
గ్రూప్ వన్ టాపర్ డా. లక్ష్మీ దీపిక కొమ్మిరెడ్డి
పట్టుదల, తపన, దానికి తగ్గ సాధన తోడైతే ఎంతటి లక్ష్యమైనా తలొంచి తీరుతుందని గ్రూప్‌వన్ టాపర్ లక్ష్మీదీపిక కొమ్మిరెడ్డి నిరూపించారు. తెలంగాణ రాష్ట్రస్థాయిలో టాప్ ర్యాంక్ సాధించానన్న విషయం తెలిసిన దీపిక ముందు కొద్దిసేపటి వరకు అది కలే అనుకున్నారు. నిజమేనని తెలుసుకుని సంభ్రమాశ్చర్యాలలో మునిగి తేలారు. గ్రూప్1 పరీక్షల్లో రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించడానికి ఆమె పడిన కష్టం, తల్లిదండ్రుల ప్రోత్సాహం అన్నీ కలిపి ఆమెను మొదటి స్థానంలో నిలిపాయి. వివరాలు ఆమె మాటల్లోనే ..
‘‘నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. ఉండేది సఫిల్‌గూడప్రాంతంలో. అమ్మ పద్మావతి గృహిణి, నాన్న కృష్ణ కొమ్మిరెడ్డి రిటైర్డ్ సీనియర్ ఆడిట్ ఆఫీసర్. పదో తరగతి సఫిల్‌గూడలోని డీఏవీ పాఠశాల, ఇంటర్ నారాయణగూడ శ్రీ చైతన్య, 2013లో మెడిసిన్ లో 119వ ర్యాంక్‌తో ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశా. మాస్టర్స్ డిగ్రీ చేయడం కోసం అమెరికా వెళ్లాను. అమ్మా నాన్నలకు ఒక్కగానొక్క కూతురిని. అందుకే డాక్టరుగా ఇక్కడే ప్రాక్టీస్ చేద్దామని అనుకున్నా.
కానీ అనుకోకుండా నా దృష్టి సివిల్స్‌పై మళ్లడంతో ఆ దిశగా ప్రయత్నించాలనుకున్నాను. అందుకు అమ్మానాన్నలు కూడా అంగీకరించారు. అదేసమయంలో గ్రూప్స్‌కు నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు చేసుకున్నా. ఆలోచన వచ్చిందే తడవుగా సిలబస్ చెక్ చేశాను. పాత ప్రశ్నాపత్రాలు పరిశీలించాను. ప్రిపరేషన్ సులభమనే అనిపించింది. దాంతో కోచింగ్‌కు వెళ్లాలనిపించలేదు. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్1 పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ సాధించాను.
2020లో మొదటిసారిగా యూపీఎస్సీ పరీక్ష రాశా! కాని, అది నేను అనుకున్నంత సులువు కాదని మూడు ప్రయత్నాలు విఫలం అయ్యేవరకు అర్థం కాలేదు. దాంతో అంతవరకు ఆప్షనల్‌గా ఉన్న తెలుగు బదులు ఆంత్రపాలజీని ఎంచుకుని గత ఏడాది నుంచి పూర్తిస్థాయిలో ప్రిపరేషన్ పై దృష్టి సారించాను. అలాగే గత సెప్టెంబర్‌లో యూపీఎస్సీ మెయిన్స్, అక్టోబర్‌లో టీజీపీఎస్సీ మెయిన్స్ కూడా రాశాను. ఈ సంవత్సరం మార్చి16న యూపీఎస్సీ ఇంటర్వ్యూకి హాజరయ్యాను.. ఆ ఫలితాలు వస్తాయనుకుంటే ఈ ఫలితాలు ముందుగా వచ్చాయి.
సివిల్స్ సాధనే ఆశయం...
నా జీవితాశయం సివిల్స్.. కెరీర్‌లో ఎదుగుదలతోపాటు ప్రజాసేవ చేయాలన్నది నా ఆకాంక్ష. త్వరలోనే వీటిని సాధిస్తానన్న నమ్మకం ఉంది. రోజూ కేవలం మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే చదివేదాన్ని. పరీక్షల సమయంలో మాత్రం 8– 9 గంటలు చదువుకునేదాన్ని. పరీక్షల సమయంలో మా అమ్మ కూడా నాతోపాటే జాగారం చేసేది. వొత్తిడి అనిపించినప్పుడు సరదాగా ముచ్చట్లు పెట్టుకునే వాళ్లం. పుస్తక పఠనం ముందునుంచే ఇష్టం. పాటలు పాడటం నా హాబీ. వొత్తిడి సమయంలో ఇవి నాకు చాలా ఉపయోగపడ్డాయి.’’ అంటూ ముగించారు దీపిక.
సోషల్ మీడియాను సక్రమంగా ఉపయోగించుకోవాలి
కోచింగ్‌ల మీద ఆధార పడి సమయం, డబ్బును వృథా చేయద్దు. సోషల్ మీడియాలో చాలా మంచి సమాచారం అందుబాటులో ఉంది. దానిని సరిగా ఉపయోగించుకోగలగాలి. కెరీర్‌లో రాణించడానికి అవసరమైన ప్రణాళికను ముందే సిద్ధం చేసుకుని అందుకు తగ్గట్టు కృషి చేయాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ధైర్యంగా ఎదుర్కొని గమ్యమే లక్ష్యంగా ముందుకు సాగాలి. అప్పుడే ఆశయాన్ని సాధించగలం.
– డా. లక్ష్మీ దీపిక కొమ్మిరెడ్డి, గ్రూప్ వన్ టాపర్
– పవన్ కుమార్ పలుగుల, సాక్షి, ఉప్పల్/ కాప్రా