కోదండరాం నేతృత్వంలో జై కిసాన్ ర్యాలీకి..
న్యూఢిల్లీ: భూసేకరణ చట్ట సవరణ బిల్లును వెనక్కు తీసుకోవాలనే డిమాండ్ తోపాటు మరో మూడు డిమాండ్లు ప్రధానంగా గూర్గావ్లో జరుగుతున్న జై కిసాన్ ట్రాక్టర్ ర్యాలీలో తెలంగాణ తరుపున పలువురు పాల్గొన్నారు. ముఖ్యంగా తెలంగాణ విద్యా వంతుల వేదిక తరుపునుంచి రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంతోపాటు రైతు స్వరాజ్య వేదిక, స్వరాజ్ అభియాన్, అఖిల భారత రైతు సంఘం, తెలంగాణ రైతు సంఘం నేతృత్వంలో 100 మంది నాయకులు, రైతులు ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లారు.
ఆదివారం నాటి ర్యాలీలో పాల్గొన్న వీరంతా సోమవారం జంతర్ మంతర్ వద్ద జరిగే భారీ ప్రదర్శన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూసేకరణ ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ తోపాటు, రైతులకు ఆదాయ భద్రత కల్పించాలని, ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు ఎకరానికి రూ.10 వేలను మూడు నెలల్లోపు నష్టపరిహారంగా చెల్లించాలని, భూమిలేని పేదలకు మూడు ఎకరాలు ఇవ్వాలని ఈ ప్రదర్శనలో డిమాండ్ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పలువురు కిసాన్ ర్యాలీలో పాల్గొంటున్నారు.