సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రతీ ముగ్గురు వ్యవసాయదారుల్లో ఒకరు కౌలురైతు ఉన్నారని రైతు స్వరాజ్య వేదిక సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలో కౌలురైతుల స్థితిగతులపై ఆ వేదిక ఆధ్వర్యంలో అధ్యయనం జరిపారు. 20 జిల్లాల్లో 34 గ్రామాల్లో మొత్తం 7,744 మంది రైతులను సర్వే చేయగా, వారిలో 2,753 మంది (35.6 శాతం) కౌలురైతులు ఉన్నట్లు తేలింది. సర్వే చేసిన మొత్తం 2,753 కౌలురైతుల్లో 523 మంది ఏమాత్రం భూమి లేనివారే. వీరు 19 శాతం మంది ఉన్నారు. 81 శాతం మంది ఎంతోకొంత సొంత భూమి ఉండి, అది జీవనోపాధికి సరిపోక అదనంగా మరి కొంతభూమిని కౌలుకు తీసుకున్నారు.
కౌలురైతుల సగటు సొంతభూమి 2.3 ఎకరాలు కాగా, సగటున కౌలుకు తీసుకున్న భూమి విస్తీర్ణం 5.1 ఎకరాలు. 31 శాతం మంది కౌలు రైతులు 5 ఎకరాల కంటే ఎక్కువ భూమిని కౌలుకు తీసుకున్నారు. కౌలు రైతుల్లో 60.9 శాతం మంది బీసీలున్నారు. ఎస్సీలు 22.9 శాతం, ఎస్టీలు 9.7 శాతం మంది ఉన్నారు. ఓసీలు 4.2 శాతం, ముస్లిం మైనారిటీలు 2.4 శాతం మంది ఉన్నారు. భూమిని కౌలుకు ఇస్తున్న యజమానుల్లో 49 శాతం మంది బీసీలు కాగా, 33 శాతం మంది ఓసీలు, 10 శాతం మంది ఎస్సీలు, మిగిలిన 7 శాతం మంది ఎస్టీలు, మైనారిటీలు.
సర్వేలో ముఖ్యాంశాలు...
► భూయజమానుల్లో 26 శాతం మంది మాత్రమే స్వయంగా వ్యవసాయం చేస్తున్నారు. 55 శాతం మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు, వ్యాపారం, కాంట్రాక్టులు, ఇతర వృత్తుల్లో ఉన్నవారే. మిగిలినవారు ఇతర వృత్తి లేనివారు లేదా వృద్ధులు.
► 25 శాతం భూ యజమానులు నగరాల్లో ఉండగా, ఒక శాతం విదేశాల్లో ఉంటున్నారు. నగరాలు, విదేశాలలో ఉన్నవారిలో సగం మంది ఆ గ్రామాలతో కానీ, వ్యవసాయంతోకానీ ఎటువంటి సంబంధం లేనివారే. కేవలం పెట్టుబడి కోసం వీరు భూములను కొని కౌలుకు ఇస్తున్నారు.
► కౌలు రైతుల్లో 9.5 శాతం మహిళలున్నారు. మహిళా కౌలురైతులలో 22.7 శాతం భూమి లేని వారే.
► 73 శాతం కౌలు రైతులు ఒకే భూమిలో కనీసం మూడేళ్లు లేదా అంతకుపైగా సాగు చేస్తున్నారు. 39 శాతం మంది 5 ఏళ్లకుపైగా, 18 శాతం మంది 10 ఏళ్లకుపైగా ఒకే భూమిలో కౌలు సాగుచేస్తున్నారు.
► 91.1 శాతం కౌలు రైతులు కౌలు మొత్తాన్ని నగదురూపంలో, 7.5 శాతం మాత్రమే పంట రూపంలో చెల్లిస్తున్నారు. చాలా కొద్దిమంది మాత్రమే పంట భాగస్వామ్యం పద్ధతిలో కౌలు ఇస్తున్నారు. నగదురూపంలో కౌలు చెల్లించేవారిలో 38.3 శాతం మంది సీజన్ ముందే పూర్తిగా చెల్లిస్తున్నారు. 20.5 శాతం మంది కౌలు ధరలో సగం ముందుగా చెల్లించి సగం చివరిలో చెల్లిస్తున్నారు. 41 శాతం మంది పంటకోతల తర్వాత చెల్లిస్తున్నారు.
► కౌలురైతుల్లో 69 శాతం వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. హమాలీ/భవన నిర్మాణ కార్మికులుగా 13 శాతం మంది, పశుపోషణపై 9.6 శాతం మంది, మేకలు, గొర్రెల పెంపకంపై 3 శాతం మంది ఆధారపడ్డారు. ఇతరులు బీడీ కారి్మకులుగా, ట్రాక్టర్ డ్రైవర్లుగా, ఆటోడ్రైవర్లుగా, చిన్నవ్యాపారులుగా అదనపు ఆదాయం సంపాదిస్తున్నారు.
► రాష్ట్రవ్యాప్తంగా ప్రతికౌలు రైతు కుటుంబానికి సగటు రుణం రూ.2.7 లక్షల వరకు ఉంది. దానిలో రూ. 2 లక్షలు ప్రైవేట్ రుణాలే. కౌలుభూమి మీద పంటసాగు కోసం బ్యాంకు రుణాలు అందడంలేదు. వాళ్లకు ఉన్న
► మొత్తం రుణాల్లో 25 శాతం మాత్రమే బ్యాంక్ రుణాలు ఉన్నాయి. ప్రైవేట్ అప్పులపై వడ్డీ 24 శాతం నుంచి 60 శాతం వరకు ఉంది.
ఇదీ చదవండి: చక్కని సాగుకు.. చిన్న డ్రోన్లు
Comments
Please login to add a commentAdd a comment