prof kodandaram
-
ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇరువురి చేత మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ హాజరయ్యారు.పెద్దల సభకు ఉద్యమ సారథికోదండరాం సార్‌గా సుపరిచితుడైన ముద్దసాని కోదండరాం స్వగ్రామం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నెన్నెల మండలం జోగాపూర్. 1955 సెప్టెంబర్ 5న ముద్దసాని వెంకటమ్మ, ఎం.జనార్దన్ రెడ్డి దంపతులకు జన్మించారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ , ఓయూలో పీజీ (పొలిటికల్ సైన్స్), జేఎన్‌యూలో ఎంఫిల్ పూర్తి చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ కోసం చేరగా.. 1981లో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఉద్యోగం రావడంతో పీహెచ్డీ మధ్యలో ఆపేశారు. ఆదివాసీల సమస్యలపై దివంగత హక్కుల నేత బాలగోపాల్, ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్‌రావుతో కలిసి పని చేశారు.ఓయూలో ప్రొఫెసర్‌గా సుదీర్ఘ కాలం పనిచేసిన కోదండరాం..దివంగత ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సహా అనేక మంది ప్రముఖ తెలంగాణవాదులతోనూ కలిసి పనిచేశారు. ఉద్యమ సమయంలో రాజకీయ జేఏసీ చైర్మన్‌గా అన్ని పార్టీలను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏకం చేయడంలో క్రియాశీలంగా పని చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటి బీఆర్ఎస్ విధానాలతో విభేదించారు. ప్రజాస్వామిక తెలంగాణ పేరిట 2018 మార్చి 31వ తేదీన తెలంగాణ జన సమితిని ఏర్పాటు చేశారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీజేఎస్ కాంగ్రెస్‌తో కలిసి పని చేసింది. అదే క్రమంలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తో జత కట్టారు. దీనితో పాటు ఉద్యమ నేపథ్యం, ప్రొఫెసర్‌గా ఆయన అందించిన సేవలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. జర్నలిజంలో విశేష కృషి జర్నలిజంలో విశేష సేవలందించిన ఆమేర్ అలీఖాన్ (సియాసత్ ఉర్దూ దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ జాహెద్ అలీఖాన్ కుమారుడు) ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీసీఏ, తరువాత సుల్తాన్–ఉల్–ఉలూమ్ కాలేజీ ఆఫ్ బిజినెస్ అడ్మిని్రస్టేషన్ నుంచి ఎంబీఏ చేశారు. ప్రస్తుతం సియాసత్‌లో న్యూస్ ఎడిటర్‌గా ఉన్న ఆయన..ప్రతిక కర్ణాటక రాష్ట్రానికి విస్తరించేందుకు విశేష కృషి చేశారు. పలు అంతర్జాతీయ ఈవెంట్లను కవర్ చేయడానికి ప్రధానమంత్రి, రాష్ట్రపతిల వెంట విదేశీ పర్యటనలకు వెళ్లారు.మైనారిటీల్లో విద్య, నైపుణ్యాన్ని వృద్ధి చేయడానికి, నిరుద్యోగుల కోసం కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా శిక్షణ ఇప్పించేవారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సియాసత్ ప్రస్తుతం ఖతర్ దేశానికి కూడా విస్తరించింది. 1973 అక్టోబర్ 18న హైదరాబాద్‌లో జన్మించిన అమేర్ అలీ ఖాన్‌కు ఉర్దూతో పాటు ఇంగ్లి‹Ù, హిందీ, అరబిక్, తెలుగు భాషలు తెలుసు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. -
ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరామ్
-
పొత్తుల విషయంపై చర్చ జరగలేదు
-
టీజేఎస్ తో కాంగ్రెస్ చర్చలు
-
కేసీఆర్ నిర్లక్ష్యంతోనే కృష్ణా జలాల్లో అన్యాయం
సాక్షి, న్యూఢిల్లీ : వ్యాపారాలు, కేసుల నుంచి కాపాడుకునేందుకే సీఎం కేసీఆర్ ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమాత్రం కాదని తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. కేసీఆర్‌కు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన 8 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కృష్ణా జలాల పంపకం జరగలేదని అన్నారు. కృష్ణా నది పరీవాహక ప్రాంతం తెలంగాణలోనే 78 శాతం ఉందని తెలిపారు. అయినప్పటికీ రాష్ట్రానికి 299 టీఎంసీలు మాత్రమే ఇచ్చారన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా రాలేదని ఆరోపిస్తూ... విభజన హామీలు నెరవేర్చాలన్న డిమాండ్‌తో సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కోదండరాం నేతృత్వంలో 150 మంది టీజేఎస్ కార్యకర్తలు మౌనదీక్ష చేపట్టారు. దీక్ష అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడుతూ, కృష్ణా జలాలు అందకపోతే హైదరాబాద్‌లో తాగునీటి ఎద్దడి వస్తుందని అన్నారు. తెలంగాణలోని భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, దిండి, పాలమూరు– రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లకు కావాల్సిన నీటి వాటా లేకపోగా.. ఈ ప్రాజెక్ట్‌లను కేవలం వరద నీటిపై ఆధారపడి కట్టారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జలాల్లో వాటా కోసం ఇప్పటికైనా పోరాడాలని అన్నారు. -
అప్పుడు సింహయాజీని కలిసిన కోదండరాం.. భేటీపై ఏమన్నారంటే?
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురు బీజేపీ నేతలకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో కోర్టులో ఈ కేసుపై విచారణ కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా.. ఈ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సింహయాజీతో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌కు సంబంధాలు ఉన్నాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో వార్తలపై ప్రొఫెసర్ కోదండరామ్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ.. నేను ఆరు నెలల క్రితం సింహయాజీని కలిసిన మాట వాస్తవమే. ఆయనను కేవలం ఆధ్యాత్మిక గురువుగానే కలిశాను. తిరుపతి నుంచి వచ్చిన ఆధ్యాత్మిక గురువుగానే సింహయాజీని కలిశానని, సింహయాజీ రాజకీయ వ్యవహారాలు నడుపుతున్న విషయం అప్పట్లో తెలియదని కోదండరాం స్పష్టం చేశారు. ఇక, వీరి భేటీలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని కోదండరామ్ వెల్లడించారు. -
Munugode Politics: కోదండరాంను కలిసిన కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంని కలిసి మునుగోడులో మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని కోదండరాం అన్నారు. పార్టీలో నేతలకు ట్రైనింగ్ క్లాసులు కూడా ఉన్నాయని తెలిపారు. మేము కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాం. కాబట్టి పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కోదండరాం చెప్పారు. కాగా, అంతకుముందు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మల్లు రవి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆదేశాలతో కోదండరాంను కలిశారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికపై చర్చిస్తూ.. ఎప్పుడు ఎన్నిక వచ్చినా టీజేఎస్ మద్దతు ఇవ్వాలని కోరారు. చదవండి: (Munugode Politics: ఆ పార్టీ సరేనంటే.. కమ్యూనిస్టులు అటువైపే..!) -
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లో బాలిక గ్యాంగ్ రేప్ ఘటనతో తల్లిదండ్రులు పట్టపగలు కూడా ఆడపిల్లలను బయటకు పంపేందుకు భయపడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ’బచావో హైదరాబాద్’ పేరుతో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రేవంత్‌రెడ్డితోపాటు ప్రొఫెసర్ హరగోపాల్, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, మల్లు రవితోపాటు సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్, టీడీపీ, బీఎస్పీ, వైఎస్సార్టీపీ నేతలు హాజరయ్యారు. ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్‌కు సంబంధించిన ఎడిటెడ్, లిమిటెడ్ వీడియోను ప్రభుత్వంతో ఒప్పందంలో భాగంగానే లీక్ చేశారని ఆరోపించారు. గ్యాంగ్‌రేప్ ఎక్కడ జరిగిందో ఇప్పటికీ హైదరాబాద్ సీపీ చెప్పడం లేదని, దేవుని పేరును ఆలంబనగా చేసుకొని ఎదగాలని చూసే పార్టీ కూడా గ్యాంగ్‌రేప్ జరిగిన ప్రదేశం గురించి అడగడం లేదన్నారు. నిజాయితీగా పనిచేసే ఐపీఎస్ అధికారులను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారని, రిటైర్డ్ అధికారులకు మళ్లీ పోస్టింగ్‌లు ఇచ్చి సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ ఘటనలో 8 మంది నిందితులుగా ఉంటే ఆరుగురిపై కేసు పెట్టారని, మిగతా ఇద్దరు ఏమయ్యారని ప్రశ్నించారు. ఎయిర్ పోర్ట్‌లో కేసీఆర్ బంధువులు పబ్‌లు పెట్టి అడ్డగోలుగా నడుపుతున్నారని, ఎయిర్‌పోర్టు పార్కింగ్ వద్ద గల పబ్‌లో అరాచకం నడుస్తోందని, సర్కారును నడిపేవాళ్లే నేరగాళ్లుగా మారారని ధ్వజమెత్తారు. మహిళా సమస్యలపై సమీక్షల్లేవు:కోదండరాం మహిళల సమస్యలపై ఎనిమిదేళ్లుగా ఒక్క సమీక్ష కూడా జరగలేదని, చివరిసారిగా రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఎం.కోదండరాం అన్నారు. జూబ్లీహిల్స్ కేసుతోపాటు ప్రతి కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.గీతారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్, ఎంఐఎంకు చెందిన నేతల కొడుకులు, మనవళ్లు ఉన్న జూబ్లీహిల్స్ కేసులో న్యాయం జరిగేలా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. సామాజికవేత్త ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణ ఉన్నతమైన సమాజం వస్తుందని ఆశించామని, కానీ పరిస్థితి దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా దాసోజు శ్రావణ్ తీర్మానాలు ప్రవేశపెట్టగా, సభ్యులు ఆమోదించారు. సమావేశంలో ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, మల్లు రవి (కాంగ్రెస్), బాలమల్లేష్ (సీపీఐ), జ్యోత్స్న (టీడీపీ), తూడి దేవేందర్ రెడ్డి (వైఎస్సార్టీపీ), మామిడాల జ్యోతి (బీఎస్పీ) తదితరులు హాజరయ్యారు. -
ప్రణాళికా బద్ధంగా.. ప్రిపేర్ కావాలి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రస్థాయిలో ఉన్నత స్థాయి ఉద్యోగమైన గ్రూప్–1కు సిద్ధమయ్యే అభ్యర్థులకు అన్ని రంగాల్లో రోజువారీ పరిణామాలపై సంపూర్ణ అవగాహన అవసరమని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.కోదండరాం పేర్కొన్నారు. ప్రణాళికా బద్ధంగా సిద్ధం కావాలని పత్రికలు, పుస్తకాల ద్వారా తాము తెలుసుకున్న సమాచారానికి సైద్ధాంతిక అవగాహనను జోడించి ప్రిపేర్ కావాలని సూచించారు. ఏ సబ్జెక్టులోనైనా ఇవే ప్రధానమని వివరించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఇటీవల గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షలకు సిద్ధమయ్యే విషయంలో అభ్యర్థులు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి?, పరీక్షలకు ఎలా సిద్ధం కావాలన్న అంశాలపై..గతంలో గ్రూప్–1 సిలబస్ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరించిన ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడారు. కృష్ణా జలాల పరిరక్షణ యాత్రలో బిజీగా ఉన్నప్పటికీ ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. భావాన్ని అర్ధం చేసుకుంటూ చదవాలి పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థులు ప్రిపేర్ అయ్యే విధానాన్ని పక్కాగా రూపొందించుకోవాలి. ప్రిలిమినరీ పూర్తిగా ఆబ్జెక్టివ్ అయినందున సబ్జెక్టుపై లోతైన అవగాహన పెంచుకోవాలి. భావాన్ని (కాన్సెప్ట్‌ను) అర్థం చేసుకుంటూ చదవాలి. ప్రస్తుతం ఉద్యోగాలు తక్కువ, అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందున పోటీ తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలి. ఏ పేపరును, ఏ అంశాన్నీ విస్మరించవద్దు. మెయిన్స్ జనరల్ ఎస్సేలో గతంలో ఏ టాపిక్ అనేది చెప్పే వారుకాదు. ఇప్పుడు ఆ సమస్య లేదు. ఏ సబ్జెక్టు చదివినా జనరల్ ఎస్సేను దృష్టిలో పెట్టుకొని మౌలిక అంశాలను అర్థం చేసుకొని సబ్జెక్టుపై సంపూర్ణ అవగాహనæ వచ్చేలా చదివితే సరిపోతుంది. జనరల్ ఇంగ్లిష్ విషయంలో భాష తెలిస్తే చాలు. అర్థం చేసుకుంటారా? పట్టు ఉందా? లేదా? అనేది మాత్రమే చూస్తారు. ఇంగ్లిష్ సాహిత్యం తెలియాల్సిన అవసరం లేదు. రాజ్యాంగ మౌలిక స్వభావం అర్ధం చేసుకోవాలి భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలతో పాటు మౌలిక స్వభావం అర్ధం చేసుకోవాలి. అది తెలియకుండా ముఖ్య అంశాలు అర్థం చేసుకోలేం. 1935లో బ్రిటిష్ పాలకులు చేసిన చట్టం నుంచే చాలా భాగాలను మన రాజ్యాంగంలోకి తీసుకున్నామనుకుంటారు. కానీ భారత రాజ్యాంగం స్వాతంత్య్ర సంగ్రామం నుంచి పుట్టింది. స్వాతంత్య్ర సంగ్రామం ప్రజాస్వామిక విలువలు, ఆకాంక్షలతో కూడింది. దాని ప్రాతిపదికనే రాజ్యాంగాన్ని రాసుకున్నాం. బ్రిటిష్ వారిది నిరంకుశ రాజ్యాంగం.. మనది మౌలికంగా ఒక ప్రజాస్వామిక వ్యవస్థను, సామాజిక న్యాయం విస్తృత పరిచే లక్ష్యాలతో రాసుకున్నది. మౌలికమైన ఈ అంశాలు అర్ధమైతే మిగతావి సులభంగా అర్ధమవుతాయి. రాజ్యాంగ ప్రవేశిక దానికి అద్దం పడుతుంది. ఆర్థిక వ్యవస్థ పరిణామ క్రమం తెలుసుకోవాలి ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధిలో వచ్చిన మార్పులపై అవగాహన ముఖ్యం. ఫ్యూడల్ (భూస్వామ్య) వ్యవస్థ నుంచి ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ వరకు ఎలా పరిణామం చెందామన్నది తెలుసుకోవాలి. నిజాం ఏలుబడిలో దన్నుగా ఉన్నది గ్రామాల్లోని భూస్వాములే. ఆ తర్వాత ప్రజా పోరాటాలతో విముక్తి చెందడం, వేల ఎకరాలు ఉన్న పెద్ద భూస్వాములు అంతరించిపోయి చిన్న భూస్వాములు ఉనికిలోకి రావడం, 1970 తర్వాత దేశ స్థాయిలో సరళీకరణ, ఆర్థిక సంస్కరణలు, 20 సూత్రాల పథకం, భూసంస్కరణలు.. వీటన్నిటిపై అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత ఏ మేరకు ఆధునిక దేశంగా ఏర్పడ్డాం... అయినా ఇంకా వెనుకబడి ఉన్న రంగాలేంటి.? మార్పు జరగాలంటే చేయాల్సిందేమిటి? అనేవి ప్రధానంగా ఆలోచిస్తూ ఇండియన్ ఎకానమీని చదవాలి. పొలిటికల్ ఎకానమీని ప్రభావితం చేసే రాజకీయ అంశాలేంటి.. ఉపాధి కల్పన ఏ రంగంలో ఎక్కువుంది.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక పురోభివృద్ధికి ఏం చేయాలన్న ప్రశ్నలను అనుబంధంగా చూసుకోవాలి. ప్రతి పేపరులో స్వాతంత్య్రానికి పూర్వం పరిస్థితులు, స్వాతంత్య్రానంతరం తలెత్తిన మార్పులు, ఈ మార్పులు దేశాన్ని ఎటు తీసుకెళుతున్నాయి.. దాని వల్ల లాభపడిన వ్యవస్థలు ఏంటి? అనేవి కీలక అంశాలుగా ఉంటాయి. ఇంటర్వ్యూలు ఉంటేనే మంచిది గ్రూప్–1కు ఇంటర్వ్యూలు ఉంటేనే బాగుంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. జిల్లాకు ఉన్నతాధికారిని ఎంపిక చేసే క్రమంలో అతని వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం ఇంటర్వ్యూ ద్వారానే సాధ్యం అవుతుంది. పాలన నైపుణ్యాలు అక్కడే తెలుస్తాయి. సివిల్స్‌కు సైతం పోటీ పడేలా సిలబస్ టీఎస్పీఎస్సీ ఏర్పడిన తర్వాత ఆ కమిషన్ నియమించిన సిలబస్ కమిటీ గ్రూప్–1 సిలబస్‌ను నాలుగు ప్రధాన భాగాలుగా రూపొందించింది. జాతీయ స్థాయిలో నిర్వహించే సివిల్స్ సిలబస్‌కు సారూప్యత ఉండేలా ఈ సిలబస్‌ను తయారు చేశాం. సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే వారు గ్రూప్–1 రాసేలా, గ్రూప్–1కు సిద్ధమయ్యే వారు సివిల్స్‌కు సైతం పోటీపడేలా, జాతీయ స్థాయి పోకడలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సిలబస్‌ను రూపొందించాం. తెలంగాణలో విభాగాధిపతిగా, జిల్లా ఉన్నతాధికారిగా వ్యవహరించే పరిపాలన అధికారికి తెలంగాణ కోణం కచ్చితంగా తెలిసి ఉండేలా చూశాం. తెలంగాణ సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాలు, ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత, గత పరిణామాలు, తొలి, మలి ఉద్యమాలు వంటి వాటిపై అవగాహనను పరిశీలించేలా సిలబస్‌ను ఖరారు చేశాం. ప్రస్తుత పరిస్థితులు, సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు వంటి అంశాలపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. మరోవైపు శాస్త్ర సాంకేతిక రంగాలు, భారతదేశ చరిత్ర, సంస్కృతి, రాజనీతి శాస్త్రం, భారత రాజ్యాంగం వంటి అంశాలను మరో విభాగంగా తీసుకొని సిలబస్‌ను రూపొందించాం. ఇంటర్ స్థాయిలో సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ పూర్తిగా ఇంటర్మీడియట్ స్థాయిలోనే ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అనగానే పూర్తిగా ఆయా రంగాలపై లోతైన అవగాహన పెంచుకోవాలని ఏమీ లేదు. ఫోకస్ అంతా సైంటిఫిక్ మెథడ్ ఎలా డెవలప్ అయిందన్నదే. సైన్స్ నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది? పురోభివృద్ధికి ఎలా దోహదపడుతోందన్నది చూసుకుంటే చాలు. తెలంగాణ ఉద్యమంపై ప్రత్యేకంగా పేపరు తెలంగాణ ఉద్యమంపై ప్రత్యేకంగా ఓ పేపరు ఉంది. నిజాం పాలన, హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రం, ముల్కీ ఉద్యమం, దేశంలో విలీనం, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, పెద్ద మనుషుల ఒప్పందాలు, వాటి అమలులో వైఫల్యాలు, 1948 తర్వాత సాయుధ పోరాటం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత, పోరాటాలు, తొలి, మలి దశ ఉద్యమాలు కీలకమైనవి. ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద మనుషుల ఒప్పందం, దాని వల్ల న్యాయం జరగకపోవడం, 1969 ఉద్యమం, మలి దశ ఉద్యమాలతో పాటు వర్తమాన సమాజాన్ని అర్థం చేసుకోవడం, దాని పూర్వ చరిత్ర తెలుసుకోవడం ముఖ్యం. 1948కి ముందు ఏముంది? ఆ తర్వాత ఎలా అభివృద్ధి చెందాం, ఇప్పుడున్న రాజకీయ ఆర్థిక పరిస్థితులు ఏంటన్న అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. -
కృష్ణా జలాల పరిరక్షణకు కోదండరాం యాత్ర
సాక్షి, హైదరాబాద్ /సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కృష్ణా ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న కేంద్ర గెజిట్‌ను రద్దు చేయాలని, నల్లగొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జన సమితి (టీజేఎస్) బుధవారం నుంచి కృష్ణా జలాల పరిరక్షణ యాత్రకు సిద్ధమైంది. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో ఆరు రోజుల పాటు 150 కిలోమీటర్ల యాత్ర నిర్వహించాలని నిర్ణయించింది. ఇదీ యాత్ర షెడ్యూల్.. ♦4వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఉదయ సముద్రం పానగల్ వద్ద యాత్ర ప్రారంభం. సా యంత్రం 6–30 గంటలకు నల్లగొండ పట్టణం లోని గడియారం సెంటర్లో బహిరంగ సభ ♦5న ఆర్జాలబావి, చర్లపల్లి, ఎంజీ వర్సిటీ, ఎల్లారెడ్డిగూడెం, చెర్వుగట్టు మీదుగా నార్కట్‌పల్లి వరకు కొనసాగింపు. ♦6 నార్కట్ పల్లి నుంచి ఏనుగులదోరి, గోపలాయపల్లి, వట్టిమర్తి స్టేజీ, చిట్యాల మార్కెట్, నేరడ, చౌడంపల్లి, బ్రాహ్మణవెల్లెంల వరకు కొనసాగుతుంది. ♦7న బ్రాహ్మణ వెల్లెం నుంచి ఎలికట్టె, రత్తిపల్లి, సింగారం, మునుగోడు, బోడంగిపర్తి, కొండాపురం, కమ్మగూడెం, తేరట్పల్లి, గట్టుప్పల్ వరకు కొనసాగుతుంది. ♦8న గట్టుప్పల్ నుంచి చర్లగూడెం, మర్రిగూడెం సెంటర్, ఈదులకుంట, కృష్ణరాంపల్లి, వింజమూరు, చింతపల్లి, మల్లేపల్లి, దేవరకొండ వరకు కొనసాగుతుంది. ♦9న దేవరకొండలో యాత్ర ప్రారంభం. నక్కలగండి ఎస్ఎల్బీసీ టన్నెల్‌కు చేరుకుంటారు. అక్కడ యాత్ర ముగించి విలేకరులతో మాట్లాడతారు. -
హుజూరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తాం: కోదండరామ్
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆగస్టు నెల చివరిలో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. టీజేఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్‌ను నమ్మే ప్రసక్తే లేదన్నారు. లక్ష ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేశారో చెప్పాలని కోదండరామ్ ప్రశ్నించారు. -
ఉస్మానియా భూములను కాపాడండి
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలోని భూములు ఆక్రమణలకు గురికాకుండా గట్టి చర్యలు తీసుకొని వాటిని కాపాడాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి , టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం, ప్రొ.రమేశ్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. భూముల పరిరక్షణలో భాగంగా ఓయూలోని ఆగ్నేయ మూలలో సరిహద్దు గోడ నిర్మాణం పూర్తిచేసేందుకు రూ.200 కోట్లు మంజూరు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. శుక్రవారం రాజ్‌భవన్ లో గవర్నర్‌కు వారు వినతిపత్రాన్ని సమర్పించారు. 1917లోనే ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఓయూ ఏర్పాటుకు 1,628 ఎకరాల భూమి కేటాయించడంతో పాటు, దాని సరిహద్దులను సూచిస్తూ సర్వే మ్యాప్‌ను పొందుపరిచారని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి చెందిన డాక్యుమెంట్లు, మ్యాప్‌లు యూనివర్సిటీ ఎస్టేట్ వద్ద అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. వర్సిటీ ఆగ్నేయ మూలలో డీడీ కాలనీ పక్కనే చిన్న చెరువు ఉందని, అది కొన్నేళ్లుగా ఎండిపోవడంతో చుట్టుపక్కల వాళ్లు చెత్తపారేయడానికి ఉపయోగిస్తుండగా కొన్ని సాంకేతిక కారణాలతో ఈ ప్రాంతంలో సరిహద్దు గోడ నిర్మాణం పూర్తికాలేదని పేర్కొన్నారు.ఓయూకు తులసి సొసైటీతో గతంలో భూవివాదం ఉండగా అది సమసిపోయిందని, ఇప్పుడు నకిలీ పత్రాలు సృష్టించి విశ్వవిద్యాలయ భూములను ఆక్రమించుకునే ప్రయత్నం జరుగుతోందన్నారు.ఈ సొసైటీ కొత్త సభ్యులకు భూమి కేటాయింపు గురించి డిమాండ్ చేసే అవకాశం లేదని స్పష్టంచేశారు. గవర్నర్ సానుకూల స్పందన.. తాము చేసిన విజ్ఞప్తిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని, ఓయూ భూముల వ్యవహారంలో సమాచారం తెప్పించుకుంటున్నామని చాడ, కోదండరాం మీడియాకు చెప్పారు. తెలంగాణలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌పై ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఈ వర్సిటీది ఎంతో కీలకమైన పాత్ర కాబట్టి, ఈ భూములు కోల్పోకుండా సీఎం బాధ్యత తీసుకోవాలని చెప్పారు. -
ముట్టడి.. కట్టడి!
కవాడిగూడ: పీఆర్సీ హామీని అమలు చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమాన పనికి.. సమాన వేతనం వర్తింప చేయాలని, వారందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఆందోళనకారులు అసెంబ్లీ వద్దకు చేరు కోకుండా ఎక్కడికక్కడే అరెస్ట్ చేసి ఆయా పోలీస్స్టేషన్లకు తరలించారు. అయితే కొందరు టీచర్లు పోలీసుల కళ్లుగప్పి ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్దకు చేరుకున్నారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. సుమారు రెండు వేల మంది ధర్నా చౌక్‌కు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పలువురు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేసి పలు పోలీస్స్టేషన్లకు తరించారు. సాయంత్రం 6 గంటలకు విడిచిపెట్టారు. గోషామహల్ స్టేషన్లో ఓయూ మాజీ పీడీఎస్‌యూ నాయకురాలు పూలన్ ధూంధాం నిర్వహించి ఆడిపాడారు. అరెస్టయిన వారిని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులు కె.గోవర్ధన్ పరామర్శించారు. ఉపాధ్యాయులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. టీపీటీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని విమర్శించారు. -
ప్రజాతెలంగాణ కోసం మరో ఉద్యమం
కవాడిగూడ: ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదని, వారికి కావాల్సిన తెలంగాణ కోసం మరో ఉద్యమం చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని, మలిదశ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఉద్యమకారులు, పలు పార్టీల నేతలు స్పష్టం చేశారు. ఆదివారం కవాడిగూడ డివిజన్లోని పింగళి వెంకట్రామ్రెడ్డి హాల్లో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. సుదీర్ఘకాలం తర్వాత కలుసుకున్న సందర్భంగా ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఆలింగనం చేసుకున్నారు. ఇది అందరి తెలంగాణ.. టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరాం మాట్లాడుతూ ‘త్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణ ఎవరి జాగీరు కాదు, సీఎం కేసీఆర్ ఒక్కరే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన అని అనుకుంటు న్నారు, ఇది కేవలం నీ తెలంగాణ కాదు.. ఇది అందరి తెలంగాణ’ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లో నౌకరీ దొరకడం లేదన్నారు. తెలంగాణకు చెందిన ప్రతీ పైసా తెలంగాణ బిడ్డలకే దక్కాలన్నారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని, స్మారక చిహ్నాలను ఏర్పాటు చేయాలన్నారు. ఆత్మీయ సమ్మేళనంలో పోస్టర్ ఆవిష్కరిస్తున్న కోదండరాం, బాలక్రిష్ణారెడ్డి, మహేందర్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి, వివేక్, ఎంపీ మధుయాష్కి, ప్రభాకర్, చెరుకు సుధాకర్, రాములునాయక్ తదితరులు అడిగి తెచ్చుకోలేదు.. హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ కళాకారుల ఆటపాటతో అన్ని వర్గాల ప్రజల వద్దకు తెలంగాణ ఉద్యమం చేరిందన్నారు. ఇది అడిగి తెచ్చుకున్న తెలంగాణ కాదు, త్యాగాలు, బలిదానాలు, పోరాటాలు చేసి సాధించుకుందన్నారు. తెలంగాణఫలాలు సబ్బండ ప్రజలకు దక్కేలా నిర్మాణాత్మమైన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన అన్యాయాలపై, పాలనపై ఏపూరి సోమన్న తనదైన శైలిలో గళమెత్తారు. సమ్మేళనం కన్వీనర్ జిట్టా బాలక్రిష్ణారెడ్డి, కో–ఆర్డినేటర్ కె.కె.మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీలు కొండ విశ్వేశ్వరరెడ్డి, వివేక్, రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ, డా.చెరుకు సుధాకర్ మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, మాజీ ఎంపీ మధుయాష్కి, యువతెలంగాణ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీరుద్రమదేవి, వివిధ జిల్లాల ఉద్యమకారులు పాల్గొన్నారు. -
ఆర్థిక అంశాలపైనే రాజకీయాలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆర్థిక అంశాలపైనే భవిష్యత్తు రాజకీయాలు కొనసాగుతాయని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో వర్తమాన ఆర్థిక పరిస్థితి – మూల్యాంకనంపై ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. కోదండరాం మాట్లాడుతూ.. ఆర్థిక పరిణామాలు ఎటుపోతాయనేది రాజకీయ పార్టీలు చర్చించాలన్నారు. రాజకీయ రంగమే ఆర్థిక సమస్యలకు పరిష్కారం చూపుతుందని, అంతిమంగా ఆర్థిక వనరులను సరిగ్గా వినియోగించగలిగేది రాజకీయాలేనన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆర్థిక అంశాలపై అవగాహన పెం పొందించుకోవాలన్నారు. జీఎస్టీ ప్రవేశపెట్టడం, ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం కూడా కారణమేనని ప్రొఫెసర్ నరసింహారెడ్డి అన్నారు. ఎలక్ట్రికల్ వాహనాలు ప్రోత్స హించేందుకు కేంద్రం చర్యలు చేపట్టడంతో వాహ నాలు కొనుగోలు చేయాలనుకునే వారు ఎలక్ట్రికల్ వాహనాలు వస్తాయని వాటిని కొనడం మానేశారని ఎకనామిక్స్ ప్రొఫెసర్ అంజిరెడ్డి అన్నారు. -
‘విధ్వంసపు పునాదులపైనే విశ్వాసాన్ని కూడగట్టాలి’
సాక్షి, హైదరాబాద్ : దేశంలో అన్ని వ్యవస్థల విధ్వంసం జరుగుతోంది.. ఆ పునాదులపైనే విశ్వాసాన్ని కూడగట్టాలని స్వరాజ్ అభియాన్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ వేదికగా శనివారం జరిగిన తెలంగాణ జనసమితి పార్టీ తొలి ప్లీనరీకి యోగేంద్ర యాదవ్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా కేశవరావు జాదవ్ గుర్తుకొస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గూర్చి ప్రొఫెసర్ జయశంకర్ చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సమస్యలపై మాట్లాడటానికి తనను హరియాణా నుంచి పిలిచారన్నారు. ఇది రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ఇదే నిజమైన జాతీయవాదమని.. కోదండరాం కంటే పెద్ద జాతీయవాది తనకు కపడలేదన్నారు యోగేంద్ర యాదవ్. ప్రస్తుతం దేశ ప్రజలంతా నిరాశలో ఉన్నారని.. ప్రజాస్వామ్యంలో అంధకారం నెలకొందని యోగేంద్ర యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో నరేంద్ర మోదీ.. తెలంగాణలో కేసీఆర్ ఇద్దరు నియంతల్లా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా బీజేపీ వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రతి ఒక్కరు తమ కల్చర్‌ను నిలబెట్టుకుంటూ.. బీజేపీ మోనో కల్చర్‌కు వ్యతిరేకంగా పోరాడలని పిలుపునిచ్చారు. అన్ని సిద్థాంతాల్లో ఉన్న మంచిని గ్రహించి ప్రస్తుత సమాజానికి ఉపయోగపడే సిద్ధాంతాన్ని తయారు చేయాలని పేర్కొన్నారు. దేశ స్వాతంత్య్ర పొరాటంలో పాల్గొనని ఆర్ఎస్ఎస్ ఈ రోజు దేశభక్తి గల సంఘంగా మభ్యపెడుతోందని మండి పడ్డారు. -
నిరంకుశ పాలనపై ప్రజా తీర్పు
సాక్షిప్రతినిధి, సూర్యాపేట: ఇష్టానుసారంగా.. తాము ఏం చేసినా.. ప్రజలు ఆమోదిస్తారన్న పాలకుల నిరంకుశ వైఖరిపై ప్రజలు ఈ ఎన్నికల్లో ఓటుతో తీర్పునిచ్చారని, ప్రజా ఉద్యమాలను అణచాలని చూస్తే ఎంతటి వారికైనా పతనం తప్పదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శుక్రవారం ఆయన సూర్యాపేట జిల్లాకేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ, ఈ లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మూల స్తంభాలైన కరీంనగర్, నిజామాబాద్ నేతలు ఓడిపోయారన్నారు. ఈ ప్రభుత్వం గెలిచాక నిరుద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయని, ప్రజా ఉద్యమాలను అణచాలని ప్రభుత్వం చూడడంతో నాలుగు నెలలకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని విమర్శించారు. మంత్రివర్గ ఏర్పాటులో ఆలస్యం, పాలన లేకపోవడం, ఏ విషయాన్ని అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ప్రజలపై నిర్లక్ష్య ధోరణితో టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో రైతులు సంఘటిత శక్తిగా నిలబడి జాతీయస్థాయికి రైతాంగ సమస్యలను తీసుకెళ్లారని తెలిపారు. త్వరలోనే తెలంగాణ జనసమితి అటవీ భూముల హక్కుపై పోరాటాన్ని ఉధృతం చేస్తుందన్నారు. ప్రజలు మాత్రం గట్టిగా నిలబడి ప్రభుత్వానికి బుద్ధి చెప్పారన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు వెంకట్‌రెడ్డి, కుంట్ల ధర్మార్జున్, గట్ల రమాశంకర్ తదితరులు ఉన్నారు. -
ప్రభుత్వ వైఫల్యంవల్లే అవకతవకలు
హైదరాబాద్: ‘అందరూ చదువుకుంటే బాగుపడతారు అనుకుంటే, ప్రస్తుతం చదువు లేకున్నా మా బిడ్డ బతికేది అనుకునే స్థాయికి పరిస్థితి వచ్చింద’ని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లోని అవకతవకలు ప్రభుత్వ వైఫల్యంవల్లే జరిగాయని, ఓ పనికిమాలిన సంస్థకు కాంట్రాక్టు ఇచ్చి పిల్లల జీవితాలతో ఆడుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ‘విద్యార్థుల ఆత్మహత్యలు – ప్రభుత్వ హత్యలు, వ్యవస్థల విధ్వంసం’అనే అంశంపై సోమవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కోదండరామ్ మాట్లాడుతూ .. ఇంటర్మీడియట్ ఫలితాల్లోని అవకతవకలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఇప్పుడు ఇంటర్‌బోర్డు తమ తప్పులేదని, విద్యార్థులే సరిగ్గా చదవలేదని నెపం వారి మీదకు నెట్టేందుకు చూస్తోందన్నారు. ఆత్మహత్య చేసుకున్న ఒక్కో విద్యార్థి కుటుంబ సభ్యులను తాము స్వయంగా కలిశామని, 10వ తరగతిలో 9.2 మార్కులు సాధించిన వారు ఇంటర్లో ఒక సబ్జెక్ట్‌లో ఎలా ఉత్తీర్ణులు కాలేరో వివరించాలన్నారు.వ్యవస్థను ప్రభుత్వం సరిగ్గా వాడుకోవడంలేదని, నిబంధనలు, మార్గదర్శకాలు, పద్ధతి అనేది లేకుండా పోయిందన్నారు. మనం పాత రాచరిక పాలన నుంచి బయటపడ్డాము రాజ్యాంగ పరమైన పాలనలో ఉన్నామని ప్రభుత్వానికి గుర్తుచేయాల్సి వస్తోందన్నారు. గతంలో స్వపరిపాలన కోసం ఉద్యమం చేశామనీ, ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన పాలనకోసం పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. తెలంగాణలో ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. గతంలో ఓ రైలు ప్రమాదం జరిగి 100 మంది మరణిస్తే నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి కేంద్రమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారని, ఇప్పుడు 23 మంది పిల్లల ఆత్మహత్యకు కారణమైన మంత్రి జగదీశ్వర్ రెడ్డిని ఇప్పటివరకు ఎందుకు బర్తరఫ్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ప్రముఖ విద్యావేత్త సమక్షంలో అన్ని పేపర్లను మరోమారు దిద్దించాలని డిమాండ్ చేశారు. బీసీ సంఘ జాతీయ నేత ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ఈ వైఫల్యంపై.. హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని అన్ని పార్టీలు కోరుతున్నా ప్రభుత్వం ఎందుకు జరిపించడంలేదో అర్థం కావడంలేదన్నారు. దోపిడీ, అణచివేతకు వ్యతి రేకంగా సామాజిక తెలంగాణ కోసం మరోమారు ఉద్యమిస్తామని హెచ్చరించారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ.. చనిపోయిన 23 మం ది విద్యార్థులవి ప్రభుత్వ హత్యలే అని పేర్కొన్నారు. నిర్ణయాలివీ.. ఈ సందర్భంగా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ప్రకటించారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబీకులకు 2 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలి. ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరపాలి, సీబీఐచే విచారణ జరిపించాలి. ‘గ్లోబరీనా’సంస్థ వెనక గల మూలాలు, సంబంధాలు, అవకతవకలపై విచారణ జరిపించాలి. కార్పొరేట్ విద్యా వ్యవస్థను అంతమొందించాలి వంటి తీర్మానాలను అఖిలపక్షం చేసినట్లు తెలిపారు. 13నుంచి చైతన్య సభలు ఈ నెల 13 నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో చైతన్య సభలు, 25న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు, 27న వేలాదిమందితో ధర్నాచౌక్ వద్ద నిరసన , జూన్ మొదటివారంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కాశీనాథ్, సీపీఐ నేతలు బాల మల్లేశ్, పాండు రంగాచారి, వివిధ పార్టీల, సంఘాల నాయకులు నాగుల శ్రీనివాస్ యాదవ్, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగం కంటే మీ చట్టాలు గొప్పవా?
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నియంతృత్వంగా వ్యవహరిస్తూ నిరసన తెలిపే, ప్రశ్నించే హక్కులను కాలరాస్తూ కొత్త చట్టాలను రూపొందిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. ‘మీరు రూపొందించిన చట్టాలు రాజ్యాంగం కంటే గొప్ప వా..’అని ప్రశ్నించారు. ఎస్.ఐ, కానిస్టేబుల్స్ సెలక్షన్ ప్రక్రియలో సెన్సార్షిప్ సిస్టంని తొలగించాలని, ఆర్.ఎఫ్.డి సిస్టం వల్ల ఇబ్బందులున్నాయని, పరుగుపందెంలో అవకతవకలను సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ గురువారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిరుద్యోగ జేఏసీ సభను నిర్వహించింది. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ నిరుద్యోగులేమైనా ఎమ్మె ల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి స్థానాలను ఆశిస్తున్నారా.. వారు చదివిన చదువుకు తగిన ఫలం లాంటి ఉద్యోగాన్ని అడుగుతుంటే, దానిలో కూడా సవాలక్ష ఆంక్షలను విధిస్తూ ఏడిపించడం సరైనది కాదన్నారు. దీని వల్ల ఎందరో అభ్యర్థులు నష్టపోతున్నారన్నారు. మిమ్మల్ని జీవితాంతం కష్టపెడతాం సభ జరుగుతుండగానే ప్రెస్‌క్లబ్ వద్ద పోలీసులు మోహరించారు. టాస్క్‌ఫోర్స్ అడిషినల్ డీసీపీ చైతన్యకుమార్ ఆధ్వర్యంలో నలుగురు ఏసీపీలు, 10 మంది ఇన్స్పెక్టర్లు, 20 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 200 మంది కానిస్టేబుళ్లు మోహరించారు. సభ ముగిసిన తర్వాత ఆర్.కృష్ణయ్య, కోదండరాం, బీసీ సంఘం నేత గుజ్జ కృష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, విద్యార్థి సంఘం నేత అన్వర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిని 45 నిమిషాలపాటు ప్రెస్‌క్లబ్‌లో నిర్బంధించి తరువాత పోలీసుస్టేషన్‌కు తరలించారు. సభకు వచ్చిన నిరుద్యోగులను బయటకు వెళ్లకుండా గేట్లు మూసేసి అడ్డుకున్నారు. దీంతో నిరుద్యోగులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.‘మమ్మల్ని బయటకు వదలండి. చచ్చిపోయేటట్టు ఉన్నాం’అని వేడుకున్నా పోలీసులు గేట్లు తెరవలేదు. ఆగ్రహానికి గురైన నిరుద్యోగులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ‘మమ్మల్ని మీరు గంట, 3 గంటలు లేదా ఒక రోజు, నెల రోజులపాటు కష్టపెడతారేమో... మేం తల్చుకుంటే మిమ్మల్ని అధికారంలోకి రాకుండా జీవితాం తం కష్టపడేటట్లు చేయగలం’అని హెచ్చరించారు. భయభ్రాంతులకు గురి చేసిన పోలీసులు అరగంట తరువాత గేట్లు తెరవడంతో అభ్యర్థులు బయటకు వచ్చారు. పోలీసులు 15 నుంచి 20 మందిని రౌండప్ చేశారు. తమ తోటివారికి ఏమైం దోనని దగ్గరకు వెళ్లి చూసిన ప్రతి ఒక్కరినీ పోలీసులు భయభ్రాంతులకు గురిచేశారు. ఓ పక్క ఎండ, మరో పక్క పోలీసుల వ్యవహారశైలితో విసిగిన నిరుద్యోగులు పెద్దఎత్తున ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. సుమారు ఐదారొందల మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, కొంతమందిని అరెస్ట్ చేసి సమీప పోలీసుస్టేషన్లకు తరలించారు. 18 వేల మందిని ముందే ఎంపిక చేసేసుకున్నారా? అభ్యర్థుల ఎంపికను సరైన రీతిలో చేయాలని వేలాదిమంది నిరుద్యోగులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రభుత్వం స్పందించడంలేదంటే, ముందుగానే ఆ 18 వేల మందిని సెలక్ట్ చేసేసుకున్నారనే అనుమానం వస్తోందని అన్నారు. న్యాయం కావాలని అడిగితే అరెస్ట్ చేస్తారా.. ఇలా ఎంతమందిని అరెస్ట్ చేసి పరిపాలన సాగిద్దామనుకుంటున్నారో పాలకులు అంతర్మథనం చేసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు చేసే ఉద్యమానికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. -
‘కాంగ్రెస్ మోసం చేసింది’
ఖిలా వరంగల్: కాంగ్రెస్ పార్టీ కొన్ని స్థానాల్లో స్నేహపూర్వక పోటీగా అభ్యర్థులను నిలిపి మోసం చేసిందని, పొత్తు నిబంధనలు పాటించడం లేదని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం వరంగల్ విద్యానగర్ కాలనీలోని టీజేఎస్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి నాలుగేళ్లు రాచరిక పాలన చేసిన కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. మహాకూటమి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గాదె ఇన్నయ్య నిజమైన తెలంగాణ ఉద్యమకారుడని, నిరుపేద, అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కోదండరాం చెప్పారు. -
టీఆర్ఎస్లో చేరిన టీజేఎస్ నేతలు
-
ప్రాజెక్టుల్లో వరంగల్‌కు అన్యాయం
కేయూ క్యాంపస్: పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వరంగల్‌కు అన్యాయం జరిగిందని, గోదావరి నీళ్లు వరంగల్ వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం రాత్రి హన్మకొండలో జరిగిన టీజేఎస్ ధూంధాం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చంపల్లి, ఎల్లంపల్లి, తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీలు కడితే బాగుండేదని, దీంతో రూ.40 వేల కోట్లు మిగిలేవని అన్నారు. అలా కాకుండా పాలకులు తమ ఇష్టానుసారంగా నిర్మిస్తుండటంతో వరంగల్‌కు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రాని పరిస్థితి ఉందన్నారు. దేవాదుల ప్రాజెక్టు ఉన్నా ఆ నీరు కూడా వరంగల్‌కు రావడం లేదన్నారు. ఎంతోమంది బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఏమిచేశారని ప్రశ్నించారు. టీఆర్ఆస్ పాలనకు చరమగీతం పాడాలి .. ఆలేరు: నిరంకుశ పాలన సాగిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని కోదండరాం పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో యువత వలసబాట పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలేరు నియోజకవర్గం నుంచి టీజేఎస్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. -
కాచుకో కేసీఆర్.. నీ పాలనకు చరమగీతం
దుబ్బాక టౌన్/చేగుంట (తూప్రాన్): ‘ఇక కాచుకో కేసీఆర్.. తెలంగాణ ప్రజలు నీ గడీల పాలనకు చరమగీతం పాడేరోజులు దగ్గర్లోనే ఉన్నయ్. ఇయ్యాళ అత్యవసంగా ఎందుకు కేబినెట్ మీటింగ్ పెట్టినవ్. ముందస్తు ఎన్నికల కోసమేనా? ఎన్నికలు ముందొస్తే ముందే.. వెనకొస్తే వెనకే రాష్ట్ర జనం నిన్ను ముంచేందుకు సిద్ధంగా ఉన్నారు’అని తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. బుధవారం దుబ్బాకలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రాజ్‌కుమార్‌తోపాటు పలువురు పార్టీలో చేరారు. ఆయన మాట్లాడుతూ, ‘ఖబడ్దార్ కేసీఆర్.. తెలంగాణ ఏమన్నా నీ జాగీరనుకుంటున్నావా. నీదగాకోరు పాలనకు రోజులు దగ్గరపడ్డాయి. ఉత్త పుణ్యానికి రూ.40 వేల కోట్లు దోచుకున్నావ్. ఈ ఎన్నికల్లో టీజేఎస్ అధికారంలోకి వస్తుందని, ఆపై నిన్ను జైల్లో పెట్టడటం ఖాయం’అని నిప్పులు చెరిగారు. తమని మాట్లాడనివ్వడం లేదని మీ ఎమ్మెల్యేలు, మంత్రులు తనతో చెప్పారన్నారు. ప్రజలే మిమ్మల్ని తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తమ పార్టీ బలహీనంగా లేదని, చాలామంది ప్రముఖులు పార్టీలోకి వచ్చేం దుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మధ్యలో దిగిపోవడానికా గెలిపించింది.. మధ్యలో దిగిపోవడానికేనా పూర్తి మెజార్టీతో గెలిపించింది అని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోదండరాం ప్రశ్నించారు. దబ్బాక సమావేశానికి వెళ్తూ చేగుంటలోని గాంధీ చౌరస్తా వద్ద టీజేఎస్ జెండాను ఆవిష్కరించారు. -
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునర్ నిర్మిస్తాం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, రాష్ట్రంలో ప్రజా స్వామ్యాన్ని పునర్ నిర్మిస్తామని తెలంగాణ జనసమితి పార్టీ (టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం తో పాటు మక్తల్, మాగనూరు మండలాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలు చోట్ల జెండాలు ఆవిష్కరించడంతో పాటు భూ ప్రక్షాళన సందర్భంగా రికార్డుల్లో తప్పులు దొర్లిన రైతులతో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు ప్రజలే కేంద్రంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి పార్టీ పెట్టుకునే స్వేచ్ఛ ఉందని, కానీ పార్టీలు ఎందుకు పెడుతున్నారని అడిగే హక్కు ఎవరికీ లేదన్నారు. అమర వీరుల ఆకాంక్షలను నెరవేర్చేలా ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. రాష్ట్రంలో రాజకీయ ఐక్యత అవసరమని భావిస్తే అన్ని పార్టీలను ఏకం చేస్తామన్నారు. రైతుబంధు చెక్కుల పంపిణీలో చాలా మంది నష్టపోయారన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటించి చెక్కుల పంపిణీలో ఉన్న లోటు పాట్లు, రైతులకు కలిగిన ఇబ్బందులపై ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. -
ప్రభుత్వ విధానాల వల్లే ఆర్టీసీకి నష్టం
హైదరాబాద్: ప్రభుత్వం అనుసరిస్తున్న విధి, విధానాల వల్లే ఆర్టీసీ నష్టాల బాటలో పయనిస్తుందని జనసమితి పార్టీ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. నష్టాలు ఎందుకు వస్తున్నాయన్న విషయాలపై చర్చించకుండా ఆర్టీసీ కార్మికుల వల్లే నష్టాలు వస్తున్నాయనడం భావ్యం కాదన్నారు. టీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్యర్యంలో శనివారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్లో ‘ఆర్టీసీ పరిరక్షణ– కార్మికుల వేతన ఒప్పందం– ప్రభుత్వ వైఖరి’ అనే అంశాలపై పలు రాజకీయ పార్టీల నేతలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. కోదండరాం మాట్లాడుతూ ఆర్టీసీ రకరకాల కారణాలతో నష్టపోతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. భారం మోస్తున్న కార్మికుల వల్లే నష్టాలు అనడం బాధగా ఉందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వక 14 నెలలు గడుస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఆర్టీసీని ప్రైవే టుపరం చేసేందుకు పావులు కదపడం సిగ్గుచేటన్నారు. సీఎం కేసీఆర్ పద్ధతి మార్చుకోవాలని టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ హితవు పలికారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ సేవారంగమైన ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధపడటం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ అధి కార ప్రతినిధి సుధీర్‌రెడ్డి, రాజిరెడ్డి పాల్గొన్నారు. -
అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోమని, తమ పార్టీకి తగిన సామర్థ్యం ఉందని, దాన్ని నిరూపించుకుంటామని చెప్పారు. పెట్రోలు, డీజిల్ ధరల తగ్గింపునకు చేపట్టాల్సిన చర్యలపై బుధవారం టీజేఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం టీజేఎస్‌పై ఇంటెలిజెన్స్ సర్వే చేయించిందని, 26 సీట్లు వస్తాయని తేలిందని, కింగ్‌మేకర్ కాబోతున్నారని విలేకరులు పేర్కొనగా.. కింగ్‌మేకర్ ఏమోకానీ కింగ్‌గా ఉంటామన్నారు. మీరు అధికారంలోకి వస్తారా.. రాష్ట్రంలో హంగ్ వస్తుందా? అని ప్రశ్నించగా.. ‘‘ఆ అంచనాలకు ఇంకా సమయం ఉంది. హంగ్ రాదు. ప్రజలు మాకు స్పష్టమైన మెజారిటీ ఇస్తారు. మేమే అధికారంలోకి వస్తాం. రాజకీయాలను మేం మార్చుతాం. ప్రభుత్వం రాజకీయాలపై ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించడం సరికాదు. ప్రభుత్వ పథకాల అమలుపై సర్వే చేస్తే ప్రజలకు ఉపయోగం ఉంటుంది’’ అని అన్నారు. కర్ణాటక పరిణామాలపై స్పందిస్తూ.. స్థానిక ప్రజల ఆకాంక్షలు ముఖ్యమని, జాతీయ పార్టీలు స్థానికుల ఆకాంక్షలను పట్టించుకోకపోవడం వల్లే స్థానిక పార్టీ్టలు వస్తున్నాయన్నారు. ప్రస్తుతం ప్రభుత్వానికి, వ్యాపారానికి, రాజకీయానికి అనైతిక సంబంధం కొనసాగుతోందని, సుప్రీంకోర్టు కోర్టు జోక్యంతో కర్ణాటకలో అది నిలిచిపోయిందని చెప్పారు. ముడి చమురు రేటు తగ్గినా.. పెట్రోలు, డీజిల్ ధరలపై టాక్స్‌లను సవరించి, జీఎస్టీ పరిధిలోకి తేవాలని కోదండరాం డిమాండ్ చేశారు. అలాగే పెట్రోలుపై టాక్స్‌ల తగ్గింపు విషయంలో నిపుణుల కమిటీ చేసిన సూచనలను అమలు చేయాలన్నారు. ముడి చమురు రేటు తగ్గినా ప్రభుత్వం మాత్రం ధరలు పెంచుతోందని విమర్శించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీజేఎస్ తరపున పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 27న అవగాహన సదస్సు నిర్వహిస్తామని కోదండరాం తెలిపారు. ఆన్లైన్ సభ్యత్వ నమోదుకు శ్రీకారం ఆన్లైన్ దరఖాస్తు విధానంలో సభ్యత్వ నమోదుకు టీజేఎస్ శ్రీకారం చుట్టింది. రానున్న పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల నుంచి టీజేఎస్ తరఫున పోటీ చేయాలనుకునే యువతకు తమ వెబ్సైట్ ద్వారా (www.telanganajanasamithiparty.org) ఆన్లైన్ దరఖాస్తులను అందుబాటులోకి తెచ్చింది. ఇది ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే దాదాపు 850 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆఫ్‌లైన్‌లో కాకుండా ఆన్లైన్లో సగటున రోజుకు వందకు పైగా దరఖాస్తులు వస్తున్నాయని కోదండరాం చెప్పారు. -
గడీ గోడలను బద్దలు కొడదాం..
సాక్షి, హైదరాబాద్ : ప్రజల ప్రభుత్వం కోసం ప్రగతిభవన్ గడీలను బద్దలు కొడదామని తెలంగాణ జన సమితి(టీజేఎస్) అధ్యక్షుడు ఎం.కోదండరాం పిలుపునిచ్చారు. పాలపిట్ట, ఆకుపచ్చ రంగులతో రూపొందించిన టీజేఎస్ జెండాను బుధవారం హైదరాబాద్‌లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాలపిట్టకు అపజయం తెలియదన్నారు. ‘‘పాలపిట్ట రంగును అద్దుకున్న టీజేఎస్ ఎక్కడైనా విజయం సాధిస్తుంది. స్వరాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా పాలన ఉంటుందనుకున్నాం. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలాగా పాలిస్తున్నాడు. బాధితులు న్యాయం కోసం పోరాటం చేస్తే అరెస్టులు చేశారు. భావ వ్యాప్తి కోసం, ప్రజలకు న్యాయం చేయడం కోసం పార్టీ అవసరం. ఇప్పటిదాకా 99 శాతం నడిచాం. ఇంకా ఒక్క శాతం మిగిలి ఉంది. 1996 నుంచి ఆచార్య జయశంకర్ సార్‌తో తెలంగాణ ప్రయాణం ప్రారంభించాం. అవే ఆశయాలను కచ్చితంగా సాధించి తీరుతాం’’అని అన్నారు. రాష్ట్ర ప్రజల బాగుకోసమే టీజేఎస్ పుట్టిందని స్పష్టంచేశారు. ఈ నెల 29న బహిరంగసభతో తమ బలమేంటో చూపిస్తామని పేర్కొన్నారు. సైకిల్‌తో బయల్దేరిన కాన్షీరాం, చీపురు చేతబట్టిన కేజ్రీవాల్ రాజ్యాధికారం సాధించలేదా అని ప్రశ్నించారు. పాలనలో మార్పు కోసమే.. ఇది తెలంగాణ ప్రజాస్వామికీకరణకు, ఏకవ్యక్తి పాలనకు మధ్య జరుగుతున్న పోరాటమని కోదండరాం అన్నారు. ఉద్యమంలో గెలిచామని, ఓట్ల పండుగలోనూ గెలుస్తామని చెప్పారు. ‘‘కేవలం పాలకుల్లో మార్పు మాత్రమే కాదు. పాలనలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తాం. ఈ నెల 29 నాటికి జన సమితి ప్రతీ ఇంటికి వెళ్లాలి. తాడు, బొంగరం లేదని కొందరు మాట్లాడుతున్నారు. ఆ బొంగరం ఎట్లా గిరాగిరా తిరుగుతుందో చూపించాలి’’అని పిలుపునిచ్చారు. ఈ నెల 29 దాకా సన్నాహక కమిటీలు పనిచేస్తాయని, ఆ తర్వాత తాత్కాలిక కమిటీలు ఏర్పాటు చేసుకుంటామని వివరించారు. ఇక నుంచి ఏ సంఘాలు ఉండవని, అందరూ జన సమితిగానే ఉంటారని పేర్కొన్నారు. ‘‘ఉద్యమంలో కీలక పాత్ర వహించిన వారికే జన సమితిలో ప్రాధాన్యం ఉంటుంది. తెలంగాణ కోసం అమరులైన వారే జన సమితికి స్ఫూర్తి. అమరుల స్ఫూర్తి మర్చిపోతే తెలంగాణవాదాన్ని, అస్తిత్వాన్ని, ఆకాంక్షలనే కాకుండా మనలను మనం మరిచినట్టే’’అని పేర్కొన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక చైర్మన్ గురజాల రవీందర్రావు మాట్లాడుతూ.. ఇక నుంచి అంతా జన సమితి సభ్యులుగానే ఉంటామన్నారు. కోదండరాం తెలంగాణకు దిక్సూచి అని చెప్పారు. మహిళలకు రాష్ట్ర కేబినెట్లో అవకాశం లేదని, దళితులపై మొసలి కన్నీరు కారుస్తున్న సీఎంకు సిగ్గుండాలని వ్యాఖ్యానించారు. నేరేళ్ల ఘటనపై సీఎం ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై మాట్లాడుతున్న సీఎం నేరెళ్లలో దళితులపైకి ఇసుక మాఫియా లారీలను ఎక్కించి చంపితే ఏం చేస్తున్నారని అడ్వొకేట్ రచనారెడ్డి అన్నారు. గాదె ఇన్నయ్య మాట్లాడుతూ.. చలి చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరాయని, వాటిని అంతం చేయాలని పేర్కొన్నారు. చీమలదండులా జన సమితి బయలుదేరిందని చెప్పారు. పాలపిట్ట, ఆకుపచ్చ రంగు, మధ్యలో నీలిరంగులో తెలంగాణ చిత్రపటం, వాటి మధ్య అమరవీరుల స్థూపంతో పార్టీ జెండాను రూపొందించారు. జెండాను రాజేశ్, లోగోను చింతా స్వామి రూపొందించారు. 29న నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావ సభ పోస్టర్, కరపత్రాన్ని కోదండరాం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజేష్, చింత స్వామిలను సత్కరించారు. -
ప్రత్యామ్నాయమే పరమావధి
సందర్భం ప్రొఫెసర్ జయశంకర్ ఇలాంటి పరిణామాలను ముందే ఊహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత అభివృద్ధి కోసం ప్రత్యేకంగా పోరాటం చేయవలసి ఉంటుందని ఆయన ఆనాడే చెప్పారు. వారి ఆదేశాల ప్రకారమే తెలంగాణ జేఏసీ ప్రజలు కేంద్రంగా కల, ప్రజాస్వామిక విలువల పునాది కల అభివృద్ధి కోసం అన్ని రకాలుగా ప్రయత్నం చేసింది. కానీ ఆచార్య జయశంకర్ అన్నట్టు భావవ్యాప్తి, ఆందోళన కార్యక్రమాలకు రాజకీయ ప్రక్రియతోనే ముగింపు సాధ్యపడుతుంది. వర్తమాన తెలంగాణలో, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అందించిన చైతన్యం వెలుగులో రాజకీయాలను పునర్నిర్వచించుకోవలసిన అవసరం ఉన్నది. సరళీకరణ నేపథ్యంలో రాజకీయాలు వికృతరూపాన్ని సంతరించుకున్నాయి. అధికారం వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలను సాధించుకోవడానికి పెట్టుబడి లేని వ్యాపారంగా మారిపోయింది. ప్రభుత్వాధికారాన్ని గుప్పెడుమంది కలసి వనరులను కొల్లగొట్టడానికి సాధనంగా వాడుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమం కేవలం ఒక భౌగోళిక తెలంగాణ ఏర్పాటుకు పరి మితమై సాగలేదు. సరళీకరణ రాజకీయాలనే ఈ ఉద్యమం వ్యతిరేకించింది. సమష్టి సంపద ప్రజలందరికీ ఉపయోగపడాలని, ఆ విధంగా వనరులను ప్రజల అవసరాలు తీర్చే విధంగా వినియోగంలోకి తేవాలని తెలంగాణ వాదం తేల్చి చెప్పింది. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలు అందరి కోసం పనిచేయాలి. కొందరి స్వార్ధ ప్రయోజనాలకు అధికారాన్ని ఉపయో గించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని తెలంగాణ ఉద్యమం బలంగా విశ్వసించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం చరిత్రాత్మక పంథాలో ఉద్యమం సాగించిన సంస్థ తెలంగాణ రాష్ట్ర సమితి. తరువాత ఉద్యమం నడిపిన సంస్థే రాజకీయ పార్టీగా అవతరించి అధికారంలోకి వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ స్ఫూర్తిని విస్మరించి ప్రభుత్వపరంగా నిలబెట్టవలసిన ప్రజా స్వామిక విలువలకు వ్యతిరేకంగా సాగుతున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ ప్రజలు కోరుకున్నట్టు పాలకులు మారిపోయారు. కానీ పాలనలో మార్పు రాలేదు. ముఖ్యమంత్రి నిరంకుశంగా, రాచరిక పద్ధతుల్లో పాలన కొనసాగిస్తున్నారు. అన్ని పాలనా వ్యవస్థలు, అన్ని సంస్థలు కుప్పకూలిపోయాయి. సచివా లయం నిరర్థకమైంది. నిర్ణయాలన్నీ ముఖ్యమంత్రి నివాసంలో జరుగు తాయి. మంత్రులతో సంబంధం లేకుండానే ముఖ్యమంత్రి ఆయా శాఖల వ్యవహారాలను సమీక్షిస్తారు. ఇష్టారాజ్యంగా నిర్ణయాలు చేస్తారు. శాసన సభ్యులు, మంత్రులే ముఖ్యమంత్రి దర్శనం కోసం పడిగాపులు పడి ఉండ వలసిన పరిస్థితి. ఇక సాధారణ ప్రజలకు ముఖ్యమంత్రిని కలుసుకునే వెసు లుబాటు ఎక్కడ దొరుకుతుంది? ఇక ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి కాగ్ బోలెడంత సమా చారం ఇచ్చింది. విద్య, వైద్య రంగాలకు తక్కువ కేటాయింపులు చేశారు. ఇది అవాంఛనీయ పరిణామం. కానీ ఆ తక్కువ కేటాయింపులను కూడా ఖర్చు చేయలేదు. వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం కోసం మంజూరైన నిధులలో సగం కూడా ఖర్చు కాలేదు. పెట్టుబడి వ్యయంలో 80 శాతం దాకా రోడ్లు, ప్రాజెక్టులు, చెరువుల మరమ్మతులకు వినియోగమ య్యాయి. అయితే అవీ దారి మళ్లాయి. ఎక్కడ బడా కాంట్రాక్టర్లు ఉన్నారో, అక్కడే ఖర్చయినాయి. ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్టుపై అనుకున్న దాని కన్నా ఎక్కువ ఖర్చయితే, పాలమూరు ఎత్తిపోతల పథకం కోసం మంజూరు చేసిన నిధులు మురిగిపోయాయి. చెరువుల మరమ్మతుల విషయంలో పూడిక తీత పనులు సగం కూడా పూర్తికాలేదు. ప్రశ్నిస్తే తప్పేమిటి? తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిదంటూ ఆక్రోశిస్తున్న జనసమూహా నికి ముందు నిలబడి వారి ఆకాంక్షల కోసం పనిచేసిన సంస్థ తెలంగాణ రాష్ట్ర సమితి. కానీ ప్రభుత్వంలోకి ప్రవేశించిన తరువాత అదే సంస్థ ప్రవర్తిస్తున్న తీరు విస్తుపోయేటట్టు ఉంటున్నది. ఉద్యమ సంస్థ పాలనలో ప్రశ్నించడాన్ని భరించలేని వాతావరణాన్ని సృష్టించారు. ప్రభుత్వ పాలనలోని అవకతవకల గురించి గొంతెత్తిన వారిని అణచివేయడానికే తెరాస ప్రభుత్వం పూను కున్నది. హైదరాబాద్‌లో ఇందిరాపార్క్ వద్ద చిరకాలం నుంచి ఉన్న ధర్ణా చౌక్‌ను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మూసివేశారు. బహిరంగ సభల నిర్వహణకు వేదికలు లేవు. సెక్షన్ 30, సెక్షన్ 144లను అనేక జిల్లాలలో విచ్చ లవిడిగా ఉపయోగిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి, ఉమ్మడి ఆలోచనల వ్యక్తీకరణకు రోడ్ల మీదకు వచ్చిన వారిని అందరినీ అరెస్టు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఎవరు నిలదీసినా జైలు పాలవుతున్నారు. అధికారం సొంత ఆస్తి అయినట్టు ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. నాటి రాజులు భావించిన తీరులోనేæ ప్రజలకు హక్కులు ఉండవనీ, పాలకులకు వారు లొంగి ఉండి వారి అధికారాన్నీ అదేశాలనూ శిరసావహించడమే ప్రజలు బాధ్యతగా స్వీక రించాలనీ ముఖ్యమంత్రిగారు భావిస్తున్నారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా.. నిరంకుశ పాలనా రీతులను తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తున్నది. ఒక వ్యక్తి ఆధిపత్యం సరికాదు, పాలనలో అందరికీ భాగస్వామ్యం ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. సమాజ వనరులు సమష్టి ప్రయోజనాలకే ఉపయో గపడాలి తప్ప గుప్పెడుమంది పాలకుల సొంత ఆస్తి కాకూడదని తెలంగాణ సమాజం ఆశిస్తున్నది. ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు నిరంకుశ పాలనకు మధ్య సంఘర్షణ తలెత్తింది. ఆధునిక ప్రజాస్వామ్య సమాజంలో, అదీ సుదీర్ఘ ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణలో రాజకీయాలు ప్రజల ఆకాంక్షల వ్యక్తీక రణకు ఉపయోగపడాలి. అంతేతప్ప ప్రజాస్వామిక సంప్రదాయాలను, ఉద్యమ ఆకాంక్షలను అణచడానికి దారితీస్తే తెలంగాణ సమాజం అంగీకరిం చదని చరిత్ర చెబుతున్నది. అనేకానేక సమస్యలు ఇవ్వాళ అపరిష్కృతంగా ఉన్నాయి. వ్యవసా యంలో మిగులు లేదని, నష్టాలపాలై పోతున్నామని ఆవేదన చెందుతున్న రైతులను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. డిగ్రీ దాకా చదివిన యువతీ, యువకుల్లో అతి ఎక్కువ నిరుద్యోగులున్న రాష్ట్రాలలో అస్సాం, జమ్మూ కశ్మీర్ తరువాత మనది మూడవ స్థానం. అయినా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి విధానాలు తయారు కాలేదు. ఖాళీ అయిన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏ స్థాయిలోను చర్యలు లేవు. వృత్తులను కాపాడటానికి ప్రభుత్వం వ్యూహ రచన చేయనే లేదు. నాలుగేళ్లలో కనీస వేతనాలను సవరించే ఒక్క ప్రభుత్వ ఉత్తర్వు రాలేదు. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్య అపరిష్కృతంగానే ఉన్నది. ఖాయిలా పడిన నిజాం షుగర్స్‌ను తెరిపించడానికి చర్యలే లేవు. ఈ లోపాలు సరి చేయడానికి తెలంగాణ జేఏసీ, ప్రజా సంఘాలు అనేక పోరాటాలు చేసినాయి. కానీ ఫలితం దక్కలేదు. అభివృద్ధి నమూనాపై చర్చిం చడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడలేదు. ప్రభుత్వ వైఖరికి మూలకారణం అధికారపార్టీ రాజకీయాలే మూలమనేది స్పష్టం. ప్రత్యామ్నాయం కోసం యత్నం సమాజంలో వ్యవస్థల నిర్మాణానికి పునాది వేసేది రాజకీయాలు. అన్ని వనరుల పంపిణీని రాజకీయాలే నిర్ధారిస్తాయి. మార్పునకు మార్గ నిర్దేశన చేసేవే రాజకీయాలు. రాజకీయాలు జవాబుదారీతనంతో, ప్రజాస్వామిక విలువల ప్రాతిపదికన జరిగితే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి. కాంట్రా క్టర్లు, కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు కేంద్రంగా రాజకీయాలు సాగితే అప్పుడు ప్రజల ఆకాంక్షలకు గుర్తింపు ఉండదు. మార్పును సాధించగల రాజకీయ నాయకులు పైసల ఆశతో సంతలో పశువులు అమ్ముడు పోయినట్లు అమ్ముడు పోతున్నారు. చాలామంది ప్రభుత్వ ఒత్తిడికి లొంగి మౌనంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ప్రయత్నం చేయ వలసి వస్తున్నది. అందుకే పార్టీని ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలపట్ల జవా బుదారీ తనంతో వ్యవహరించకపోతే, సమష్టి ప్రయోజనాల కోసం ప్రభు త్వాన్ని నడిపించే ప్రయత్నం చేయకపోతే సమాజ రుగ్మతలకు పరిష్కారం దొరకదు. కంచె చేను మేసినట్లు, పాలించేవాడే ప్రజలను విస్మరిస్తే ఉద్యమ ఆకాంక్షలు నెరవేరవు. ఆచార్య జయశంకర్ బాటలో ప్రొఫెసర్ జయశంకర్ ఇలాంటి పరిణామాలను ముందే ఊహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత అభివృద్ధి కోసం ప్రత్యే కంగా పోరాటం చేయవలసి ఉంటుందని ఆయన ఆనాడే చెప్పారు. వారి ఆదేశాల ప్రకారమే తెలంగాణ జేఏసీ ప్రజలు కేంద్రంగా కల, ప్రజాస్వామిక విలువల పునాది కల అభివృద్ధి కోసం అన్ని రకాలుగా ప్రయత్నం చేసింది. కానీ ఆచార్య జయశంకర్ అన్నట్టు భావవ్యాప్తి, ఆందోళన కార్యక్రమాలకు రాజకీయ ప్రక్రియతోనే ముగింపు సాధ్యపడుతుంది. రాజకీయరంగంలో ప్రజల ఆకాంక్షలను బలంగా వ్యక్తీకరించగలిగిన వేదిక లేకపోతే అన్ని ప్రయ త్నాలు, ఉద్యమాలు సంపూర్ణ ఫలితాలను సాధించలేవు. రాజకీయ రంగాన్ని విస్మరిస్తే అన్ని ఉద్యమాలు విఫలమయ్యే ప్రమాదం ఉంది. ఈ అనుభవాల నుంచే తెలంగాణ జేఏసీ గాని, ఇతర ప్రజా సంఘాలు కానీ ప్రత్యామ్నాయ రాజకీయాలను పాదుకొల్పే ప్రయత్నాన్ని మొదలుపెట్టాయి. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వెలుగులో రాజకీయాలను పునర్ నిర్వ చించాలి. ఉద్యమ కాలంలో ప్రజలు రాజకీయాలను శాసించారు. తమ వెంట రాని నాయకుల వెంటపడినారు. తెలంగాణ సాధన కోసం నాయకులు కదిలి వచ్చేటట్టు చేయగలిగినారు. ఇవ్వాళ ప్రజాస్వామిక ఆకాంక్షల సాధనకై రాజ కీయాలలో మార్పు తేవాలి. ప్రజలందరూ గౌరవంతో జీవించగల, ప్రజలు కేంద్రంగా కల అభివృద్ధి కోసం మనం రాజకీయాలను మార్చాలి. దాని కోసం తెలంగాణ జన సమితిని ఏర్పాటు చేస్తున్నాం.ప్రత్యామ్నాయ రాజకీయాలే తెలంగాణ జనసమితి లక్ష్యం. జనం కోసమే జన సమితి–ప్రగతి కోసమే పాలన అన్న నినాదం మాకు మార్గదర్శకం. ప్రొ‘‘ యం. కోదండరాం వ్యాసకర్త తెలంగాణ జన సమితి అధ్యక్షులు -
ప్రజల తెలంగాణను ఆవిష్కరిస్తాం
-
ప్రజల తెలంగాణను ఆవిష్కరిస్తాం
హైదరాబాద్: ప్రజలు కోరుకున్న తెలంగాణను ఆవిష్కరించేందుకు రాజకీయంగా ముందుకు వస్తున్నామని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కోదండ రాం నేతృత్వంలో ఏర్పాటయ్యే కొత్త పార్టీలో పనిచేస్తామంటూ మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్‌తోపాటు పలువురు అనుచరులు సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. దిలీప్ తన అనుచరులనుకోదండరాం కు పరిచయం చేశారు. కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే ప్రత్యామ్నాయ రాజకీయశక్తి అవసరమని భావించామన్నారు. వారం తర్వాత కొత్త పార్టీ ప్రకటన కొత్త పార్టీ నిర్మాణానికి చర్యలు ప్రారంభించామని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరో వారం రోజుల్లో పూర్తవుతుందని, అప్పుడే పార్టీని ప్రకటిస్తామని కోదండరాం అన్నారు. ఇప్పటికే పార్టీ నిర్మాణాన్ని ప్రారంభించామని చెప్పారు. తెలంగాణ వస్తే మార్పు జరుగుతుందని, పిల్లలకు ఉచితంగా చదువులు, వైద్యం అందుతుందని, వ్యవసాయం బాగుపడుతుందని భావించామని, కాని ఆ పరిస్థితులు కానరావడంలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్రటేరియేట్‌కు వెళ్లడం లేదని, కనీసం ఆయన ఇంటి వద్ద ధర్మదర్శనానికి కూడా అవకాశం లేకుండా పోయిందన్నారు. దిలీప్‌కుమార్ మాట్లాడుతూ తాను ఏ పదవిని ఆశించి రాలేదని, ప్రజలు కోరుకున్న తెలంగాణ కోసం కోదండరాంతో కలసి పనిచేయడానికి వచ్చానని తెలిపారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ మాజీ అధ్యక్షుడు మహ్మద్ రియాజ్, మాజీ గౌరవాధ్యక్షురాలు కపిలవాయి ఇందిర, ఆకుల శ్రీనివాస్, సుబ్రమణ్యం, రవీందర్, విశాల్, మల్లేశ్, పార్థసారథి, జ్యోష్న, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. -
ట్యాంక్‌బండ్ అష్ట దిగ్బంధం
సాక్షి, హైదరాబాద్: మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌ను పోలీసులు అష్టదిగ్బంధం చేశారు. శనివారం తెలంగాణ జేఏసీ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ఈ సభకు పోలీసులు ఇప్పటికే అనుమతి నిరాకరించారు. అయినా నిర్వహించి తీరతా మని ఆయా పార్టీల నేతలు ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్‌కు దారితీసే మార్గాలన్నింటినీ ముళ్లకంచెలతో మూసివేశారు. ఇందిరాపార్కు సమీపంలోని కట్ట మైసమ్మ టెంపుల్ వద్ద నుంచి మెట్ల ద్వారా పైకి వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేశారు. గోశాల వద్ద కూడా ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఘాట్ వద్ద రోడ్డు మూసివేసి లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా రాకపోకలను నియంత్రించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి ట్యాంక్‌బండ్‌పై రాకపోకలను పూర్తిగా నియంత్రించనున్నట్లు పోలీసులు తెలిపారు. అటు సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాయకుల నివాసాల వద్ద నిఘా హిమాయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం, విద్యానగర్‌లోని న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యాలయాల వద్ద పోలీసులు మఫ్టీలో నిఘా పెట్టారు. తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకులు నలమాస కృష్ణ, రవిచంద్రలను నారాయణగూడలో వారి నివాసాల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తార్నాకలో ప్రొఫెసర్ కోదండరాం ఇంటి చుట్టూ మఫ్టీ పోలీసులు మోహరించారు. అర్ధరాత్రి తర్వాత ఏ సమయంలోనైనా ఆయన్ను అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని న్యూడెమోక్రసీ నాయకులు రాంచంద్రయ్య, లింగ్యాలతోపాటు మరో 150 మందిని అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లా పీడీఎస్‌యూ నాయకులు సురేశ్‌ను కాకతీయ వర్సిటీలో ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఇక ఖమ్మం, భువనగిరి,కొత్తగూడెం తదితర జిల్లాల సీపీఐ కార్యదర్శులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. విద్యానగర్‌లోని మార్క్స్ భవన్ వద్ద పీవోఎల్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మేష్‌ను శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. చాలామంది నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అడుగడుగునా బలగాలు నగర పోలీసులు, రాష్ట్ర, కేంద్ర బలగాలతో కలిపి మొత్తం 12 వేలకు పైగా సిబ్బందితో రాజధాని నగరాన్ని దాదాపు అష్టదిగ్బంధనం చేశారు. ఓయూతోపాటు కొన్ని సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన అ«ధికారులు వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 3 వేల మందిని నియమిస్తున్నారు. ర్యాలీలు జరుగుతాయని భావిస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో చోటుచేసుకున్న ఉదంతాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా రూఫ్ టాప్ వాచ్, ఎక్కడికక్కడ కార్డన్ ఏరియాలను ఏర్పాటు చేశారు. నగరంలోని కీలక ప్రాంతాల్లోని ఎత్తైన భవనాలపై బైనాక్యులర్లతో ప్రత్యేక సిబ్బందిని నియమించారు. సమాచార మార్పిడి కోసం వీరికి సెల్ఫోన్లు, మాన్‌ప్యాక్(వైర్లెస్ సెట్స్) అందించారు. మూడు కమిషనరేట్లలో ఉన్న సిబ్బందికి ‘స్టాండ్ టు’ప్రకటించి కచ్చితంగా విధుల్లో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. అశ్వక దళాలు, టియర్ గ్యాస్ స్క్వాడ్స్, వాటర్ క్యానన్స్, వజ్ర వాహనాలను అందుబాటులో ఉంచుతున్నారు. మిలియన్ మార్చ్‌లో పాల్గొనేందుకు వచ్చే వారిని అడ్డుకునేందుకు శివారు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. నగరంతోపాటు శివార్లలో మొత్తం 350 పోలీసు చెక్‌పోస్టులు, పికెట్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు. నిర్వహించి తీరుతాం టీజేఏసీ చైర్మన్ కోదండరాం ప్రభుత్వం మిలియన్ మార్చ్ స్ఫూర్తి యాత్రకు అనుమతి నిరాకరించినా నిర్వహించి తీరుతామని టీజేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి ఆయన తార్నాకలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ చరిత్రలో మిలియన్ మార్చ్‌ను గుర్తు చేసుకునేందుకు స్ఫూర్తి యాత్ర నిర్వహించేందుకు అనుమతి కోరామన్నారు. ప్రభుత్వం దాన్ని అడ్డుకోవడం దారుణమన్నారు. సీఎం ఆందోళనలకు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద అనుమతులు కావాలి కానీ చరిత్రను గుర్తుచేసుకునే ఈ సభకు అనుమతి నిరాకరించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభకు అనుమతి లేదు. ట్యాంక్‌బండ్‌పై ఎవరైనా సభ లు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే అరెస్టు చేస్తాం. మధ్య మండలంలోని కీలక ప్రాంతాలకొచ్చే వాహనాలను తనిఖీలు చేస్తాం. ట్యాంక్ బండ్‌పై రాకపోకలపై శనివారం ఉదయం నిర్ణయం తీసుకుంటాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – జోయల్ డెవిస్, మధ్య మండల డీసీపీ -
అమరుల ఆశయసాధనకు ఉద్యమించాలి
ఆమనగల్లు: తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారి ఆశయ సాధన కోసం మనమంతా ఉద్యమించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మన బతుకుదెరువు కోసం ఉద్యమించక తప్పదన్నారు. ఆమనగల్లు మండలం కోనాపూర్ గ్రామంలో తెలంగాణ విద్యార్థి వికాస వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల ఆత్మగౌరవసభ సోమవారం జరిగింది. తెలంగాణ విద్యార్థి వికాస వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రం ఏర్పాటు కోసం 1200 మంది ఆత్మహత్య చేసుకున్నారని, అమరుల ఆత్మబలిదానం, అనేక పోరాటాల ఫలితమే తెలంగాణ రాష్ట్రమని ఆయన అన్నారు. పారిశ్రామిక రంగంలో చిన్న కంపెనీలను తీసుకువచ్చి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు. ప్రభుత్వం విషం వెదజల్లే కంపెనీలను ఏర్పాటు చేయడాన్ని విరమించుకోవాలని ఆయన కోరారు. కంపెనీల కోసం రైతుల భూములను గుంజుకుని బతుకుదెరువుకు దూరం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మూడు ఏళ్లుగా వ్యవసాయ రంగం నష్టాలలో ఉందని, దీంతో రైతులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3800 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, సిద్దిపేట జిల్లాలోనే రైతు ఆత్మహత్యలు అధికమని ఆయన అన్నారు. ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులపైనే దృష్టి సారించి నిధులు ఖర్చు చేస్తున్నదని ఆయన ఆరోపించారు. వెనుకబడిన పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు అందించడానికి ప్రభుత్వం దగ్గర సరైన ప్రణాళిక లేదని ఆయన విమర్శించారు. కొన్ని నెలలుగా సచివాలయానికి సీఎం రావడం లేదని సచివాలయానికి రాని సీఎంగా కేసీఆర్ గిన్నీస్‌బుక్ రికార్డు సాధిస్తారేమో అని ఆయన ఎద్దేవా చేశారు. జయశంకర్‌సార్ చెప్పిన విధంగా తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ కోసం పోరాడామని, ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం పోరాడుతామని ఆయన చెప్పారు. తలకొండపల్లి సమీపంలో ఏర్పాటు చేయదలచిన డంపింగ్‌యార్డు ఏర్పాటును విరమించుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో టీజేఏసీ కో కన్వీనర్ పురుషోత్తం, అధికార ప్రతినిధి వెంకట్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ చల్మారెడ్డి, జేఏసీ నాయకులు బాలాజీసింగ్, యాదిలాల్, పాపిశెట్టి రాము, రాజు, కుమార్, రాములు, శ్రీను, సంజీవ, గణేశ్, వీరేశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటాపాట కార్యక్రమం ఆకట్టుకుంది. -
చాలా అన్యాయమైన రీతిలో వ్యవహరించారు
-
సర్కార్‌పై పోరాడే దమ్ము జేఏసీకుంది: కోదండరాం
సాక్షి, సంగారెడ్డి: ప్రజా సమస్యల పరి ష్కారం కోసం ప్రభుత్వంతో పోరాడే దమ్ము, ధైర్యం, ఆత్మవిశ్వాసం టీజేఏసీకి మెండుగా ఉన్నాయని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తనపై జేఏసీ నేతలు పిట్టల రవీందర్, మరికొందరు చేసిన విమర్శలపై స్టీరింగ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. టీజేఏసీ, ఎంపీజే సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సంగారెడ్డి ఇస్లామిక్ స్టడీ సెంటర్లో ‘సుధీర్ కమిటీ’సిఫార్సులపై జరిగిన సదస్సులో కోదండరాం ప్రసంగించారు. సుధీర్ కమిటీ నివేదిక ముస్లింల స్థితిగతులకు అద్దం పట్టిందన్నారు. వారికి రిజర్వేషన్లను 12 శాతానికి పెంచాలన్న సిఫార్సుల అమలుకు ప్రయత్నిస్తామన్నారు. ఉర్దూను రెండో భాషగా అమలు చేయడంతోపాటు, ప్రభుత్వ ఉద్యోగాల్లో వివక్షను తొలగించేందుకు ‘సమాన అవకాశాల కమిటీ’వేయాలన్నారు. -
గాలికి పోయేవాళ్లం కాదు
ఎన్ని నిర్బంధాలు విధించినా పోరాడుతాం: కోదండరాం ► ర్యాలీ విజయవంతమైంది ► సమస్య తీవ్రత అందరికీ అర్థమైంది ► ముస్లింల సమస్యలపై జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తాం సాక్షి, హైదరాబాద్: ప్రశ్నించేవాళ్లు ఉండకూ డదని ప్రభుత్వంలో ఉన్నవారు కోరుకు న్నా.. తాము గాలికి కొట్టుకు పోయేవాళ్లం కాదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం పేర్కొన్నారు. ఎన్ని నిర్బం ధాలు విధించినా పోరాటాలు ఆగవని స్పష్టం చేశారు. గురువారం కోదండరాం నివాసంలో టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. నిరుద్యోగ నిరసన ర్యాలీపై ప్రభుత్వ నిర్బంధం, అరెస్టులు, అనంతరం పరిణామాలు తదితర అంశాలపై అందులో చర్చించారు. అనంతరం కోదండరాం విలేకరులతో మాట్లాడారు. నిరుద్యోగ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని... ఈ తీవ్రతను ప్రపంచానికి చాటి చెప్పాలనే తమ లక్ష్యం సంపూర్ణంగా నెరవేరిందని ఆయన చెప్పారు. ర్యాలీ, సభ విషయంలో సంఘీ భావంగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కుల ప్రకారం నిరసన తెలపడానికి తాము శాంతియుతంగా ర్యాలీ చేస్తామంటే అనుమతి ఇవ్వలేదన్నారు. అర్ధరాత్రి అరెస్టులు చేయడం అత్యంత దారుణమని విమర్శించారు. అర్ధరాత్రి తమ ఇంటిపైకి వచ్చి, తలుపులు విరగ్గొట్టి మరీ అరెస్టు చేయాల్సిన పరిస్థితులు, అవసరం ఎందుకు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. తమను ఏ పోలీస్‌స్టేషన్‌లో పెట్టారో కూడా తెలియనివ్వకుండా రహస్యంగా ఉంచా ల్సిన అవసరమేమిటని నిలదీశారు. భూనిర్వాసితుల సమస్యపై రాష్ట్రపతిని కలుస్తాం పోలీస్‌స్టేషన్‌లో తమను కలవడానికి వచ్చిన వివిధ పార్టీల నేతలను కూడా పోలీ సులు అరెస్టు చేయడం దుర్మార్గమని కోదండరాం అన్నారు. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించినా, పోలీసులతో వేధింపులకు గురిచేసినా పట్టించుకోవాల్సి న అవసరం లేదన్నారు. 5 వేల మందిని అరెస్టు చేయడం, వేలాది మంది పోలీసులను మోహరించడం ఎలాంటి సంకేతమో ప్రజలకు తెలుసునని చెప్పారు. ఉస్మాని యా, కాకతీయ వర్సిటీల్లోని హాస్టళ్ల వద్ద సాయుధ బలగాలను పెట్టారని, నాయకులు, నేతల ఇళ్లపై పడి అరెస్టులు చేశారని... అయినా నిరసన ప్రదర్శన జరిగిందన్నారు. మొత్తంగా జేఏసీ ప్రతిపాదించిన అంశంపై పెద్దఎత్తున చర్చ జరిగిందని, తాము సంపూర్ణ విజయం సాధించామని చెప్పా రు. స్వామి అగ్నివేశ్, యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ వంటివారు తమకు ఫోన్లు చేసి, టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఖండించారన్నారు. భూనిర్వాసితుల సమ స్యపై త్వరలోనే రాష్ట్రపతిని కలుస్తామని తెలిపారు. ముస్లింల సమస్యలపై సుధీర్ కమిటీ సిఫార్సులను అమలుచేయాలని కోరుతూ జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తా మని.. మార్చి 1న మహబూబ్‌నగర్‌లో, 4న నిజామాబాద్‌లో వాటిని ఏర్పాటు చేస్తున్నా మని వెల్లడించారు. ఈ సమావేశంలో జేఏసీ నేతలు కె.రఘు, ప్రహ్లాదరావు, వెంకటరెడ్డి, ఇటిక్యాల పురుషోత్తం, భైరి రమేశ్, గోపాల శర్మ, గురజాల రవీందర్ తదితరులు ఉన్నారు. -
'22న ర్యాలీ నిర్వహించి తీరుతాం'
కరీంనగర్ : 'మా కొలువులు మాకు కావాలి' పేరుతో ఈ నెల 22న చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నట్లు జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం తెలిపారు. కరీంనగర్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ యువత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ( చదవండి : సతాయిస్తే వెనక్కి తగ్గుతామా? ) ప్రభుత్వం నుంచి అనుమతి రాకున్నా ర్యాలీ నిర్వహించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికే ఈ ర్యాలీ చేపడుతున్నామన్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్కు వరకు నిరసన ర్యాలీ నిర్వహించి.. ఇందిరాపార్కు వద్ద భారీ సభ నిర్వహిస్తామని కోదండరాం తెలిపారు. -
నిరుద్యోగులకు తెలంగాణలోనూ అన్యాయమే
టీజేఏసీ చైర్మన్ కోదండరాం కూసుమంచి(పాలేరు): తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగులకు అన్యాయమే జరుగుతోందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో జరుగుతున్న తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్రస్థాయి సదస్సు ఆదివారం ముగిసింది. సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషిచేయడమే తన అభి మతమన్నారు. ప్రభుత్వంలోని కొందరు తాము లక్ష ఉద్యోగాలు ఇస్తాం కానీ అవకాశం ఉన్నప్పుడు అని ప్రకటించటం పద్ధతికాదన్నారు. ఉద్యోగాల భర్తీపై సీఎంను కలిశారా అని విలేకరులు ప్రశ్నించగా.. సీఎంను కలవడమంటే దేవుడికి ఉత్తరం రాసినట్లేనని చమత్కరించారు. కొత్తగా రాజకీయ పార్టీ పెడుతున్నారనే వదంతులపై స్పందిస్తూ.. ‘నేను దీనిపై ఆలోచించలేదు. ఏదైనా ఉంటే మీడియాకు చెబుతా’అని ముగించారు. -
లభించని కడియం అపాయింట్మెంట్..
కలవలేకపోయిన కోదండరాం సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యు కేషన్లో (బీఎడ్) ప్రవే శాల కోసం రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించే విషయమై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో చర్చించేందుకు బుధవారం సచివాలయానికి వచ్చిన టీజే ఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంకు మంత్రి అపాయింట్మెంట్ లభించలేదు. బీఎడ్ కాలేజీ యాజమాన్య ప్రతినిధులతో సచివాలయానికి బయలుదేరిన ఆయన ఫోన్లో కడియం శ్రీహరి పేషీకి ఫోన్ చేసి, అపాయింట్మెంట్ కావాలని కోరారు. అయితే అప్పటికే డిప్యూటీ సీఎం.. వీసీల సమావేశంలో ఉండటంతో అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఆ తరువాత సచివాల యంలోని ఉప ముఖ్యమంత్రి పేషీకి బీఎడ్ కాలేజీ ప్రతినిధులు వచ్చి అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించారు. అప్పుడూ వీసీల సమావేశంలోనే కడియం ఉండ టంతో కలిసేందుకు అవకాశం కుదరలేదు. దీంతో కోదండరాం సచివాలయంలోని ఇతర విభాగాల అధికారులను వేరే సమస్యలపై కలిసి వెళ్లిపోయారు. -
‘డాక్టర్’ మారితే మేలు
► సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి కోదండరాం వ్యాఖ్య ► పాలకుల ఇష్ట ప్రకారం కాదు.. ప్రజలకు తగ్గ పాలన ఉండాలి ► భూ నిర్వాసితుల హక్కుల పరిరక్షణకు 29న ధర్నా ► తెలంగాణ జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయం ► రాజకీయ నేతలను లోకాయుక్త పరిధిలోకి తేవాలి ► ఫిరాయింపుల చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ‘పాలకుల ఇష్ట ప్రకారం కాదు, ప్రజల అవసరాలకు తగినట్టుగా పరిపాలన ఉండాలి. ఒక డాక్టరు మందు ఇవ్వకుంటే ఇంకొక డాక్టర్ దగ్గరకు పోకుండా ఉంటమా? ఇప్పుడున్న డాక్టరు వైఖరిని మార్చుకుంటారని ఆశిస్తున్నా. డాక్టరు వైఖరి మారకుంటే ఏమైతదో మీరే చూస్తరు’అని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం వ్యాఖ్యానించారు. తెలంగాణ జేఏసీ విస్తృతస్థాయి సమావేశం హైదరాబాద్‌లో ఆదివారం జరిగింది. కోదండరాం అధ్యక్షతన జరిగిన సమావేశంలో పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకున్నారు. ప్రజా సమస్యలు, వివిధ అంశాలపై భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కోదండరాం విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజా సంక్షేమాన్ని, రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోవడంలేదని, ప్రజలు పార్టీలకతీతంగా పునరంకిత ఉద్యమానికి నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రామస్థాయి నుంచి నిర్మాణం చేసుకుంటున్నామని, సామాజిక తెలంగాణ కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తామని ప్రకటించారు. అవసరమైతే ఎంత పెద్ద ఉద్యమాలకైనా సిద్ధమని ప్రకటించారు. ఉద్యోగులు, రైతులు, మహిళా సమస్యలపై కచ్చితంగా నిలబడతామని స్పష్టం చేశారు. భూసేకరణ చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుకు వ్యతిరేకంగా, 2013 చట్టానికి తూట్లు పొడిచే చర్యలకు వ్యతిరేకంగా నిర్వాసితుల హక్కుల కోసం పోరాడుతామన్నారు. నిర్వాసితుల హక్కులను కాపాడుకోవడానికి ఈ నెల 29న ధర్నా చేపడతామని ప్రకటించారు. ‘నాయకుల’ను లోకాయుక్త పరిధిలోకి తేవాలి రాజకీయ నాయకులను లోకాయుక్త పరిధిలోకి తీసుకురావాలని కోదండరాం డిమాండ్ చేశారు. జనవరిలో విద్యా రంగ సమస్యలపై అధ్యయనంతోపాటు వివిధ కార్యక్రమాలను చేపడతామన్నారు. ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం ఫిబ్రవరిలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మార్చిలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథపై అధ్యయనం చేసి, నివేదికను ప్రజల ముందుపెడతామన్నారు. ఏప్రిల్‌లో చిన్న, సూక్ష్మ పరిశ్రమలపై అధ్యయనం, కార్యక్రమాలు చేపడుతామని చెప్పారు. ప్రైవేటు యూనివర్సిటీలను ఏర్పాటు చేయవద్దని, ప్రభుత్వ వర్సిటీలు, చిన్న పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ బకాయిలను చెల్లించాలని, హెల్త్‌కార్డులను ఇవ్వాలని, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరారు. రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేయాలని, ధాన్యం కొనుగోలుకు కృషి చేయాలని, వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలకు చట్టబద్ధంగా దక్కిన భూమిని గుంజుకుంటున్నారని, వారి భూములను తిరిగివ్వాలని కోరారు. మహిళలకు సాధికారత, భద్రత కల్పించాలని, ప్రభుత్వంలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఫిరాయింపులపై స్పీకర్‌దే బాధ్యత సమైక్య రాష్ట్రంలో విలువల్లేని రాజకీయాలున్నాయని, తెలంగాణ రాష్ట్రంలోనైనా విలువలతో కూడిన రాజకీయాలు ఉంటాయని ఆశించామని కోదండరాం పేర్కొన్నారు. రాష్ట్రంలో విలువలతో కూడిన రాజకీయాల్లేవని విమర్శించారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అమలు చేయాల్సిందేనని, ఆ బాధ్యత స్పీకర్‌పై ఉందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సిటిజన్ చార్టర్‌ను చట్టబద్ధం చేసి, అమలు చేయాలని డిమాండ్ చేశారు. లోకాయుక్త వ్యవస్థను పెంపొందించాలని, రాజకీయ నాయకులను దీని పరిధిలోకి తేవాలని కోరారు. జోనల్ వ్యవస్థ రద్దుతో తీవ్ర పరిణామాలు జోనల్ వ్యవస్థతో తీవ్ర నష్టం, నిరుద్యోగులపై తీవ్రమైన పరిణామాలుంటాయని కోదండరాం ఆందోళన వెలిబుచ్చారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా పోయే ప్రమాదముందన్నారు. దీనిపై నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయాలని, నివేదిక వచ్చిన తర్వాతనే జోనల్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని సూచించారు. నిరుద్యోగాన్ని రూపుమాపడమే లక్ష్యంగా ఆర్థిక విధానాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. జేఏసీపై ఉన్న విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేయాలని తీర్మానించినట్లు చెప్పారు. జేఏసీ నేత ముఖ్యమంత్రి అయినా.. వేదిక మీద ఉన్న జేఏసీ నేతల్లో ఎవరైనా ముఖ్యమంత్రి అయినా.. ప్రజల సమస్యల కోసం పని చేయడానికి జేఏసీ కొనసాగుతుందని కోదండరాం స్పష్టం చేశారు. పాలకులను వ్యతిరేకించడమే జేఏసీ లక్ష్యం కాదని, ప్రజల సమస్యల కోసం పాలకులను ప్రశ్నించడానికి పునరంకితమైన సంస్థ అని తెలిపారు. జేఏసీ రాజకీయ వేదిక కాదని, జేఏసీగానే కొనసాగుతుందని స్పష్టం చేశారు. సమస్యలపై అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదించి, ప్రజల్లో ప్రచారం చేసిన తర్వాత సమస్య పరిష్కారం కాకుంటే అవసరమైతే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. నిజాం షుగర్స్‌పై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన అసంబద్ధంగా ఉందన్నారు. ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, క్రమంగా రైతులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులకు పంచశీల సూత్రాలు నిర్దేశించారు. జేఏసీ పూర్తిస్థాయి కమిటీ ప్రొఫెసర్ కోదండరాం చైర్మన్‌గా తెలంగాణ జేఏసీకి పూర్తిస్థాయి కమిటీని ప్రకటించారు. కన్వీనర్‌గా పిట్టల రవీందర్, కో చైర్మన్లుగా నల్లపు ప్రహ్లాద్, ఖాజా మొహీనుద్దీన్, ఇటిక్యాల పురుషోత్తం, కో కన్వీనర్లుగా బిక్షపతి, డి.పి.రెడ్డి, వి.సంధ్య, జి.శంకర్, భైరి రమేశ్, తన్వీర్ సుల్తానా, అధికార ప్రతినిధులుగా జి.వెంకట్ రెడ్డి, గురజాల రవీందర్రావు, స్టీరింగ్ కమిటీ సభ్యులుగా ప్రభాకర్ రెడ్డి, మల్లికార్జున్, ముత్తయ్య, దేశపాక శ్రీనివాస్, విజేందర్ రెడ్డి, రామగిరి ప్రకాశ్ ఎన్నికయ్యారు. అలాగే ఎడిటోరియల్ కమిటీ, నిర్మాణ కమిటీ, ఫైనాన్స్ కమిటీ, పబ్లిసిటీ కమిటీలను కూడా ప్రకటించారు. -
టీఆర్ఎస్ పాలన సంతృప్తిగా లేదు
జేఏసీ చైర్మన్ కోదండరాం భీమదేవరపల్లి: రెండేళ్లు దాటినా టీఆర్ఎస్ పాలన అంత సంతృప్తిగా సాగడం లేదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో రచించిన ‘మా పోరాటం’ పుస్తకాన్ని శనివారం హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌బాబుతో కలిసి కోదండరాం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 25న హైదరాబాద్‌లో జేఏసీ కార్యవర్గ సమావేశంలో తాము అవలంబించే విధానాలు, భవిష్యత్ కార్యచరణ రూపొందించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో సన్న, చిన్నకారు రైతులతో పాటుగా చేతివృత్తులు చిన్నాభిన్నం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు వైద్యం, విద్య సైతం పూర్తిస్థాయిలో అందడం లేదని కోదండరాం అన్నారు. ప్రజల ఇబ్బందులను జేఏసీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వారి పక్షాన నిలుస్తుందన్నారు. నూతనంగా ఏర్పాటైన జిల్లాల్లో జేఏసీ కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజలకు మా విధానాలు చేరువ చేసేందుకు త్వరలో మాస పత్రిక, వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తామని వెల్లడించారు. -
కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వ్యయం !
హైదరాబాద్: తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనకరమా కాదా? అనే అంశంపై టీ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో ఇంజనీరింగ్ నిపుణులతో చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ కోదండరాం, అస్కీ మాజీ పరిశోధకులు గౌతమ్ షింగ్లే, విద్యుత్ రంగ నిపుణులు కె. రఘు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం నివేదికను గౌతమ్ షింగ్లే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.... కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఎకరాలకు సగటున 42 వేల నుంచి 73 వేల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. తుమ్మడి హెట్టి, మేడిగడ్డ రెండు చోట్ల నీటి లభ్యత దాదాపుగా సమానంగా ఉందన్నారు. ఎత్తిపోతల పథకానికి జలవిద్యుత్ లభ్యత నామమాత్రమేనని, కాళేశ్వరం ప్రాజెక్టుకు 4వేల 500 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందన్నారు. అన్ని ప్రాజెక్టులకు కలిపి 10 వేల మెగావాట్ల విద్యుత్ అవసరమన్నారు. ఆదాయం 4 వేల కోట్ల రూపాయలు, మొత్తం ప్రాజెక్టు వ్యయం ఖర్చు రూ.17 వేల కోట్లు, పెట్టుబడి వ్యయం రూ.71 వేల కోట్లు అవుతున్నట్లు నిపుణులు తేల్చారన్నారు. 1949 నుంచి ఇప్పటి వరకూ గోదావరిలో నీటిలభ్యతను పరిగణలోనికి తీసుకుని ఈ నివేదిక రూపొందించారని ఆయన తెలిపారు. ప్రతి ఏటా జూలై నుంచి అక్టోబర్ వరకు ఈ ప్రాజెక్టుకు నీరు లభిస్తుందన్నారు. కాళేశ్వరం మీద శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం ఇదని..అంతేకానీ జేఏసీ తయారు చేసింది కాదని కోదండరాం తెలిపారు. -
హోంగార్డులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి
-
వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలి
ప్రొఫెసర్ కోదండరాం హైదరాబాద్: రైతు ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఓ వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలని, ప్రస్తుతం తలెత్తున్న సమస్యల పరిష్కారానికి ఒక సమగ్ర వ్యవసాయ విధానం ఎంతో అవసరమని రైతు జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. అన్నదాతకు అండగా... కదులుదాం దండిగా.. అనే నినాదంతో అక్టోబర్ 2న తెలంగాణ రైతు జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద ‘మౌన దీక్ష’ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో దీక్ష పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. రోజూ మనకు తిండి పెట్టే అన్నదాతను ఆదుకోకపోతే ఈ సమాజమే బతకలేదని, కాబట్టి అందరూ ఈ దీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. భూమి, నీరు, విత్తనాలపై రైతులకు హక్కు ఉండాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని, రుణమాఫీ ఒకే దఫాలో చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిర్లక్ష్య, నియంతృత్వ పద్ధతిలో భూసేకరణ సాగుతుందని... మల్లన్న సాగర్ విషయంలో నిరంకుశ ధోరణి ఆపాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రాజెక్టులు కట్టేందుకు ఎవరూ వ్యతిరేకం కాదు.. ఎక్కడ కట్టాలి, ఎంత కట్టాలనేదానిపై చర్చ జరగాలన్నారు. రైతు జేఏసీ ప్రతినిధులు జలపతిరావు, విస్సా కిరణ్‌కుమార్, కన్నెగంటి రవి, భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధి అంజిరెడ్డి, టీజేఏసీ నేత పిట్టల రవీందర్, శ్రీధర్‌రెడ్డి, అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక రిజర్వేషన్లపై సమగ్ర చర్చ జరగాలి
ఈ చర్చను జోనల్ అంశానికి పరిమితం చేయటం సరికాదు ►జోనల్ వ్యవస్థ రద్దుపై హడావుడిగా నిర్ణయం తీసుకోవద్దు ► దీని వల్ల తెలంగాణ సమాజానికి దీర్ఘకాలిక నష్టం వాటిల్లుతుంది ► తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హైదరాబాద్: స్థానిక రిజర్వేషన్లకు సంబంధించిన చర్చను జోనల్ అంశానికి పరిమితం చేయటం సరికాదని, అన్ని అంశాలనూ కూలంకషంగా పరిశీలించి దీనిపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. గురువారం నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ విద్యావంతుల వేదిక గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘జోనల్ వ్యవస్థ రద్దు’ అనే అంశంపై విద్యార్థి, ఉద్యోగ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. జోనల్ వ్యవస్థ రద్దుపై హడావుడి నిర్ణయం తీసుకుంటే తెలంగాణ సమాజానికి దీర్ఘకాలిక నష్టం వాటిల్లుతుందన్నారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా గత అనుభవాలు, కోర్టు తీర్పులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించారు. స్థానిక రిజర్వేషన్ల అంశాన్ని చారిత్రక దృష్టితో చూడాలని, దీనిపై అధ్యయనం చేసి చర్చించాలని చెప్పారు. ముందుగా పోస్టుల విషయంలో అవి ఏ స్థాయి పోస్టులో నిర్ణయించాలన్నారు. స్థానిక రిజర్వేషన్లపై అధ్యయనం చేసి.. ఆ రిపోర్టును ఢిల్లీకి పంపి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వాల హయాంలో ఎన్నడూ స్థానిక రిజర్వేషన్లను అమలు చేయకపోవటం వల్లే తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని, ముఖ్యమైన రంగాల్లో స్థానికులకు అవకాశం ఇవ్వలేదని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఐతే.. ముల్కి రూల్స్ ప్రకారం 12 ఏళ్లు నివసిస్తే స్థానికులుగా.. ఆర్టికల్ 371డీ రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నాలుగేళ్లు నివసిస్తే స్థానికులుగా నిర్ణయించారని, ఏది ఏమైనప్పటికీ స్థానిక రిజర్వేషన్లపై సమగ్రమైన చర్చ జరిపి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆర్ఎంపీ, పీఎంపీలను అరెస్టు చేయటం సరికాదని, వారికి ప్రభుత్వం శిక్షణ ఇవ్వటంతో పాటు సర్టిఫికెట్లను జారీ చేసి వైద్యం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోదండరాం డిమాండ్ చేశారు. గుర్తింపు కోసం వారు అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారని చెప్పారు. ప్రొఫెసర్ పురుషోత్తం మాట్లాడుతూ సమగ్రమైన అధ్యయనం చేయకుండా జోనల్ వ్యవస్థను రద్దు చేయాలనుకోవటం సరికాదన్నారు. దీని వల్ల అనేక సమస్యలు తలెత్తటంతో పాటు వెనుకబడిన జిల్లాల్లోని విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక నగర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్, వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గురిజాల రవీందర్రావు, ప్రధాన కార్యదర్శి తిప్పర్తి యాదయ్య, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత మల్లిఖార్జున్, తెలంగాణ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హన్మంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'బాబు విధానాలతోనే విఘాతం'
మందమర్రి: టీడీపీ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన నూతన సరళీకృత విధానాలతో ప్రభుత్వ రంగ పరిశ్రమలకు పెద్ద విఘాతం కలిగిందని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. అప్పటి ప్రభుత్వం అవలంభించిన విధానాల ఫలితంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో సీఐటీయూ ఆధ్వర్యంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం నాలుగో మహాసభలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సింగరేణిని కాపాడుకోవచ్చని పలు ఉద్యమ సభల్లో కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. కాంట్రాక్ట్ కార్మికులు బానిసలుగా పనిచేస్తున్నారని, అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్.. గత పాలకుల కంటే వారిని కట్టు బానిసలుగా చూస్తున్నారని తెలిపారు. ఓపెన్‌కాస్ట్‌లతో ఉత్తర తెలంగాణ భూమి పుండుగా మారి ఇక్కడ పర్యావరణం విధ్వంసానికి గురవుతోందన్నారు. కొత్తగా ఏర్పాటయ్యే కొమురం భీమ్ జిల్లాలో బొందల గడ్డలు తప్ప ఏమీ ఉండవని అన్నారు. మహసభలో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గురిజాల రవీందర్రావు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు పి.రాజారావు పాల్గొన్నారు. -
నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలి: ప్రొ.కోదండరామ్
కరీంనగర్ : నేదునూరులో జెన్కో పవర్‌ప్లాంట్ పనులు వెంటనే చేపట్టి నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు. లేకుంటే భూములును తిరిగి రైతులకు అప్పగించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. గురువారం కోదండరామ్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరులో జెన్కో పవర్ ప్లాంట్ కోసం సేకరించిన భూములను ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక రైతులతో కోదండరామ్ సమావేశమయ్యారు. -
ప్రభుత్వం తప్పును సరిచేసుకోవాలి : కోదండరామ్
హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరామ్ మరోసారి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ... ప్రొ.జయశంకర్ వర్థంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం తనకు బాధ కలిగించిందన్నారు. వచ్చే ఏడాదైనా ప్రభుత్వం చేసిన తప్పును సరిచేసుకోవాలని కోదండరామ్ సూచించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు మద్దతుగా ఉంటామని కోదండరాం స్పష్టం చేశారు. -
సార్ బాటలో పయనిద్దాం: కోదండరాం
హైదరాబాద్ : ప్రభుత్వం అంటే ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పని చేయాలని టి.జేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాం అభిప్రాయపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లోని టి.జేఏసీ కార్యాలయంలో ప్రొ. కె.జయశంకర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రొ.కె.జయశంకర్ చిత్రపటానికి ప్రొ.కోదండరాం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రొ. కోదండరాం మాట్లాడుతూ... తెలంగాణ అభివృద్ధి కోసం మరింత సంఘటితంగా ప్రయత్నించాలని ప్రొ.జయశంకర్ సార్ చెప్పారని ఈ సందర్భంగా కోదండరాం గుర్తు చేశారు. ఆయన బాటలోనే పయనిద్దామని తెలంగాణ ప్రజలకు కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడం ఓ ఎత్తు అయితే.... రాష్ట్రాభివృద్ధి సాధించడం మరో ఎత్తు అని తెలిపారు. కాంట్రాక్టర్లు, రియల్టర్లకు లబ్ధి చేకూర్చే తెలంగాణ వద్దని ప్రభుత్వ నేతలకు సూచించారు. అలాగే ఏ అంశంపైన అయినా తాము తొందరపడి మాట్లాడమని... అధ్యయనం చేశాకే ఏ విషయంపైన అయినా స్పందిస్తామని చెప్పారు. మసుషులు ఎవరూ శాశ్వతం కాదని... వారి ఆలోచనలే ఎప్పటికీ నిలిచి ఉంటాయని కోదండరాం పేర్కొన్నారు. -
యుద్ధప్రాతిపదికన కరువు నివారణ చర్యలు
పెబ్బేరు/భూత్పూర్: రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కరువు నివారణ చర్యలు చేపట్టాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా తెలంగాణలో పూర్తి కరువు ఏర్పడిందన్నారు. ఆదివారం మే డే వేడుకల్లో భాగంగా ఆయన మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్, పెబ్బేరు మండలాల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ని నాలుగు జిల్లాల్లో జేఏసీ ఆధ్వర్యంలో కరువు పరిస్థితిపై అధ్యయనం చేసి నివేదికలను జిల్లాల కలెక్టర్లతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు అందజేశామని వివరించారు. త్వరలో గవర్నర్ నరసింహన్నూ కలవనున్నట్లు తెలిపారు. పంటలు, పండ్లతోటలు దెబ్బతిని రైతులు అప్పులపాలయ్యారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కనీసం ఎకరాకు రూ.10 వేలు తగ్గకుండా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులను ఇప్పుడు ఆదుకుంటేనే వచ్చే ఖరీఫ్‌లో తిరిగి పంటలు సాగు చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయి చెరువులను నీటితో నింపి ఉంటే ఇంతటి కరువు వచ్చేది కాదన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని కోరారు. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో వృద్ధులు, వికలాంగులకు కూడా మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని ఆయన కోరారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా టీజేఏసీ పాత్ర ప్రముఖంగా ఉంటుందని కోదండరాం స్పష్టంచేశారు. కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువస్తున్న సరళీకరణ చట్టాల ఫలితంగా కార్మికుల సంక్షేమం డోలాయమానంలో పడిందని కోదండరాం ఆవేదన వ్యక్తంచేశారు. కాంట్రాక్ట్, ఒప్పంద ఉద్యోగులను నియమిస్తూ ప్రభుత్వాలు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నాయని చెప్పారు. చట్టాలను పకడ్బందీగా అమలు చేసినప్పుడే కార్మికులకు న్యాయం జరుగుతుందన్నారు. -
నిజాం షుగర్స్‌ను ప్రభుత్వమే నడపాలి
♦ అదే ఉద్యమ కాలం నాటి ఆకాంక్ష ♦ రైతులు, కార్మికులతో చర్చించి ఉద్యమ కార్యాచరణ ♦ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం బోధన్: నిజాంషుగర్ ఫ్యాక్టరీకి పూర్వవైభవం తీసుకురావడం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో నిజాంషుగర్స్‌ను స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడుపాలని ఉద్యమం చేపట్టామన్నారు. నిజాంషుగర్స్‌ను తెరిపించి, ప్రభుత్వమే నడపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం లేఆఫ్ ప్రకటించి తాత్కాలికంగా ఫ్యాక్టరీని మూసి వేసిన నేపథ్యంలో చెరుకు పంట సాగు, రైతుల స్థితిగతులు, పంట సాగు, ఫ్యాక్టరీ భవిష్యత్తుపై రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు సోమవారం కోదండరాం గ్రామాల్లో పర్యటించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఖాజాపూర్, హున్సా, మందర్న గ్రామాల్లో ప్రొఫెసర్ పర్యటించారు. మందర్న, హున్సాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో కోదండరాం మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో నిజాంషుగర్స్‌ను ప్రైవేటీకరించడం తప్పిదమని, స్వరాష్ట్రంలో ఫ్యాక్టరీ మూసివేయడం మరో తప్పిదమవుతోందన్నారు. నిజాంషుగర్ ఫ్యాక్టరీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఫ్యాక్టరీ రక్షణ కోసం జిల్లా ప్రతినిధులు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. బంగారు తెలంగాణ స్వప్నం బంజారాహిల్స్‌కే పరిమితం కావొద్దని, యావత్ తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలన్నారు. రైతులు, కార్మికుల ఆకాంక్షను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీల పరిధిలోని రైతులు, కార్మికులతో చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సదస్సులు, సమావేశాలు నిర్వహించి త్వరలోనే హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం తలపెడుతామన్నారు. పార్టీల కతీతంగా రైతులు సంఘటితం కావాలన్నారు. ఎడ్లబండి ఎక్కిన తర్వాత పగ్గాలు చేత పట్టాలే కాని భయపడితే ఎలా అని రైతులను నుద్దేశించి అన్నారు. పార్టీలకతీతంగా బతుకు జెండా ఎత్తాలన్నారు. నిజాంషుగర్స్‌ను తిరిగి తెరిపించాలని కోరడం న్యాయబద్ధమైందని, ఇదే తెలంగాణ ఉద్యమం నేర్పిందన్నారు. న్యాయం, ధర్మం కోసమే తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం నడిచిందన్నారు. -
రాష్ట్ర పురోభివృద్ధే లక్ష్యంగా పని చేస్తాం : ప్రొ.కోదండరాం
హైదరాబాద్: తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ(టి.జేఏసీ) రాష్ట్రంలో వాచ్డాగ్ పాత్రను పోషిస్తుందని ఛైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ తెలిపారు. ప్రజల ఆకాంక్ష సాధనకు ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం పునాదిగా ప్రజలే కేంద్రంగా ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ జేఏసీ ప్రధాన కార్యాలయంలో స్టీరింగ్ కమిటీ సుదీర్ఘంగా సమావేశమైంది. ఇటీవలి కాలంలో జేఏసీ నుంచి పలు ఉద్యోగ సంఘాలు బయటకు వెళ్లిన నేపథ్యంలో.. తాజాగా జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి దాదాపు ఇరవైకి పైగా ప్రజా సంఘాలు వివిధ జేఏసీ నాయకులు హాజరై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అనంతరం చైర్మన్ ప్రొ.ఎం.కోదండరామ్ జేఏసీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇక నుంచి జేఏసీ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రజలు తమపై నమ్మకముంచి అనేక పిలుపులకు స్పందించి మద్దతుగా నిలిచారు కాబట్టి వారికి అండగా నిలుస్తామన్నారు. రాష్ట్రంలో సమస్యలు తలెత్తినప్పుడు ప్రభుత్వ లోటుపాట్లు ఎత్తిచూపాలని స్థూలంగా నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రంలో టీ-జేఏసీ నిర్మాణాన్ని విస్తృత పరచాలని, అందుకోసం నిర్మాణాత్మక కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. జేఏసీ నుంచి ఇటీవలి కాలంలో పలు ఉద్యోగ సంఘాలు వెళ్లిపోవడాన్ని తప్పు పట్టడంలేదని, ప్రతీ సంఘానికి స్వేచ్ఛ ఉంటుందని, అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుందన్నారు. అయితే వారు ఇన్నాళ్లు తమతో కలిసి నిర్వహించిన పాత్రను గుర్తు పెట్టుకుంటామన్నారు. అలాగే ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏ ప్రయత్నాలోనైనా తమవంతు భాగస్వామ్యం నిర్వహిస్తామన్నారు. టీచర్ల నియామకాలు చేపట్టడంతోపాటు గ్రూప్ -2 పోస్టులు పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లోని అన్ని పోస్టులకు వయోపరిమితి పెంచాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రొ.కోదండరాం విజ్ఞప్తి చేశారు. రాజకీయపార్టీలను జేఏసీలోకి చేర్చుకోం.. తమ టీంను ఇక నుంచి టీ-జేఏసీగానే పిలవాలని కోదండరామ్ కోరారు. జేఏసీలోకి కలిసి వచ్చే ప్రజా సంఘాలన్నింటినీ కలుపుకుంటామని, రాజకీయ పార్టీలను మాత్రం చేర్చుకోబోమన్నారు. అయితే అంశాల ఆధారంగా అవసరమైనప్పుడు రాజకీయపార్టీలతో కలిసి పనిచేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా ఉన్న ఇరిగేషన్ పాలసీపై అధ్యయనం చేసిన తర్వాతనే తమ నిర్ణయం ప్రకటిస్తామన్నారు. దీనిపై అనుభవజ్ఞులైన వారితో చర్చించి అభిప్రాయం వ్యక్తంచేస్తామన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువుపై అసెంబ్లీలో సమగ్రమైన చర్చ జరగాలని, అలాగే తమకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఎమ్మెల్యేలకు అందజేస్తామన్నారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో పశువులకు మేత విషయమై త్వరలో రెవెన్యూమంత్రితో సమావేశమవుతామన్నారు. -
రైతు సమస్యల పరిష్కారానికే ‘కిసాన్ సమ్మేళన్’: కోదండరామ్
హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషించేందుకు ఏప్రిల్‌లో జరగనున్న ‘కిసాన్ సమ్మేళన్’ దోహదపడగలదని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. మన రాష్ట్ర ఉత్పత్తిలో 13 శాతం మాత్రమే వ్యవసాయం ఆదాయం ఉందని, దానిపైనే 61 శాతం మంది ఆధారపడి బతుకు గడుపుతున్నారని వెల్లడించారు. గ్రామాల్లోకి వెళ్తే కరువు పరిస్థితుల తీవ్రత తెలుస్తోందన్నారు. నీరులేక, పెట్టుబడులు మునిగిపోయి, తినడానికి గింజలులేక రైతులు దుర్భర స్థితిని ఎదుర్కొంటున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలో కిసాన్ స్వరాజ్ సమ్మేళనం హైదరాబాద్‌లో నిర్వహించడం వల్ల రైతు సమస్యలకు పరిష్కారం చూపవచ్చునన్నారు. ఏప్రిల్ 1 నుంచి 3వ తేదీ వరకు ‘అలయెన్స్ ఫర్ సస్టెయినబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చర్ ’(ఎఎస్హెచ్ఎ), రైతు స్వరాజ్యవేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించనున్న 3వ అఖిల భారత ‘కిసాన్ స్వరాజ్ సమ్మేళనం’ వివరాలను మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సంబంధిత సంఘాల ప్రతినిధులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమ రిసెప్షన్ కమిటీ సభ్యుడు కోదండరామ్ మాట్లాడారు. సమావేశంలో రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు కిరణ్ విస్సా, కన్నెగంటి రవి, మానవహక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. జీవన్ కుమార్, తెలంగాణ రైతు సంఘం ప్రతినిధి ప్రసాదరావులు మాట్లాడారు. -
సీఎంతో నాకెలాంటి విభేదాల్లేవ్
టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం రాయికల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో తనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని తెలంగాణ రాజకీయ జేఏసీ(టీజేఏసీ) చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కరీంనగర్ జిల్లా రాయికల్‌లో కరువు పరిస్థితులను పరి శీలించేందుకు వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. సీఎం ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు పోరాడుతుంటే... ప్రజల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తున్నానని అన్నారు. తమ ఇద్దరిదీ ఒకే దారి అని పేర్కొన్నారు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీతో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారని, తాను జేఏసీ తో ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు పోరాటం చేశామని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్, కోదండరాం మధ్య భేదాభిప్రాయాలున్నాయని చాలా మంది అంటున్నారని, అది కేవలం పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశారు. తమ ఇద్దరిదీ ఒకే పంథా అని అన్నారు. జేఏసీలోంచి వివిధ సంఘాలు వారి ఇష్టానుసారంగానే బయటకు వెళ్తున్నాయని తెలిపారు. త్వరలోనే జేఏసీ ప్రత్యేక సమావేశం నిర్వహించి భవిష్యత్ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ప్రస్తుతం తనకు రాజకీయా ల్లో ప్రవేశించాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు. అన్నా హజారే వంటి నాయకులు సేవ చేస్తున్నారే తప్ప రాజకీయాల్లోకి వస్తున్నారా? అని అన్నారు. కరువు పరిస్థితులపై అధ్యయనం చేసి రైతులకు న్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. -
ఉద్యమం చేయనివారికి మంత్రి పదవులా?
జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆవేదన వికారాబాద్ రూరల్: తెలంగాణ ఉద్యమం గురించి తెలియనివారు, ఉద్యమంలో పాల్గొననివారు ఇప్పుడు రాష్ట్రంలో మంత్రి పదవులు అనుభవిస్తున్నారని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉద్యమకారుడు మహేందర్‌రెడ్డి కుటుంబ సభ్యులను బుధవారం రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో పరామర్శించారు. అనం తరం విలేకరులతో మాట్లాడుతూ పంచాయతీరాజ్, అగ్రికల్చర్ తదితర విభాగాల్లో కాంట్రాక్టులను ఉద్యమకారులకు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. డబుల్ బెడ్రూం ఇళ్లలో ఉద్యమకారులకు కోటాను కల్పించాలని డిమాండ్ చేశారు. -
'ఉద్యమకారులను అణిచివేసిన వారికే పెద్దపీట'
హైదరాబాద్ : రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులకు ప్రాధాన్యత దక్కడం లేదని టీ జేఏసీ నాయకుడు ప్రొ. కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన తెలంగాణ ఉద్యమకారుడు మహేందర్‌రెడ్డి కుటుంబాన్ని బుధవారం రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో ప్రొ.కోదండరాం పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఉద్యమకారులను అణిచివేసిన వారికే ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆరోపించారు. ఉద్యమకారులను గుర్తించి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రొ.కోదండరాం సూచించారు. -
విద్యార్థులు ఢిల్లీకి వెళ్లిన రోజే విచారణా?
యూనివర్సిటీలో ఉన్నప్పుడే కమిటీని పంపాలి : ప్రొ. కోదండరాం విద్యారణ్యపురి: సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ మృతి కారుకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థులు ఈనెల 23న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టారని, అరుుతే కేంద్ర ప్రభుత్వం ఆ రోజే విచారణ కమిటీని హైదరాబాద్‌కు పంపించడం ఏమిటని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నించారు. విద్యార్థులు లేనప్పుడు విచారణ ఎలా జరుపుతారని అన్నారు. వరంగల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో తెలంగాణ ఉద్యమ అమరుడు పిల్లి గిరిబాబు వర్ధంతి సభను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. 23న సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులంతా ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేపడుతున్నారని, ఆ రోజు విచారణకు వచ్చి గోడలు, కిటికీలను విచారిస్తారా? అని ఎద్దేవా చేశారు. రోహిత్ మృతిపై వాస్తవాలు మరుగనపడేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈనెల 23న కాకుండా.. విద్యార్థులు యూనివర్సిటీలో ఉండే.. మరో రోజు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. -
పాడి రైతులకు 60 కోట్లు ఇవ్వలేరా?
♦ తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రొఫెసర్ కోదండరాం ♦ పాల ప్రోత్సాహకానికి సీలింగ్ పెట్టడం సరికాదని వ్యాఖ్య ♦ ‘విజయ’కు పాలు పోసే రైతులందరికీ ప్రోత్సాహకం ఇవ్వాలని డిమాండ్ ♦ కర్ణాటక మాదిరిగా రాష్ట్రంలోనూ మధ్యాహ్న భోజనంలో పాలు ఇవ్వాలని వినతి సాక్షి, హైదరాబాద్: బడా పారిశ్రామికవేత్తలకు రూ. వేల కోట్లు ఇస్తున్న ప్రభుత్వం.. విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు రూ. 60 కోట్లు ఇవ్వడానికి ఎందుకు జంకుతోందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నిలదీశారు. పాల ప్రోత్సాహకానికి 25 లీటర్ల సీలింగ్ పెట్టడం సమంజసం కాదన్నారు. విజయ డెయిరీకి అనుబంధంగా ఉండే సహకార, ప్రైవేటు డెయిరీలకే పాల ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని.. కరీంనగర్, మదర్ డెయిరీలకు ప్రోత్సాహకం ఇవ్వకుండా ఇతరత్రా ప్రయోజనం చేకూర్చాలని సూచించారు. పాల ప్రోత్సాహకపు సొమ్మును రైతు బ్యాంకు ఖాతాలో నేరుగా వేయాలని కోరారు. తెలంగాణ ఆదర్శ పాడి రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కందాల బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో కోదండరాం మాట్లాడారు. రైతు ఆత్మహత్యలు ఆగాలంటే వ్యవసాయంతోపాటు పాడి, కోళ్ల రంగాలను అభివృద్ధి చేయాలని, కోళ్ల పరిశ్రమలో చిన్న రైతులకు ఏవిధంగా లబ్ధి చేకూర్చాలన్న దానిపై సర్కారు ఆలోచన చేయాలన్నారు. 85 శాతం సన్నచిన్నకారు రైతులు 66 శాతం పాలు పోస్తున్నార ని చెప్పారు. ప్రైవేటు సంస్థలు ముందుకు రావడంతో రాష్ట్రంలో విజయ డెయిరీ పాల సేకరణ చితికిపోయిందన్నారు. ఈ పరిస్థితుల్లో విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటరుకు రూ. 4 ప్రోత్సాహకం ఇవ్వడం మంచి పరిణామం అన్నారు. రైతు ఆత్మహత్యల నివారణకు ఈ చొరవను ప్రభుత్వం కొనసాగించాలన్నారు. ఇతర రాష్ట్రాల పోటీ నుంచి విజయ డెయిరీని కాపాడుకోవాలని కోరారు. ప్రపంచంలో పాల పొడి విక్రయంలో సంక్షోభం ఏర్పడిందనీ.. దీంతో అమూల్, నందిని వంటి ఇతర రాష్ట్రాల డెయిరీలు మన రాష్ట్రంలోకి పాలను డంప్ చేస్తున్నాయని అన్నారు. దీనివల్ల విజయ డెయిరీ సహా ఇతర సహకార పాల ఉత్పత్తిదారులు నష్టపోతున్నారన్నారు. అందువల్ల బయటి రాష్ట్రాల డెయిరీలకు షరతులు విధించాలని, మన రాష్ట్రంలోని రైతుల నుంచే పాలను సేకరించాలని ఆదేశించాలన్నారు. లేకుంటే ప్రత్యేక పన్ను వేసి అడ్డుకోవాలన్నారు. అలాగే విజయ డెయిరీ పాల ఏజెంట్ల కమీషన్ పెంచాలన్నారు. కర్ణాటకలో మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు పాలు సరఫరా చేస్తున్నారని.. దీనివల్ల అక్కడ రోజుకు 10 లక్షల లీటర్ల పాలు అవసరం అవుతున్నాయన్నారు. తెలంగాణలోనూ ఇలాగే చేస్తే విజయ డెయిరీ పాల సేకరణ పెరుగుతుందన్నారు. విద్యార్థులకూ ఆరోగ్యం పెరుగుతుందన్నారు. కందాల బాల్‌రెడ్డి మాట్లాడుతూ పాల ప్రోత్సాహకాన్ని ప్రైవేటు డెయిరీలకు ఇవ్వాలా? వద్దా? అని నిర్ధారించేందుకు ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘాన్ని రెండు మూడు రోజుల్లో కలసి నివేదిక ఇస్తామన్నారు. ప్రభుత్వం పాల ప్రోత్సాహకంపై మార్పులు చేర్పులు చేసే వరకు ఇప్పటివరకు ఉన్న జీవోనే అమలు చేయాలని కోరారు. -
ఎడారిలో ఒయాసిస్..బాలోత్సవ్
కొత్తగూడెం: ‘చిన్నారులు ఆడుకుందామంటే సరైన ఆటస్థలాలు లేవు.. చదువుకుందామంటే పుస్తకాలు సక్రమంగా లేవు.. ఇలాంటి పరిస్థితిలో చిన్నారుల్లో అభిరుచిని వెలికితీసేందుకు ఈ జాతీయ స్థాయి బాలోత్సవ్ ఎడారిలో ఒయాసిస్‌లా పని చేస్తుంది.’ అని టీజేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. 24వ అంతర్‌బాలల సాంస్కృతిక ఉత్సవాలు (జాతీయ స్థాయి బాలోత్సవ్ - 2015) ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను ఖమ్మంకు చెందిన బాలమేధావి ఎస్.కె. సాధిక్‌పాషా బెలూన్లు ఎగురవేసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో కోదండరాం మాట్లాడుతూ ప్రస్తుతం విద్యార్థులు వారి అభిరుచులకు అనుగుణంగా చదివే పరిస్థితులు లేవన్నారు. ఒక్కో విద్యార్థికి ఒక్కో రంగంలో ప్రావీణ్యం ఉంటుందని, దానిని ప్రొత్సహిస్తే వారిలో ఉన్న ప్రతిభ, వారిని ఉన్నతస్థానాలకు తీసుకెళ్తుందన్నారు. గతంలో కొత్తగూడెం పట్టణం అంటే తనకు కేవలం బొగ్గు మాత్రమే గుర్తుకు వచ్చేదని, కానీ ఇప్పుడు ఇక్కడకు వచ్చిన తర్వాత ఇంతమంది చిన్నారులను చూసి మరోకోణం నేర్చుకున్నానన్నారు. 24 ఏళ్లుగా ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం అభినందించదగ్గ విషయమన్నారు. కార్యక్రమాన్ని మరో వందేళ్లపాటు కొనసాగించాలన్నారు. పిల్లలు పెద్దలై.. పెద్దలకు నేర్పే విషయాలను ఇక్కడికి వచ్చి తెలుసుకోవాలన్నారు. వచ్చే ఏడాది కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరవుతానన్నారు. బాలోత్సవ్ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రమేష్‌బాబు మాట్లాడుతూ 24 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో వందల మంది తనకు తోడ్పాటునందించారన్నారు. బాలల కోసం ఏదైనా చేయాలనే తపనతో తాను ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రారంభ కార్యక్రమంలో ప్రముఖకవి అంద్శై మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు, కొత్తగూడెం ఆర్డీవో రవీంద్రనాథ్, డీఎస్పీ సురేందర్‌రావు, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు, టీజేఏసీ జిల్లా చైర్మన్ కూరపాటి రంగరాజు, మున్సిపల్ చైర్పర్సన్ పులి గీత తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు 16 విభాగాల్లో పోటీలు జరిగాయి. ఈ పోటీలకు తొమ్మిది రాష్ట్రాలకు చెందిన పాఠశాలల నుంచి సుమారు తొమ్మిదివేల మంది బాలబాలికలు హాజరయ్యారు. -
ఉద్యమ స్వరూపం
♦ ‘తెలంగాణ రాష్ట్రోదయం’ పుస్తకంపై వక్తలు ♦ భవిష్యత్‌కు బాటలు వేశారంటూ కోదండరామ్‌కు కితాబు హైదరాబాద్: తెలంగాణ ఉద్యమానికి విస్తృత స్థాయిలో ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి, దానికి ప్రజల ఉద్యమ స్వరూపాన్ని తెచ్చిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ కోదండరామ్ అని పలువురు వక్తలు కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో జరిగిన కీలకమైన మలుపులు, ప్రజా ఉద్యమ నిర్మాణ క్రమాన్ని వివరిస్తూ ఆయన రాసిన ‘తెలంగాణ రాష్ట్రోదయం’ పుస్తకం భవిష్యత్తు తెలంగాణకు మార్గదర్శి కాగలదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరామ్ రాసిన ‘తెలంగాణ రాష్ట్రోదయం’ పుస్తకావిష్కరణ బుధవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ఆయన గురువు ప్రొ. రమా మెల్కొటె ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. రచయత జూలూరి గౌరీశంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, సీనియర్ పాత్రికేయులు మల్లేపల్లి లక్ష్మయ్య, ప్రొఫెసర్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ.. ప్రజలను చైతన్యవంతులను చేయడం వల్ల తెలంగాణ ఉద్యమానికే కాకుండా భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధికి కూడా కోదండరామ్ బాటలు వేశారని అన్నారు. కోదండరామ్ తన విద్యార్థే అయినా.. తెలంగాణ ఉద్యమంలో తాను ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానన్నానని ప్రొఫెసర్ రమా మేల్కొటే అన్నారు. ఎంతో సహనంతో ఉద్యమాన్ని నిర్మించి విజయతీరాల వరకు నడిపించారని చెప్పారు. పార్టీలకు అతీతంగా ఆయన ఇప్పటికీ ప్రజా ఉద్యమాల్లోనే కొనసాగడం సంతోషదాయకమన్నారు. పుస్తకంలో వచ్చిన మొదటి వ్యాసం 1998 తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎదుర్కొన్న సమస్యల గూర్చి రాసినట్లు కోదండరామ్ వెల్లడించారు. వ్యవసాయానికి, సాగునీటి రంగానికి జరిగిన అన్యాయం, పర్యావరణ పరిస్థితులకు ఉండే ప్రత్యేకతలను విస్మరించి సీమాంధ్ర పాలకులు తమ అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాంతాన్ని మార్చుకున్నారని అన్నారు. రాష్ట్ర సాధనలో తలెత్తిన రాజకీయ సంక్షోభం, ప్రభుత్వాలు అనుసరించిన వ్యూహాలు, ఎత్తుగడలు వంటి అంశాలను పుస్తకంలో వివరించినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో సమస్యలు పరిష్కారం కావాలంటే ముందు సీమాంధ్ర ఆధిపత్యం పోవాలని.. అలా అనుకునే ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లామన్నారు. తెలంగాణ సమాజం పైనే గత 40 ఏళ్లుగా తన అధ్యయనం కొనసాగుతోందని చెప్పారు. ఒక ప్రత్యామ్యాయ అభివృద్ధి నమూనాగా తెలంగాణను రూపొం దించుకోవలసి ఉందన్నారు. ముఖ్యంగా వ్యవసాయంపై ఎక్కువ దృష్టి పెట్టాలని అన్నారు. మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ దశాబ్దకాలంగా తెలంగాణ ప్రజల్ని అర్ధం చేసుకునే కరదీపిక ఈ పుస్తకమని అన్నారు. -
చారిత్రకతను దృష్టిలో ఉంచుకోండి
ఆదిబట్ల: చారిత్రక పరిస్థితులను దృష్టిలో ఉం చుకుని జిల్లాల విభజన జరగాలని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మంగళవారం ఆయన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగర కలాన్‌లో తెలంగాణ ఉద్యమంలో అమరుడైన కాకి కుమార్ స్మారకార్థం నిర్మించిన తెలంగాణ తల్లి విగ్రహా న్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. రంగారెడ్డిని తూర్పు, పశ్చిమ జిల్లాలుగా విభజిస్తే బాగుం టుందని అభిప్రాయపడ్డారు. గతంలో తెలుగుతల్లిని కీర్తిస్తూ పాడిన పాటల్లో తెలంగాణకు స్థానం ఉండేది కాదన్నారు. మన కవులు, మేధావులు, శిల్పులకు వచ్చిన ఆలోచనే తెలంగాణ తల్లికి ప్రతిరూపం అని వివరించారు. స్థానికంగా ఉన్న కంపెనీల్లో సూపర్వైజర్ నుంచి అన్నిస్థాయిల కేడర్ల వరకు 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఉద్యమ సమయంలో డిమాండ్ చేశామన్నారు. అయితే రాష్ట్రం వచ్చాక పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదన్నారు. రాష్ట్రం లో ఉన్న పలు కంపెనీలు స్థానికులకు ఉపాధి కల్పిస్తే ఆ కంపెనీలకు స్థిరత్వం లభిస్తుందని, రక్షణ దొరుకుతుందన్నారు. ఉత్తరాంచల్, హిమాచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఏదైనా కంపెనీకి ప్రభుత్వం స్థలం ఇచ్చేముందు అగ్రిమెం ట్లో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే అని జీవో ఉంటుందని, ఇలాంటి జీవోలు తెలంగాణలోనూ అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. -
చనిపోయిన రైతులకు ఎక్స్‌గ్రేషియా అందడం లేదు
హైదరాబాద్ : రాష్ట్రంలో చనిపోయిన రైతులకు 10 శాతం ఎక్స్ గ్రేషియా కూడా అందడం లేదని జేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో ప్రొ.కోదండరామ్ మాట్లాడుతూ... రైతుల ఆదాయ భద్రత కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. అలాగే పండిన పంటకు గిట్టుబాటు ధరను కూడా ప్రభుత్వమే కల్పించాలన్నారు. ఖర్చు తక్కవగా ఉండే సమగ్ర వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో 90 శాతం మంది చిన్న... సన్నకారు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కోదండరామ్ తెలిపారు. -
కోదండరాం నేతృత్వంలో జై కిసాన్ ర్యాలీకి..
న్యూఢిల్లీ: భూసేకరణ చట్ట సవరణ బిల్లును వెనక్కు తీసుకోవాలనే డిమాండ్ తోపాటు మరో మూడు డిమాండ్లు ప్రధానంగా గూర్గావ్లో జరుగుతున్న జై కిసాన్ ట్రాక్టర్ ర్యాలీలో తెలంగాణ తరుపున పలువురు పాల్గొన్నారు. ముఖ్యంగా తెలంగాణ విద్యా వంతుల వేదిక తరుపునుంచి రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంతోపాటు రైతు స్వరాజ్య వేదిక, స్వరాజ్ అభియాన్, అఖిల భారత రైతు సంఘం, తెలంగాణ రైతు సంఘం నేతృత్వంలో 100 మంది నాయకులు, రైతులు ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లారు. ఆదివారం నాటి ర్యాలీలో పాల్గొన్న వీరంతా సోమవారం జంతర్ మంతర్ వద్ద జరిగే భారీ ప్రదర్శన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూసేకరణ ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ తోపాటు, రైతులకు ఆదాయ భద్రత కల్పించాలని, ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు ఎకరానికి రూ.10 వేలను మూడు నెలల్లోపు నష్టపరిహారంగా చెల్లించాలని, భూమిలేని పేదలకు మూడు ఎకరాలు ఇవ్వాలని ఈ ప్రదర్శనలో డిమాండ్ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పలువురు కిసాన్ ర్యాలీలో పాల్గొంటున్నారు. -
సమ్మెకు సంఘీభావం
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయమైనవే.. వారి సమస్యల పరిష్కారానికి సర్కారు చొరవచూపాలి జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం వికారాబాద్ : హక్కుల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు సంఘీభావం తెలియజేస్తున్నామని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టంచేశారు. ఆదివారం ఆయన వికారాబాద్‌కు వచ్చారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు తక్కువ జీతాలతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వేతనాలు పెంచాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేయడం న్యాయమైనదేనని ఆయన పేర్కొన్నారు. సంస్థ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తమ డిమాండ్లను సవరించుకోవడంపై ఆయన ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవచూపాలని సూచించారు. కాగా.. ఆదివారం తాండూరు డిపోకు చెందిన బస్సుకు అడ్డు వెళ్లిన ఆర్టీసీ కార్మికుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని తరలిస్తుండగా.. పోలీసులను అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది సమన్వయంతో పరిస్థితి సద్దుమణిగింది. తాండూరులో బస్సులను అడ్డుకునేందుకు కార్మికుల యత్నం తాండూరు : ఆర్టీసీ బస్సులు డిపో నుంచి బయటకు రాకుండా యూనియన్ నాయకులు, కార్మికులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆదివారం ఆర్టీసీ సమ్మె ఐదో రోజు సందర్భంగా యూనియన్ నాయకులు, కార్మికులు ధర్నా నిర్వహించారు. ఉదయం 9గంటలకు ఆర్టీసీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ రాజేంద్రప్రసాద్, డిపో మేనేజర్ లక్ష్మీధర్మా వివిధ రూట్లలో బస్సులు నడిపేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు రంగప్రవేశం చేసి కార్మికుల ప్రయత్నాలను విఫలం చేశారు. చించొళి, కరన్‌కోట్, కోస్గీ తదితర రూట్లలో నాలుగు బస్సులను అధికారులు నడిపించారు. దీంతో అధికారులకు వ్యతిరేకంగా నాయకులు నినాదాలు చేశారు. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, జేఏసీ తాండూరు చైర్మన్ సోమశేఖర్‌తోపాటు నాయకులు ఆర్.విజయ్‌కుమార్, మదన్‌రెడ్డి, సీఐటీయూ నాయకుడు శ్రీనివాస్ తదితరులు డిపో వద్దకు వచ్చి, సంఘీభావం ప్రకటించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సర్కారుకు సూచించారు. కార్మికుల సమ్మెకు అండగా ఉంటామన్నారు. సమ్మెలో భాగంగా యూనియన్ నాయకులు, కార్మికులు డిపో ఆవరణలో పాటలు పాడారు. కబడ్డీ ఆడారు. -
త్వరలో 'చలో హైదరాబాద్': కోదండరాం
త్వరలో టి.జేఏసీ ఆధ్వర్యంలో 'చలో హైదరాబాద్'ను నిర్వహిస్తామని ఆ జేఏసీ కన్వీనర్ ప్రొ.కోదండరాం తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 4 - 7 తేదీల మధ్యలో చలో అసెంబ్లీ నిర్వహిస్తామన్నారు. చలో అసెంబ్లీ అనుమతి కోసం ప్రభుత్వానికి లేఖ రాస్తామని తెలిపారు. శాంతిని ప్రతిబింబించే విధంగా చలో 'హైదరాబాద్' కార్యక్రమం ఉంటుందని కోదండరాం వివరించారు. ఈ సందర్భంగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై కోదండరాం నిప్పులుచెరిగారు. సీఎం కిరణ్ తెలంగాణ ప్రజలను హైదరాబాద్‌లో ఉండనివ్వడని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజలను కాందిశీకులుగా మారుస్తాడని కోదండరాం ఆరోపించారు. కిరణ్ చేసే వ్యాఖ్యలకు అర్థం పర్థం ఉండదని అన్నారు. విభజనను అడ్డుకోవడానికి టి.ఎమ్మెల్యేలను కొంటామని సీమాంధ్రులంటున్నారని ఆయన గుర్తు చేశారు. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమే అని కోదండరాం స్ఫష్టం చేశారు. -
రాయల తెలంగాణ కూడా సరి కాదు:కోదండరామ్