
ఆడపిల్లల భద్రతకు ప్రమాదం పొంచివున్నదని స్పష్టంగా కనబడుతున్నా కళ్లుమూసుకున్న పోలీస్ యంత్రాంగం సాక్షిగా హైదరాబాద్‌లో మొన్న శనివారం ఒక యువతిపై లైంగిక దాడి జరిగింది.
ఎంఎంటీఎస్‌లో ప్రయాణిస్తుండగా బోగీలో ఎవరూలేని సమయం చూసి దుండగుడు దాడి చేయగా తప్పించుకునే యత్నంలో నడుస్తున్న రైలునుంచి ఆమె దూకి తీవ్ర గాయాలపాలైంది. పగలంతా కిక్కిరిసి వుండే ఎంఎంటీఎస్ రైళ్లు చీకటిపడే వేళకు దాదాపు ఖాళీ అవుతుంటాయి. జనం ఎక్కువున్న సమయాల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా ఆడవాళ్ల బోగీల్లో ఎక్కి వెకిలిచేష్టలకు పాల్పడటం, సెల్‌ఫోన్లు, ఆభరణాలు అపహరించటం వంటివి పెరిగాయని అనేకులు చెబుతున్నారు.
హిజ్రాల ఆగడాలు సరేసరి. ఒంటరిగా ప్రయాణించక తప్పని స్థితిలో ఈ అరాచకాలు ఇంకెంత మితిమీర గలవో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఈ మాదిరి ఉదంతాలపై నిత్యం ఫిర్యాదులు అందుతూనే ఉంటాయని మీడియా కథనాలు చెబుతున్నాయి. ప్రయాణికుల సంఘాలు కూడా ఆందోళనలు చేసినా పోలీసులు మేల్కొనలేదు. రైల్వే భద్రతా దళం(ఆర్‌పీఎఫ్), ప్రభుత్వ రైల్వే పోలీస్(జీఆర్‌పీ) విభాగం అసలు దీన్ని సమస్యగానే భావించలేదు.
ఆ విభాగాలు కర్తవ్య నిర్వహణలో విఫలం కావటమే నిజమైన సమస్య. కనీసం చీకటిపడింది మొదలు అర్ధరాత్రి సర్వీసులు ఆగిపోయే వరకైనా బందోబస్తు అవసరమని గ్రహించలేదు. సరిగదా అంతక్రితం ఎంఎంటీఎస్ రైళ్లలోవుండే హోంగార్డుల్ని సైతం ఈమధ్య తొలగించారంటున్నారు. హైదరాబాద్ నగరంలో సుమారు 30 ఎంఎంటీఎస్ స్టేషన్లువుంటే కేవలం పది స్టేషన్లలో మాత్రమే భద్రత ఉండటం, అది కూడా అంతంత మాత్రం కావటం దారుణం.
స్టేషన్లలో అక్కడక్కడ పేరుకు ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ కానిస్టేబుళ్లు కనబడు తుంటారు. కానీ మహిళల కోచ్‌లు ఎలావున్నాయో, భద్రత ఏ మేరకు అవసరమో గమనించేపాటి పని కూడా వారినుంచి ఆశించే స్థితి లేదంటే నిర్వాహకులు సిగ్గుపడాలి.
సాంకేతికత విస్తరించిన ఈ కాలంలో కూడా దాన్ని సవ్యంగా వినియోగించలేని అశక్తతలో ప్రభు త్వాలుండటం విచారకరం. హైదరాబాద్ నగర శివారులో 2019 నవంబర్‌లో ఒక మహిళా వైద్యు రాలిని అపహరించి, ఆమెపై అత్యాచారం జరిపి హత్య చేసిన ఉదంతం చోటు చేసుకున్నప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దాన్ని తెలంగాణకు సంబంధించిందిగా చూడలేదు.
అలాంటి పరిస్థితి ఏపీలో తలెత్తకూడదన్న సంకల్పంతో పోలీస్ వ్యవస్థను కదిలించి కేవలం మూడు నెలల వ్యవధిలోనే దిశ యాప్ అందుబాటులోకి తెచ్చారు. దిశ ప్రత్యేక పోలీస్ స్టేషన్లు నెలకొల్పారు. లక్షలాదిమంది ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటంవల్ల ఆపత్కాలంలో అనేకమందిని రక్షించటం సాధ్యమైంది.
2021 సెప్టెంబర్‌లో ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష రాయటానికి ఢిల్లీ వెళ్లిన ఏపీ యువతి తెల్లారుజామున దిగి ఆటో ఎక్కాక కీడు శంకించినప్పుడు దిశ యాప్ వల్లే పోలీసులను అప్రమత్తం చేసింది. ఏపీ పోలీసుల సమన్వయంతో ఆమె క్షేమంగా పరీక్ష రాసింది. తిరిగి ఏపీకి వెళ్లే రైలు ఎక్కేవరకూ సాయం దొరికింది. హైదరాబాద్‌లో బెంగళూరు వెళ్లే రైలెక్కిన మహిళ సైతం ఈ యాప్‌ను ఉపయోగించుకునే తనను తాను రక్షించుకోగలిగింది.
దేశంలో ఏ మూలనున్నా ఈ యాప్ ద్వారా సమాచారం అందుకుని మహిళలను రక్షించిన ఉదంతాలు కోకొల్లలు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక వెనకా ముందూ చూడకుండా దీన్ని రద్దుచేశారు. తొమ్మిది నెలలు జాప్యంచేసి, అదే యాప్‌కు సురక్షా అనే పేరు తగిలించి ఈ నెల మొదటివారంలో మళ్లీ తీసుకొచ్చారు.
వేషం మారిన ఈ యాప్‌పై మహిళల్లో పెద్దగా ప్రచారం చేసిన దాఖలా కూడా లేదు. అఘాయిత్యాలు మితిమీరిన ఈ కాలంలో దిశవంటి యాప్‌ను కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేవరకైనా కొనసాగించాలన్న ఇంగితజ్ఞానం కూటమి ప్రభు త్వానికి లేకపోయింది. బహుశా ఆ యాప్ కొనసాగివుంటే ఎంఎంటీఎస్‌లో ఆపదలో చిక్కుకున్న యువతికి అది ఆసరాగా నిలిచేదేమో!
ఎక్కడో వేరే రాష్ట్రంలోవున్న యువతులకు ఆపత్కాలంలో సాయపడటం మాట అటుంచి, తాడేపల్లిలో డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో దుండ గుల బారిన పడిన మహిళను కూడా కాపాడలేని అశక్తతలో ఏపీ పోలీసులు కూరుకుపోయారు. ఫలితంగా ఆ మహిళపై దుండగులు అత్యాచారం చేసి, హతమార్చారు. అదే ప్రాంతంలో మొన్న జనవరి 31న మరో మహిళ బలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈమాదిరి అఘాయిత్యాలకు అంతేలేదు.
ఎంఎంటీఎస్ ఉదంతంలో రైల్వే పోలీసులు బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. దుండ గుడు పట్టుబడవచ్చు కూడా. ఈ ఉదంతం పోలీసులకు ఎలాంటి గుణపాఠం నేర్పిందోగానీ మళ్లీ మరోటి జరిగేవరకూ పట్టనట్టు వ్యవహరించే ధోరణికి ఇకనైనా స్వస్తి పలకాలి. ఖర్చు తగ్గించుకుని లాభార్జన చేయాలన్న యావ భద్రతకు తూట్లు పొడుస్తుందన్న సంగతి ఎంఎంటీఎస్ నిర్వాహకులు తెలుసుకోవాలి.
ఆకతాయిలూ, అసాంఘిక శక్తులూ, యధేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించేవారూ తమకేం కాదన్న భరోసాతో ఉండటం మహిళలకూ, పిల్లలకూ ప్రాణాంతకమవుతుంది. రైల్వే స్టేషన్లతోపాటు బోగీల్లో సైతం సీసీ కెమెరాలుంటే, వాటిని నిత్యం పర్యవేక్షిస్తుంటే, తక్షణం చర్యలు తీసుకునే యంత్రాంగం పనిచేస్తే ఆగడాలను అరికట్టడం సులభమవుతుంది. అలాగే మహిళల రక్షణకు తగిన యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలి. గడప దాటితే క్షేమంగా తిరిగొస్తామో లేదోనన్న భయాందోళనల మధ్య పౌరులు బతికే దుఃస్థితి ఉండటం మంచిదికాదని ప్రభుత్వం, రైల్వేశాఖ గుర్తించాలి.