
సాక్షి,హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలానికి చెందిన రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. రైతు మామిళ్ల నర్సయ్య ఆత్మహత్యపై హరీశ్‌రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు హరీశ్‌రావు శనివారం(జనవరి25)ఒక ప్రకటన విడుదల చేశారు.‘ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే గడిచిన వారం రోజుల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం.
రైతుల మరణ మృదంగం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్లు? కాంగ్రెస్ పాలనలో రైతన్నకు భరోసా లేక మనోధైర్యం కోల్పోతున్నడు. అందరికి అన్నం పెట్టే అన్నదాతకు సున్నం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ. నమ్మి ఓటేసిన పాపానికి నట్టేట ముంచి, నమ్మక ద్రోహం చేస్తున్నది. రుణమాఫీ పూర్తి చేసినట్లు రంకెలేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న రైతులకు ఏమని సమాధానం చెబుతారు.
రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఆత్మహత్యలు పరిష్కారం కావు, బతికుండి కొట్లాడుదాం. అధైర్య పడొద్దు, బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది’అని హరీశ్‌రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment