విద్యుదాఘాతానికి యువరైతు బలి
విద్యుదాఘాతానికి యువరైతు బలి
Published Mon, Oct 10 2016 1:53 AM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM
సైదాపురం : విద్యుదాఘాతానికి ఓ యువరైతు బలైపోయాడు. చేతికెక్కి వచ్చిన కొడుకును పాడెక్కించాల్సిన పరిస్థితి రావడంతో తల్లిదండ్రుల కళ్లల్లో కన్నీటి ప్రవాహానికి అడ్డేలేకుండా పోయింది. ఈ విషాద సంఘటన ఆదివారం సైదాపురంలో జరిగింది. సైదాపురానికి చెందిన పాలవారి నారాయణ జీవాలను మేపుకుంటూ జీవనం సాగించేవాడు. ఆయనకు ఒక కొడుకు ప్రతాప్ (26), కుమార్తె ఉన్నారు. ప్రతాప్ కొంత వరకు చదువుకుని ఆపేసి తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. మూడేళ్ల క్రితం ఽరాగనరామాపురం గ్రామానికి చెందిన వాణితో ప్రతాప్‌కు వివాహమైంది. వారికి రెండేళ్ల కుమార్తె ఉంది. ప్రతాప్ ఇటీవల సైదాపురం సమీపంలో రెండున్నర ఎకరాల బీడు భూమిని కొనుగోలు చేసి కొత్తగా బోరును ఏర్పాటు చేసుకున్నాడు. వ్యవసాయానికి రాత్రిపూట విద్యుత్ ఇస్తున్న నేపథ్యంలో బోరు నుంచి నీరు ఎలా వస్తుందో చూడటానికి శనివారం రాత్రి పొలానికి వెళ్లాడు. ఆదివారం తెల్లవారు జామున విద్యుత్ సరఫరా రావడంతో మోటారు ఆడలేదు. దీంతో తోట సమీపంలోనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు చేరుకుని పరిశీలించాడు. ఎటువంటి అవగాహన లేకపోవడంతో 11 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద టెస్టర్‌తో విద్యుత్ సప్లయ్‌ను పరిశీలించే క్రమంలో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రతాప్ తోటలో ఉన్న కాపలాదారుడు గమనించి మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. మృతదేహాన్ని ఇంటికి తరలించారు. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండే ప్రతాప్ విద్యుదాఘాతానికి బలైపోవడంతో అతని కుటుంబ సభ్యులు గుండెలావిసేలా రోదించారు. నాకు కొరివి పెడతాడు అనుకుంటే.. నేను నా బిడ్డకు కొరివి పెట్టాల్సి వచ్చిందంటూ ప్రతాప్ తండ్రి నారాయణ హృదయవిదారకంగా విలపించాడు. చిన్న తనంలో భర్తను కోల్పోయానంటూ..నాకు దిక్కెవరంటూ భార్య వాణి కన్నీరు మున్నీరుగా విలపించింది.
Advertisement
Advertisement