నిజాం షుగర్స్‌ను ప్రభుత్వమే నడపాలి
♦ అదే ఉద్యమ కాలం నాటి ఆకాంక్ష
♦ రైతులు, కార్మికులతో చర్చించి ఉద్యమ కార్యాచరణ
♦ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
బోధన్: నిజాంషుగర్ ఫ్యాక్టరీకి పూర్వవైభవం తీసుకురావడం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో నిజాంషుగర్స్‌ను స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడుపాలని ఉద్యమం చేపట్టామన్నారు. నిజాంషుగర్స్‌ను తెరిపించి, ప్రభుత్వమే నడపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్‌డీఎస్‌ఎల్ యాజమాన్యం లేఆఫ్ ప్రకటించి తాత్కాలికంగా ఫ్యాక్టరీని మూసి వేసిన నేపథ్యంలో చెరుకు పంట సాగు, రైతుల స్థితిగతులు, పంట సాగు, ఫ్యాక్టరీ భవిష్యత్తుపై రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు సోమవారం కోదండరాం గ్రామాల్లో పర్యటించారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఖాజాపూర్, హున్సా, మందర్న గ్రామాల్లో ప్రొఫెసర్ పర్యటించారు. మందర్న, హున్సాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో కోదండరాం మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో నిజాంషుగర్స్‌ను ప్రైవేటీకరించడం తప్పిదమని, స్వరాష్ట్రంలో ఫ్యాక్టరీ మూసివేయడం మరో తప్పిదమవుతోందన్నారు. నిజాంషుగర్ ఫ్యాక్టరీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఫ్యాక్టరీ రక్షణ కోసం జిల్లా ప్రతినిధులు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. బంగారు తెలంగాణ స్వప్నం బంజారాహిల్స్‌కే పరిమితం కావొద్దని, యావత్ తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలన్నారు. రైతులు, కార్మికుల ఆకాంక్షను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.
ఎన్‌డీఎస్‌ఎల్ ఫ్యాక్టరీల పరిధిలోని రైతులు, కార్మికులతో చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సదస్సులు, సమావేశాలు నిర్వహించి త్వరలోనే హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం తలపెడుతామన్నారు. పార్టీల కతీతంగా రైతులు సంఘటితం కావాలన్నారు. ఎడ్లబండి ఎక్కిన తర్వాత పగ్గాలు చేత పట్టాలే కాని భయపడితే ఎలా అని రైతులను నుద్దేశించి అన్నారు. పార్టీలకతీతంగా బతుకు జెండా ఎత్తాలన్నారు. నిజాంషుగర్స్‌ను తిరిగి తెరిపించాలని కోరడం న్యాయబద్ధమైందని, ఇదే తెలంగాణ ఉద్యమం నేర్పిందన్నారు. న్యాయం, ధర్మం కోసమే తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం నడిచిందన్నారు.