గాంధీ మందిరం వద్ద ధ్వంసమైన విగ్రహం
నాయుడుపేటటౌన్: పట్టణంలోని పడమటివీధిలో ఉన్న గాంధీ మందిరంలోని జాతిపిత విగ్రహం కిందపడేసి ధ్వంసం చేసి ఉండటాన్ని శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించారు. అర్ధరాత్రి సమయంలో మందుబాబులు విగ్రహాన్ని ధ్వంసం చేసి ఉండొచ్చని స్థానికులు కొందరు అనుమానిస్తున్నారు. అయితే ఉదయం మందిరంలో గేదెలు ఉండటంతో గాంధీ విగ్రహానికి ఉన్న పూలమాలలను అవి లాగే సమయంలో విగ్రహం కిందపడి ధ్వంసమై ఉండొచ్చని పలువురు చెబుతున్నారు. కాగా విగ్రహం ధ్వంసమైన తర్వాతే మెడలో ఉన్న పూలమాలలు తినేందుకు గేదెలు వచ్చాయనే వాదన ఉంది.
నిగ్గుతేల్చాలి
స్వాతంత్య్రం కోసం ఉద్యమాలు జరుగుతున్న గాంధీ నాయుడుపేటకు వచ్చి పడమటివీధిలో నాయుడుపేట చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన స్వాతంత్య్ర సమరవీరులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. దీంతో ఆయన నడయాడిన స్థలంలో గాంధీ మందిరాన్ని నిర్మించారు. అప్పటి స్వాతంత్య్ర సమరయోధులతో కలిసి స్థానికులు గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నో సంవత్సరాల నుంచి గాంధీ విగ్రహం ధ్వంసం కావడంతో పట్టణంలో కలకలం రేగింది. స్థానికులతోపాటు వివిధ సంఘాలు, పార్టీల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పూర్తిస్థాయిలో విచారించి నిగ్గుతేల్చాలని, మహాత్ముడి విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
అధికారుల పరిశీలన
గాంధీ విగ్రహం ధ్వంసమైందని సమాచారం రావడంతో ఆర్డీఓ ఎం.శ్రీదేవి, గూడూరు డీఎస్పీ వీఎస్ రాంబాబు, స్థానిక సీఐ మల్లికార్జునరావు తదితర శాఖల అధికారులు మందిరం వద్దకు వెళ్లి పరిశీలించారు. తొలుత నగర పంచాయతీ కమిషనర్ లింగారెడ్డి చంద్రశేఖరరెడ్డి వెళ్లి ధ్వంసమైన విగ్రహాన్ని తాత్కాలికంగా మందిరంలో ఉంచి తలుపులకు తాళాలు వేశారు.
మందుబాబులకు అడ్డాగా..
గాంధీ మందిరం వద్ద అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఆ ప్రాంతం మందుబాబులకు అడ్డాగా మారింది. వాహనాల పార్కింగ్ స్థలంగా వినియోగించుకుంటున్నారు. గతంలో అక్కడ కొందరు అతిగా మద్యం సేవించి మృతిచెందిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే మందుబాబులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment