ప్రణాళికా బద్ధంగా.. ప్రిపేర్‌ కావాలి | Sakshi An Interview With Prof Kodandaram Over Group 1 Preparation | Sakshi
Sakshi News home page

ప్రణాళికా బద్ధంగా.. ప్రిపేర్‌ కావాలి

Published Sat, May 7 2022 4:04 AM | Last Updated on Sat, May 7 2022 4:04 AM

Sakshi An Interview With Prof Kodandaram Over Group 1 Preparation

సాక్షి ప్రతినిధి, నల్లగొండ:  రాష్ట్రస్థాయిలో ఉన్నత స్థాయి ఉద్యోగమైన గ్రూప్‌–1కు సిద్ధమయ్యే అభ్యర్థులకు అన్ని రంగాల్లో రోజువారీ పరిణామాలపై సంపూర్ణ అవగాహన అవసరమని టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఎం.కోదండరాం పేర్కొన్నారు. ప్రణాళికా బద్ధంగా సిద్ధం కావాలని పత్రికలు, పుస్తకాల ద్వారా తాము తెలుసుకున్న సమాచారానికి సైద్ధాంతిక అవగాహనను జోడించి ప్రిపేర్‌ కావాలని సూచించారు.

ఏ సబ్జెక్టులోనైనా ఇవే ప్రధానమని వివరించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఇటీవల గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షలకు సిద్ధమయ్యే విషయంలో అభ్యర్థులు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి?, పరీక్షలకు ఎలా సిద్ధం కావాలన్న అంశాలపై..గతంలో గ్రూప్‌–1 సిలబస్‌ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరించిన ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడారు. కృష్ణా జలాల పరిరక్షణ యాత్రలో బిజీగా ఉన్నప్పటికీ ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

భావాన్ని అర్ధం చేసుకుంటూ చదవాలి 
పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థులు ప్రిపేర్‌ అయ్యే విధానాన్ని పక్కాగా రూపొందించుకోవాలి. ప్రిలిమినరీ పూర్తిగా ఆబ్జెక్టివ్‌ అయినందున సబ్జెక్టుపై లోతైన అవగాహన పెంచుకోవాలి. భావాన్ని (కాన్సెప్ట్‌ను) అర్థం చేసుకుంటూ చదవాలి. ప్రస్తుతం ఉద్యోగాలు తక్కువ, అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందున పోటీ తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలి. ఏ పేపరును, ఏ అంశాన్నీ విస్మరించవద్దు. మెయిన్స్‌ జనరల్‌ ఎస్సేలో గతంలో ఏ టాపిక్‌ అనేది చెప్పే వారుకాదు.

ఇప్పుడు ఆ సమస్య లేదు. ఏ సబ్జెక్టు చదివినా జనరల్‌ ఎస్సేను దృష్టిలో పెట్టుకొని మౌలిక అంశాలను అర్థం చేసుకొని సబ్జెక్టుపై సంపూర్ణ అవగాహనæ వచ్చేలా చదివితే సరిపోతుంది. జనరల్‌ ఇంగ్లిష్‌ విషయంలో భాష తెలిస్తే చాలు. అర్థం చేసుకుంటారా? పట్టు ఉందా? లేదా? అనేది మాత్రమే చూస్తారు. ఇంగ్లిష్‌ సాహిత్యం తెలియాల్సిన 
అవసరం లేదు.  

రాజ్యాంగ మౌలిక స్వభావం అర్ధం చేసుకోవాలి 
భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలతో పాటు మౌలిక స్వభావం అర్ధం చేసుకోవాలి. అది తెలియకుండా ముఖ్య అంశాలు అర్థం చేసుకోలేం. 1935లో బ్రిటిష్‌ పాలకులు చేసిన చట్టం నుంచే చాలా భాగాలను మన రాజ్యాంగంలోకి తీసుకున్నామనుకుంటారు. కానీ భారత రాజ్యాంగం స్వాతంత్య్ర సంగ్రామం నుంచి పుట్టింది.

స్వాతంత్య్ర సంగ్రామం ప్రజాస్వామిక విలువలు, ఆకాంక్షలతో కూడింది. దాని ప్రాతిపదికనే రాజ్యాంగాన్ని రాసుకున్నాం. బ్రిటిష్‌ వారిది నిరంకుశ రాజ్యాంగం.. మనది మౌలికంగా ఒక ప్రజాస్వామిక వ్యవస్థను, సామాజిక న్యాయం విస్తృత పరిచే లక్ష్యాలతో రాసుకున్నది. మౌలికమైన ఈ అంశాలు అర్ధమైతే మిగతావి సులభంగా అర్ధమవుతాయి. రాజ్యాంగ ప్రవేశిక దానికి అద్దం పడుతుంది. 

ఆర్థిక వ్యవస్థ పరిణామ క్రమం తెలుసుకోవాలి 
ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధిలో వచ్చిన మార్పులపై అవగాహన ముఖ్యం. ఫ్యూడల్‌ (భూస్వామ్య) వ్యవస్థ నుంచి ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ వరకు ఎలా పరిణామం చెందామన్నది తెలుసుకోవాలి. నిజాం ఏలుబడిలో దన్నుగా ఉన్నది గ్రామాల్లోని భూస్వాములే. ఆ తర్వాత ప్రజా పోరాటాలతో విముక్తి చెందడం, వేల ఎకరాలు ఉన్న పెద్ద భూస్వాములు అంతరించిపోయి చిన్న భూస్వాములు ఉనికిలోకి రావడం, 1970 తర్వాత దేశ స్థాయిలో సరళీకరణ, ఆర్థిక సంస్కరణలు, 20 సూత్రాల పథకం, భూసంస్కరణలు.. వీటన్నిటిపై అవగాహన పెంచుకోవాలి.

ఆ తర్వాత ఏ మేరకు ఆధునిక దేశంగా ఏర్పడ్డాం... అయినా ఇంకా వెనుకబడి ఉన్న రంగాలేంటి.? మార్పు జరగాలంటే చేయాల్సిందేమిటి? అనేవి ప్రధానంగా ఆలోచిస్తూ ఇండియన్‌ ఎకానమీని చదవాలి. పొలిటికల్‌ ఎకానమీని ప్రభావితం చేసే రాజకీయ అంశాలేంటి.. ఉపాధి కల్పన ఏ రంగంలో ఎక్కువుంది.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక పురోభివృద్ధికి ఏం చేయాలన్న ప్రశ్నలను అనుబంధంగా చూసుకోవాలి. ప్రతి పేపరులో స్వాతంత్య్రానికి పూర్వం పరిస్థితులు, స్వాతంత్య్రానంతరం తలెత్తిన మార్పులు, ఈ మార్పులు దేశాన్ని ఎటు తీసుకెళుతున్నాయి.. దాని వల్ల లాభపడిన వ్యవస్థలు ఏంటి? అనేవి కీలక అంశాలుగా ఉంటాయి.  

ఇంటర్వ్యూలు ఉంటేనే మంచిది 
గ్రూప్‌–1కు ఇంటర్వ్యూలు ఉంటేనే బాగుంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. జిల్లాకు ఉన్నతాధికారిని ఎంపిక చేసే క్రమంలో అతని వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం ఇంటర్వ్యూ ద్వారానే సాధ్యం అవుతుంది. పాలన నైపుణ్యాలు అక్కడే తెలుస్తాయి. 

సివిల్స్‌కు సైతం పోటీ పడేలా సిలబస్‌ 
టీఎస్‌పీఎస్సీ ఏర్పడిన తర్వాత ఆ కమిషన్‌ నియమించిన సిలబస్‌ కమిటీ గ్రూప్‌–1 సిలబస్‌ను నాలుగు ప్రధాన భాగాలుగా రూపొందించింది. జాతీయ స్థాయిలో నిర్వహించే సివిల్స్‌ సిలబస్‌కు సారూప్యత ఉండేలా ఈ సిలబస్‌ను తయారు చేశాం. సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యే వారు గ్రూప్‌–1 రాసేలా, గ్రూప్‌–1కు సిద్ధమయ్యే వారు సివిల్స్‌కు సైతం పోటీపడేలా, జాతీయ స్థాయి పోకడలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సిలబస్‌ను రూపొందించాం. తెలంగాణలో విభాగాధిపతిగా, జిల్లా ఉన్నతాధికారిగా వ్యవహరించే పరిపాలన అధికారికి తెలంగాణ కోణం కచ్చితంగా తెలిసి ఉండేలా చూశాం.

తెలంగాణ సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాలు, ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత, గత పరిణామాలు, తొలి, మలి ఉద్యమాలు వంటి వాటిపై అవగాహనను పరిశీలించేలా సిలబస్‌ను ఖరారు చేశాం. ప్రస్తుత పరిస్థితులు, సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు వంటి అంశాలపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. మరోవైపు శాస్త్ర సాంకేతిక రంగాలు, భారతదేశ చరిత్ర, సంస్కృతి, రాజనీతి శాస్త్రం, భారత రాజ్యాంగం వంటి అంశాలను మరో విభాగంగా తీసుకొని సిలబస్‌ను రూపొందించాం. 

ఇంటర్‌ స్థాయిలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ 
సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పూర్తిగా ఇంటర్మీడియట్‌ స్థాయిలోనే ఉంటుంది. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అనగానే పూర్తిగా ఆయా రంగాలపై లోతైన అవగాహన పెంచుకోవాలని ఏమీ లేదు. ఫోకస్‌ అంతా సైంటిఫిక్‌ మెథడ్‌ ఎలా డెవలప్‌ అయిందన్నదే. సైన్స్‌ నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది? పురోభివృద్ధికి ఎలా దోహదపడుతోందన్నది చూసుకుంటే చాలు. 

తెలంగాణ ఉద్యమంపై ప్రత్యేకంగా పేపరు 
తెలంగాణ ఉద్యమంపై ప్రత్యేకంగా ఓ పేపరు ఉంది. నిజాం పాలన, హైదరాబాద్‌ ప్రత్యేక రాష్ట్రం, ముల్కీ ఉద్యమం, దేశంలో విలీనం, ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు, పెద్ద మనుషుల ఒప్పందాలు, వాటి అమలులో వైఫల్యాలు, 1948 తర్వాత సాయుధ పోరాటం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత, పోరాటాలు, తొలి, మలి దశ ఉద్యమాలు కీలకమైనవి.

ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద మనుషుల ఒప్పందం, దాని వల్ల న్యాయం జరగకపోవడం, 1969 ఉద్యమం, మలి దశ ఉద్యమాలతో పాటు వర్తమాన సమాజాన్ని అర్థం చేసుకోవడం, దాని పూర్వ చరిత్ర తెలుసుకోవడం ముఖ్యం. 1948కి ముందు ఏముంది? ఆ తర్వాత ఎలా అభివృద్ధి చెందాం, ఇప్పుడున్న రాజకీయ ఆర్థిక పరిస్థితులు ఏంటన్న అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement