
ఫ్యాక్టరీ పునఃప్రారంభంపై స్పష్టత కరువు
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ ప్రకటన అమలయ్యేనా?
2025 డిసెంబర్ నాటికి ఫ్యాక్టరీలు తెరిపిస్తామంటూ రైతులతో సదస్సులు
తెరిపించే ప్రక్రియ మొదలైనా.. మళ్లీ సందిగ్ధం
తెరిపించేది ప్రభుత్వమా?.. ప్రైవేటా?.. సహకారమా?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు నిజాం షుగర్స్ పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేసినప్పటికీ.. మళ్లీ సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ కొంత ప్రక్రియ పూర్తి చేసింది. ప్రైవేటు యాజమాన్యం పరిధిలోని ఈ ఫ్యాక్టరీకి చెందిన రూ.400 కోట్ల బ్యాంకుల బకాయిలకు సంబంధించి, వన్‌టైం సెటిల్‌మెంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.190 కోట్లు చెల్లించింది.
2025 డిసెంబర్ నాటికి ఫ్యాక్టరీని తెరిపిస్తామని ప్రకటించినప్పటికీ.. అది మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఆలస్యంగానైనా.. పబ్లిక్ సెక్టార్‌లోనా, ప్రైవేటు సెక్టార్‌లోనా, సహకార విధానంలో ప్రారంభిస్తారా? అనే అంశంపై కూడా స్పష్టత లేకుండా పోయింది.
మరోవైపు క్షేత్రస్థాయిలో సన్నద్ధత విషయంలో ఇప్పటికీ గందరగోళమే నడుస్తోంది. ఎందుకంటే ఈ ఏడాది క్రషింగ్ సీజన్ (అక్టోబర్ నుంచి డిసెంబర్) నాటికి సాధ్యమయ్యే పరిస్థితులు లేవు. ప్రభుత్వం నుంచి సైతం స్పష్టమైన ప్రకటన రావడం లేదు. బోధన్ ఫ్యాక్టరీని మరో చోటికి తరలించి.. కొత్త యంత్రాలతో నడిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు చర్చ జరుగుతోంది.
రైతులతో విడతల వారీగా కమిటీ చర్చలు
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీలో సభ్యుడైన మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ రైతులతో విడతలవారీగా ముఖాముఖి చర్చలు జరిపింది. చెరుకు సాగును ప్రోత్సహించేందుకు అవగాహన సదస్సులు నిర్వహించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, షుగర్ కేన్ బోర్డు రాష్ట్ర స్థాయి అధికారులు పాల్గొన్నారు. మరోవైపు ప్రస్తుతం ఫ్యాక్టరీ స్థితిగతులు, యంత్రాల పరిస్థితిని నిపుణుల బృందం పరిశీలిస్తోంది. తరువాత వారి నివేదిక మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
నిపుణుల బృందం నివేదిక ప్రభుత్వం వద్దకు వెళ్లి దని ప్రచారం జరుగుతోంది. నివేదికలో ఏముందో బయటకు రాలేదు. మరోవైపు చెరుకు సాగుపై రైతులు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం విధానపరంగా ఫ్యాక్టరీ పునఃప్రారంభం విషయమై స్పష్టత ఇవ్వలేదు. రైతులు గణనీయమైన స్థాయిలో చెరుకు పంటను పండించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తేనే.. షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించే పరిస్థితి ఉంది.
ఈ నేపథ్యంలో పునఃప్రారంభానికి అడుగులు మరింతగా పడాలంటే చెరుకు సాగు విస్తీర్ణమే ప్రధానం కానుంది. బోధన్ (ఉమ్మడి నిజామాబాద్), మంబోజిపల్లి (ఉమ్మడి మెదక్), ముత్యంపేట (ఉమ్మడి కరీంనగర్) జిల్లాల్లో నిజాం డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీలున్నాయి.
2002లో ప్రైవేటుకు విక్రయించిన చంద్రబాబు ప్రభుత్వం..
నిజాం షుగర్స్ యూనిట్లను 2002లో డెల్టా పేపర్ మిల్స్ అనే ప్రైవేటు సంస్థకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం విక్రయించింది. 2014లో ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ నిజాం షుగర్స్‌ను ప్రభుత్వపరం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా 2015 డిసెంబర్ 23న ఫ్యాక్టరీ మూడు యూనిట్లకు లేఆఫ్ ప్రకటించారు. 2005–06లో చెరుకు దిగుబడి 35 వేల టన్నులున్నప్పటికీ నడిపిన ఈ కర్మాగారాలను.. 2015లో దిగుబడి లక్ష టన్నులకు పెరిగినా మూసేయడం గమనార్హం. దీంతో రైతులు వరి పంట వైపు మళ్లారు.
నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలున్న బోధన్, ముత్యంపేట, మంబోజిపల్లి ప్రాంతాల్లో రైతులు గణనీయమైన విస్తీర్ణంలో చెరుకు పంట పండించేందుకు ముందుకు వస్తేనే.. ప్రభుత్వం ఫ్యాక్టరీల పునఃప్రారంభం విషయంలో మరింత వేగంగా ముందుకెళ్లే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతులు చెరుకు సాగు చేయడంపై ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment