Farmer Deaths
-
ఏనుగు దాడిలో మరో రైతు మృతి
పెంచికల్పేట్ (సిర్పూర్): మహారాష్ట్ర మీదుగా ప్రాణహిత నది దాటి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోకి అడుగుపెట్టిన ఏనుగు మరో రైతు ను బలితీసుకుంది. చింతలమానెపల్లి మండలం బూరెపల్లి గ్రామ శి వారు మిరప చేనులో పని చేసుకుంటున్న రైతు అల్లూరి శంకర్‌ను బుధవారం పొట్టన పెట్టుకోగా.. గురువారం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్తున్న పెంచికల్పేట్ మండలం కొండపల్లికి చెందిన కారు పోశన్న(60)పై దాడి చేసి చంపేసింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం వేకువజామున పంటకు నీళ్లు పెట్టేందుకు రైతు పోశన్న పొలానికి వెళ్లగా, రహదారికి సమీపంలోని పొలం వద్ద ఉన్న ఏనుగు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం ఏనుగు రోడ్డుపైకి రావడంతో అక్కడే వాకింగ్ చేస్తున్న యువకులు గమనించి పరుగులు తీసి ఫోన్ ద్వారా గ్రామస్తులకు విషయం తెలియజేశారు. మృతుడికి భార్య సుశీల, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఘటనాస్థలాన్ని అదనపు కలెక్టర్ వేణు, కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్, అటవీ అధి కారులు పరిశీలించారు. ఏనుగు దాడి నేపథ్యంలో దహెగాం, చింతలమానెపల్లి, కౌటాల, బెజ్జూర్, పెంచికల్పేట్ మండలాల్లో 144 సెక్షన్ విధించి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీశాఖ అధికారులతో వాగ్వాదం బుధవారమే ఓ రైతు ఏనుగు దాడిలో మృతిచెందినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అందువల్లే గురువారం పోశన్న ఏనుగు దాడిలో ప్రాణాలు కోల్పోయాడని గ్రామస్తులు అటవీశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో అటవీ వర్గాలపై దాడికి యత్నించడంతో అక్కడే ఉన్న డీఎస్పీ కరుణాకర్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామస్తులను అడ్డుకున్నారు. బాధిత కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా, ఐదెకరాల వ్యవసాయ భూమి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అటవీశాఖలో కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగావకాశమిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. లోడుపల్లి అడవుల్లోకి గజరాజు గురువారం రైతును చంపిన ఏనుగు మళ్లీ రాత్రి 8 గంటల కు కొండపల్లి టర్నింగ్ వద్ద కనిపించింది. అటు నుంచి లోడుపల్లి అడవుల్లోకి వెళ్లినట్టు గుర్తించారు. పెంచికల్పేట్– సలుగుపల్లి రోడ్డులో రాకపోకలను నిలిపివేశారు. ఏనుగుకు హాని తలపెట్టొద్దు.. బెజ్జూర్: కుమురంభీం జిల్లాలో సంచరిస్తున్న ఏనుగుకు ప్రజలు ఎలాంటి హానీ తలపెట్టొద్దని రాష్ట్ర వైల్డ్ లైఫ్ పీసీసీఎఫ్ పర్గేన్ సూచించారు. బెజ్జూర్ రేంజ్ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. కాగజ్‌నగర్ డివిజన్ ప్రాంతంలో దాని ముఖ్య ఆహారం చెరుకు దొరకకపోవడంతో తిరిగి చత్తీస్‌గఢ్‌కు వెళ్లే అవకాశం ఉందన్నారు. అటవీశాఖ అప్రమత్తం సాక్షి, హైదరాబాద్: ఏనుగు సంచరిస్తున్న ప్రదేశాలలో అటవీశాఖ అధికారులు.. సమీప గ్రామాలలోని ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రతీ ఒక్క నివాసాన్ని సందర్శించి వారిని బయటికి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. హుల్లా పార్టీ (సంప్రదాయ పద్ధతిలో వెలిగించిన మషాల్, డప్పులు కొట్టడం ద్వారా ఏనుగును తరిమికొట్టడానికి ఉపయోగించే ప్రొఫెషనల్) మహారాష్ట్రలోని సమీప అటవీ ప్రాంతాల నుండి కూడా రప్పించి ఏనుగును జనావాసం నుంచి అటవీ ప్రాంతంలోకి మళ్లించే యత్నం చేస్తున్నారు. -
హడలెత్తిస్తున్న ఏనుగు.. దాడిలో ఇద్దరి రైతుల విషాదం!
ఆదిలాబాద్: కుమురంభీం జిల్లా ప్రజలను గజరాజు హడలెత్తిస్తున్నాడు. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు రైతులు ఏనుగు దాడిలో మృత్యువాత పడటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆచూకీ చిక్కకుండా తిరుగుతున్న ఏనుగు గ్రామీణులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రెండేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో దహెగాం, కొండపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరిని పెద్దపులి హతమార్చగా.. ఇప్పుడు ఏనుగు రూపంలో మృత్యువు వెంటాడుతోందని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇద్దరు రైతుల మృతి.. బూరెపల్లి సమీపంలోని ప్రాణహిత నదిలో బుధవారం తెల్లవారుజామున ఏనుగును కొంతమంది గ్రామస్తులు గమనించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. సమాచారాన్ని విశ్వసించని అటవీ అధికారులు ఏనుగును నియంత్రించకపోవడంతో అది నది దాటి చింతలమానెపల్లి మండలంలోకి ప్రవేశించింది. ఉదయం 11 గంటల సమయంలో బూరెపల్లి సమీపంలోని వ్యవసాయ భూముల వద్దకు వచ్చిన ఏనుగు అక్కడే మిరపతోటలో పని చేస్తున్న రైతు అల్లూరి శంకర్‌పై దాడి చేసి చంపేసింది. ఆందోళనకు గురైన గ్రామస్తులు ఏనుగును తరిమేందుకు ప్రయత్నించారు. అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు దానిని అనుసరించగా.. గంగాపూర్, ఖర్జెల్లి గ్రామాల పక్కన ఉన్న ప్రాణహి త చేవేళ్ల ప్రాజెక్టు కాలువ పక్క నుంచి రుద్రాపూర్ గ్రామం వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి అధికారులు ఏనుగు కదలికలను గుర్తించలేదు. మళ్లీ గురువారం తెల్లవారుజామున పెంచికల్పేట్ మండలం కొండపెల్లి గ్రామానికి చెందిన కారు పోశన్న(60)పై దాడి చేసి చంపింది. అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఎల్కరి సుధాకర్‌ను వెంబడించగా తప్పించుకున్నాడు. ఈ క్రమంలో ఏనుగు పలువురికి చెందిన తోటలు, పంటలు ధ్వంసం చేసింది. చింతలమానెపల్లి మండలం నుంచి బెజ్జూర్, పెంచికల్పేట్ మండలాల్లో సంచరించింది. ఈమండలాలతో పాటు పక్కన ఉన్న కౌటాల, దహెగాం మండలాలు కలిపి రెండు రోజులుగా ఏనుగు ఐదు మండలాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోకి ప్రవేశించిన ఏనుగు ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాన్ని అటవీశాఖ ధ్రువీకరించడం లేదు. ఇప్పటివరకు కచ్చితమైన సమాచారం లేకపోవడంతో అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదు. కాగా గత మంగళవారం ఏనుగు బూరెపల్లి వద్ద ప్రాణహిత నదికి అవతలి వైపు ఉన్న చౌడంపల్లి అటవీ ప్రాంతంలో సంచరించినట్లు అక్కడి ప్రజలు తెలిపారు. చింతలమానెపల్లి మండలానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలోని గడ్చిరోలి జిల్లా రేపన్‌పల్లి రేంజ్ పరిధిలోని కమలాపూర్‌లో ఏనుగుల సంరక్షణ కేంద్రం ఉంది. అక్కడి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏనుగు అడవుల్లో సంచరించేది. దక్షిణ గడ్చిరోలి ప్రాంతంగా పిలిచే మాలెవాడ, మురుంగావ్ ప్రాంతం ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రకు సరిహద్దుగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లోని దట్టమైన అభయారణ్యం ఒడిశా రాష్ట్రంలోని అటవీ ప్రాంతంతో కలిసి ఉంటుంది. కొన్నేళ్లుగా ఇక్కడి ప్రాంతంలో ఏనుగుల సంచారం ఉంది. మూడేళ్ల క్రితం మాలెవాడ అటవీ ప్రాంతానికి 25 నుంచి 30 ఏనుగుల బృందం వచ్చినట్లు అక్కడి అటవీ అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలోని ఏనుగుల గుంపు నుంచే ఓ ఏనుగు ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది. గడ్చిరోలి నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ధనోరాలో ఈ ఏనుగుల గుంపు కొద్ది నెలలుగా తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఓ డ్రైవర్ సహా మరో ముగ్గురిపై దాడి చేసి చంపేశాయి. ఈ ఏనుగులు కర్ణాటక రాష్ట్రం నుంచి అటవీ ప్రాంతం గుండా గడ్చిరోలిలోని మాలెవాడ అటవీ ప్రాంతానికి చేరుకున్నట్లు వారు చెబుతున్నారు. అటవీశాఖపై విమర్శలు.. బూరెపల్లి వద్ద ఏనుగు సంచరిస్తున్న సమచారాన్ని అటవీశాఖకు చేరవేసినా అధికారులు పట్టించుకోలేదని స్థానికుల నుంచి విమర్శలు వస్తున్నాయి. సరైన సమయంలో స్పందించని కారణంగానే అల్లూరి శంకర్ ఏనుగు దాడిలో మరణించాడని ఆరోపిస్తున్నారు. ఒకరిపై దాడి చేసిన అనంతరం స్వయంగా జిల్లా అటవీ అధికారి పర్యవేక్షణలో ఉండగానే పెంచికల్పేట్ మండలంలోని కొండపల్లి వద్ద మరొకరు ఏనుగు దాడిలో మృతి చెందడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడంలో అటవీశాఖ నిర్లక్ష్యం వహించిందని, గోప్యత పాటించడంతోనే ప్రమాదాలు పెరుగుతున్నాయని మండిపడుతున్నారు. కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలో కొన్ని నెలల క్రితం అటవీ అధికారుల నిర్లక్ష్యంతో రెండు పులులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అధికారులను బాధ్యులు చేస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు పలువురిపై వేటు వేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ.. ఎస్పీ సురేశ్‌కుమార్, అటవీ కన్జర్వేటర్ శాంతారాం, జిల్లా అటవీ అధికారి నీరజ్ టోబ్రివాల్, డీఎస్పీ కరుణాకర్ స్వయంగా ఆయా మండలాలలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అధికారులు చింతలమానెపల్లి, కౌటాల, బెజ్జూర్, పెంచికల్పేట్, దహెగాం మండలాలలో 144 సెక్షన్ విధించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. లోడుపల్లి అడవుల్లోకి గజరాజు.. పెంచికల్పేట్(సిర్పూర్): పెంచికల్పేట్ మండలం కొండపల్లిలో గురువారం వేకువజామున రైతును చంపిన ఏనుగు మళ్లీ రాత్రి 8 గంటలకు బెజ్జూర్ నుంచి పెంచికల్పేట్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు కొండపల్లి టర్నింగ్ వద్ద ఎదురొచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పీసీసీఎఫ్ శాంతారాం, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్ ఏనుగు సంచారాన్ని నిర్ధారించారు. లోడుపల్లి అడవుల్లోకి వెళ్లిందని తెలిపారు. అటవీశాఖ అధికారులు ఇచ్చిన సమాచారంతో ఎస్సై కొమురయ్య ఆధ్వర్యంలో పెంచికల్పేట్– సలుగుపల్లి రహదారిలో రాకపోకలను నిలిపివేశారు. నా వెంట పడింది.. ఉదయం పూట కొండప ల్లి సమీపంలో వాకింగ్‌కు వెళ్లా. ఏనుగు ఘీంకరించిన శబ్దం వినిపించింది. దూరంగా ఉన్న ఇద్దరు మిత్రులను అప్రమత్తం చేస్తూ అరవడంతో ఏనుగు నా వెంట పడడంతో పరుగెత్తి తప్పించుకున్నా. తర్వాత ఏను గు ఉన్న స్థలంలో చూడడానికి వెళ్లగా అక్కడ కారు పోశన్న మృతదేహం కనిపించింది. – ఎల్కరి సుధాకర్, పెంచికల్పేట్ -
Farmers movement: నేడు రైతు సంఘాల ‘బ్లాక్ డే’
చండీగఢ్: పంజాబ్–హరియాణా సరిహద్దు ల్లో ఖనౌరి వద్ద బుధవారం చోటుచేసుకున్న రైతు మరణంపై హరియాణా ముఖ్యమంత్రి, హోం మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రైతు మృతికి సంతాపం ప్రకటిస్తూ దేశవ్యాప్తంగా శుక్రవారం ‘బ్లాక్ డే’ గా పాటించాలని రైతులను కోరింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, హరియాణా సీఎం ఖట్టర్, రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్‌ల దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్లు తెలిపింది. ఈ నెల 26వ తేదీన రైతులంతా తమ ట్రాక్టర్లతో జాతీయ రహదారులను దిగ్బంధించాలని పిలుపునిచ్చింది. అదేవిధంగా, మార్చి 14వ తేదీన ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో మహాపంచాయత్‌లో చేపట్టనున్నట్లు తెలిపింది. ఢిల్లీ చలో కార్యక్రమాన్ని సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా(కేఎంఎం)లు కలిసి చేపట్టగా ఎస్కేఎం మద్దతు మాత్రమే ఇస్తోంది. 2020–21లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘంగా పోరాడిన ఎస్కేఎం నేతలెవరూ ‘ఢిల్లీ చలో’లో పాలుపంచుకోవడం లేదు. గురువారం ఎస్కేఎం నేతలు చండీగఢ్‌లో సమావేశమై సరిహద్దుల్లోని శంభు, ఖనౌరిల వద్ద నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. అనంతరం ఎస్కేఎం నేతలు బల్బీర్ సింగ్ రాజేవాల్, జోగీందర్ సింగ్ ఉగ్రహాన్, రాకేశ్ తికాయత్, దర్శన్పాల్ మీడియాతో మాట్లాడారు. ఖనౌరి వద్ద బుధవారం జరిగిన ఆందోళనల్లో శుభ్‌కరణ్ సింగ్ అనే రైతు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సీఎం ఖట్టర్, మంత్రి విజ్‌లపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వారిద్దరూ వెంటనే పదవులకు రాజీనామా చేయాలన్నారు. మృతుడి కుటుంబానికి పరిహారంగా రూ.కోటి చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అతడికున్న రూ.14 లక్షల రుణాలను మాఫీ చేయాలన్నారు. ఈ నెల 26వ తేదీన ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) దిష్టిబొమ్మను కూడా దహనం చేస్తామన్నారు. ఎస్కేఎం(రాజకీయేతర)ను కూడా కలుపుకుని పోయేందుకు చర్చలు ప్రారంభిస్తామని చెప్పారు. -
దద్దరిల్లిన సరిహద్దులు
చండీగఢ్: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, వ్యవసాయ రుణాల రద్దుతో సహా ఇతర డిమాండ్లపై రైతు సంఘాలు, కేంద్ర మంత్రుల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో రైతులు మళ్లీ పోరుబాట పట్టారు. రెండు రోజుల విరామం తర్వాత బుధవారం నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా తమ పోరాటం ఆగదని తేలి్చచెప్పారు. రైతులు, పోలీసుల మధ్య ఘర్షణలతో పంజాబ్–హరియాణా సరిహద్దులోని శంభు, ఖనౌరీ బోర్డర్ పాయింట్లు దద్దరిల్లిపోయాయి. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ సంఖ్యలో ట్రాక్టర్ ట్రాలీలు, మినీ వ్యాన్లు, జేసీబీలపై నిరసనకారులు తరలివచ్చారు. సరిహద్దుల్లో వేలాది మంది గుమికూడారు. రక్షణ వలయాన్ని ఛేదించుకొని ముందుకు దూసుకెళ్లడానికి ప్రయతి్నంచారు. వాహనాలతో బారీకేడ్లను ధ్వంసం చేసే ప్రమాదం ఉందని పోలీసులు అనుమానించారు. నిరసనకారులను చెదరగొట్టడానికి హరియాణా పోలీసులు డ్రోన్‌తో బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. శంభు బోర్డర్ పాయింట్ వద్ద బుధవారం మూడుసార్లు బాష్పవాయువు ప్రయోగం చోటుచేసుకుంది. డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా పెంచారు. ఖనౌరీలోనూ రైతుల ఆందోళన కొనసాగింది. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఢిల్లీ వెళ్లడానికి తమను అనుమతించడానికి డిమాండ్ చేశారు. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి, వారిని చెదరగొట్టారు. బాష్పవాయువు ప్రభావం నుంచి తప్పించుకోవడానికి చాలామంది రైతులు మాసు్కలు, కళ్లద్దాలు ధరించారు. -
అవన్నీ రైతు ఆత్మహత్యలు కావు..
వరంగల్ క్రైం: పంట నష్టం, అప్పుల బాధ తదితర కారణాలతో గ్రామాల్లో జరిగే రైతుల ఆత్మహత్యలపై వరంగల్ పోలీస్ కమిషనర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. గురువారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నకిలీ విత్తన ముఠాల వివరాలు వెల్లడించిన సీపీ.. అనంతరం పలువురు విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో రైతు ఆత్మహత్యలపై మాట్లాడుతూ ‘గ్రామాల్లో జరుగుతున్నవన్నీ రైతు ఆత్మహత్యలు కాదు.. గుండెపోటు, అనారోగ్యంతో చనిపోయినా రైతు ఆత్మహత్యలుగా నమోదయ్యేవి. గతంలో రైతు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం రూ.లక్ష పరిహారం ఇచ్చేది. అందుకే రైతు ఆత్మహత్యగా నమోదు చేసేవాళ్లం. ఎలా చనిపోయినా రైతు ఆత్మహత్యగానే నమోదు చేయడంతో సంఖ్య ఎక్కువగా ఉంది..’అని అన్నారు. ఈ వ్యాఖ్యలు మీడియాలో రావడంతో సీపీ వివరణ ఇచ్చారు. 6 నెలలుగా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు: రైతు ఆత్మహత్యలపై ఎలాంటి వివాదం లేదని సీపీ వివరణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పించడం ద్వారా ఆరు నెలల కాలంగా ఏ ఒక్క రైతు కూడా ఆర్థిక, పంటనష్టం కారణంతో ఆత్మహత్యకు పాల్పడలేదని, ఈ కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎక్కడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల అభ్యన్నతి కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగానే రైతుబీమా పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఈ పథకం ద్వారా రైతు ఏ కారణంతో మరణించినా ఆ కుటుంబానికి ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారన్నారు. కానీ రైతులు, పోలీసులకు ఈ పథకంపై సరైన అవగాహన లేకపోవడంతో ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఇతర కారణాలతో రైతులు మరణిస్తే 2004లో అప్పటి ప్రభుత్వం జారీచేసిన 421 జీఓ నిబంధనల ప్రకారమే ఆర్థిక సాయం కోసం రైతు ఆత్మహత్యలుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వివరించారు. అయితే ప్రస్తుతం రైతులు ఏ విధంగా మరణించినా బాధిత కుటుంబాలకు రైతుబీమా ద్వారా ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్నారని తెలిపారు. -
కామారెడ్డి జిల్లా అడ్లూర్‌లో ఉద్రిక్తత
-
కామారెడ్డిలో ఉద్రిక్తత.. బెడిసికొట్టిన మున్సిపల్ మాస్టర్ ప్లాన్!
సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని అడ్లూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాస్టర్ ప్లాన్‌లోని భూమి కోల్పోవడంతో రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, రాములు ఆత్మహత్యతో రైతులు ఆందోళనకు దిగారు. అయితే, గత నెలరోజులుగా మాస్టర్ ప్లాన్‌పై కామారెడ్డి రైతులు ధర్నా చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ విషయంలో రాములు సూసైడ్ నోట్‌తో ఈ రగడ మరింతగా ముదిరింది. జరిగింది ఇదే.. కామారెడ్డి టౌన్: సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన పయ్యావుల రాములు(42)కు కామారెడ్డి పట్టణ శివారులోని ఇలి్చపూర్ వద్ద 3 ఎకరాల సాగుభూమి ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాములు ఆ భూమిని గతంలోనే అమ్మకానికి పెట్టాడు. మున్సిపల్ నూతన మాస్టర్‌ప్లాన్ ప్రతిపాదనల్లో ఆయన భూమిని ఇండ్రస్టియల్ జోన్లోకి మార్చడంతో భూమి అమ్ముడుపోవడం లేదు. దీంతో మనస్తాపానికి గురైన రాములు మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు బుధవారం మృతదేహాన్ని ట్రాక్టర్లో తీసుకుని బల్దియా వద్ద ఆందోళన చేయడానికి బయలుదేరగా.. పోలీసులు కామారెడ్డి బస్టాండ్ వద్ద అడ్డుకున్నారు. దీంతో రైతులు రెండు గంటలపాటు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదం జరిగింది. రైతులు మృతదేహాన్ని అక్కడే వదిలేసి బల్దియా కార్యాలయానికి వెళ్లి ఆందోళన చేశారు. అనంతరం పోలీసులు కొత్తబస్టాండ్ వద్దనున్న మృతదేహాన్ని అశోక్‌నగర్ కాలనీ, రైల్వేగేట్, పాత బస్టాండ్ మీదుగా జిల్లా ఆస్పత్రికి తరలించారు. బల్దియా వద్ద ధర్నా తన భర్త మృతదేహన్ని అనుమతి లేకుండా పోలీసులు ఏరియా ఆస్పత్రికి తరలించడంపై మృతుడి భార్య శారద నిరసన తెలిపింది. ఆమె పెద్ద కుమారుడు అభినందు, చిన్న కుమారుడు నిషాంత్, బంధువులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ముందున్న అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రైతులు మున్సిపల్ కార్యాలయం గేటు వద్ద ఆందోళన చేశారు. కమిషనర్ కమీషనర్ రాగానే ఆయనతో వాగ్వాదానికి దిగారు. మద్యాహ్నం నుంచి రాత్రి వరకు ఆందోళన కొనసాగింది. ఆందోళనలో లింగాపూర్, అడ్లూర్ఎల్లారెడ్డి, ఇలి్చపూర్ తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు. నా కుటుంబాన్ని ఆదుకోండి తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆత్మహత్య చేసుకున్న రాములు భార్య పయ్యావులు శారద కోరింది. బుధవారం రాత్రి ఆమె ఆందోళన విరమించి, కుటుంబ సభ్యులతో కలి సి ఏరియా ఆస్పత్రికి వెళ్లింది. ప్రభుత్వం, అధి కారుల నిర్లక్ష్యం వల్ల తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా మని, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని గ్రామనికి తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. -
ప్రతి ముగ్గురు రైతుల్లో.. ఒకరు కౌలుదారే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రతీ ముగ్గురు వ్యవసాయదారుల్లో ఒకరు కౌలురైతు ఉన్నారని రైతు స్వరాజ్య వేదిక సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలో కౌలురైతుల స్థితిగతులపై ఆ వేదిక ఆధ్వర్యంలో అధ్యయనం జరిపారు. 20 జిల్లాల్లో 34 గ్రామాల్లో మొత్తం 7,744 మంది రైతులను సర్వే చేయగా, వారిలో 2,753 మంది (35.6 శాతం) కౌలురైతులు ఉన్నట్లు తేలింది. సర్వే చేసిన మొత్తం 2,753 కౌలురైతుల్లో 523 మంది ఏమాత్రం భూమి లేనివారే. వీరు 19 శాతం మంది ఉన్నారు. 81 శాతం మంది ఎంతోకొంత సొంత భూమి ఉండి, అది జీవనోపాధికి సరిపోక అదనంగా మరి కొంతభూమిని కౌలుకు తీసుకున్నారు. కౌలురైతుల సగటు సొంతభూమి 2.3 ఎకరాలు కాగా, సగటున కౌలుకు తీసుకున్న భూమి విస్తీర్ణం 5.1 ఎకరాలు. 31 శాతం మంది కౌలు రైతులు 5 ఎకరాల కంటే ఎక్కువ భూమిని కౌలుకు తీసుకున్నారు. కౌలు రైతుల్లో 60.9 శాతం మంది బీసీలున్నారు. ఎస్సీలు 22.9 శాతం, ఎస్టీలు 9.7 శాతం మంది ఉన్నారు. ఓసీలు 4.2 శాతం, ముస్లిం మైనారిటీలు 2.4 శాతం మంది ఉన్నారు. భూమిని కౌలుకు ఇస్తున్న యజమానుల్లో 49 శాతం మంది బీసీలు కాగా, 33 శాతం మంది ఓసీలు, 10 శాతం మంది ఎస్సీలు, మిగిలిన 7 శాతం మంది ఎస్టీలు, మైనారిటీలు. సర్వేలో ముఖ్యాంశాలు... ► భూయజమానుల్లో 26 శాతం మంది మాత్రమే స్వయంగా వ్యవసాయం చేస్తున్నారు. 55 శాతం మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు, వ్యాపారం, కాంట్రాక్టులు, ఇతర వృత్తుల్లో ఉన్నవారే. మిగిలినవారు ఇతర వృత్తి లేనివారు లేదా వృద్ధులు. ► 25 శాతం భూ యజమానులు నగరాల్లో ఉండగా, ఒక శాతం విదేశాల్లో ఉంటున్నారు. నగరాలు, విదేశాలలో ఉన్నవారిలో సగం మంది ఆ గ్రామాలతో కానీ, వ్యవసాయంతోకానీ ఎటువంటి సంబంధం లేనివారే. కేవలం పెట్టుబడి కోసం వీరు భూములను కొని కౌలుకు ఇస్తున్నారు. ► కౌలు రైతుల్లో 9.5 శాతం మహిళలున్నారు. మహిళా కౌలురైతులలో 22.7 శాతం భూమి లేని వారే. ► 73 శాతం కౌలు రైతులు ఒకే భూమిలో కనీసం మూడేళ్లు లేదా అంతకుపైగా సాగు చేస్తున్నారు. 39 శాతం మంది 5 ఏళ్లకుపైగా, 18 శాతం మంది 10 ఏళ్లకుపైగా ఒకే భూమిలో కౌలు సాగుచేస్తున్నారు. ► 91.1 శాతం కౌలు రైతులు కౌలు మొత్తాన్ని నగదురూపంలో, 7.5 శాతం మాత్రమే పంట రూపంలో చెల్లిస్తున్నారు. చాలా కొద్దిమంది మాత్రమే పంట భాగస్వామ్యం పద్ధతిలో కౌలు ఇస్తున్నారు. నగదురూపంలో కౌలు చెల్లించేవారిలో 38.3 శాతం మంది సీజన్ ముందే పూర్తిగా చెల్లిస్తున్నారు. 20.5 శాతం మంది కౌలు ధరలో సగం ముందుగా చెల్లించి సగం చివరిలో చెల్లిస్తున్నారు. 41 శాతం మంది పంటకోతల తర్వాత చెల్లిస్తున్నారు. ► కౌలురైతుల్లో 69 శాతం వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. హమాలీ/భవన నిర్మాణ కార్మికులుగా 13 శాతం మంది, పశుపోషణపై 9.6 శాతం మంది, మేకలు, గొర్రెల పెంపకంపై 3 శాతం మంది ఆధారపడ్డారు. ఇతరులు బీడీ కారి్మకులుగా, ట్రాక్టర్ డ్రైవర్లుగా, ఆటోడ్రైవర్లుగా, చిన్నవ్యాపారులుగా అదనపు ఆదాయం సంపాదిస్తున్నారు. ► రాష్ట్రవ్యాప్తంగా ప్రతికౌలు రైతు కుటుంబానికి సగటు రుణం రూ.2.7 లక్షల వరకు ఉంది. దానిలో రూ. 2 లక్షలు ప్రైవేట్ రుణాలే. కౌలుభూమి మీద పంటసాగు కోసం బ్యాంకు రుణాలు అందడంలేదు. వాళ్లకు ఉన్న ► మొత్తం రుణాల్లో 25 శాతం మాత్రమే బ్యాంక్ రుణాలు ఉన్నాయి. ప్రైవేట్ అప్పులపై వడ్డీ 24 శాతం నుంచి 60 శాతం వరకు ఉంది. ఇదీ చదవండి: చక్కని సాగుకు.. చిన్న డ్రోన్లు -
కేసీఆర్ 8 ఏళ్ళ పాలనలో 8 వేల మంది రైతులు బలి
-
AP: అన్నదాతకు ఆత్మస్థైర్యం
సాక్షి, అమరావతి: ఏ అన్నదాతకూ ఆత్మహత్య చేసుకునేంత దుస్థితి రాకూడదు. అనుకోని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడితే... పాలకులు ఆ కుటుంబాన్ని అక్కున చేర్చుకుని భరోసా ఇవ్వాలి. కానీ చంద్రబాబు హయాంలో... పరిహారం కోసమే ప్రాణాలు తీసుకుంటున్నారని వారిని ఎగతాళి చేశారు. సాయాన్నీ గాలికొదిలేశారు. ‘ప్రశ్నిస్తా!’ అని పదేపదే అరిచే జనసేనాని పవన్‌కల్యాణ్ ఈ దురాగతంపై నోరెత్తితే ఒట్టు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక రైతు ఆత్మహత్యలపై రీసర్వే చేయించారు. చంద్రబాబు హయాంలో మరణించిన 469 మంది రైతుల కుటుంబాలకు పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి 7 లక్షలకు పెంచి మరీ అందజేశారు. దీన్ని ప్రశ్నించలేని జనసేనాని కొత్త రాగం అందుకున్నారు. రైతుల ఊసెత్తకుండా.. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు ప్రభుత్వం సాయం చేయలేదంటున్నారు. ఏం! కౌలు రైతుల వివరాల్ని గ్రామ సచివాలయాల స్థాయిలో నమోదు చేసుకుని లక్షల మందికి సీసీఆర్సీ (గుర్తింపుకార్డులు) ఇచ్చింది ఈ ప్రభుత్వం కాదా? వారందరికీ రైతు భరోసా అమలు చేసిన తొలి రాష్ట్రం ఏపీ కాదా? పంటల బీమా సహా రైతులకిచ్చే అన్ని పథకాలనూ కౌలు రైతులకూ వర్తింపజేసింది ఈ ప్రభుత్వం కాదా? ఎవరు చనిపోయినా కౌలు రైతే అంటే ఎలా? కౌలురైతులు కాని సామాన్యులు ఆత్మహత్యకు పాల్పడినా వైఎస్సార్ బీమా కింద ప్రభుత్వం సాయం అందిస్తుండటం మీకు తెలీదా? చంద్రబాబు హయాంలో రైతులకు సైతం సాయం ఎగవేస్తే ప్రశ్నించలేదు ఈ దత్తపుత్రుడు. ఇపుడు కౌలు రైతులంటూ ఎందుకీ డ్రామా అన్నదే అందరి ప్రశ్న!!. ► మట్టినే నమ్ముకుని సేద్యం చేస్తున్న కౌలు రైతుల కడగండ్లను గుర్తిస్తూ దేశంలోనే తొలిసారిగా రైతు భరోసా నుంచి పంటల బీమా దాకా అన్ని రకాల ప్రయోజనాలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అందచేస్తోంది. లక్షల మంది కౌలు రైతులకూ గ్రామ సచివాలయాల ద్వారా సీసీఆర్సీ కార్డులను ఇచ్చి పంట రుణాలు సమకూర్చి వెన్ను తడుతోంది. గత సర్కారు హయాంలో వంచనకు గురై ఆత్మహత్యలకు ఒడిగట్టిన 469 మంది అన్నదాతల కుటుంబాలకు ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిహారం కింద రూ.23.45 కోట్లను చెల్లించింది. రుణమాఫీ పేరుతో మోసపోయిన రైతన్నలకు సాంత్వన చేకూరుస్తోంది. గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి అన్ని సేవలను అక్కడే అందచేస్తోంది. విత్తనం నుంచి నూర్పిళ్ల దాకా ప్రతి అడుగులోనూ వారికి తోడుగా ఉండే బాధ్యతను సంతోషంగా స్వీకరించింది. సాయంపై సేనాని బుకాయింపు గత సర్కారుకు రైతుల ఆత్మహత్యలను గుర్తించేందుకే మనసు రాలేదు. రుణమాఫీ పేరుతో అన్నదాతలను నిలువునా ముంచేసింది. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తే ఆ డబ్బుల కోసమే చనిపోతారని వ్యాఖ్యానిస్తూ ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్న సమయంలో పరిహారాన్ని చంద్రబాబు ఎత్తివేశారు. రైతుల ప్రాణాలకు వెల కట్టి చులకనగా మాట్లాడారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇవేవీ పట్టనట్లుగా వ్యవహరిస్తూ ఇప్పుడు కౌలు రైతులతో సహా రైతన్నలను అన్ని రకాలుగా ఆదుకుంటున్న ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తుండటం, తాను వచ్చాకే సాయం అందుతోందంటూ బుకాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాపరికం లేకుండా.. పశ్చిమ గోదావరి జిల్లాలోనే 2019 జూన్ 1వతేదీ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 2వతేదీ వరకు ఆత్మహత్యలు చేసుకున్న 41 మంది రైతన్నల కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించింది. గత సర్కారు రైతుల ఆత్మహత్యలను కనీసం నమోదు చేయకపోగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాపరికం లేకుండా పారదర్శకంగా పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేస్తోంది. ఎప్పటికప్పుడు వెంటనే బాధిత కుటుంబాలను ఆదుకుంటోంది. రైతు శ్రేయస్సే ధ్యేయంగా.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే రైతు శ్రేయస్సుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా గత సర్కారు హయాంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతులు, కౌలు రైతుల వివరాలు సేకరించి ఆదుకోవాలని ఆదేశించారు. 2014 నుంచి 2019 మే 31 వరకు ఆత్మహత్యలకు పాల్పడ్డ 773 మంది రైతులకు సంబంధించి పునఃపరిశీలన చేయాలని నిర్దేశించారు. విచారణ అనంతరం 469 రైతు కుటుంబాలు ఎక్స్‌గ్రేషియాకు అర్హులని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పన మొత్తం రూ.23.45 కోట్లను చెల్లించారు. ఇందులో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 19 మంది కూడా ఉన్నారు. పరిహారం పెంపు.. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాను రూ.7 లక్షలకు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు 2019 అక్టోబర్ 14న జీవో 102 జారీ అయింది. పెంచిన పరిహారాన్ని 01–06–2019 నుంచి వర్తింప చేసేందుకు వీలుగా 20–02–2020న మరో జీవో 43 జారీ చేశారు. ఈ జీవోల ప్రకారం 01–06–2019 నుంచి 31–12–2019 వరకు ఆత్మహత్యలు చేసుకున్న 308 మంది రైతు కుటుంబాలకు రూ.ఏడు లక్షల చొప్పున రూ.21.56 కోట్లను ఎక్స్‌గ్రేషియాగా చెల్లించారు. ఇదే ప్రకారం 2020 సంవత్సరంలో ఆత్మహత్యలు చేసుకున్న 260 రైతు కుటుంబాలకు రూ.ఏడు లక్షల చొప్పున రూ.18.20 కోట్లను పరిహారంగా చెల్లించారు. ఇక 2021 సంవత్సరంలో 126 రైతు కుటుంబాలకు రూ.8.82 కోట్లను అందచేశారు. గత సర్కారు హయాంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలతో కలిపి 2021 వరకు ఎక్స్‌గ్రేషియా కింద రూ.72.145 కోట్లను చెల్లించారు. కలెక్టర్ల వద్ద కార్పస్ నిధి ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను తక్షణం ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో జిల్లా కలెక్టర్ వద్ద కార్పస్ నిధిగా కోటి రూపాయల చొప్పున అందుబాటులో ఉంచింది. 2021–22 బడ్జెట్లో బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించేందుకు రూ.20 కోట్లను కేటాయించగా రూ.15.345 కోట్లు వ్యయం చేసింది. 2022–23 బడ్జెట్లోనూ పరిహారం కోసం రూ.20 కోట్లను కేటాయించారు. పశ్చిమలో 41 కుటుంబాలకు పరిహారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2019 జూన్ 1 నుంచి 2022 ఫిబ్రవరి 2 వరకు 41 మంది రైతుల ఆత్మహత్యలు నమోదు కాగా ప్రభుత్వం అందరికీ పరిహారం చెల్లించింది. సాగు చేస్తున్నట్లు నిర్థారించిన 26 మందికి రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇవ్వగా ఇతరులకు అలాంటి రుజువులు లేకున్నా మానవత్వంతో వైఎస్సార్ బీమా కింద రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు చెల్లించారు. ఇందులో నాలుగు రైతు కుటుంబాలకు రూ.రెండు లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించగా 11 కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పరిహారం అందింది. పరిహారంతో పాటు పథకాలూ.. బాధిత కుటుంబాలకు కేవలం ఎక్స్‌గ్రేషియా మాత్రమే కాకుండా వివిధ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటోంది. ఒక్కో కుటుంబానికి కనిష్టంగా రెండు.. గరిష్టంగా ఏడు పథకాలు అమలు చేస్తోంది. జగనన్న అమ్మ ఒడి, రైతు భరోసా, వైఎస్సార్ చేయూత, జగనన్న తోడు, వైఎస్సార్ పెన్షన్ కానుక, వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ తదితర పథకాలను ఆ కుటుంబాలకు వర్తింప చేస్తున్నారు. -
ఆశ పోయింది.. శ్వాస ఆగింది..కొనుగోలు కేంద్రంలోనే ఆగిన రైతు గుండె
హుజూరాబాద్/జమ్మికుంట: ధాన్యంరాశి వద్ద ఇరవై రోజులుగా పడిగాపులు కాసినా, కొనే నాథుడులేడనే ఆవేదనతో అన్నదాత కన్ను మూశా డు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లాలో మంగళవారం జరిగింది. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంటకు చెందిన బిట్ల ఐలయ్య (59)కు 15 గుంటల వ్యవసాయ భూమి ఉంది. అందులో పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు 20 రోజుల క్రితం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. ధాన్యం తేమగా ఉందని అధికారులు కొర్రీ పెట్టడంతో ఐలయ్య అక్కడే ధాన్యం ఆరబోసి 20 రోజులుగా పడిగాపులు కాస్తున్నాడు. ఎప్పటిలాగే మంగళ వారం మధ్యాహ్నం ఇంటికి వెళ్లి భోజనం చేసి మళ్లీ కొనుగోలు కేంద్రానికి వచ్చాడు. ధాన్యాన్ని గన్నీ సంచుల్లో నింపుతుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురై వడ్ల రాశిపైనే కుప్పకూలి విగతజీవిగా మారాడు. ఆయనకు భార్య లక్ష్మి, కూతురు నిత్య ఉన్నారు. కొనుగోలులో జాప్యం చేయడం వల్లే ఐలయ్య మృతి చెందాడని, మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సంపత్‌రావు డిమాండ్ చేశారు. వడ్లు తెచ్చి 20 రోజులైతాంది వడ్లను కేంద్రానికి తీసుకొచ్చి 20 రోజులైతాంది. తేమ ఉందని ఆరబెట్టాలని సార్లు చెప్పిన్లు. అప్పటిసంది కేంద్రంలోనే రోజూ ధాన్యం ఎండబెడుతున్నం. ఈ రోజు నా భర్త భోజనం చేసి, వడ్లను బస్తాలలో నింపేందుకు పోయిండు. కొద్దిసేపటికే చనిపోయిండని చెప్పిన్లు. నాకు దిక్కెవరు. ప్రభుత్వం ఆదుకోవాలె. – లక్ష్మి, మృతుడి భార్య టోకెన్ ఇచ్చాం ఐలయ్య వారం క్రితం కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చాడు. ఆరబెట్టిన తర్వాత ఈ టోకెన్ జారీ చేశాం. ఈరోజు గన్నీ తీసుకొని నింపుతుండగా అస్వస్థతకు గురై గుండెపోటుతో చనిపోయాడని తెలిసింది. – తిరుపతి, పీఏసీఎస్ సెంటర్ ఇన్చార్జి ఐలయ్యది ఆకస్మిక మరణం: అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ ఐలయ్య ధాన్యాన్ని గన్నీ సంచుల్లో నింపే సమయంలో గుండెపోటుతో మృతి చెందారని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 4న 10–10 రకానికి చెందిన దాదాపు 50 బస్తాల ధాన్యాన్ని తీసుకురాగా, 6న టోకెన్ జారీచేశామని పేర్కొన్నారు. ఐలయ్య మృతిపై జిల్లా సహకార అధికారి కార్యాలయం సీనియర్ ఇన్స్పెక్టర్ ప్రసూనతో విచారణ జరిపించినట్లు పేర్కొన్నారు. -
సీన్ రీక్రియేషన్.. లఖీమ్‌పూర్‌కు ఆశిష్ మిశ్రా
అఖీమ్‌పూర్ ఖేరి: ఉత్తరప్రదేశ్‌లో లఖీమ్‌పూర్ ఖేరి హింసాకాండపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తన కార్యాచరణను వేగవంతంగా చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు, ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాతోపాటు ఇదే కేసులో అరెస్టు చేసిన మరో ముగ్గురిని గురువారం ఘటనా స్థలానికి తీసుకొచి్చంది. హింసకు దారితీసిన పరిణామాలను తెలుసుకొనేందుకు లఖీమ్‌పూర్‌లో చోటుచేసుకున్న వరుస ఘటనలను రీక్రియేట్ చేసింది. రైతుల స్థానంలో కొన్ని బొమ్మలను పెట్టి, వాహనంతో ఢీకొట్టించినట్లు తెలుస్తోంది. పటిష్టమైన భద్రత మధ్య నిందితులను టికోనియా–బన్బరీపూర్ రోడ్డులో ఘటనా స్థలానికి చేర్చారు. అక్టోబర్ 3న జరిగిన ఘటనపై వారిని ప్రశ్నించారు. అంతకముందు అధికారులు జిల్లా జైలుకు చేరుకొని, నిందితులు దాస్, లతీఫ్, భారతిని తమ కస్టడీలోకి తీసుకొని, లఖీమ్‌పూర్‌కు బయలుదేరారు. ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాను పోలీసు కార్యాలయం నుంచి తీసుకొచ్చారు. దుర్ఘటన జరిగిన ప్రాంతం జిల్లా కేంద్రం లఖీమ్‌పూర్ సిటీకి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్టోబర్ 3న రహదారిపై నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపైకి ఓ వాహనం దూసుకెళ్లడంతో నలుగురు మరణించిన సంగతి తెలిసిందే. అనంతరం చెలరేగిన హింసాకాండలో మరో నలుగురు బలయ్యారు. వీరిలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఒక డ్రైవర్, ఒక జర్నలిస్టు ఉన్నారు. -
లఖీమ్‌పూర్ ఘటనను ఖండించాలి
బోస్టన్: ఉత్తరప్రదేశ్‌లో నలుగురు రైతుల ప్రాణాలను బలి తీసుకున్న లఖీంపూర్ ఖేరి ఘటనను తీవ్రంగా ఖండించాల్సిందేనని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. అదే సమయంలో ఆ తరహా ఘటనలు దేశంలో ఎక్కడ జరిగినా గళమెత్తాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న సీతారామన్ మంగళవారం హార్వర్డ్ కెన్నెడీ స్కూలులో జరిగిన చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ కొందరు సీతారామన్‌ను రైతులు బలిగొన్న ఘటనపై ప్రశ్నల వర్షం కురిపించారు. లఖీంపూర్ ఖేరి ఘటనపై ప్రధానమంత్రి, ఇతర సీనియర్ మంత్రులు ఎందుకు పెదవి విప్పడం లేదని, బీజేపీ దేనికి ఆత్మరక్షణలో పడిపోయిందని సూటిగా ప్రశ్నించారు. దీనికి సీతారామన్ బదులిస్తూ లఖీంపూర్ ఖేరి ఘటనని ప్రతీ ఒక్కరూ ఖండిస్తున్నారని ఆ తరహా ఘటనలు దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయని వాటి గురించి కూడా మాట్లాడాలని అన్నారు. ‘‘దేశంలో ఏ ప్రాంతంలో ఈ తరహా ఘటనలు జరిగినా అందరూ గళమెత్తాలి. భారత్ గురించి బాగా తెలిసిన డాక్టర్ అమర్త్యసేన్ వంటి వారు ఎక్కడ ఇలాంటి ఘటనలు జరిగినా లేవనెత్తాలి. యూపీలో బీజేపీ అధికారంలో ఉండడం, కేంద్ర మంత్రి కుమారుడు ప్రమేయంపై ఆరోపణలున్నాయి కాబట్టే అందరూ మమ్మల్ని వేలెత్తి చూపిస్తున్నారు. ఈ పని ఎవరు చేసినా న్యాయస్థానంలో తేలిపోతుంది. ఇదంతా నేను మా ప్రధానిని కానీ, మా పార్టీని కానీ వెనకేసుకొని రావడం కాదు. నేను భారత్ గురించి మాట్లాడతాను. నిరుపేదలకు జరగాల్సిన న్యాయం గురించి మాట్లాడతాను’’అని సీతారామన్ సమాధానమిచ్చారు. -
మరణావస్థలో కాంగ్రెస్!: సిద్ధూ
చండీగఢ్: కాంగ్రెస్‌ను తనదైన శైలిలో ఇబ్బందులు పెడుతున్న నవజోత్‌సింగ్ సిద్దూ మరోమారు గళం విప్పారు. యూపీలో జరిగిన రైతు మరణాలకు సంబంధించి ఆయన మొహాలి నుంచి లఖిమ్‌పూర్‌కు యాత్ర చేపట్టారు. దీని ఆరంభానికి ముందు పంజాబ్ సీఎం రాక ఆలస్యం కావడంతో ఆయన అసహనంగా కనిపించారు. దీంతో సిద్ధూను కేబినెట్‌మంత్రి పర్గాత్ సింగ్ శాంతింపజేయడానికి ప్రయతి్నస్తున్న వీడియో ఒకటి మీడియాలో ప్రత్యక్షమైంది. సీఎం త్వరలో వస్తారని పర్గాత్ చెప్పడం, ఈ యాత్ర విజయవంతమవుతుందని కాంగ్రెస్ పంజాబ్ సీడబ్లు్యసీ చీఫ్ సుఖ్విందర్ సింగ్ సముదాయించడం వీడియోలో కనిపించింది. వీరి మాటలకు సిద్ధూ స్పందిస్తూ ‘‘విజయం ఎక్కడ? నాకు పగ్గాలు అప్పజెప్పిఉంటే మీకు విజయం కనిపించేది. ఇప్పుడు కాంగ్రెస్ మృతావస్థలో ఉంది.’’ అని ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా కనిపించింది. సీఎం మార్పునకు నిరసనగా కాంగ్రెస్ పంజాబ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సిద్ధూ అనంతరం అధిష్టానం బుజ్జగింపుతో మెత్తబడ్డట్లు కనిపించారు. అయితే ఆయన రాజీనామాను అధికారికంగా ఉపసంహరించుకోలేదు. ఆయనలో అసంతృప్తి చల్లారలేదని తాజా వ్యాఖ్యలు చూపుతున్నాయి. సిద్ధూకు దళితులపై గౌరవం లేదని, కేవలం ఎన్నికల కోసం కుల రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్ష అకాలీదళ్ విమర్శించింది. కాంగ్రెస్ సమస్యలకు తక్షణ పరిష్కారాలు దొరకవు! న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సమస్యల పరిష్కారానికి తక్షణ మార్గాల్లేవని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. లఖీమ్‌పూర్ ఘటనతో పార్టీకి తక్షణ పునర్వైభవం వస్తుందని ఆశించేవారు నిరాశ పడకతప్పదంటూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌లో చేరడానికి ప్రశాంత్ తయారవుతున్నారన్న ఊహాగానాల నడుమ ఆయన తాజా ట్వీట్ అందరినీ ఆకర్షిస్తోంది. జీఓపీ(గ్రాండ్ ఓల్డ్ పార్టీ– కాంగ్రెస్) వెనువెంటనే పునర్వికాసం చెందేందుకు లఖీమ్‌పూర్ ఘటన ఉపయోగపడుతుందని చాలామంది ఆశిస్తున్నారని, వీరంతా త్వరలో అతిపెద్ద నిరాశను ఎదుర్కొంటారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో ప్రశాంత్ చేరికను కొందరు వ్యతిరేకిస్తున్నారు. తాజా ట్వీట్‌తో తనకు, పార్టీ నాయకత్వంతో విభేదాలున్నట్లు ప్రశాంత్ పరోక్షంగా చెప్పినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఎంతమందిని అరెస్టు చేశారు?
సాక్షి, న్యూఢిల్లీ: లఖీమ్‌పూర్ ఖేరి ఘటనలో నలుగురు రైతులతో సహా మొత్తం 8 మంది మృతి చెందడం దురదృష్టకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఉదంతంలో తాజా పరిస్థితులపై నివేదిక అందజేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హింసాకాండకు సంబంధించి ఎవరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు? ఎంతమందిని అరెస్టు చేశారు? అనే వివరాలతో నివేదిక వెంటనే ఇవ్వాలని స్పష్టం చేసింది. యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్), జ్యుడీషియల్ కమిషన్ వివరాలను సైతం తమకు తెలియజేయాలని వెల్లడించింది. ఈ సుమోటో కేసుపై తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఘటనపై విచారణ చేపట్టాలంటూ న్యాయవాదులు శివకుమార్ త్రిపాఠి, సీఎస్ పాండా సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు. గురువారం జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లిల ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. న్యాయవాది త్రిపాఠి వాదనలు వినిపించారు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేఖ ద్వారా ఏం ఉపశమనం కావాలని కోరుకుంటున్నారో చెప్పాలని లాయర్‌ను సీజేఐ ప్రశ్నించారు. ఘటనపై విచారణ జరిపేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని విన్నవించారు. జస్టిస్ హిమాకోహ్లి జోక్యం చేసుకొని ఘటనను సరిగ్గా పరిశీలించలేదని, ఎఫ్ఐఆర్ సరిగ్గా నమోదు చేయలేదని పేర్కొన్నారు. అనంతరం యూపీ అదనపు అడ్వొకేట్ జనరల్ గరీమా ప్రసాద్ వాదనలు వినిపించారు. ఉదంతంపై ప్రభుత్వం ‘సిట్’ వేసిందని, దర్యాప్తు కోసం జ్యుడీషియల్ కమిషన్‌ను నియమించిందని తెలిపారు. రైతు తల్లికి తగిన వైద్య సేవలందించండి ‘అలహాబాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పరిస్థితిని నివేదికలో తెలియజేయండి. శుక్రవారం విచారణ జరుపుతాం’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ‘‘హత్యకు గురైన వారిలో రైతులతోపాటు ఇతరులు ఉన్నారు. ఎవరెవరిపై ఎఫ్ఐఆర్ నమోదయ్యింది? ఎవరిని అరెస్టు చేశారో తెలుసుకోవాలనుకుంటున్నాం. అందుకే తాజా పరిస్థితిపై నివేదిక దాఖలు చేయండి’’ అని జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. అంతకుముందు.. సుమోటో కేసుపై విచారణ ప్రారంభిస్తూ జస్టిస్ ఎన్.వి.రమణ న్యాయవాదులు లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు. వారు కోరుతున్నట్లుగానే లఖీమ్‌పూర్ ఖేరి ఘటనపై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా కూడా స్క్రీన్ మీద కనిపించేసరికి ఎవరి తరఫున వాదిస్తున్నారని ప్రశ్నించారు. పౌరుల స్వేచ్ఛ కోసం బార్ సభ్యుడిగా వాదనలు వినిపిస్తానని హన్సారియా బదులిచ్చారు. ఆశిష్ మిశ్రాకు సమన్లు జారీ చేసిన ఉత్తరప్రదేశ్ పోలీసులు లఖీమ్‌పూర్ ఖేరి: లఖీమ్‌పూర్ ఖేరి హింసాకాండ ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాను ప్రశి్నంచేందుకు శుక్రవారం ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేసినట్లు ఐజీ లక్ష్మీసింగ్ చెప్పారు. సమన్లకు స్పందించకపోతే చట్టప్రకారం ముందుకెళ్తామని తెలిపారు. ఈ హింసాకాండతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న బన్బీర్పూర్కు చెందిన లవకుశ్, నిఘాసన్ తహసీల్‌కు చెందిన ఆశిష్ పాండేను అరెస్ట్ చేసి ప్రశి్నస్తున్నట్లు చెప్పారు. హింసాకాండలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశిష్‌పై ఎఫ్ఐఆర్ నమోదవడం తెల్సిందే. ఏకసభ్య జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు లఖీమ్‌పూర్ ఖేరి హింసాకాండపై న్యాయ విచారణకు అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ప్రదీప్‌కుమార్ శ్రీవాస్తవ సభ్యుడిగా జ్యుడీíÙయల్ కమిషన్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర హోంశాఖ సీనియర్ అధికారి ఒకరు గురువారం ఈ విషయం వెల్లడించారు. ఏకసభ్య కమిషన్ ఏర్పాటుపై ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. లఖీమ్‌పూర్ ఖేరి కేంద్రంగానే ఈ కమిషన్ పని చేస్తుందని, న్యాయ విచారణను పూర్తి చేయడానికి రెండు నెలల సమయం ఇస్తున్నట్లు తెలిపింది. -
హైడ్రామా నడుమ రాహుల్ పరామర్శ
లక్నో: అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాం«దీ, తన సోదరి ప్రియాంక గాం«దీతో కలిసి లఖీమ్‌పూర్ ఖేరిలో బాధిత రైతు కుటుంబాలను పరామర్శించారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ చన్నీ, ఛత్తీస్‌గఢ్ సీఎం బఘేల్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్, సూర్జేవాలేలతో కలిసి బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి లక్నో విమానాశ్రయానికి రాహుల్ చేరుకున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి యూపీ ప్రభుత్వం అనుమతినిచి్చనప్పటికీ పోలీసులు రాహుల్ సొంత వాహనంలో వెళ్లడానికి అంగీకరించలేదు. పోలీసు వాహనంలో వెళ్లాలని చెప్పారు. దీంతో లక్నో విమానాశ్రయంలో రాహుల్ ధర్నా చేశారు. ‘నాకు వాహనం ఏర్పాటు చేయడానికి మీరెవరు? నేను నా సొంత వాహనంలో వెళతాను’ అంటూ పోలీసులు, భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నా వాహనంలో వెళ్లడానికి అనుమతించేవరకు నేను ఇక్కడే కూర్చుంటాను. రైతుల్ని అణిచివేస్తున్నారు. వారిని దోచేస్తున్నారు. వ్యవసాయ చట్టాలను ఎవరి కోసం చేశారో అందరికీ తెలుసు’’ అని రాహుల్ అన్నారు. రాహుల్ ధర్నాతో దిగొచి్చన యూపీ పోలీసులు సొంత వాహనంలో వెళ్లడానికి అనుమతించారు. లక్నో నుంచి సీతాపూర్ గెస్ట్‌హౌస్‌లో ఉన్న ప్రియాంక గాంధీని ఆయన కలుసుకున్నారు. మూడు రోజులుగా నిర్బంధంలో ఉన్న ప్రియాంక గాం«దీని విడుదల చేస్తున్నట్టు అదనపు మెజిస్ట్రేట్ ప్రకటించారు. ఆ తర్వాత రాహుల్, ప్రియాంక కలిసి కాల్పుల్లో మరణించిన లవ్‌ప్రీత్ సింగ్, రమన్కాశ్యప్ కుటుంబాలను పరామర్శించారు. అనతంతరం మరో బాధితుడు నచార్ సింగ్ ఇంటికి బయలుదేరారు. రాహుల్, ప్రియాంక కన్నా ముందు ఆప్ పారీ్టకి చెందిన నేతల బృందం బాధిత కుటుంబాలను పరామర్శించారు. గురువారం అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ నేత మిశ్రాలు బాధిత కుటుంబాల పరామర్శకు రానున్నారు. అమిత్‌షాతో అజయ్ మిశ్రా భేటీ రైతు మరణాలకు నైతిక బా«ధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్లు ఊపందుకున్న నేపథ్యంలో బుధవారం ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలుసుకున్నారు. రైతులపైకి వాహనాన్ని అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ నడిపాడని ఆరోపణల నేపథ్యంలో అమిత్ షాకి మిశ్రా వివరణ ఇచ్చారు. ఘటన జరిగిన సమయంలో తాను కానీ, తన కుమారుడు కానీ అక్కడ లేరని చెప్పుకొచ్చారు. సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు నేడు సీజేఐ నేతృత్వంలో విచారణ ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరీలో రైతుల నిరసన సందర్భంగా చోటుచేసుకున్న హింసాకాండను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం దీనిపై విచారణ చేపట్టనుంది. ఈ మేరకు కేసులిస్టును సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఈ ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లీ సభ్యులుగా ఉన్నారు. 8 మంది మరణానికి కారణమైన లఖీమ్‌పూర్ ఖేరీ హింసపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో న్యాయ విచారణకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఒక పథకం ప్రకారం రైతులపై దాడులు దేశంలో ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించడం లేదని, నియంతృత్వమే రాజ్యమేలుతోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రైతులపై ఒక పథకం ప్రకారం దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బుధవారం లక్నోకు బయలుదేరే ముందు ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం లక్నోకి వచ్చినప్పటికీ లఖీమ్‌పూర్ ఖేరికి వెళ్లడానికి తీరిక దొరకలేదని అన్నారు. యూపీలో కొత్త తరహా రాజకీయాలు నెలకొన్నాయని, క్రిమినల్స్ తమ ఇష్టారాజ్యంగా దారుణాలకు తెగబడి యధేచ్ఛగా తిరుగుతున్నారని, బాధితులకి న్యాయం చెయ్యమని అడిగితే నిర్బంధిస్తున్నారన్నారు. -
రైతు దారుణ హత్య
విడవలూరు (బుచ్చిరెడ్డిపాళెం): పొలాన్ని కౌలుకు ఇచ్చిన రైతు మోడెం చంద్రశేఖర్‌రెడ్డి (56)ని దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా శనివారం వెలుగుచూసింది. సీఐ కోటేశ్వరరావు కథనం మేరకు.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డికి చెందిన 13 ఎకరాల పొలాన్ని కోవూరు మండలం పాటూరు గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి కౌలుకు తీసుకున్నాడు. ప్రస్తుతం పంట చేతికి రావడంతో పంటను కోయాలని సురేష్ అనుకున్నాడు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎకరానికి 13 వేల రూపాయలను కౌలుగా చెల్లించాల్సి ఉంది. కానీ చంద్రశేఖర్‌రెడ్డి తనకు ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలని గత పది రోజుల కిత్రం డిమాండ్ చేశాడు. దీనికి కౌలు రైతు సురేష్ ఒప్పుకోలేదు. అయితే, పంట తాను కోసుకుని ధాన్యాన్ని విక్రయించి మిగిలిన డబ్బులు ఇస్తానని చంద్రశేఖర్‌రెడ్డి తెలిపాడు. దీనికి సురేష్ ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈనెల 14న ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన చంద్రశేఖర్‌రెడ్డి కనిపించకపోవడంతో అతని భార్య వసుధ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు చంద్రశేఖర్‌రెడ్డి మొబైల్ ఆధారంగా సురేష్‌తో ఫోన్లో మాట్లాడారు. దీంతో తాము దొరికిపోయామని గ్రహించి సురేష్ పోలీసులకు లొంగిపోయి జరిగిన విషయాన్ని తెలిపాడు. నిందితుడు ఈనెల 14న చంద్రశేఖర్‌ను రేబాలలోని నిర్మానుష్యమైన ప్రాంతానికి రమ్మని చెప్పి అక్కడ అతని చేత పూటుగా మద్యం తాగించాడు. తర్వాత చంద్రశేఖర్‌రెడ్డిని కొట్టి తాడుతో మెడకు ఉరివేసి చంపేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా వెంకటేశ్వరపురం వద్ద ఉన్న పెన్నానదిలో పూడ్చి వేశాడు. ఈ మేరకు నిందితుడిని తీసుకెళ్లి పూడ్చిన స్థలానికి చేరుకుని చంద్రశేఖర్‌రెడ్డి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు. ఈ హత్యలో మొత్తం 6 మంది పాల్గొన్నారని, మిగిలిన 5 మందిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. -
దొర గారికి చీమకుట్టినట్లైనా లేదా? వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిహారం అందక బాధితులు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటుంటే దొర గారికి చీమకుట్టినట్లైనా లేదని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల విమర్శించారు. ముంపు బాధితుల ప్రాణాలు తీసిన పాపం సర్కారుదేనని దుయ్యబట్టారు. పరిహారం చెల్లింపులో ఎందుకింత పరిహాసమని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనులు పూర్తి కావస్తున్నా..పరిహారం, ఇళ్లు, ప్లాట్లు ఇవ్వకుండా ఎర్రవల్లి, పల్లెపహాడ్, వేములఘాట్, ఏటిగట్టు కిష్టాపూర్ గ్రామాలకు నీళ్లు, కరెంట్ నిలిపివేయడాన్ని ఆక్షేపించారు. 70 ఏళ్ల వయసులో రైతు మల్లారెడ్డి ఆత్మహత్యకు ఒడిగట్టాడంటే ఆయన ఎంత క్షోభను అనుభవించి ఉంటాడో ఆలోచించాలన్నారు. అధికారుల నిర్లక్ష్యమే మల్లారెడ్డిని బలి తీసుకుందని ఆమె ఆరోపించారు. ఈ మేరకు షర్మిల కార్యాలయం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. -
ఏనుగు దాడిలో రైతు దుర్మరణం
గంగాధరనెల్లూరు (చిత్తూరు జిల్లా): ఏనుగు దాడిలో ఓ రైతు దుర్మరణం పాలయ్యాడు. ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలంలో జరిగిన ఈ ఘటన స్థానికులను ఆందోళనకు గురిచేసింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. బొమ్మవారిపల్లిలో బుధవారం ఓ ఏనుగు విధ్వంసం సృష్టించింది. మామిడి చెట్లు, ఫెన్సింగ్‌ను ధ్వంసం చేసింది. నాశంపల్లి ఎస్టీ కాలనీకి చెందిన కళావతిని గాయపరిచింది. అక్కడ ఉన్న ప్రజలు పెద్దగా కేకలు వేయడంతో అక్కడి నుంచి ఏనుగు వెళ్లిపోయింది. కళావతిని 108 అంబులెన్స్‌లో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఏనుగు గంగాధరనెల్లూరు వైపు వచ్చింది. పొలం పనులు చేసుకుంటున్న లక్ష్మి ఆ ఏనుగును దగ్గర్నుంచి చూడటంతో భయంతో పరుగులుదీసింది. ఈ క్రమంలో ఓ రాయిపై పడింది. తలకు తీవ్ర గాయం కావడంతో ఆమెను వేలూరు సీఎంసీకి తీసుకెళ్లారు. అనంతరం నీవా నది పక్కన పొలం పనులు చేసుకుంటున్న వేల్కూరు ఇందిరానగర్ కాలనీకి చెందిన వజ్రవేల్(48)పై ఏనుగు దాడి చేసింది. దంతాలతో పొడవడంతో రైతు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతనిని తిరుపతి రుయాకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
అకాల వర్షాలతో రైతులు లబోదిబో
(విశాఖ దక్షిణ)/పీలేరు /గంగవరం(చిత్తూరు జిల్లా)/పెదదోర్నాల/హిందూపురం: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిశాయి. చిత్తూరు జిల్లాలో పిడుగు పాటుకు ఒకరు మరణించగా, ఓ ఆవు మృతి చెందింది. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో పలుచోట్ల వడగండ్ల వాన కురిసింది. కల్లాల్లో మిర్చి తడిసిపోయింది. శ్రీకాకుళం జిల్లా రాజాం, పాలకొండ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అనంతపురం జిల్లా హిందూపురంలో గాలివాన హోరెత్తింది. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లేపాక్షి మండలంలోని కల్లూరు ఎస్సీ కాలనీలో కొబ్బరి చెట్టుపై భారీ శబ్దంతో పిడుగు పడటంతో స్థానికులు ఆందోళన చెందారు. చిత్తూరు జిల్లా పీలేరు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన రైతు పి.వెంకటరమణ (50) పిడుగుపాటుకు గురై మరణించగా.. గొర్రెలు మేపుకునేందుకు వెళ్లిన నాగరాజ, హరిబాబు, చంద్రకళ తీవ్రంగా గాయపడ్డారు. వారిని పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గంగవరం మండలం మామడుగు గ్రామానికి చెందిన త్యాగరాజులు పొలం వద్ద నుంచి పాడి పశువును ఇంటికి తోలుకొస్తుండగా పిడుగు పడింది. ఈ క్రమంలో ఆవును వదిలేసి త్యాగరాజులు పరుగులు తీశాడు. అయితే ఆవు మాత్రం అక్కడికక్కడే మృతి చెందింది. రానున్న 48 గంటల్లో మోస్తరు వర్షాలు కొమరిన్ ప్రాంతం, దాని పరిసర ప్రాంతాల మీద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, పశ్చిమ బెంగాల్లో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా రానున్న 48 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు, కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురు గాలులు 30–40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం వివరాలు.. చిత్తూరు జిల్లా ముడివేడులో 58 మి.మీ, శ్రీకాకుళం జిల్లా భామనిలో 52, అనంతపురం జిల్లా హిందూపురం ఆర్టీవో ఆఫీసు ప్రాంతంలో 50, ప్రకాశం జిల్లా బి.చెర్లపల్లిలో 45, మార్కాపురం ప్రాంతంలో 44, అనంతపురం జిల్లా హిందూపూర్ ప్రాంతంలో 44, విజయనగరంలో 41 మి.మీ వర్షపాతం నమోదైందని అధికారులు చెప్పారు. పాడేరులో రెండు సెంటీ మీటర్లు, చింతపల్లిలో సెంటీ మీటర్ వర్షపాతం నమోదైంది. -
రైతు మృతదేహాన్ని కొరికి తిన్న ఎలుకలు
చంఢీగడ్: వ్యవసాయ చట్టాల రద్దు కోసం చేస్తున్న ఉద్యమంలో పాల్గొన్న రైతు గుండెపోటుతో మరణించగా.. అతడి మృతదేహాన్ని ఎలుకలు పీక్కు తిన్నాయి. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచిన శవాన్ని ఎలుకలు కొరికి తినడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. దీనిపై కుటుంబసభ్యులతోపాటు రైతు సంఘాల నాయకులు, ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటన హరియాణా రాష్ట్రం సోనిపట్ జిల్లాలో చోటుచేసుకుంది. సోనిపట్ జిల్లాలోని బయాన్‌పూర్ గ్రామానికి చెందిన రైతు రాజేందర్ (72). దేశవ్యాప్తంగా సాగుతున్న రైతు ఉద్యమంలో పాల్గొంటున్నాడు. అయితే బుధవారం ఆయన గుండెపోటుకు గురవడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందాడు. దీంతో సానిపట్లోని ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో రాజేందర్ మృతదేహం భద్రపర్చారు. గురువారం వచ్చిచూసేసరికి మృతదేహంపై గాట్లు.. గాయాలు ఉన్నాయి. దీనిపై కుటుంబసభ్యులు ఆస్పత్రి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎలుకలు మృతదేహాన్ని కొరకడంతో గాట్లు పడ్డాయని వైద్యాధికారులు గుర్తించారు. అయితే ఆస్పత్రిలో నిర్లక్ష్యం వహించిన సంబంధిత వారిపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వైద్యాధికారులు తెలిపారు. హరియాణా బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ మండిపడింది. రైతులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రణదీదీప్ సూర్జేవాలా స్పందించారు. ఈ ఘటనపై ట్విటర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. 73 साल में ऐसा दर्दनाक मंजर शायद कभी ना देखा हो ! शहीद किसान के शव को चूहे कुतर जाएँ और भाजपा सरकारें तमाशबीन बनी रहें। शर्म से डूब क्यों नही मार गए भाजपाई !#FarmersProtests pic.twitter.com/7jE9yaNYfz — Randeep Singh Surjewala (@rssurjewala) February 19, 2021 -
ఎన్డీఏ అంటే ‘నో డాటా అవైలబుల్’
న్యూఢిల్లీ: లాక్డౌన్ సమయంలో ఎంత మంది వలస కార్మికులు మరణించారు, ఎంత మంది ఉపాధి కోల్పోయారు అనే విషయాన్ని పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ ప్రశ్నించింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి రికార్డులు మెంటయిన్ చేయలేదని, ఆ లెక్కలు తమ వద్ద లేవని లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ ఎన్డీఏ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా విమర్శలు కురిపించారు. ఎన్డీఏ అంటే ‘నో డాటా అవైలవుబుల్’ అంటూ ఎద్దేవా చేశారు. వలస కార్మికులు, రైతు ఆత్మహత్యలు, కోవిడ్ -19, ఆర్థిక వ్యవస్థపై డాటా లేదు అంటూ శశిథరూర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. (చదవండి: అవి రైతుల పాలిట మరణ శాసనాలే!) ఈ మేరకు ‘ది నేమ్ ఛేంజర్స్’ అనే కార్టూన్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు థరూర్. దీనిలో మోదీ, నిర్మలా సీతారామన్, అమిత్ షాలు ‘నో డాటా అవైలబుల్’ అనే ప్లకార్డులు పట్టుకున్నట్లు ఉన్న కార్టూన్ని ట్వీట్ చేశారు. దాంతో పాటు ‘వలస కార్మికులకు సంబంధించి నో డాటా.. రైతు ఆత్మహత్యల గురించి నో డాటా..ఆర్థిక ఉద్దీపనపై తప్పుడు డాటా, కోవిడ్ -19 మరణాలపై సందేహాస్పద డాటా, జీడీపీ వృద్ధిపై మేఘావృత డాటా. ఈ ప్రభుత్వం ఎన్డీఏ అనే పదానికి సరికొత్త అర్థాన్ని ఇస్తుంది’ అంటూ శశి థరూర్ ట్వీట్ చేశారు. (రాజ్యసభ రగడ : విపక్ష ఎంపీల సస్పెన్షన్) No #data on migrant workers, no data on farmer suicides, wrong data on fiscal stimulus, dubious data on #Covid deaths, cloudy data on GDP growth — this Government gives a whole new meaning to the term #NDA! pic.twitter.com/SDl0z4Hima — Shashi Tharoor (@ShashiTharoor) September 22, 2020 వ్యవసాయ రంగంలో సంభవించే ఆత్మహత్యలు, అందుకు గల కారణాలకు సంబంధించి కేంద్రం దగ్గర ఎలాంటి డాటా లేదంటూ ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో శశి థరూర్ ఈ ట్వీట్ చేశారు. అంతేకాక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సోమవారం మాట్లాడుతూ.. ‘నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ప్రకారం పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రైతు ఆత్మహత్యలకు సంబంధించి ఎలాంటి డాటా లేదని నివేదించాయని తెలిపారు. ఈ పరిమితి కారణంగా, వ్యవసాయ రంగంలో ఆత్మహత్యకు గల కారణాలపై జాతీయ సమాచారం ఆమోదించడం కానీ విడిగా ప్రచురించడం కానీ జరగలేదు’ అని ఆయన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి విధించిన దేశవ్యాప్త లాక్డౌన్ సమయంలో మరణించిన వలసదారుల సంఖ్యపై తమ దగ్గర ఎలాటి డాటా లేదని గతంలో పార్లమెంటులో ప్రభుత్వం అంగీకరించిన సంగతి తెలిసిందే. -
నారా వారి పాలనలో నేలరాలిన కర్షకులెందరో!
సాక్షి, అమరావతి: ఒకవైపు ప్రకృతి ప్రకోపం.. మరోవైపు గత సర్కారు నిర్లక్ష్యం వెరసి ఆంధ్రప్రదేశ్‌లో గడచిన ఐదేళ్లలో వ్యవసాయ రంగంలో బలవన్మరణాలు పెరిగాయి. ఇందుకు సంబంధించి తాజాగా విడుదలైన ఎన్సీఆర్బీ–2018 నివేదికలోనూ ఏపీ నాలుగో స్థానంలో కొనసాగింది. 2014లో రైతు ఆత్మహత్యల్లో ఏపీ 7వ స్థానంలో ఉండగా.. 2015లో 6వ స్థానానికి చేరింది. 2016లో అన్నదాతల ఆత్మహత్యలు భారీగా పెరగ్గా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు వెల్లువెత్తడంతో అప్పటి ప్రభుత్వం ఎన్సీఆర్బీకి లెక్కలు తగ్గించి పంపించిందన్న విమర్శలున్నాయి. అయినప్పటికీ దేశ వ్యాప్తంగా రైతు ఆత్మహత్యలు తగ్గుముఖం పడితే, ఆ ఏడాదీ ఏపీ 4వ స్థానానికి చేరడం గమనార్హం. ఆ తరువాత 2017, 2018 ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం మన రాష్ట్రం 4వ స్థానంలోనే కొనసాగింది. ఇలా చంద్రబాబు పాలనలో 7, 6 స్థానాల నుంచి నాలుగో స్థానానికి దిగజారి రైతుల ఆత్మహత్యల్లో హ్యాట్రిక్ సాధించినట్లైంది. ఐదేళ్లలో 3,832 మంది.. ఎన్సీఆర్బీ నివేదికల ప్రకారం 2014 నుంచి 2018 వరకు రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో 3,832 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. వీరిలో సొంత భూమి గల రైతులు 1,043 మంది, కౌలు రైతులు 612 మంది, కూలీలు 2,177 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పెరిగాయి అన్నదాతల ఆత్మహత్యలను నిలువరించడంలో గడచిన ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా గట్టి ప్రయత్నాలే జరిగాయి. తద్వారా పలు రాష్ట్రాలు మంచి ఫలితాలు సాధించాయి. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం చివరి మూడేళ్లూ ఆత్మహత్యలు పెరిగాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ వంటి రాష్ట్రాలు వివిధ కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా వ్యవసాయ రంగంలో మరణాలను నిరోధించగలిగాయి. 2014లో 4వ స్థానంలో ఉన్న కేరళ రైతులను ఆదుకుని బలవన్మరణాలను నివారించడంలో మంచి ఫలితాలు సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల సంక్షేమాన్ని పట్టించుకోకపోవడంతో మరణాలు మరింత పెరిగాయనే విమర్శలున్నాయి. -
వలస బతుకుల్లో ఆశల మోసులు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఈ ఏడాది అనంతపురం జిల్లా వ్యవసాయ ముఖచిత్రం అనూహ్యంగా మారిపోయింది. కొన్నేళ్లుగా కరువుతో అల్లాడిన జిల్లా రైతుల ముఖాల్లో ఇప్పుడు ‘వర్షా’తిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వలస బాట పట్టిన రైతులు, రైతు కూలీలు సొంతూళ్లకు తరలివస్తూ పొలం బాట పడుతున్నారు. జిల్లా నుంచి ఏటా సుమారు 4 లక్షల మంది పనుల కోసం వలస వెళ్తుంటారు. వర్షపు చినుకు మీద ఆశతో పంట వేసిన రైతు.. అది పండకపోతే ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. జిల్లాలో గత ఐదేళ్లలో ఏకంగా 300 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ ఏడాది జిల్లాలో అద్భుతం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలతో కుంటలు, చెరువులు నిండిపోయాయి. గత ఆగస్టులో భూగర్భ నీటి మట్టం 27.75 మీటర్ల లోతున ఉండగా... ప్రసుత్తం 19.72 మీటర్లకు చేరింది. బోర్లు రీచార్జ్ అయ్యాయి. జిల్లాలో 70 వేల బోర్లు రీచార్జ్ కాగా, భూగర్భంలో 56 టీఎంసీల నీరు ఇంకిందని లెక్కలు చెబుతున్నాయి. హంద్రీ–నీవా ద్వారా చెరువులకు నీరు విడుదల చేయడంతో అదనంగా 50 వేల ఎకరాలు, హెచ్చెల్సీ కింద అదనంగా 20 వేల ఎకరాలు సాగులోకి వచ్చింది. దీంతో ఇప్పటికే సగం మంది వలస రైతులు సొంత గ్రామాలకు తిరిగొచ్చి పంటలు సాగు చేసుకుంటున్నారు. వీటన్నింటికీ తోడు వైఎస్సార్ రైతు భరోసా కింద జిల్లాలో 7,12,625 మంది అన్నదాతలకు లబ్ధి కలిగింది. అమ్మఒడి, నేతన్న నేస్తం, తదితర ప్రభుత్వ పథకాలు ఆయా వర్గాల వారికి భరోసా కల్పించడంతో ఎక్కడెక్కడికో వలస వెళ్లిన వారు తిరిగి వస్తున్నారు. పెరిగిన సాగు.. చేతినిండా పని జిల్లాలో మొత్తం 63 మండలాలకు గాను ఈ ఏడాది 21 మండలాల్లో 20 శాతం అధిక వర్షపాతం నమోదైంది. 32 మండలాల్లో సాధారణ వర్షాలు కురిశాయి. 10 మండలాల్లో మాత్రమే తక్కువ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షపాతం 483.8 మిల్లీమీటర్లు కాగా, ఈ ఏడాది నవంబర్ 8 నాటికే 492.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జూన్, జూలైలో వర్షాలు లేక వేరుశనగ సాగు కొంత తగ్గింది. పత్తి, ఉలవలు, జొన్న, ఆముదం సాగు బాగా పెరిగింది. రబీలో కూడా సాగు విస్తీర్ణం పెరగనుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రబీలో 1,14,193 హెక్టార్లు సాధారణ సాగు విస్తీర్ణం కాగా>, లక్షా 20 వేల హెక్టార్ల వరకూ సాగు కావచ్చని భావిస్తున్నారు. దీంతో వ్యవసాయ పరంగా కూలీలకు పనులు బాగా దొరుకుతున్నాయి. ఈ రైతు పేరు కృష్ణమూర్తి. అనంతపురం జిల్లా రొళ్ల మండలం హెచ్‌టీ హళ్లి గ్రామం. తనకున్న 2.75 ఎకరాల కోసం బోరు బావి తవ్వించాడు. వర్షాభావంతో ఎండిపోయింది. బోరుపై రూ.2 లక్షల వరకు పెట్టి నష్టపోయాడు. కుటుంబాన్ని పోషించుకునేందుకు భార్యా పిల్లలతో 2017లో బెంగళూరుకు వలసపోయాడు. అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు. ఈ ఏడాది భారీ వర్షాలతో జిల్లాలో భూగర్భ జలమట్టం పెరగడంతో కృష్ణమూర్తి బోరు నుంచి నీళ్లు పుష్కలంగా వస్తున్నాయి. దీంతో గత నెలలో స్వగ్రామానికి వచ్చి వ్యవసాయ పనులు ప్రారంభించాడు. రైతు వెంకటేశులది గుమ్మఘట్ట మండలంలోని రంగచేడు. రెండు నెలల క్రితం వరకూ బెంగళూరు, మైసూర్, చిక్‌మగులూరు ప్రాంతాల్లో కూలి పనులు చేసేవాడు. ఇప్పుడు గ్రామంలో సమృద్ధిగా వర్షాలు పడడంతో తనకున్న 5 ఎకరాల పొలంలో వరి, పత్తి సాగు చేశాడు. మొన్నటి వరకు కూలీగా పనిచేసిన తను.. ఇప్పుడు ఇంకొకరికి కూలి పని ఇస్తున్నానని ఆనందంగా చెబుతున్నాడు. ప్రభుత్వ భరోసా పెరిగింది.. ఈ ఏడాది వర్షాలు బాగా పడ్డాయి. దీంతో బెంగళూరు నుంచి మా ఊరికి వచ్చేశాము. 2 ఎకరాల్లో పంటలను సాగు చేశా. 4 పాడి గేదెలను పెట్టుకున్నా. ప్రభుత్వం ఆదుకుంటుందన్న భరోసా పెరిగింది. – శివన్న, కాకి గ్రామం, రొళ్ల మండలం వలస వెళ్లిన వారు తిరిగొస్తున్నారు జిల్లాలో వర్షాలు బాగా కురవడంతో పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు తిరిగొస్తున్నారు. హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్ని 6 వేల క్యూసెక్కులకు పెంచడం, సమాంతర కాలువను 4 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించేందుకు సీఎం అంగీకరించారు. ఇది జరిగితే జిల్లాలో వలస అనే మాటే వినపడదు. – సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ రైతులు సంతోషంగా ఉన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడటంతో బోర్లు రీచార్జ్ అయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసా మొత్తం రైతులకు మరింత ధైర్యాన్నిచ్చింది. సాగు విస్తీర్ణం పెరిగింది. చిరుధాన్యాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. – హబీబ్ బాషా, వ్యవసాయశాఖ జేడీ -
మృతిచెందిన యజమాని కోసం.. కుక్క పడిగాపులు