Rythu swarajya Vedika
-
Sakshi Special: మొక్కవోని మట్టిబిడ్డలు
మట్టి ఎవరికీ అపకారం చేయదు. నాగలితో దున్నినప్పుడల్లా రైతుకు పంట ఇవ్వాలనే అనుకుంటుంది. కాని ఒక్కోసారి రుతువులు మోసం చేస్తాయి. మరోసారి మార్కెట్ మోసం చేస్తుంది. ఇంకోసారి అకాల వర్షం. అప్పుడు ఏమవుతుంది?ప్రతిరోజూ పొలానికి వెళ్లి తిరిగొచ్చే నాన్న ఆ రోజు రాడు. ‘నా పంటను ఎందుకు నాకు దక్కకుండా చేశావ్’ అని దేవుడితో పోట్లాడటానికి వెళ్లిపోతాడు. అప్పుడు అమ్మ ఉంటుంది. ధైర్యం నింపుకో అని చెప్పే మట్టి ఉంటుంది. ఆ పిల్లలు నిలబడతారు. నిలబడాలి. అందరూ తోడైతే వారి ముఖాలలో ఇంద్రధనువులు సాధ్యమే. ఆత్మహత్యలు చేసుకుని మరణించిన రైతుల పిల్లలను రానున్న ‘బాలల దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేకంగా కలిసింది సాక్షి. ఇక సందడి మొదలైంది.‘మీరు ఫ్రెండ్స్‌తో కలిసి నిద్రపోతారా?’‘సెలవుల్లో పొలానికి వెళ్లి వ్యవసాయం చేస్తారా?’‘నైట్‌టైమ్ స్కై అంతా క్లియర్‌గా ఉండి స్టార్స్ కనపడతాయా?‘మీకు లోన్లీగా అనిపించినప్పుడు ఏం చేస్తారు’‘విలేజస్‌లో ఏమేమి ఇంటెరెస్టింగ్‌గా ఉంటాయి’...సినిమాల్లో అందరూ మెచ్చేలా నటించిన లిటిల్ స్టార్స్ జీవితంలో సవాళ్లతో పోరాడుతున్న రియల్స్టార్స్ను ‘సాక్షి’, ‘రైతు స్వరాజ్యవేదిక’ ఉమ్మడి ప్రయత్నం వల్ల కలిశారు. ‘బాలల దినోత్సవం’ సందర్భంగా హైదరాబాద్‌లోని తార్నాకలో రానున్న ప్రత్యేకంగా జరిగిన కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, మెదక్ జిల్లాలకు చెందిన ఐదు రైతు కుటుంబాలకు చెందిన 11 మంది పిల్లలు ముగ్గురు లిటిల్ స్టార్స్‌ను కలిశారు. ‘వాల్తేరు వీరయ్య’లో నటించిన శ్రేష్ట, ‘కేజీఎఫ్’లో నటించిన భాను ప్రకాశ్, స్పైడర్, స్వాగ్ వంటి మూవీస్‌లో చేసిన హనీషాలు ఈ చిన్నారులతో కలిసి కబుర్లు చెప్పారు. ఆ పిల్లలు ఈ పిల్లలు పరస్పరం మాట్లాడుకున్నారు. లిటిల్ స్టార్స్ తమ సినిమాల్లో తాము చెప్పిన డైలాగులు చెప్పారు. డాన్సులు చేశారు. షూటింగ్‌కు తీసుకెళతామన్నారు. అలా ఆ పిల్లల మనసు తేలిక చేశారు. కారణం? వారి నాన్నలు వారితో లేరు. వారి నాన్నలంతా రైతులు. వ్యవసాయంలో వచ్చిన కష్టాలు ఆ నాన్నలను హటాత్తుగా లేకుండా చేశాయి. ఆ క్షణం నుంచి ఆ పిల్లలకు ఆమ్మే నాన్నయినా అమ్మయినా. అయితే పిల్లలు కూడా ధైర్యం తెచ్చుకున్నారు. ఇలాంటి పిల్లలకు సాయం అందించడానికి ‘రైతు స్వరాజ్యవేదిక’ అనే సంస్థ పని చేస్తోంది. ఆ సంస్థ, సాక్షి కలిసి ఈ పిల్లల సందడిని ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా ఆ రైతుబిడ్డలు ఏమన్నారు?జీవితం అంటే ఏమిటో తెలిసిందిరైతు బిడ్డలను చూసిన స్టార్ సెలబ్రిటీలు ఎంతో ఉద్వేగానికి గురయ్యారు. వారి పట్ల స్నేహహస్తం సాచారు. వారి స్పందన తెలియచేశారు. ‘చిన్న చిన్న కష్టాలకే ఎంతో బాధ పడతాం, కానీ వీరి జీవితకాలవేదన చూశాక మేమెంత మంచి జీవితంలో ఉన్నామో తెలుస్తుంది. ఈ ఒక్కరోజు నాకు జీవితాన్ని పరిచయం చేసింది. భవిష్యత్‌లో కూడా వీరి సమస్యలపై దృష్టి సారిస్తాను. సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని నిర్ణయించుకున్నాను’ అని భాను ప్రకాశ్ అంటే ‘నాన్న లేకుంటే జీవితం ఎంత చీకటి మయమో తెలిసింది. నాలాంటి పిల్లలే వారు. కానీ నాకున్న సౌకర్యాల్లో ఒక్కశాతం కూడా వారికి లేవు. వారితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండిపోవాలనుంది’ అన్నది హనీషా రెస్పాన్స్. ‘నా కన్నా పెద్దగా ఉన్న ఆ అక్కలు, అన్నలు ఏడుస్తుంటే నాకు చాలా బాధేసింది. వారి కోసం నేను డ్యాన్స్ చేశాను. ‘నా సినిమా షూటింగ్‌లకు తీసుకెళతానని చెప్పాను. వారి ఊరికి కూడా వెళతాను తొందరలో’ అంది శ్రేష్ట.వారి కాళ్ల మీద వాళ్లే నిలబడాలి‘మాది కౌలు వ్యవసాయం., పంట పండకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయాం. అవి కట్టలేక అదే పత్తి చేనులో పత్తి మందు తాగి చనిపోయడు నా భర్త. అప్పటి నుంచి మా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నా కూలీ, ఈ ఆవు పాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్నాను’ అని దేవరకొండకు చెందిన సరోజ చెప్తే, ‘గుంట భూమి లేదు. 8 లక్షల అప్పు మిగిలింది. అప్పులోళ్ల్ల బాధ భరించలేక ఆయన తనువు చాలించాడు. ఇద్దరూ పాపలే.. వారి కాళ్ల మీద వారు నిలబడి బతకగలగాలనే లక్ష్యంతో చదివిస్తున్నాను’ అని మరో తల్లి అంది. ‘మాది కౌలు వ్యవసాయం. మిర్చి పంటలో వచ్చిన నష్టాలకు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు నా కొడుక్కు 2 నెలలు. ఎన్ని ఆఫీసులు తిరిగినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయమూ అందలేదు. వ్యవసాయం పై మక్కువ ఉన్నా నా బిడ్డను మాత్రం రైతుగా మారనివ్వను’ జయశంకర్ భూపాల పల్లి జిల్లాకు చెందిన మానస అన్నారు.‘ఒక్కసారన్నా లాభం రాకపోతుందా అని ఎనిమిదేళ్లు కౌలు చేశాం. ఒక్కసారి మిర్చి పంట పండినా ధర లేదు. దాంతో నా భర్త 2019 ఆత్మహాత్య చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు. ఇల్లు కూడా లేక నాన్న వాళ్లింట్లో ఉంటున్నాను’ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన సుమలత అంటే ‘7,8 ఏళ్లు కౌలు చేశాం. రేటు ఉన్నప్పుడు పంట పండలేదు, పండినప్పుడు «దర లేదు. రెండూ ఉంటే వర్షాలు లేవు. ఆయన ఆత్మహాత్య చేసుకున్నప్పుడు నా గుండె కూడా ఆగినంత పనైంది. కానీ రెండేళ్ల బాబు, నాలుగేళ్ల పాప. వారి కోసం బతికి ఉన్నాను’.యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మమత అన్నారు.చదువుకుని ఎంతో ఎదుగుతున్నారు‘రైతు స్వరాజ్య వేదిక’ రైతుల సంక్షేమం కోసం 2011లో ఏర్పడింది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు అత్యంత సంక్షోభంలో ఉన్నాయని మా అధ్యయనంలో తెలుసుకుని వారి కుటుంబాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం. తెలంగాణ వచ్చాక ఈ పదేళ్లలో 7600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో 80 శాతం కౌలు రైతులే. కౌలు రేట్లు పెరగడం, ప్రభుత్వ సహకారం పట్టాదారులకే ఉండటం వంటి కారణాలతో ఈ ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఈ 7600 మందిలో 1600 మందిని మాత్రమే ప్రభుత్వం గుర్తించింది. మిగతా వారివి రైతు ఆత్మహత్య కాదంటారు. దీనికి కౌలు డాక్యుమెంట్లు, అప్పుల కాగితాలు అడుగుతారు. ఇది భార్యభర్తల గొడవ, బిడ్డ పెళ్లి ఖర్చువల్లే, కొడుకు చదువు, ఇల్లు కట్టుకున్నారు.. ఇలాంటి కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నారంటూ వ్యవసాయ సంబంధ అంశాన్ని దూరం చేస్తున్నారు. కానీ వారి ఆదాయ వనరు మాత్రం వ్యవసాయం అని పరిగణించట్లేదు. వివిధ సంస్థల సహకారంతో ఈ కుటుంబాలకు ఉపాధి కోసం బర్రెలు, మేకలు కొనిస్తున్నాం. పిండి గిర్నీ, షాప్‌లు పెట్టిస్తున్నాం. పిల్లల చదువులకూ సహకారం అందిస్తున్నాం. ఇలా సహకారం అందుకుని ఇంజనీర్లుగా, సాఫ్ట్వేర్లుగా, ఉత్తమ క్రీడా కారులుగా ఎదిగిన రైతు బిడ్డలు ఉన్నారు.– కొండల్ రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కన్వీనర్లాయర్ అవుతాను8వ తరగతి చదువుతున్నాను. అందరూ వారి నాన్నలతో హాయిగా ఆడుకుంటుంటే నేను మాత్రం హాస్టల్లో ఆహారం, నీరు పడక ఎలర్జీలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. మా నాన్న ఉంటే నన్ను కూడా మంచి ప్రైవేటు స్కూల్లో చదివించేవారు అని బాధగా ఉంటుంది. అయినప్పటికీ అమ్మ కష్టాలను దూరం చేయడానికి లాయర్ అవ్వాలనే ఆశయంతో ఉన్నాను. సినిమాల్లో చూసే సెలబ్రిటీలతో ఆడుకోవడం చాలా ఆనందంగా ఉంది. – మింటూఅమ్మను బాగా చూసుకుంటానాన్న మరణం నన్నెంతగానో కుంగదీసింది. కానీ ఆ ఆవేదనను చదువులపై చూపించలేదు. బాగా చదువుకుంటున్నాను. అమ్మను బాగా చూసుకోవాలి అనేది నా కోరిక. నాన్న ఉండగా ఎప్పుడూ పనికెళ్లని అమ్మ నా కోసం కూలి పనికి వెళుతోంది. పైగా తనకు కిడ్నీ ఆపరేషన్ అయ్యింది. మా కష్టాలను తట్టుకునే శక్తి మాకుంది. మీరంతా మాతో ఉన్నారనే భరోసా ఇస్తే చాలు. – తేజస్వినిమేమే తయారవుతాంఉదయాన్నే నాన్న గుర్తుకొస్తాడు. అందరు నాన్నలు వారి పిల్లల్ని స్కూలుకు తీసుకెళుతుంటే చూసి. అమ్మ పొలం పనికి తొందరగా వెళ్లాలని మేమే త్వరగా తయారయ్యి మా స్కూల్‌కు వెళతాం. నాన్నలా కావొద్దని బాగా సంపాదించాలని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను. నాన్న చేసిన అప్పుల కష్టాల్లో అమ్మ ఉంది. అందుకే ఎలాంటి అతి ఖర్చులు చేయం. పెద్దయ్యాక అమ్మను బాగా చూసుకోవాలి. – చింటూ అమ్మ కోసం నవ్వుతాహాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. డాక్టర్ అవ్వాలి, నాన్న చేసిన అప్పులు తీర్చి అమ్మకు భారం తగ్గించాలి. మా హాస్టల్లో ఫ్రెండ్స్ దగ్గరికి అమ్మానాన్నలు వస్తే.. మా దగ్గరికి అమ్మ మాత్రమే వస్తుంది. అప్పుడు ఏడుపొస్తుంది. కాని అమ్మ బాధపడుతుందని నవ్వుతా. – అక్షిత– హనుమాద్రి శ్రీకాంత్– డి.జి. భవానిఫొటోలు: పి. మోహనాచారి -
ప్రతి ముగ్గురు రైతుల్లో.. ఒకరు కౌలుదారే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రతీ ముగ్గురు వ్యవసాయదారుల్లో ఒకరు కౌలురైతు ఉన్నారని రైతు స్వరాజ్య వేదిక సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలో కౌలురైతుల స్థితిగతులపై ఆ వేదిక ఆధ్వర్యంలో అధ్యయనం జరిపారు. 20 జిల్లాల్లో 34 గ్రామాల్లో మొత్తం 7,744 మంది రైతులను సర్వే చేయగా, వారిలో 2,753 మంది (35.6 శాతం) కౌలురైతులు ఉన్నట్లు తేలింది. సర్వే చేసిన మొత్తం 2,753 కౌలురైతుల్లో 523 మంది ఏమాత్రం భూమి లేనివారే. వీరు 19 శాతం మంది ఉన్నారు. 81 శాతం మంది ఎంతోకొంత సొంత భూమి ఉండి, అది జీవనోపాధికి సరిపోక అదనంగా మరి కొంతభూమిని కౌలుకు తీసుకున్నారు. కౌలురైతుల సగటు సొంతభూమి 2.3 ఎకరాలు కాగా, సగటున కౌలుకు తీసుకున్న భూమి విస్తీర్ణం 5.1 ఎకరాలు. 31 శాతం మంది కౌలు రైతులు 5 ఎకరాల కంటే ఎక్కువ భూమిని కౌలుకు తీసుకున్నారు. కౌలు రైతుల్లో 60.9 శాతం మంది బీసీలున్నారు. ఎస్సీలు 22.9 శాతం, ఎస్టీలు 9.7 శాతం మంది ఉన్నారు. ఓసీలు 4.2 శాతం, ముస్లిం మైనారిటీలు 2.4 శాతం మంది ఉన్నారు. భూమిని కౌలుకు ఇస్తున్న యజమానుల్లో 49 శాతం మంది బీసీలు కాగా, 33 శాతం మంది ఓసీలు, 10 శాతం మంది ఎస్సీలు, మిగిలిన 7 శాతం మంది ఎస్టీలు, మైనారిటీలు. సర్వేలో ముఖ్యాంశాలు... ► భూయజమానుల్లో 26 శాతం మంది మాత్రమే స్వయంగా వ్యవసాయం చేస్తున్నారు. 55 శాతం మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు, వ్యాపారం, కాంట్రాక్టులు, ఇతర వృత్తుల్లో ఉన్నవారే. మిగిలినవారు ఇతర వృత్తి లేనివారు లేదా వృద్ధులు. ► 25 శాతం భూ యజమానులు నగరాల్లో ఉండగా, ఒక శాతం విదేశాల్లో ఉంటున్నారు. నగరాలు, విదేశాలలో ఉన్నవారిలో సగం మంది ఆ గ్రామాలతో కానీ, వ్యవసాయంతోకానీ ఎటువంటి సంబంధం లేనివారే. కేవలం పెట్టుబడి కోసం వీరు భూములను కొని కౌలుకు ఇస్తున్నారు. ► కౌలు రైతుల్లో 9.5 శాతం మహిళలున్నారు. మహిళా కౌలురైతులలో 22.7 శాతం భూమి లేని వారే. ► 73 శాతం కౌలు రైతులు ఒకే భూమిలో కనీసం మూడేళ్లు లేదా అంతకుపైగా సాగు చేస్తున్నారు. 39 శాతం మంది 5 ఏళ్లకుపైగా, 18 శాతం మంది 10 ఏళ్లకుపైగా ఒకే భూమిలో కౌలు సాగుచేస్తున్నారు. ► 91.1 శాతం కౌలు రైతులు కౌలు మొత్తాన్ని నగదురూపంలో, 7.5 శాతం మాత్రమే పంట రూపంలో చెల్లిస్తున్నారు. చాలా కొద్దిమంది మాత్రమే పంట భాగస్వామ్యం పద్ధతిలో కౌలు ఇస్తున్నారు. నగదురూపంలో కౌలు చెల్లించేవారిలో 38.3 శాతం మంది సీజన్ ముందే పూర్తిగా చెల్లిస్తున్నారు. 20.5 శాతం మంది కౌలు ధరలో సగం ముందుగా చెల్లించి సగం చివరిలో చెల్లిస్తున్నారు. 41 శాతం మంది పంటకోతల తర్వాత చెల్లిస్తున్నారు. ► కౌలురైతుల్లో 69 శాతం వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. హమాలీ/భవన నిర్మాణ కార్మికులుగా 13 శాతం మంది, పశుపోషణపై 9.6 శాతం మంది, మేకలు, గొర్రెల పెంపకంపై 3 శాతం మంది ఆధారపడ్డారు. ఇతరులు బీడీ కారి్మకులుగా, ట్రాక్టర్ డ్రైవర్లుగా, ఆటోడ్రైవర్లుగా, చిన్నవ్యాపారులుగా అదనపు ఆదాయం సంపాదిస్తున్నారు. ► రాష్ట్రవ్యాప్తంగా ప్రతికౌలు రైతు కుటుంబానికి సగటు రుణం రూ.2.7 లక్షల వరకు ఉంది. దానిలో రూ. 2 లక్షలు ప్రైవేట్ రుణాలే. కౌలుభూమి మీద పంటసాగు కోసం బ్యాంకు రుణాలు అందడంలేదు. వాళ్లకు ఉన్న ► మొత్తం రుణాల్లో 25 శాతం మాత్రమే బ్యాంక్ రుణాలు ఉన్నాయి. ప్రైవేట్ అప్పులపై వడ్డీ 24 శాతం నుంచి 60 శాతం వరకు ఉంది. ఇదీ చదవండి: చక్కని సాగుకు.. చిన్న డ్రోన్లు -
మహిళా రైతుల కుటుంబాలను ఆదుకోరా?
ఆత్మహత్య చేసుకున్న మహిళా రైతుల కుటుంబాల పరిస్థితి దారుణంగా ఉంది. మాడ సాగరిక, పాకాల మల్లవ్వ, కొరకండ్ల లక్ష్మి, గొంగళ్ల విజయ, రేగుల ఊర్మిళ.. ఈ మహిళలందరూ వ్యవసాయాన్ని ముందుండి నడిపిస్తూ అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న మహిళా రైతుల్లో కొందరు మాత్రమే. మహిళా రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం గత రెండేళ్ల నుంచి మొదటి స్థానంలో ఉంది (ఎన్.సి.ఆర్.బి. గణాంకాలు). 2015లో తెలంగాణలో 153 మంది మహిళా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామానికి చెందిన పాకాల మల్లవ్వ చేయి మంచిదని తోటి రైతుల నమ్మకం. ఆమె చేతితో తమ పొలాల్లో విత్తనాలు వేయించుకునేవారు. కానీ, కౌలు రైతు అయిన మల్లవ్వ వరుసగా నాలుగేళ్లు నష్టాలపాలై 2015 డిసెంబర్ 12న ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామానికి చెందిన మాడ సాగరిక ఆత్మహత్య చేసుకున్నప్పుడు పత్రికల్లో ప్రముఖంగా వార్త ప్రచురితం కావడంతో చర్చనీయాంశమైంది. అయినా ఈ కుటుంబాలకు ఇప్పటి వరకూ ఎక్స్‌గ్రేషియా అందలేదు. మహిళా రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఇకనైనా ఆర్థికంగా ఆదుకోవాలి. – బి. కొండల్‌రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక -
కౌలు రైతులను గుర్తించరా?
సందర్భం ఈ రోజు వ్యవసాయం నడుస్తున్నదంటే అది కౌలు రైతుల పుణ్యమే. కానీ వీరికి ఎలాంటి సాయం అందడం లేదు. వచ్చే సంవత్సరం ఇచ్చే ఎకరాకు రూ. 4,000 సాయం మాత్రం కౌలు రైతులకు అందేటట్లు చూడటం మన బాధ్యత. తెలంగాణలో ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ రైతుల మధ్య ఒకటే చర్చ. ఎవరు నిజమైన రైతు? పట్టాదారు పాస్‌బుక్ కలిగి వ్యవసాయం చేయనివారా? భూమి కౌలుకు తీసుకుని కష్ట, నష్టాలకు ఓర్చుకుని వ్యవసాయం చేసేవారా? సాధారణంగా భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసే వ్యక్తినే నిజమైన రైతుగా గుర్తిస్తారు. కానీ ముఖ్యమంత్రి ప్రకటన, అధికారులు వ్యవహరిస్తున్న తీరు కౌలు రైతులను రైతులుగా గుర్తించే అవకాశం ఇవ్వడం లేదు. ‘ఎవరికి భూమి ఉంటే వారే రైతు. వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఎకరాకు రూ.4,000 వేస్తాం. రెండు పంటలు వేస్తే రూ. 8,000 వేస్తాం’ ఉచిత ఎరువుల పథకాన్ని ప్రకటిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన ఇది. ఈ ప్రకటన కౌలు రైతుల గుండెల్లో గుబులు రేపుతోంది. రుణమాఫీ ప్రయోజనాన్ని భూమి యజమానులకే కట్టబెట్టారని, ఇప్పుడు సబ్సిడీ ఎరువులకు ఇచ్చే ప్రోత్సాహకాన్నీ వారి ఖాతాల్లోనే వేస్తున్నారని, నిజంగా భూమిని సాగు చేసి, అప్పుల పాలవుతున్న, అన్ని కష్టాలనూ ఎదుర్కొంటున్న కౌలు రైతులకు అన్యాయం జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్న రైతులకే అమలైంది. రూ.23,000 కోట్ల రుణ మాఫీ అయితే, కౌలు రైతులకు వర్తించింది కేవలం రూ. 23 కోట్లు. తెలంగాణలో ఈ మూడేళ్ల కాలంలో 3 వేలమందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో అత్యధికులు భూమి లేని కౌలు రైతులు. కొందరు కొంత భూమి ఉండి మరింత భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసే కౌలు రైతులు. వీరి కుటుంబాలకు నష్ట పరిహారం కూడా లేదు. కౌలు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కొన్ని: భూక్యా మరోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన గిరిజన మహిళా కౌలు రైతు. కౌలు రైతు గుర్తింపు కార్డు గురించి తుర్కపల్లి తహసీల్దార్ కార్యాలయానికి నాలుగుసార్లు తిరిగింది, గుర్తింపు కార్డు రాలేదు, రెవెన్యూ అధికారులు చెప్పిన సమాధానం భూయజమాని అంగీకారం తెలపలేదని! మరోని ఆ కార్డుపై పెద్దగా ఆశించింది ఏమీలేదు, వడగండ్ల వాన పడి పంటనష్టం జరిగింది కాబట్టి తనపేరు నమోదు చేసుకోమంటే కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే నీ పేరు నమోదు చేసుకుంటామన్నారు వ్యవసాయ అధికారులు. అదే మండలం ఇబ్రహీంపురం గ్రామానికి చెందిన నర్సిరెడ్డి తనకు కౌలు రైతు గుర్తింపు కార్డు, ఆ కార్డు మీద పంట పెట్టుబడి కోసం కొంత బ్యాంకు రుణం ఇప్పించమని అప్పటి ఉమ్మడి నల్లగొండ జిల్లా కలెక్టర్ కాళ్లపై పడ్డాడు. ఆ హఠాత్ పరిణామానికి చలించిన కలెక్టర్ జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్‌ను పిలిచి నర్సిరెడ్డికి రుణం మంజూ రు చేయవలసిందిగా ఆదేశించారు. అయినా బ్యాంకు అధికారులు నిరాకరించారు. కారణం అప్పటికే భూ యజ మాని పంట రుణం తీసుకున్నాడు. 2015 కరువు నష్ట పరి హారం రాష్ట్రంలో ఒక్క కౌలు రైతుకు కూడా రాలేదు. ఈ సందర్బంగా కౌలు రైతుల రక్షణ కోసం 2011లో వచ్చిన భూ అధీకృత సాగుదారుల చట్టం అమలు తీరు గురించి ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఆ చట్టం ప్రకా రం ప్రభుత్వం నుంచి∙వ్యవసాయ పరమైన ఏ సంక్షేమ పథకాలు వచ్చినా కౌలు రైతులకు దక్కాలి. ఈ పథకాలు వర్తించటానికి కౌలు రైతుకు గుర్తింపు కార్డు ఉండాలి. ఆ కార్డులు ఇచ్చే ప్రక్రియ దారుణంగా ఉంది. తెలంగాణలో 10 లక్షలకు పైగా కౌలు రైతులు ఉంటే గత సంవత్సరం 10 వేల మందికి కూడా అందలేదు. రెవెన్యూ శాఖ దీనిని ఎన్నడూ సమీక్షించిన దాఖలాలు లేవు. ఈ మూడు సంవత్సరాలలో ఆ శాఖ మంత్రి మహమ్మద్ అలీ గారు కౌలు రైతుల సమస్య గురించి ఒక్క మాటైనా మాట్లాడలేదు.ఈ విషయం గురించి చర్చించటానికి రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యాలయం ఇఇఔఅ (భూ పరిపాలన ప్రధాన అధికారి కార్యాలయం)కు వెళితే ఆ పోస్ట్ ఎప్పుడూ ఖాళీగానే కనిపిస్తుంది. భూ అధీకృత సాగుదారుల చట్టం గురించి ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ అంశం మీద చిన్న కదలిక కూడా లేదు. పైగా కౌలు రైతులను మోసగించే ప్రక్రియకు వ్యవసాయ అధికారులు శ్రీకారం చుట్టారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చే సంవత్సరం నుంచి రైతులకు ఎకరాకు పంటకు రూ.4,000 సాయం అందిస్తామన్నది. దాని కోసం అన్ని జిల్లా కేంద్రాలలో వ్యవసాయ అధికారులు రైతు సమగ్ర సర్వే అని ఒక ప్రశ్నపత్రం రూపొందించారు. ఈ సర్వే ఆధారంగానే వచ్చే సంవత్సరం ఎకరాకు పంటకు ప్రకటించిన ఆ సాయం అందిస్తారని అంటున్నారు. కానీ వ్యవసాయ అధికారులు రూపొందించిన ఈ సర్వే పత్రంలో రైతుకు సంబంధించి 25 రకాల వివరాలు ఉన్నాయి. కౌలు రైతుకు సంబంధించిన ఒక్క విషయం కూడా లేదు. ఈ విషయం గురించి రైతు స్వరాజ్య వేదిక వ్యవసాయ కమిషనర్‌ను కలిసినా ఇంతవరకు ఎలాంటి ఫలితం కనిపించలేదు. సర్వే అధికారులకు కూడా ఈ మేరకు ఎలాంటి ఆదేశాలు అందలేదు. జూన్ 10వ తేదీతో సర్వే ముగుస్తుంది. ఇంకెప్పుడు కౌలు రైతుల పేర్లు నమోదు చేస్తారు? కౌలు రైతుల సమస్యల మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? ఈ రోజు వ్యవసాయం నడుస్తున్నదంటే అది కౌలు రైతుల పుణ్యమే. కానీ వీరికి ఎలాంటి సాయం అందడం లేదు. వచ్చే సంవత్సరం ఇచ్చే ఎకరాకు రూ. 4,000 సాయం మాత్రం వాస్తవంగా వ్యవసాయం చేస్తున్న రైతులకు అందేటట్లు చూడటం మన బాధ్యత. - బి. కొండల్ రెడ్డి వ్యాసకర్త రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధి మొబైల్ : 99488 97734 -
కోదండరాం నేతృత్వంలో జై కిసాన్ ర్యాలీకి..
న్యూఢిల్లీ: భూసేకరణ చట్ట సవరణ బిల్లును వెనక్కు తీసుకోవాలనే డిమాండ్ తోపాటు మరో మూడు డిమాండ్లు ప్రధానంగా గూర్గావ్లో జరుగుతున్న జై కిసాన్ ట్రాక్టర్ ర్యాలీలో తెలంగాణ తరుపున పలువురు పాల్గొన్నారు. ముఖ్యంగా తెలంగాణ విద్యా వంతుల వేదిక తరుపునుంచి రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంతోపాటు రైతు స్వరాజ్య వేదిక, స్వరాజ్ అభియాన్, అఖిల భారత రైతు సంఘం, తెలంగాణ రైతు సంఘం నేతృత్వంలో 100 మంది నాయకులు, రైతులు ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లారు. ఆదివారం నాటి ర్యాలీలో పాల్గొన్న వీరంతా సోమవారం జంతర్ మంతర్ వద్ద జరిగే భారీ ప్రదర్శన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూసేకరణ ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ తోపాటు, రైతులకు ఆదాయ భద్రత కల్పించాలని, ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు ఎకరానికి రూ.10 వేలను మూడు నెలల్లోపు నష్టపరిహారంగా చెల్లించాలని, భూమిలేని పేదలకు మూడు ఎకరాలు ఇవ్వాలని ఈ ప్రదర్శనలో డిమాండ్ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పలువురు కిసాన్ ర్యాలీలో పాల్గొంటున్నారు. -
హామీలు నెరవేర్చని పార్టీలపై కోర్టుకెళ్లే అధికారమివ్వండి!
హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ఆతర్వాత పత్తా లేకుండా పోయే పార్టీలపై కోర్టుల్లో కేసు వేసే అధికారాన్ని ఓటర్లకు ఇవ్వాలని సీపీఐ అనుబంధ రైతు సంఘం, రైతు స్వరాజ్య వేదిక ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఈమేరకు గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికి లేఖ రాశాయి. వ్యవసాయ రుణాల మాఫిపై వివిధ పార్టీలు ఇస్తున్న హామీలను ఈ లేఖలో ప్రధానంగా ప్రస్తావించాయి. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం ఎన్నికల సంఘం నిబంధనావళికి విరుద్ధమని పేర్కొన్నాయి. నిజంగానే వ్యవసాయ రుణాల మాఫీకి ఆయా పార్టీలు కట్టుబడి ఉంటే నిధులు, లబ్ధిదారుల వివరాలను కూడా ఎన్నికలకు ముందుగానే ప్రకటించేలా ఎన్నికల సంఘం ఆదేశించాలని రైతు నేతలు పశ్య పద్మ, డాక్టర్ జీవీ రామాంజనేయులు, కన్నెగంటి రవి విజ్ఞప్తి చేశారు. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయని పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని, లేకుంటే ఓటర్లే కోర్టుల్లో కేసు వేసేలా మార్గదర్శకాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఆయా పార్టీల నాయకులు తదుపరి ఎన్నికల్లో నిలబడకుండా నిషేధించాలని కోరారు.