు. కండలేరు వైపు వెళుతుండగా కండలేరు డ్యామ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారించగా తనకేమీ తెలియదని శేషయ్య చెబుతున్నట్టు కండలేరు డ్యాం ఎస్‌ఐ నరసింహారావు తెలిపారు. ఉన్మాదిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
ఉన్మాది వీరంగం
Published Wed, Oct 23 2013 3:43 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement