మా ఇంటి మణిదీపం | Girl child is a blessing to family Khammam District Collector Muzammil Khan | Sakshi
Sakshi News home page

మా ఇంటి మణిదీపం

Published Thu, Apr 3 2025 12:35 AM | Last Updated on Thu, Apr 3 2025 6:10 AM

Girl child is a blessing to family Khammam District Collector Muzammil Khan

స్త్రీ శక్తి

‘ఆడపిల్ల పుట్టింది’ అనే వార్త చెవిన పడగానే... ‘మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది’ అంటూ సంబరం అంబరాన్ని అంటాలి. ‘మా పాప–మా ఇంటి మణిదీపం’ ఇచ్చే స్ఫూర్తి అదే. ‘ఆడపిల్లలు ఎంత చదివితే అంత ముందుకు వెళతారు. అంత అదనపు శక్తి వస్తుంది’ అని అమ్మమ్మ చెబుతుండే వారు. తన అమ్మమ్మ స్ఫూర్తితో చదువు నుంచి స్వయం ఉపాధి వరకు మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు రూపొందిస్తున్నారు ఖమ్మం జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌...

‘బేటీ బచావో...బేటీ పడావో’ స్ఫూర్తితో ఖమ్మం జిల్లాలో ‘మా పాప–మా ఇంటి మణిదీపం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆడపిల్ల పుట్టిన ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు, నానమ్మని సత్కరిస్తారు. శాలువ కప్పి స్వీట్‌ బాక్స్, పండ్లు, ఒక సర్టిఫికెట్‌ను అందజేస్తారు. కొందరి ఇళ్లకు స్వయంగా కలెక్టర్‌ వెళుతున్నారు.

హాజరు శాతంపెరిగింది
పాఠశాలల్లో బాలికల హాజరు శాతంపై కలెక్టర్‌ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. బాలికల హాజరు శాతం పెరిగేలా కృషి చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో బాలికల హాజరు శాతం 86 నుంచి 92 శాతానికి పెరిగింది. పాఠశాలల్లో బాలికలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకున్నారు.

ఆర్థిక శక్తి
స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు ఉపాధి కలిగిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో స్త్రీ–టీ క్యాంటీన్లు ప్రసిద్ధి చెందాయి. ఇప్పటికే 50 కి పైగా క్యాంటీన్‌ల వరకు జిల్లా వ్యాప్తంగా లాభాల బాటలో నడుస్తుండగా మరిన్ని క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారు. యూనిట్లను మంజూరు చేయడంతోపాటు ఎప్పటికప్పుడు వాటి పనితీరును కలెక్టర్‌ పర్యవేక్షిస్తున్నారు.

మా అమ్మమ్మ అలా లాయర్‌ అయింది...
మహిళలు చదువుకుంటే తరతరాలుగా ఆ కుటుంబం బాగుపడుతుందని చెబుతారు. అది కళ్లతో చూశా. మా అమ్మమ్మకు పన్నెండేళ్లకే పెళ్లి చేశారు. అమ్మమ్మ వాళ్ల ఇంటి ఎదుట కిరాణాషాపు ఉండేది. అక్కడ సరుకులను న్యూస్‌ పేపర్లలో కట్టి ఇచ్చేవారు. ఆ న్యూస్‌ పేపర్లను చదువుతూ మరోసారి చదువుపై ఆసక్తిని పెంచుకుని బీఈడీ, ఎంఈడీ పూర్తి చేసింది. లాయర్‌ అయింది. అప్పుడే నాకు తెలిసింది చదువుతో 
ఎంతైనా సాధించవచ్చునని. 
– ముజమ్మిల్‌ ఖాన్, కలెక్టర్, ఖమ్మం

కలెక్టర్‌ మా ఇంటికి వచ్చారు!
నాకు మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది. మా ఇంటికి కలెక్టర్‌ సార్‌ వచ్చిండు. మాకు సన్మానం చేసి, పూలు, పండ్లు, స్వీట్లు ఇచ్చారు. సర్టిఫికెట్‌ అందజేశారు. మా పాప పెద్దయ్యాక ఈ సర్టిఫికెట్‌ చూపించి కలెక్టర్‌ ఇచ్చారని చెప్పమన్నారు. ‘మీకు మహాలక్ష్మి పుట్టింది. బాగా చదివించండి. భవిష్యత్తులో మంచి ఉద్యోగం సంపాదిస్తుంది’ అంటూ ఆశీర్వదించారు. 
– బానోత్‌ కృష్ణవేణి, రామచంద్రాపురం, ఖమ్మం జిల్లా

– బొల్లం శ్రీనివాస్, సాక్షి ప్రతినిధి, ఖమ్మం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement