nizam sugars
-
కమిటీతోనైనా కథ ముగిసేనా?
సాక్షి, హైదరాబాద్: నష్టాలతో మూత పడిన నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్) ఆస్తులను విక్రయించి బ్యాంకులు, ఇతర సంస్థలకు బకాయి లు చెల్లించాల్సిందిగా సుమారు నాలుగున్నర ఏళ్ల క్రితం నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) తీర్పుని చ్చింది. నిజాం షుగర్స్ పునరుద్ధర ణ మార్గాలు మూసుకుపోవడంతో ఆస్తుల విక్ర యం (లిక్విడేషన్) మినహా మరో మార్గం లేదని గతంలోనే స్పష్టం చేసింది. ఎన్సీఎల్టీ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసినా ఏళ్ల తరబడి నిజాం దక్కన్ షుగర్స్ భవితవ్యం కొలిక్కిరావడం లేదు. ఈ నేపథ్యంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఎన్డీఎస్ఎల్ను తిరిగి తెరిపిస్తామంటూ ‘పునరుద్ధరణ కమిటీ’ని ప్రకటించింది. ఈ కమిటీలో మరో మంత్రి దామోదర రాజనర్సింహ సహ చైర్మన్‌గా, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పి.సుదర్శన్‌రెడ్డి, రోహిత్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఎ.చంద్రశేఖర్‌తో పాటు ఆర్థిక, పరిశ్రమ లు, వ్యవసాయ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు. ఎన్డీఎస్ఎల్ను తిరిగి తెరవడం లక్ష్యంగా ఏర్పాటైన నిజాం షుగర్స్ పునరుద్ధరణ కమిటీ రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలనే ప్రభుత్వ ఆదేశాలు ఎంత మేర ఫలిస్తాయనే చర్చ జరుగుతోంది. చంద్రబాబు హయాంలో ప్రైవేటు పరం ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో 1937లో ఏర్పాటైన నిజాం చక్కెర కర్మాగారం (ఎన్ఎస్ఎల్) 1990వ దశకం నాటికి నష్టాల బాట పట్టింది. నష్టాల నుంచి నిజాం షుగర్స్‌ను గట్టెక్కిస్తామనే నెపంతో 2002లో నాటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 51 శాతం వాటాను డెల్టా పేపర్ మిల్లుకు విక్రయించింది. దీంతో దశాబ్దాల తరబడి ఎన్ఎస్ఎల్గా పేరొందిన నిజాం షుగర్స్ ఎన్‌డీఎస్‌ఎల్‌గా పేరు మార్చుకుంది. ప్రైవేటు సంస్థకు 51 శాతం వాటా అప్పగించడంపై అప్పట్లో పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే నష్టాల నుంచి గట్టెక్కే పరిస్థితి లేకపోవడంతో ఎన్డీఎస్ఎల్ను మూసివేస్తున్నట్లు 2015 డిసెంబర్లో యాజమాన్యం ప్రకటించింది. పరిశ్రమ ఆస్తులను విక్రయించి అప్పులు చెల్లించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఈ ప్రతిపాదనను తిరస్కరించిన రాష్ట్ర ప్రభుత్వం రైతుల భాగస్వామ్యంతో సహకార రంగంలో ఎన్డీఎస్ఎల్ను నడిపేందుకు 2015 ఏప్రిల్‌లో కార్యదర్శుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. డెల్టా పేపర్ మిల్లుకు చెందిన 51 శాతాన్ని టేకోవర్ చేయడంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి 3 నెలల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా జీఓఎంఎస్ 28ను కూడా జారీ చేసింది. ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన ఎన్డీఎస్ఎల్ అప్పులు పెరిగినందున దివాలా పరిశ్రమగా గుర్తించాలని ఎన్డీఎస్ఎల్ 2017లో నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. అప్పులు తీర్చేందుకు కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిసొల్యూషన్ ప్రాసెస్ ప్రారంభించాలని కోరడంతో రుణదాతలతో సంప్రదింపులు జరిపేందుకు ఎన్సీఎల్టీ లిక్విడేటర్‌ను కూడా నియమించింది. 2017 అక్టోబర్ నుంచి 2018 సెపె్టంబర్ వర కు 11 పర్యాయాలు రుణదాతలతో సంప్రదింపులు జరిపినా పునరుద్ధరణ అంశం కొలిక్కి రాలే దు. పరిశ్రమ కొనుగోలుకు ముందుకు వ చ్చిన కొన్ని సంస్థలు ఎన్డీఎస్ఎల్ ఆస్తులు, అప్పులు పరిశీలించి వెనకడుగు వేశాయి. నాలుగున్నరేళ్ల క్రితం సంస్థకు రూ.360 కోట్ల అప్పులు ఉండగా, ఆస్తుల విలువ కూడా అంతే ఉన్నట్లు తేలింది. సంస్థ పునరుద్ధరణ, అమ్మకం ప్రయత్నాలు కొలి క్కి రాకపోవడంతో ఎన్సీఎల్టీ లిక్విడేషన్‌కు అనుమతిచ్చింది. ఎన్సీఎల్టీ తీర్పుపై 2019లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, నేటికీ ఆ కేసులో పురోగతి లేదు. ఎన్డీఎస్ఎల్పై ఇప్పటికే హౌజ్‌కమిటీ, కార్యదర్శుల కమిటీ వంటివి ఏర్పాటైనా సంస్థ మనుగడపై స్పష్టత ఇవ్వ లేకపోయాయి. ఈ నేపథ్యంలో నిజాం దక్కన్ షుగర్స్‌ను పునరుద్ధరిస్తామంటూ తాజాగా కమిటీని ఏర్పాటు చేసింది. రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని గడువు నిర్దేశించింది. -
బాబుకు ‘నిజాం షుగర్స్’ పాపమే కొట్టింది
బోధన్: ‘‘లాభాల్లో నడిచే నిజాం షుగర్స్‌ను ప్రైవేటీకరించి ఇప్పుడు ఏపీలో చంద్రబాబు శిక్ష అనుభవిస్తున్నాడు, అలాంటి పరిస్థితి మీకు (ఎన్డీఎస్ఎల్ ప్రైవేట్ యాజమాన్యం) రావాలని కోరుకోవడం లేదు.. ఎన్డీఎస్ఎల్(నిజాం డెక్కన్ షుగర్స్ లిమిటెడ్) లేఆఫ్ నుంచి రావాల్సిన బకాయి వేతనాలు పూర్తిగా చెల్లించండి’’అని కార్మికులు డిమాండ్ చేశారు. ఒక్కసారిగా బాబు ప్రస్తావన విని ఎన్డీఎస్ఎల్ సీఈవో సుబ్బరాజు, పర్సనల్ ఆఫీసర్ శ్రీధర్‌రాజు, స్థానిక అధికారి రమేష్ అవాక్కయ్యారు. ఫ్యాక్టరీ మూసివేత వల్ల తమ జీవితాలు అన్యాయమయ్యాయని, కుటుంబాలు రోడ్డున పడ్డాయని, బిచ్చమెత్తుకుని బతకాల్సిన దుస్థితి వచ్చిందని కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. కార్మికుల వేతన, ఇతర బకాయిల చెల్లింపునకు సంబంధించి సెటిల్మెంట్ చేసేందుకు ఎన్డీఎస్ఎల్ అధికారులు శుక్రవారం నిజామాబాద్ జిల్లా బోధన్ ఫ్యాక్టరీలో సమావేశం నిర్వహించారు. బోధన్, ముత్యంపేట, ముంబోజిపల్లి ఫ్యాక్టరీల కార్మికులు హాజరయ్యా రు. 2015 డిసెంబర్ 23న ప్రైవేట్ యాజమాన్యం బోధన్, ముత్యంపేట(జగిత్యాల), ముంబోజిపల్లి (మెదక్) యూనిట్లను మూసివేసిన విషయం తెలిసిందే. రాతపూర్వక ఒప్పందం మేరకు ఇవ్వండి ఎన్డీఎస్ఎల్ సీఈవో సుబ్బరాజు చర్చను ప్రారంభిస్తూ 2021లో లేబర్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 2015 డిసెంబర్ 23 కట్ డేట్ (లేఆఫ్ ప్రకటించిన తేదీ) నిర్ధారించి ఏడాదికి 15 రోజుల చొప్పున కార్మికుడి సర్విసు మేరకు వేతనంతో కూడిన బకాయిలు చెల్లిస్తామని తెలిపారు. ఈ ప్రతిపాదన అసంబద్ధమైందని కార్మికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ మూసివేతకు గురైతే ఏడాదికి 45 రోజుల చొప్పున వేతనం చెల్లించాలని యాజమాన్యం రాతపూర్వకంగా హామీ ఉందని, దీంతో పాటు, లేబర్ కోర్టు తీర్పు ప్రకారం 15 రోజులు కలుపుకుని 60 రోజుల చొప్పున వేతన బకాయిలు ఇవ్వాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వాటా 49 శాతం ప్రైవేట్ కంపెనీ వాటా 51 శాతంతో జాయింట్ వెంచర్లో నడుస్తున్నందున చర్చల్లో ప్రభుత్వ భాగస్వామ్యం ఉందా? అన్ని ప్రశ్నించారు. చర్చల అనంతరం కార్మికుల డిమాండ్‌ను ఎండీ దృష్టికి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు. చర్చల వెనుక ఏదో కుట్ర ఉంది.. చర్చల వెనుక ప్రైవేట్ యాజమాన్యం ఏదో కుట్ర పన్నుతోందని కార్మిక నాయకులు రవి శంకర్‌గౌడ్, ఉపేందర్, కుమార స్వామిలు ఆరోపించారు. ఫ్యాక్టరీలో భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వాన్ని పక్కన బెట్టి ఎన్నికల సమయంలో దొంగ చాటు చర్చలెందుకని ప్రశ్నించారు. మూడు ఫ్యాక్టరీలకు సంబంధించి రూ. 2వేల కోట్ల ఆస్తులు కబళించేందుకే ప్రయత్నాలు జరుగుతున్నాయేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్డీఎస్ఎల్ను రీ ఓపెనింగ్ చేయలేం.. తెలంగాణ ప్రభుత్వం ఫ్యాక్టరీ టే కోవర్ చేస్తుందని స్పష్టత ఇచ్చినందున రీ ఓపెనింగ్ చేయలేమని ఎన్డీఎస్ఎల్ సీఈవో సుబ్బారావు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
తగ్గని షుగర్ ప్రాబ్లం
నిజామాబాద్ జిల్లాలో 2014 ఎన్నికల్లో తొమ్మిదింటికి తొమ్మిది అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి.. మరోసారి ‘కారు’ జోరు కొనసాగించేందుకు మంచి గేరు మీదుంది. ప్రస్తుత ఎన్నికల్లో సిట్టింగ్‌లకే సీట్లు ఖరారు చేసింది. కాంగ్రెస్ మహాకూటమి పేరుతో రంగంలోకి దిగుతున్న నేపథ్యంలో పోరు తీవ్రంగానే ఉండే అవకాశం ఉంది. అయితే కూటమిలోని పక్షాలు ఏ మేరకు సమన్వయంతో కలిసి పనిచేస్తాయన్నదే సమస్య. బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో పసుపు, ఎర్రజొన్న సాగు అంశాలు, కామారెడ్డి, బోధన్, బాన్స్వాడ నియోజకవర్గాల్లో నిజాం చక్కెర కర్మాగారం అంశం ప్రభావం చూపనుండగా, నిజామాబాద్ అర్బన్, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో స్థానిక సమస్యలే ప్రచారాస్త్రాలు కానున్నాయి. టీఆర్ఎస్కు దన్ను.. ‘ఎర్రజొన్న’ జిల్లాలోని బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో ఎర్రజొన్న రైతులు ఎన్నికలను ప్రభావితం చేయనున్నారు. వీరికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిపడ్డ రూ.9 కోట్లను విడుదల చేయడంతో పాటు, రైతుల నుంచి ఆ పంట మొత్తాన్ని కొనేలా ప్రభుత్వం తీసుకున్న చొరవను అనుకూలంగా మలుచుకుని టీఆర్ఎస్ విస్తృత ప్రయోజనం పొందనుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎర్రజొన్నల కొనుగోలు వ్యవహారంలో జరిగిన కాల్పుల ఘటనను టీఆర్ఎస్.. ఇప్పటికీ తాజాగానే ఉంచుతోంది. బకాయిల చెల్లింపు విషయంలో మాట నిలుపుకున్న విషయాన్ని ఎక్కువగా ప్రచారం చేస్తోంది. గతేడాది ఎర్రజొన్నలను ప్రభుత్వమే కొనాలని రైతులు రోడ్డెక్కడంతో.. జిల్లా ప్రతినిధులు ముఖ్యమంత్రిని ఒప్పించి ఎర్రజొన్న మొత్తాన్ని కొనేలా చేశారు. దీంతో రైతులు సంతృప్తితో ఉన్నట్లు సమాచారం. వాణిజ్య పంట అయిన ఎర్రజొన్నలను కొనుగోలు చేసి రైతులను ఏటా మోసం చేస్తున్న సీడ్ వ్యాపారులకు చెక్ పెట్టడం 40 ఏళ్లలో ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమని రైతులు, రైతు నాయకులు అంటున్నారు. కేంద్రం వల్లే పసుపు బోర్డు ఆగిందని.. జిల్లాలో పసుపు ఎక్కువగా పండించే రైతులు అసంతృప్తితో ఉన్నారు. జిల్లాలో పసుపుబోర్డు ఏర్పాటు చేయిస్తామని టీఆర్ఎస్ హామీనిచ్చింది. నిజామాబాద్ ఎంపీ కవిత కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినా.. సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. రాందేవ్ బాబాను కలిసి ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు కోసం కృషి చేశారు. ఎకరాకు లక్ష రూపాయల వరకు పెట్టుబడిపెట్టి పసుపు సాగుచేస్తే.. సరైన మార్కెటింగ్ సౌకర్యం లేక, ధర సరిగా రాక రైతులు నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక్కడ పసుపుబోర్డు ఏర్పాటైతే మార్కెటింగ్ సౌకర్యం మెరుగు పడుతుంది. కానీ కేంద్రం తీరు వల్ల రైతులకు మేలు జరగడం లేదనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. గల్ఫ్..బీడీ.. వగైరా - తెలంగాణ నుంచి భారీ సంఖ్యలో గల్ఫ్ దేశాలకు కార్మికులు వలస వెళ్లడాన్ని దృష్టిలో ఉంచుకున్న టీఆర్ఎస్.. ఎన్ని కల సందర్భంగా గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేస్తామని హామీనిచ్చింది. 2018–19 బడ్జెట్లో ఎన్ఆర్ఐ సెల్‌కు రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ నేతలు ఏకంగా గల్ఫ్ దేశాల్లో పర్యటించి అక్కడి కార్మికుల స్థితిగతులను పరిశీలించమే కాక, రూ.500 కోట్లతో గల్ఫ్ కార్పొరేషన్ ఏర్పాటుకు హామీనిచ్చారు. - జిల్లాలో బీడీ కార్మికులు లక్షన్నర వరకు ఉంటారు. వీరికి కనీస వేతనాలు లేవు. నెలలో పనిదినాలూ తక్కువే. ఈ అంశంపై ఏ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. - డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణం ఆశించిన స్థాయిలో లేకపోవడాన్ని విపక్షాలు దుమ్మెత్తిపోయనున్నాయి. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు చూపించడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలను ప్రతిపక్షం ఎక్కుపెట్టనుంది. - పునరుజ్జీవ పథకంలో భాగంగా ఎస్ఆర్ఎస్పీని నింపడానికి ప్రభుత్వం చేపట్టిన పథకంతో.. జిల్లా రైతాంగానికి సాగునీటికి ఢోకా ఉండదని అధికార పక్షం చెబుతోంది. రైతుబంధు, బీమా పథకాలతోపాటు వివిధ వర్గాలకు ఇస్తున్న పెన్షన్లు, పథకాలను అధికార పక్షం ప్రచారం చేసుకోనుంది. టీఆర్ఎస్ ఇలా.. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన ప్రధాన హామీ.. నిజాం చక్కెర కర్మాగారాన్ని తెరిపించ డం. ప్రభుత్వ సంస్థగా కాక, రైతులు సహకార సంస్థగా ఏర్పాటు చేసుకుని నడిపించుకుంటే చేదోడుగా నిలుస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు రైతులు అంగీకరించక.. ప్రభుత్వమే నడిపించాలని పట్టుబట్టారు. అనంతరం ఫ్యాక్టరీ స్వాధీనం, భవిష్యత్తు నిర్వహణపై ప్రభుత్వం అధ్యయన కమిటీని వేసింది. నివేదిక రాలేదు. ఈలోపు ముందస్తు ఎన్నికలొచ్చాయి. ఏళ్లుగా కర్మాగారాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న కార్మికులు, చెరకు ప్రధాన పంటగా సాగు చేస్తున్న రైతులు ఫ్యాక్టరీ మూతతో రోడ్డునపడ్డారు. ఈ అంశాన్ని టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఎలా ఎదుర్కొంటుందనేది వేచి చూడాలి. కాంగ్రెస్ అలా.. నిజాం షుగర్స్‌ను ప్రభుత్వ రంగ సంస్థగా ఎందుకు మార్చలేదంటూ టీఆర్ఎస్ను నిలదీయడానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. చంద్రబాబు హయాంలో జాయింట్ వెంచర్ పేరుతో ఈ కర్మాగారంపై పెత్తనాన్ని ప్రైవేట్ సంస్థకు అప్పగించా రు. నాడు అవినీతి, అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో.. 2004లో అప్పటి సీఎం డాక్టర్ రాజశేఖరరెడ్డి శాసనసభ కమిటీని వేశారు. కానీ, కమిటీ సిఫారసు అమలు కాలేదు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు.. పరిశ్రమను ప్రైవేట్‌పరం చేయడానికి యత్నించగా, రైతులు, కార్మికులు స్టే తెచ్చుకున్నారు. ఆ తరుణంలోనే టీఆర్ఎస్.. తాము అధికారంలోకి వస్తే కర్మాగారాన్ని ప్రభుత్వమే నడిపిస్తుందని పేర్కొంది. దీన్నే కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా చేసుకుంటోంది. ..::కె.శ్రీకాంత్‌రావు -
‘నిజాం షుగర్స్‌ను కాపాడుకుందాం’
బోధన్ : తెలంగాణ వారసత్వ సంపద నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని నిజాంషుగర్స్ ఫ్యాక్టరీ (ఎన్ఎస్ఎఫ్)ని కలిసికట్టుగా కాపాడుకుందామని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపు నిచ్చారు. నిజాంషుగర్స్‌ను స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడపాలన్న ప్రధాన డిమాండ్‌తో టీ జేఏసీ, నిజాంషుగర్స్ రక్షణ కమిటీ, అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం బోధన్‌లో ధర్నా, పాదయాత్ర, బహిరంగ సభను నిర్వహించారు. కార్యక్రమంలో కోదండరాం మాట్లాడుతూ ఒక వైపు అసెంబ్లీలో వారసత్వ కట్టడాల రక్షణకు బిల్లు ఆమోదం తెలుపుతూనే మరో వైపు వారసత్వ సంపద నిజాంషుగర్ ఫ్యాక్టరీ నాశనమవుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం విచిత్రమైన పరిస్థితి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చిందన్నారు. ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయకుండా రైతులు ముందుకువస్తే అప్పగిస్తామని ప్రకటన చేసిన ప్రభుత్వం నెలలు గడిచిపోతున్నా విధివిధానాలు ప్రకటించకుండా జాప్యం చేస్తోందన్నారు. ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేసేందుకే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. రైతులకు ఎకరానికి రూ. 4వేల ఎరువు సహాయం వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేయాలన్నారు. -
నిజాం షుగర్స్‌ను ప్రభుత్వమే నడపాలి
♦ అదే ఉద్యమ కాలం నాటి ఆకాంక్ష ♦ రైతులు, కార్మికులతో చర్చించి ఉద్యమ కార్యాచరణ ♦ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం బోధన్: నిజాంషుగర్ ఫ్యాక్టరీకి పూర్వవైభవం తీసుకురావడం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో నిజాంషుగర్స్‌ను స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడుపాలని ఉద్యమం చేపట్టామన్నారు. నిజాంషుగర్స్‌ను తెరిపించి, ప్రభుత్వమే నడపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం లేఆఫ్ ప్రకటించి తాత్కాలికంగా ఫ్యాక్టరీని మూసి వేసిన నేపథ్యంలో చెరుకు పంట సాగు, రైతుల స్థితిగతులు, పంట సాగు, ఫ్యాక్టరీ భవిష్యత్తుపై రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు సోమవారం కోదండరాం గ్రామాల్లో పర్యటించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఖాజాపూర్, హున్సా, మందర్న గ్రామాల్లో ప్రొఫెసర్ పర్యటించారు. మందర్న, హున్సాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో కోదండరాం మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో నిజాంషుగర్స్‌ను ప్రైవేటీకరించడం తప్పిదమని, స్వరాష్ట్రంలో ఫ్యాక్టరీ మూసివేయడం మరో తప్పిదమవుతోందన్నారు. నిజాంషుగర్ ఫ్యాక్టరీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఫ్యాక్టరీ రక్షణ కోసం జిల్లా ప్రతినిధులు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. బంగారు తెలంగాణ స్వప్నం బంజారాహిల్స్‌కే పరిమితం కావొద్దని, యావత్ తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలన్నారు. రైతులు, కార్మికుల ఆకాంక్షను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీల పరిధిలోని రైతులు, కార్మికులతో చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సదస్సులు, సమావేశాలు నిర్వహించి త్వరలోనే హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం తలపెడుతామన్నారు. పార్టీల కతీతంగా రైతులు సంఘటితం కావాలన్నారు. ఎడ్లబండి ఎక్కిన తర్వాత పగ్గాలు చేత పట్టాలే కాని భయపడితే ఎలా అని రైతులను నుద్దేశించి అన్నారు. పార్టీలకతీతంగా బతుకు జెండా ఎత్తాలన్నారు. నిజాంషుగర్స్‌ను తిరిగి తెరిపించాలని కోరడం న్యాయబద్ధమైందని, ఇదే తెలంగాణ ఉద్యమం నేర్పిందన్నారు. న్యాయం, ధర్మం కోసమే తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం నడిచిందన్నారు. -
నిజాం షుగర్స్ కార్మికుల అరెస్ట్
బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని నిజాం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికులను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 40 మందిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. గత డిసెంబర్లో యాజమాన్యం కార్మికులకు లేఆఫ్ ప్రకటించింది. దీనిపై రెండు నెలలుగా పని లేక, వేతనాలు లేక ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కార్మికులు నిరసనగా ఆదివారం మెదక్ జిల్లా గజ్వేల్ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వద్ద ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు కార్మికులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌లకు నిరసనగా కార్మికుల ధర్నా అరెస్ట్ చేసిన కాసేపటికి వారిని విడిచిపెట్టారు. అరెస్ట్‌లను నిరసిస్తూ వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. -
నిజాంషుగర్స్ ఫ్యాక్టరీని కాపాడుతాం: కవిత
బోధన్: నిజాం షుగర్స్ కార్మికులెవరూ అధైర్యపడొద్దని, ఫ్యాక్టరీని కాపాడేం దుకు ప్రభుత్వం దృష్టిసారిం చిందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా బోధన్ శక్కర్‌నగర్ చౌరస్తాలో మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్‌రాం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి సభలో ఎంపీ కవిత మాట్లాడారు. నిజాం షుగర్స్ సమస్య తన నియోజకవర్గం పరిధిలోని బోధన్ , మెట్పల్లి, సీఎం కేసీఆర్ నియోజకవర్గ పరిధిలోని మెదక్ ఫ్యాక్టరీలున్నాయన్నారు. నిజాం షుగర్స్ సమస్య పరిస్కారానికి ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీ వేసిందని, మరో కమిటీని నియమించిందని తెలిపారు. ఈ కమిటీల నివేదికలు వస్తున్నాయని, ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల నిజాం షుగర్స్ సమస్యను పరిష్కరించడంలో ఆలస్యం జరుగుతోందన్నారు. మూడు చక్కెర ఫ్యాక్టరీల పరిధిలోని కార్మికుల బకాయి వేతనాల చెల్లింపు విషయంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావుతో కార్మికుల సమక్షంలో చర్చించాననివివరించారు. -
ఖాయిలా పరిశ్రమలపై వైఖరేంటి?
బీజేఎల్పీ నేత కె. లక్ష్మణ్ హైదరాబాద్: ఆల్విన్, ప్రాగా టూల్స్, నిజాం షుగర్స్, ఆజంజాహీ మిల్స్, రేయాన్స్ ఫ్యాక్టరీ... తదితర మూతపడ్డ భారీ పరిశ్రమల విషయంలో ప్రభుత్వం అనుసరించబోయే విధానాలేమిటో గవర్నర్ ప్రసంగంలో కనిపించలేదని బీజేఎల్పీ నేత లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించిన సింగరేణి కాలరీస్ కార్మికులకు ఇచ్చిన అడ్వాన్స్‌ను వేతనంలో సర్దుబాటు చేస్తుండటం దారుణమని, వారి సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా పరిగణించే అంశంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే తరహాలో ఉందని, సీబీఐ దర్యాప్తు పేరుతో రెండు పడక గదుల ఇళ్ల పథకానికి శ్రీకారమే చుట్టలేదని, కేజీ టూ పీజీ పథకంపై ఎటూ తేల్చలేదన్నారు. ఇలాంటి కీలకమైన వాటిపై గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా స్పష్టత ఇవ్వలేదన్నారు. తెలంగాణలోని చాలా విశ్వవిద్యాలయాలకు వీసీలు లేరని, ఓ ఎంపీ, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు మంత్రి పదవులిచ్చిన సీఎం కేసీఆర్.. మహిళలను మంత్రులు చేయకపోవటం విడ్డూరమన్నారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని, సకాలంలో మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఇందిరాపార్కులో వినాయక్‌సాగర్ ఏర్పాటుకు తాము పూర్తి వ్యతిరేకమని, సాగర్ ప్రక్షాళన కోసం అందులోని నీటిని ఖాళీ చేస్తే ఆ నీళ్లు పారే కాలువతో పక్కనున్న బస్తీలు అనారోగ్యం పాలవుతాయని తెలిపారు. కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో ప్రతిపక్షాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని లక్ష్మణ్ సూచించారు. -
నిజాం షుగర్స్‌ను రైతులకే ఇస్తాం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: నిజాం చక్కెర ఫ్యాక్టరీని రైతులకే అప్పగిస్తామని చెరుకు రైతులకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. నిజాం చక్కెర కర్మాగారం పరిరక్షణ సమితికి చెందిన రైతులు సోమవారం సచివాలయంలో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవిత నేతృత్వంలో సీఎంను కలిశారు. రైతులే నడుపుకున్నట్లయితే షుగర్ ఫ్యాక్టరీని ఉచితంగా ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు పరిరక్షణ సమితి కన్వీనర్ అప్పిరెడ్డి మీడియాకు తెలిపారు. -
నిజాం షుగర్స్‌ను అమ్మడాన్ని వైఎస్ వ్యతిరేకించారు
* అసెంబ్లీలో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ సాక్షి, హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్దైదె న నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడాన్ని అప్పట్లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక దానిపై కమిటీ వేస్తే... ఫ్యాక్టరీని అడ్డగోలుగా ప్రైవేటుకు కట్టబెట్టారంటూ నివేదిక ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. సోమవారం అసెంబ్లీలో నిరుద్యోగ సమస్యపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడారు. రానురానూ ప్రభుత్వ రంగం కుంచించుకుపోతుందని, ప్రైవేటురంగమే ముందుకు వస్తోందని బీజేపీ నేత లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల జోక్యం చేసుకుంటూ.. పై వ్యాఖ్యలు చేశారు. అప్పటి ఎన్డీఏ సర్కారులో టీడీపీ భాగస్వామ్యంగా ఉందని, ఆ సమయంలో నిజాం కాలం నాటి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మారని మంత్రి మండిపడ్డారు. హెచ్ఎంటీ, ఆంధ్రా స్పిన్నింగ్, హెచ్ఏఎల్లను ఎవరు మూసేశారని ప్రశ్నించారు. అనంతరం ఉద్యోగుల విభజనపై మాట్లాడుతూ.. తెలంగాణలో పని జరగకుండా చూడాలని కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగుల విభజనలో జాప్యాన్ని గమనిస్తే కుట్ర జరుగుతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. బీసీ గురుకులాలకు సన్న బియ్యం తెలంగాణలోని బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాలు, వసతి గృహాలకు బీపీటీ రకం సన్నబియాన్ని సరఫరా చేయాలని నిర్ణయించామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ‘మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల’ రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలను సోమవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆయన ప్రారంభించారు. బీసీ వసతి గృహాలు, గురుకుల విద్యాలయాలలో ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల చారు, చాలీచాలని కూరలతో విద్యార్థులు అర్ధాకలితో అలమటించేవారన్నారు. -
తొమ్మిదేళ్ల పాలనంతా స్కాములే
‘వైఎస్సార్ జనభేరి’లో చంద్రబాబుపై విజయమ్మ ధ్వజం విజయవాడ: ‘‘నిజాం షుగర్స్‌ను విక్రయించడం వల్ల రూ.308 కోట్లు నష్టం వస్తోందని నాటి ఐఏఎస్ అధికారి పి.సి.పరేఖ్ చెప్పినప్పటికీ చంద్రబాబు పచ్చచొక్కాలకు అప్పనంగా ధారాదత్తం చేశారు. సొంత లాభం కోసం చిత్తూరు డెయిరీని మూయించి హెరిటేజ్ సంస్థలు స్థాపించి దేశవ్యాప్తంగా తన సంస్థల్ని విస్తరించుకున్నారు. తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు పచ్చచొక్కాలకు మినహా ఎవరికీ మేలు చేయలేదు. ఆయన పాలనంతా స్కాములే’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ధ్వజమెత్తారు. ‘‘మాజీ ఐఏఎస్ అధికారి పి.సి. పరేఖ్ ‘క్రూసేడర్ ఆర్ కాన్స్పిరేటర్’ అనే పుస్తకంలో నిజాం షుగర్స్ విషయం రాసినట్లు పత్రికల్లో చదివాను. మద్యం, ఏలేరు, తెల్గీ, నీరు-మీరు, పనికి ఆహార పథకం, ఐఎంజీ, ఎమ్మార్ కుంభకోణాల్లో చిక్కుకున్న చంద్రబాబు.. కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకొని బతుకుతున్నారు’’ అని విమర్శించారు. మంగళవారం ‘వైఎస్సార్ జనభేరి’ కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్లోని 11 గ్రామాల్లో ఆమె ఎన్నికల రోడ్‌షో నిర్వహించారు. -
ఏమంటారు బాబూ!
సంపాదకీయం తొమ్మిదేళ్ల తన పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదని ప్రకటనల మోత మోగిస్తున్న చంద్రబాబు నాయుడు ఖంగు తినేలా ఆయన నిర్వాకం మరోసారి బట్టబయలైంది. బాబు హయాంలో ప్రభుత్వ రంగ సంస్థల విభాగం బాధ్యతలను చూసిన సీనియర్ ఐఏఎస్ అధికారి పీసీ పరేఖ్ తాజాగా వెలువరించిన ‘క్రూసేడర్ ఆర్ కాన్స్పిరేటర్?’ పుస్తకం నిజాం షుగర్స్‌ను బాబు తెగనమ్మిన తీరును సోదాహరణంగా వివరిం చింది. ఐఏఎస్ అధికారిగా రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ వివిధ శాఖల్లో పనిచేసినప్పుడు ఎదురైన ఎన్నో అనుభవాలను ఆయన గ్రంథస్థం చేశారు. తనపై ఎవరు ఆరోపణలు చేసినా బాబు ఒకటే జవాబు చెబుతారు. ‘నాపై ఎన్నో విచారణలు జరిగాయి. ఒక్కదాన్లో కూడా నన్ను తప్పుబట్టలేదు. కోర్టుల్లో ఎన్నో కేసులు వేశారు. అన్నీ కొట్టేశారు. ప్రభుత్వం ఎన్నో సభా సంఘాలను నియమించింది. ఏ ఒక్కటీ నన్ను దోషిగా చెప్పలేదు’ అంటారు. ఈ మాటలన్నిటిలోనూ అర్ధ సత్యాలూ, అసత్యాలూ ఉన్నాయని తరచు నిరూపణ అవుతూనే ఉన్నా ఆయన తన బాణీ మార్చరు. ఇప్పుడు పరేఖ్ పుస్తకం మరొక్కసారి బాబు మాటల్లోని డొల్లతనాన్ని వెల్లడించింది. నిజాం షుగర్స్ సంస్థ చరిత్ర చాలా ఉన్నతమైనది. 90 ఏళ్లనాటి ఆ సంస్థ లక్షలాదిమంది చెరకు రైతులపాలిట కల్పవల్లి. ఎన్నడో 1921లో బోధన్‌లో తొలి యూనిట్ మొదలయ్యాక ఇది ఆరు చక్కెర మిల్లులు, రెండు డిస్టిలరీలుగా విస్తరించింది. తెలంగాణ ప్రాంతంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించిన పరిశ్రమగా పేరుప్రఖ్యాతులున్నాయి. దీనికి నష్టాలొస్తున్నాయన్న సాకుతో 2002లో బాబు ప్రభుత్వం ప్రైవేటీకరిం చింది. నిజాం షుగర్స్ అమ్మకం వ్యవహారం గురించి నిజానికి 2004లోనే కాగ్ నిశితంగా విమర్శించింది. లక్షలాదిమంది రైతుల కల్పవల్లిగా ఉంటున్న ఈ సంస్థ క్రమేపీ నష్టాల్లోకి జారుకుంటున్నప్పుడు ఆదుకోవా ల్సిందిపోయి, పునరుద్ధరించాల్సిందిపోయి నష్టాల సాకుతో 1,042.27 ఎకరాలను కేవలం రూ. 3.35 కోట్లకు రాసి చ్చేసిన వైనాన్ని ఎండగట్టింది. అటు తర్వాత 2006లో సభా సంఘం సైతం యూనిట్ల అమ్మకంలో బాబు ప్రభుత్వం చేసిన మాయను గణాంకాల సహితంగా తూర్పారబట్టింది. రెండేళ్లపాటు విచారణ జరిపి రూపొందించిన విలువైన నివేదిక అది. నిజాం షుగర్స్ సంస్థ ఆస్తులను తెగనమ్మడంలో చాలా లొసుగు లున్నాయి. ప్రపంచబ్యాంకు ఆదేశాలను పొల్లుపోకుండా పాటించడంలో బాబుకు దేశంలోనే ఎవరూ సాటిలేరని వామపక్షాలు అప్పట్లోనే విమర్శించాయి. రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థల ఉసురుతీసి వేలాదిమంది ఉద్యోగులను, వారి కుటుంబాలను వీధులపాలు చేసిన ఘనత బాబుకు దక్కుతుందని వివిధ సందర్భాల్లో ఆ పార్టీలు తెలిపాయి. అయితే, నిజాం షుగర్స్‌ను అమ్మకానికి పెట్టిన తీరు ప్రపంచబ్యాంకు అధికారులకే కళ్లు తిరిగేలా చేసిందని సభా సంఘం వెల్లడించింది. వందల కోట్ల విలువచేసే ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు విక్రయించడా నికి కూడా ఓ పద్ధతి ఉంటుంది. ఓపెన్ టెండర్ విధానంలో బిడ్లను ఆహ్వా నించి వచ్చిన ప్రతిపాదనల్లో మేలైనదేదన్న పరిశీలన చేస్తారు. అనంతరం నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ వేరే పద్ధతి అనుసరించాలంటే అందుకు మంత్రివర్గం ఆమోదం అవసరమవుతుంది. కానీ, నిజాం షుగర్స్ విష యంలో బాబు ఈ క్రమానికి తూట్లు పొడిచారు. అనుకూలమైనవారితో కేబినెట్ సబ్ కమిటీ నియమించి, అడ్వొకేట్ జనరల్ సలహాను సైతం పెడచెవినబెట్టి తాను అనుకున్న వ్యక్తులకు బాబు కట్టబెట్టారు. ఈలోగా తమది ఆపద్ధర్మ ప్రభుత్వంగా మారినా ఎవరికీ తెలియకుండా హడా వుడిగా భూముల్ని బదిలీచేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వానికి ఆరోజుల్లోనే రూ. 300 కోట్ల నష్టం జరిగిందని సభా సంఘం తేల్చింది. ఇప్పుడు ఆ భూముల విలువ వేల కోట్ల రూపాయలుంటుంది. పరేఖ్ ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి వ్యతిరేకి ఏమీ కాదు. ఆర్ధికంగా భారంగా మారిన సంస్థలను అమ్మేస్తేనే ఆర్ధిక సాయం చేస్తామన్న ప్రపంచబ్యాంకు ఆదేశాలతో ఆయనకేమీ పేచీలేదు. అందువల్లే ‘అనేక ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలించాక’ నిజాం షుగర్స్ యూనిట్లను బహిరంగ వేలం ద్వారా అమ్మాలని ఆయన నేతృత్వంలోని కమిటీ నిర్ణయించింది. ఆ నిర్ణయానికి అనుగుణంగా రెండు మిల్లులనూ, ఒక డిస్టిలరీని అమ్మారు కూడా. ఆ మూడింటి విషయంలోనూ మెరుగైన ధర లభించిందని, అటు తర్వాతే బాబు సర్కారు జోక్యంతో వ్యవహారం వక్రమార్గంలోకి జారుకున్నదని పరేఖ్ చెబుతున్నారు. నష్టజాతక సంస్థలను అమ్మడమంటే వాటిపై ఆధారపడ్డ వేలాది కుటుంబాలను వీధులపాలు చేయడమేనని ప్రజాస్వామిక సంస్థలు విశ్వసిస్తాయి. నష్టాలకు దారితీస్తున్న పరిస్థితులను నిజాయితీగా అధ్యయనంచేసి, తగిన చర్యలు తీసుకుంటే అలాంటి సంస్థలు మళ్లీ పునరుజ్జీవం పొంద డం సాధ్యమేనని చెబుతాయి. ఈ వాదనతో విభేదించే పరేఖ్వంటివారిని కూడా బాబు చర్యలు ఆశ్చర్యపరిచాయి. ఇందులోకి గోల్డ్‌స్టోన్ ఎక్స్‌పోర్ట్స్ అనే సంస్థ హఠాత్తుగా చొరబడటం, నిబంధనల బాదరబందీ లేకుండా ఆస్తులన్నిటినీ ఆ సంస్థకు నామమాత్రపు ధరకు కట్టబెట్టడం ఆయనను దిగ్భ్రమపరిచింది. అసలు నిజాం షుగర్స్ సంస్థ నష్టాల్లోకి జారుకున్న తీరుపై విచారణ జరిపిస్తే ఇంతకన్నా దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఒక్క నిజాం షుగర్స్ అనే కాదు...రిపబ్లిక్ ఫోర్జ్, చిత్తూరు, ఒంగోలు, విశాఖ డెయిరీలు, ఆల్విన్ వంటి ఎన్నో సంస్థలు హఠాత్తుగా నష్టాల్లోకి జారుకుని నాశనమైపోయాయి. ఏ ప్రయోజనాలాశించి, ఎవరిని ఉద్ధరించడానికి వీటన్నిటి ఉసురూ తీశారో, లక్షలాదిమందిని రోడ్లపాలు చేశారో బాబు సంజాయిషీ ఇవ్వాలి. ‘ఆయనొస్తేనే ఉద్యోగాలొస్తాయండీ...’అని చానెళ్లలో ఊదరగొడుతున్నం దుకైనా తన సచ్చీలత ఏపాటిదో నిరూపించుకోవాలి. -
ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగలేదు..
నిజాం షుగర్స్‌పై సభా సంఘం నిర్ధారణలివీ నిజాం షుగర్స్‌కు చెందిన నాలుగు యూనిట్లు - షక్కర్నగర్, మెట్పల్లి, ముంబోజిపల్లి చక్కెర మిల్లులు, షక్కర్నగర్ డిస్టిలరీల విక్రయం వ్యవహారంలో రెండేళ్ల పాటు విచారణ జరిపిన సభా సంఘం 2006 ఆగస్టులో 350 పేజీల నివేదిక ఇచ్చింది. ఈ యూనిట్ల అమ్మకంలో చంద్రబాబు ప్రభుత్వ అక్రమాలకు అంతేలేదంటూ తూర్పారబట్టింది. ప్రభుత్వ ఖజానాకు రూ. 300 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. చంద్రబాబు నిర్వాకంపై సభా సంఘం తన నివేదికలో నిర్ధారించిన ముఖ్యాంశాలివీ... * ‘‘నిజాం షుగర్స్ యూనిట్లను అమ్మటానికి ప్రైవేటు వ్యక్తులతో చర్చలు జరపడమనేది ప్రపంచంలో ఇంకెక్కడా జరగని వ్యవహారమని ప్రపంచ బ్యాంకు అధికారులే చెప్పారు. ఈ పద్ధతిలో అమ్మటానికి కేబినెట్ అనుమతి కూడా లేదు. ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై కేబినెట్ సబ్-కమిటీ సొంతంగా ఈ పని కానిచ్చింది. అడ్వొకేట్ జనరల్ సలహాలను సైతం పెడచెవిన పెట్టింది. * కేబినెట్ సబ్ కమిటీలోని యనమల రామకృష్ణుడు (అప్పటి ఆర్థికమంత్రి), ఇ.పెద్దిరెడ్డి (అప్పటి చక్కెర శాఖ మంత్రి), కె.విద్యాధరరావు (అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి).. ముగ్గురూ ఈ మోసానికి ప్రధాన కారకులు. ఇతర రాజకీయ పార్టీలు, చెరకు రైతులు, ఉద్యోగుల నుంచి ఎన్ని అభ్యంతరాలు వచ్చినప్పటికీ డెల్టా పేపర్ మిల్స్ (డీపీఎం)కే నిజాం షుగర్స్ యూనిట్లు అమ్మేందుకు కేబినెట్ సబ్‌కమిటీ మొండిగా మొగ్గుచూపింది. * అమ్మకానికి పెట్టిన నిజాం షుగర్స్ యూనిట్ల ఆస్తులలో కొన్నిటికి అతి తక్కువ విలువ కట్టారు. కొన్నిటికి అసలు విలువే కట్టలేదు. అలా ప్రస్తావించని ఆస్తుల విలువ రూ. 40 కోట్లు. దీంతో కొనుగోలు దారులు ఈ నాలుగు యూనిట్లకు చాలా తక్కువ మొత్తానికి బిడ్లు దాఖలు చేశారు. * డీపీఎం తుది బిడ్‌ను ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్ ఉద్దేశపూర్వకంగా తప్పుడు అంచనా కట్టింది. వారి ధర మిగిలిన వాటికన్నా మెరుగైనదిగా చూపింది. * నిజాం షుగర్స్ నాలుగు యూనిట్ల భూములను బాబు ప్రభుత్వం నామమాత్రపు ధరకు, భారీ నష్టానికి అమ్మేసింది. అదీ శాసనసభ రద్దయిన తర్వాత. ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉన్న సమయంలో 2003 నవంబర్ 14న సేల్ డీడ్స్ 2004 ఫిబ్రవరి 25న, 2004 మే 20న రిజిస్టరయ్యాయి. కొత్త ప్రభుత్వం కొద్ది రోజుల్లో రానుండగా చంద్రబాబు ప్రభుత్వం హడావుడిగా ఈ తంతు పూర్తిచేసింది. కొత్త ప్రభుత్వానికి తెలియనివ్వకుండానే ఈ భూమి బదిలీ జరిగిపోయింది. * నాటి ప్రతిపక్ష నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి రాసిన లేఖకు 2002 మే 3న నాటి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు జవాబు రాస్తూ.. ‘‘అదనపు ఆస్తులలోని 101 ఎకరాలకు డీపీఎం రూ. 10 కోట్లు చెల్లిస్తోంది’’ అంటూ అబద్ధమాడారు. నిజానికి డీపీఎం చెల్లించింది రూ. 6.16 కోట్లే.’’ -
నిజాం షుగర్ ఫ్యాక్టరీలను టేకోవర్ చేయాలని నిర్ణయం
నిజామాబాద్: నిజాం షుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వం టేకోవర్ చేసేందుకు రంగం సిద్ధమైంది. జిల్లాలోని బోధన్, మెట్పల్లి, మిమ్మెజిపల్లిలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వం టేకోవర్ చేయాలని సబ్ కమిటీ నిర్ణయించింది. దానికి సంబంధించిన నివేదికను క్యాబినెట్ కు పంపుతామని మంత్రులు సునీత, సుదర్శన్ రెడ్డిలు తెలిపారు. ఆ ఫ్యాక్టరీలను నడుపుతున్న వ్యక్తులను పిలిచి మాట్లాడామని వారు పేర్కొన్నారు. దానికి గాను రూ.234 కోట్లు ఇవ్వాలని అధికారులు చెప్పారని మంత్రులు స్ఫష్టం చేశారు. -
‘నిజాం షుగర్స్’ ప్రభుత్వ పరం
బోధన్ టౌన్/బోధన్, న్యూస్‌లైన్: బోధన్ శక్కర్‌నగర్‌లోని నిజాంషుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని 12 ఏళ్లుగా పోరాడుతున్నామని, కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయంతో మా పోరాటం ఫలించినట్లైందని ఏపీ షుగర్స్ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శి రాజయ్య హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం బోధన్ పట్టణంలోని చక్కెర కర్మాగారం వద్ద యూనియన్ నాయకులు, శక్కర్‌నగర్ కాలనీలో బీజేపీ నాయకులు టపాసులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వం టేకోవర్ చేయాలని మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇది కార్మికుల విజయమన్నారు. శాసనసభా సంఘం నివేదికను అమలు చేయాలని అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేత యెండల లక్ష్మీనారాయణ పోరాడారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు మురళి, శివరామ్, బాలకృష్ణ, సూరజ్ ప్రసాద్, మల్లేశం, రమేశ్, భిక్షపతి, ప్రసాద్‌రావ్, కార్మికులు నీలమ్మ, గోపి, లక్ష్మి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు రామరాజు, ఉపాధ్యక్షులు మేకల రవి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. ఫ్యాక్టరీ నేపథ్యం బోధన్‌లోని శక్కర్‌నగర్‌లో 1932లో నిజాం ప్రభువులు చక్కెర కర్మాగార నిర్మాణాన్ని ప్రారంభించారు. 1938లో నిర్మాణం పూర్తైది. ఫ్యాక్టరీ అభివృద్ధికి 16 వేల ఎకరాలను కేటాయించారు. చెరుకు సాగుకు రైతులను ప్రోత్సహించారు. తర్వాతి కాలంలో సుమారు 40 వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ ఫ్యాక్టరీ ద్వారా ఉపాధి పొందారు. అప్పట్లో ఆసియా ఖండంలోనే అతిపెద్ద వ్యవసాయాధార పరిశ్రమగా ఈ ఫ్యాక్టరీ గుర్తింపు పొందింది. ఎన్నో ఏళ్లు లాభాల బాటలో నడిచింది. బాబు జమానాలో.. 2002లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో ఈ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించారు. నష్టాలను సాకుగా చూపి ఫ్యాక్టరీ ఆస్తులను తెగనమ్మారు. బోధన్ యూనిట్‌తో పాటు కరీంనగర్ జిల్లాలోని మెట్పల్లి, మెదక్ జిల్లాలోని ముంబోజీపేట్ చక్కెర కర్మాగారాలను ప్రైవేటీకరించారు. సుమారు రూ. 350 కోట్ల విలువైన ఫ్యాక్టరీ ఆస్తులను రూ. 67 కోట్లకే డేల్టా కంపెనీకి కట్టబెట్టారు. ప్రైవేట్ సంస్థకు 51 శాతం, ప్రభుత్వం 49 శాతం వాటాతో జాయింట్ వెంచర్ చేశారు. దీంతో రైతులు, కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఫ్యాక్టరీ యాజమాన్యం లాభాపేక్షతో వ్యవహరించడంతో రైతులు, కార్మికులు నష్టపోయారు. వీఆర్ఎస్ పేరుతో కార్మికులను తొలగించింది. ఫలితంగా వందలాది కుటుంబాలు వీధిన పడ్డాయి. బోధన్‌లోనే 75 మందికిపైగా కార్మికుల బలవన్మరణాలకు పాల్పడ్డారు. రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక.. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశంపై శాసనసభా సంఘాన్ని నియమించారు. విచారణ జరిపిన శాసనసభా సంఘం.. ఫ్యాక్టరీ ప్రైవేటీకరణలో భారీస్థాయిలో అక్రమాలు జరిగాయని తేల్చింది. ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని 2006లో సిఫారసు చేసింది. ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతూ 2007లో బోధన్‌కు చెందిన నిజాంషుగర్స్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ అప్పిరెడ్డి, చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, బీఎంఎస్ కార్యదర్శి రాజయ్య హైకోర్టును ఆశ్రయించారు. రోశయ్య హయాంలో.. ఫ్యాక్టరీ స్వాధీనం చేసుకోవడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని 2010 నవంబర్‌లో హైదరాబాద్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య అధికారులను ఆదేశించారు. 2011 నవంబర్ 11న జిల్లాకు వచ్చిన అప్పటి ప్రభుత్వ రంగ సంస్థల మంత్రి శంకర్రావు మీడియాతో మాట్లాడుతూ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే జీవోపై సంతకం చేశానని ప్రకటించడంతో ఈ ప్రాంత రైతులు, కార్మికుల్లో ఆనందం వ్యక్తమైంది. తర్వాత మళ్లీ కథ మొదటికి వచ్చింది. విజయమ్మ పిటిషన్ చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ 2011 అక్టోబర్‌లో వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో నిజాంషుగర్స్ ప్రైవేటీకరణ అంశాన్నీ చేర్చారు. కిరణ్‌కుమార్‌రెడ్డి నిజాంషుగర్స్ జాయింట్ వెంచర్లో ప్రభుత్వ వాటాను పూర్తిగా తొలగించి ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కుట్రపన్నారన్న ఆరోపణలున్నాయి. 2013 డిసెంబర్ 13న తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన ఏడుగురు మంత్రులతో మంత్రి వర్గ ఉప సంఘాన్ని నియమించారు. నిజాంషుగర్స్‌ను ప్రైవేటీకరించాలన్న ఉద్దేశంతోనే ఈ కమిటీని నియమించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కుట్రను అడ్డుకునేందుకు చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సర్కారు కుట్రలకు హైకోర్టు బ్రేక్ సబ్ కమిటీపై విశ్వాసం లేకపోవడంతో నిజాంషుగర్స్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ అప్పిరెడ్డి మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నియమించిన సబ్ కమిటీని రద్దు చేసి రైతాంగం, కార్మికుల ప్రయోజనాలు కాపాడాలని పిటిషన్ దాఖలు చేశారు. స్పందించిన హైకోర్టు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ నెల 9న సబ్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులిచ్చిందని అప్పిరెడ్డి పేర్కొన్నారు. కోర్టు అనుమతి లేకుండా సబ్ కమిటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఉత్తర్వుల్లో పేర్కొందన్నారు. సానుకూల నిర్ణయం శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశమైన మంత్రి వర్గ ఉప సంఘం ఫ్యాక్టరీ విషయంలో నిర్ణయం తీసుకుంది. ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సూచించింది. సబ్ కమిటీ నిర్ణయంపై రైతులు, కార్మికులు, తెలంగాణవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రూ. 260 కోట్లు ఇస్తే నిజాం షుగర్స్ అప్పగిస్తాం!
సాక్షి, హైదరాబాద్: తమకు రూ.260 కోట్లు చెల్లిస్తే నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని నిజాం షుగర్స్‌ను ఇచ్చేందుకు సిద్ధమని మంత్రివర్గ ఉప సంఘానికి డెల్టా పేపర్స్ కంపెనీ స్పష్టంచేసినట్టు తెలిసింది. నిజాం షుగర్స్ కర్మాగారంపై మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి తదితరులతో ఏర్పా టైన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం సచివాలయంలో సమావేశమైంది. కర్మాగారం అప్పగింతపై తమకు నివేదిక ఇవ్వాలని కంపెనీని ఉపసంఘం ఆదేశించింది. -
పోరాటం..సఫలం
మెదక్, న్యూస్‌లైన్: చెరకు రైతులకు తీపి కబురు. నిజాం చక్కెర ఫ్యాక్టరీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మంత్రివర్గ ఉప సంఘం శుక్రవారం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ నిర్ణయంతో ప్రైవేటీకరణ కోసం వేసిన ఎత్తులు చిత్తుకాగా, రైతుల పదేళ్ల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. అన్నీ అనుకున్నట్లే జరిగితే జిల్లాలోని చెరకు రైతులకు మద్దతు ధర దక్కడంతో పాటు చెరకు సాగు విస్తీర్ణం కూడా భారీగా పెరగనుంది. నష్టాల బూచి చూపి.. మెదక్ నియోజకవర్గంలోని మంభోజిపల్లిలో ఏర్పాటు చేసిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని నష్టాల బూచి చూపుతూ 2001లో అప్పటి టీడీపీ ప్రభుత్వం కారుచౌకగా అమ్మేసింది. సుమారు రూ.600 కోట్ల విలువచేసే ఫ్యాక్టరీ ఆస్తులను కేవలం 67 కోట్లకే డెల్టా పేపర్ యజమాన్యానికి అప్పటి పాలకులు అమ్మేశారు. అదికూడా 8 ఏళ్లలో డబ్బులు చెల్లించే అవకాశాన్ని ఉదారంగా ప్రైవేట్ యాజమాన్యానికి కట్టబెట్టారు. 51 శాతం వాటాను ప్రైవేట్ యజమాన్యానికి 49 శాతం వాటా ప్రభుత్వ యాజమాన్యంలో ఉండేలా ఒప్పం దం చేసుకున్నారు. అప్పట్లో ఈ విషయంపై రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురు కావడంతో అనంతరం అధికారంలోకి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 ఆగస్టు 31న జువ్వాడి రత్నాకర్‌రావు ఆధ్వర్యంలో 9 మంది సభ్యులతో కూడిన అసెంబ్లీ హౌస్ కమిటీని ఏర్పాటు చేశారు. సుమారు రెండేళ్లపాటు పరిశీలన జరిపిన ఈ కమిటీ నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వ పరం చేసుకోవాలని సూచిస్తూ 2006 ఆగస్టు 31న 345 పేజీలతో కూడిన నివేదికను అసెంబ్లీకి సమర్పించింది. అయితే వైఎస్ మరణానంతరం ఆ నివేదికను అమలుకు నోచుకోకుండా పోయింది. రైతుల పోరాటం నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటూ కొంతమంది రైతులు కోర్టుకు వెళ్లారు. ప్రభుత్వం కూడా ఫ్యాక్టరీ భవితవ్యం తేల్చేందుకు 2013 డిసెంబర్ 13న ఏడుగురు మంత్రులతో ఉప సంఘాన్ని నియమించింది. ఈ మేరకు జీవో నంబర్ 5435ను జారీ చేసింది. కాగా రైతుల నుంచి అభిప్రాయం కోరాలంటూ గత నెలలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని రైతులు తీర్మానించారు. ఇదే సమయంలో మంత్రివర్గ ఉప సంఘం ప్రైవేటీకరణ వైపు మొగ్గుచూపుతుందన్న అనుమానంతో రైతు సంఘాల నాయకులు హైకోర్టులో 5/2014 ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీంతో సర్కార్ ఇచ్చిన జీఓను హైకోర్టు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్లాలని, పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయిస్తూ శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రైతులు తీర్మానం చేశారు. ఈ సమావేశానికి తెలంగాణ ప్రజాఫ్రంట్ కార్యదర్శి, హైకోర్టులో పిల్ దాఖలు చేసిన న్యాయవాది చిక్కుడు ప్రభాకర్, ఈటేల రాజేందర్, కోదండరాం, వేదకుమార్, శ్రీనివాస్‌గౌడ్, రైతు పోరాట కమిటీ నాయకులు నాగిరెడ్డి, దేవేందర్‌రెడ్డి, సీపీఎం నాయకులు రాంచంద్రారెడ్డి, సీపీఐ వెంకయ్య, బీజేపీ నుండి భూంరావు తదితరులు హాజరయ్యారు. ఈ పరిణామాలను గమనించిన మంత్రివర్గ ఉప సంఘం అప్పటికప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వపరం చేసుకోవాలని సిఫారసు చేసింది. పదేళ్ల పోరాటం ఫలితమిది పదేళ్లుగా చేస్తున్న పోరాటానికి నేడు ఫలితం లభించింది. మెదక్ ఫ్యాక్టరీ పరిధిలో 12 మండలాలకు చెందిన సుమారు 3,500 మంది రైతులకు ప్రయోజనం లభించనుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా రైతన్నల సహకారంతో పోరాటం చేశాం. ప్రభుత్వం వెంటనే మంత్రివర్గ ఉప సంఘం సిఫారసును ఆమోదించాలి. - నాగిరెడ్డి, చెరుకురైతు పోరాట సమితి నాయకులు, మెదక్. -
నిజాం షుగర్స్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం : కేటీఆర్
బోధన్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రంలో నిజాం షుగర్స్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని నిజాం చక్కెర ఫ్యాక్టరీ స్థాపించి 75 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన వజ్రోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు ఆసియా ఖండంలోనే అతిపెద్ద చక్కెర ఫ్యాక్టరీగా పేరున్న నిజాం షుగర్స్‌ను చంద్రబాబు నష్టాల సాకు చూపి ప్రైవేటీకరించారని, వేలాది మంది కార్మికులను రోడ్డు పాలు చేశారని ధ్వజమెత్తారు. దాదాపు రూ.700 కోట్ల విలువ చేసే ఫ్యాక్టరీ నాలుగు యూనిట్లను అప్పనంగా రూ.67 కోట్లకే ఆంధ్ర ప్రాంతానికి చెందిన అస్మదీయులకు అప్పగించారని ఆరోపించారు. దమ్ముంటే కిరణ్ కుమార్ రెడ్డి కొత్తపార్టీ పెట్టాలని ఆయన సవాల్ విసిరారు. -
నిజాం సుగర్స్‌పై మంత్రుల బృందం ఏర్పాటు జీవో
హైకోర్టు నిలుపుదల సాక్షి, హైదరాబాద్: నిజాం సుగర్స్ ప్రైవేటీకరణపై తీసుకున్న చర్యలను సమీక్షించేందుకు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 13న జారీ చేసిన జీవోను హైకోర్టు గురువారం నిలుపుదల చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకూ ఈ జీవో ఆధారంగా ఎటువంటి చర్యలూ చేపట్టడానికి వీల్లేదని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, జస్టిస్ చల్లా కోదండరాంలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రుల బృందం ఏర్పాటు జీవోను సవాల్ చేస్తూ నిజామాబాద్‌కు చెందిన నిజాం సుగర్స్ పరిరక్షణ కమిటీ, తెలంగాణ చెరకు రైతుల సంఘం కన్వీనర్ ఎం.అప్పిరెడ్డి, కో-కన్వీనర్ అజయ్ ఆర్.వడియార్, కార్యదర్శి వి.నాగిరెడ్డి, చెరకు అభివృద్ధి మండలి చైర్మన్ కంది బుచ్చిరెడ్డి లంచ్‌మోషన్ రూపంలో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది. -
నిజాం షుగర్స్‌పై రాజకీయ కుట్ర
బోధన్, న్యూస్‌లైన్ : నిజాం షుగర్ ఫ్యాక్టరీ అంశంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుతో ఈ ప్రాంత రైతులు, ఫ్యాక్టరీలోని కార్మికుల్లో హర్షం వ్యక్తమైంది. ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుం దని, తమ భవిష్యత్తు బంగారుమయం అవుతుందని ఆనందించారు. అయితే రాష్ట్ర విభజన పూర్తికాకముందే నిజాం షుగర్స్‌ను సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ సమావేశంలో ఫ్యాక్టరీ అంశం చర్చకు వచ్చేలా, ప్రైవేటీకరణ కు అనుకూల వాతావరణం కల్పించేలా ఆ కంపెనీ చూసినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటయ్యే కొత్త సర్కారు ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటుందన్న భయంతో ఆ కంపెనీ కుట్రలు పన్నుతోందని రైతులు, తెలంగాణవాదులు అనుమానాలు వ్యక్తం చేశారు. అధికార పక్ష నేతలపై ఆగ్రహం బోధన్ పట్టణంలోని సీడీసీ కార్యాలయంలో గురువారం కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు తమకు అనుకూలంగా ఉన్న రైతుల తో సమావేశం ఏర్పాటు చేసి, ప్రైవేట్ సంస్థకు అనుకూలంగా తీర్మానం చేయించారు. దీంతో ఫ్యాక్టరీని పూర్తిగా ప్రైవేట్ పరం చేసేందుకే ప్రభుత్వం మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం బోధన్ సీడీసీ కార్యాయలంలో డీసీసీబీ చైర్మన్ గంగాధర్‌రావు పట్వారీ, సీడీసీ చైర్మన్ పోతారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గంగాశంకర్, ఏఎంసీ మాజీ చైర్మన్ పాషామోహినొద్దీన్ల ఆధ్వర్యంలో చెరుకు రైతుల సమావేశం ఏర్పాటు చేశారు. నిజాం షుగర్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలా, ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టాలా అన్న అంశంపై అభిప్రాయాలు సేకరించారు. అధికార పక్షానికి అనుకూలంగా ఉన్న రైతులు కొందరిని పిలిచి ప్రైవేట్ సంస్థకు అనుకూలంగా తీర్మానం చేయించారని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. శక్కర్‌నగర్‌లోని ఎన్డీఎస్ఎల్ ఎదుట బీఎంఎస్ కార్యదర్శి ఈరవేణి సత్యనారాయణ అధ్వర్యం లో కార్మికులు ఆందోళన చేశారు. ప్రైవేట్ కంపెనీకి అనుకూలంగా తీర్మానం చేసిన అధికార పక్ష నేతల చిత్రపటాన్ని దహనం చేశారు. ఫ్యాక్టరీ జోలికొస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాజకీయ కుట్ర నిజాం షుగర్స్‌ను ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం రాజకీయ కుట్ర చేస్తోందని ఎన్డీఎస్ఎల్ షుగర్ మజ్దూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి రాజయ్య ఆరోపించారు. ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. ప్రైవేట్ కంపెనీ ఏనాడూ పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదన్నారు. ఫ్యాక్టరీ స్వాధీనంపై శాసనసభా సంఘం సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి నిజాం షుగర్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు కేపీ శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం శక్కర్‌నగర్ ఎన్ఎస్ఎఫ్ విశ్రాంతి భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పన్నేండేళ్ల కాలంలో ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం ఏనాడూ రైతుల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. 2006-07 సీజన్లో టన్నుకు రూ.50 చొప్పున ప్రోత్సాహక రాయితీ ఇస్తామ ని ప్రకటించి ఎగొట్టిందని ఆరోపించారు. 2007-08 సీజన్లో టన్నుకు రూ. 120 ధర తగ్గించిందన్నారు. క్రషింగ్ ఆగిపోతుందేమోన నే భయంతోనే కొందరు రైతులు ఫ్యాక్టరీ యాజ మాన్యానికి అనుకూలంగా తీర్మానం చేశారన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. సమావేశంలో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కార్యదర్శి గోపాల్‌రెడ్డి, ప్రతినిధులు కొప్పర్తి సుబ్బారావు, కోట గంగారెడ్డి, మారుతి పటేల్ పాల్గోన్నారు. నేడు ఫ్యాక్టరీ ముట్టడి నిజాం షుగర్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం ఫ్యాక్టరీని ముట్టడించనున్నట్లు టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఈ విషయాన్ని ఆ పార్టీ బోధన్ నియోజకవర్గ ఇన్చార్జి షకీల్ తెలిపారు. ప్రైవేటీకరణకు ఒప్పుకోం బోధన్ టౌన్ : ఎన్డీఎస్ఎల్ను పూర్తిగా ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని సీపీఎం డివిజన్ కార్యదర్శి గంగాధర్ అప్పా ఆరోపించారు. దీనికి తాము ఒప్పుకోబోమని పేర్కొన్నారు. చక్కెర కర్మాగారాన్ని వెంట నే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాం డ్ చేశారు. శుక్రవారం ఆయన బోధన్‌లోని సాగర్ ఫంక్షన్ హాల్లో విలేకరులతో మాట్లాడారు. ఫ్యాక్టరీ విషయమై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీ వేశారని, ఇది ఫ్యాక్టరీని ప్రైవేట్‌పరం చేసే కుట్రలో భాగమేనని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులకు ఫ్యాక్టరీని కట్టబెట్టేందుకే కుట్ర జరుగుతోందన్నారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు రెండు రైతు కూలీ సంఘాలుగా విడిపోయి ప్రైవేటీకరణకోసం డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపిం చారు. ప్రైవేటీకరణకు అనుకూలంగా రైతులు తీర్మానం చేయడం వెనక మంత్రి సుదర్శన్‌రెడ్డి హస్తం ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు శంకర్‌గౌడ్, గంగాధర్, శ్రీనివాస్, కిష్టాగౌడ్, లింగం పాల్గొన్నారు. -
తీపి కబురు అందేనా !
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బోధన్‌లోని నిజాం షుగర్స్ భవిత వ్యం తేల్చేందుకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడంతో రైతులు, కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తెలంగా ణ రాష్ట్రం సిద్ధిస్తున్న తరుణంలో తీసుకున్న ఈ నిర్ణయంతో ఫ్యాక్టరీ సైతం ప్రభుత్వ ప రం అవుతుందన్న ఆశాభావంతో ఉన్నారు. చంద్రబాబు నాయుడి హయాంలో ఈ ఫ్యాక్టరీని ప్రైవేట్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సమీక్షించేందుకు తెలంగాణ మంత్రుల ఒత్తిడి మేరకు ప్రభుత్వం ఈనెల 13న కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు పి.సుదర్శన్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, సునీత లక్ష్మారెడ్డితో పాటు సీమాంధ్రకు చెందిన మరో ముగ్గురు మంత్రులు సభ్యులుగా ఉన్నారు. ఈ సబ్‌కమిటీకి పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి ప్రదీప్‌చంద్ర కన్వీనర్‌గా వ్యవహరి స్తున్నారు. పది రోజుల్లో నివేదిక సమర్పిం చాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సబ్‌కమిటీని ఆదేశించారు. ఆసియా ఖండంలో నే ఒకప్పుడు అతి పెద్ద వ్యవసాయాధారిత పరిశ్రమగా ప్రఖ్యాతి పొందిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ(ఎన్ఎస్ఎఫ్)ని 1936లో నిర్మించారు. 16 వేల ఎకరాలలో చెరు కు సాగుకు నీటి సౌకర్యం కల్పించేందుకు వీలు గా నిజాంసాగర్ ప్రాజెక్టును నిర్మించారు. కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. నిజాం పాలన ముగిసిన తర్వాత ఫ్యాక్టరీ ప్రభుత్వ స్వాధీనమైంది. జిల్లా అభివృద్ధికే కాక రాష్ట్రంలో చక్కెర పరిశ్రమ విస్తరణకు దోహదపడింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించింది. పొరుగు జిల్లా కరీంనగర్‌తో పాటు మహారాష్ట్ర ప్రాంతవాసులు ఫ్యాక్టరీలో పని చేసి, ఇక్కడే స్థిరపడ్డారు. బాబు హయాంలో.. చాలాకాలం లాభాల్లో నడిచిన ఈ చక్కెర కర్మాగారం పాలకులు, ఫ్యాక్టరీ ఉన్నతాధికారుల స్వార్థానికి బలైంది. నష్టాల సాకు చూపిన చంద్రబాబు ప్రభుత్వం 2002లో ప్రైవేట్‌పరం చేసింది. రూ.300 కోట్ల విలువ చేసే ఫ్యాక్టరీ ఆస్తులను రూ.67 కోట్లకే డెల్టా పేపర్ సంస్థకు కట్టబెట్టింది. ప్రైవేట్ సంస్థకు 51 శాతం, ఎన్ఎస్ఎఫ్కు 49 శాతం వాటాతో జాయింట్ వెంచర్ పేరుతో వారికి స్వాధీనం చేసింది. దీం తో నిజాం షుగర్ ఫ్యాక్టరీ కాస్తా నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్‌గా రూపాంతరం చెందింది. బోధన్‌లోని శక్కర్‌నగర్ ప్రధాన యూనిట్‌తో పాటు కరీంనగర్ జిల్లాలోని మెట్పల్లి, మెదక్ జిల్లాలోని ముంబాజీపేట ఫ్యాక్టరీలూ ప్రైవేట్ సంస్థ పరమయ్యాయి. రైతు, కార్మిక సంఘాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించినా అప్పటి ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. రోడ్డున పడ్డ కార్మికులు ప్రైవేటీకరణతో ఫ్యాక్టరీ గత వైభవాన్ని కోల్పోయింది. వేలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఫ్యాక్టరీ గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో రైతన్నకు పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితులు ఏర్పడ్డాయి. పైగా బిల్లుల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోం ది. దీంతో ప్రతి క్రషింగ్ సీజన్లో మద్దతు ధర కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితులున్నాయి. వైఎస్ఆర్ హయాంలో.. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నిజాం షుగర్స్ ప్రైవేటీకరణలో అవినీ తి అక్రమాలను నిగ్గుతేల్చేందుకు శాసనసభా కమిటీని ఏర్పాటు చేశారు. అప్పటి దేవాదాయ శాఖ మంత్రి రత్నాకర్‌రావు చైర్మన్‌గా, ఎమ్మెల్యేలు పి.సుదర్శన్‌రెడ్డి, ఎస్.గంగారాం, సురేశ్ షెట్కార్, బాజిరెడ్డి గోవర్ధన్, జి.చిన్నారెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, కళా వెంకట్రావు, మర్రి శశిధర్‌రెడ్డి సభ్యులుగా సభా సంఘాన్ని నియమించారు. ఈ సంఘం విచారణ చేసి 350 పేజీ ల నివేదికను ప్రభుత్వానికి అందించింది. ప్రైవేటీకరణ లో అక్రమాలు చోటు చేసుకున్నాయని గుర్తించిన సంఘం.. ఫ్యాక్టరీని ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని సిఫారసు చేసింది. హైకోర్టులో అప్పీలు నిజాం షుగర్స్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ అప్పిరెడ్డి సభా సంఘం సిఫారసులు అమలు చేయాలని కోరుతూ 2007లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరికొన్ని కార్మిక సంఘాలు సైతం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. పలుమార్లు కోర్టులో విచారణకు వచ్చింది. ఏవో సాకులు చూపి ప్రభుత్వం తప్పించుకుంటోంది. విజయమ్మ పిటిషన్ చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని 2011 అక్టోబర్‌లో వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశా రు. ఇందులో నిజాం షుగర్స్ ప్రైవేటీకరణ వ్యవహారాన్నీ చేర్చారు. రోశయ్య, కిరణ్‌ల హయాంలో.. 2010 నవంబర్11న అప్పటి సీఎం రోశయ్య సభా సంఘం సిఫారసులను పరిశీలించాలని అధికారులకు సూచించారు. దీంతో బోధన్ ప్రాంత ప్రజల్లో హర్షం వ్యక్తమయ్యింది. ఫ్యాక్టరీ వద్ద పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఆ తర్వాత ఈ విషయం మరుగున పడింది. సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా శంకర్రావు 2011 నవంబర్ 21న నిజామాబాద్ వచ్చారు. చక్కెర ఫ్యాక్టరీ ప్రైవేట్ సంస్థతో ఉన్న జాయింట్ వెంచర్ రద్దు జీవోపై సంతకం చేశానని అప్పట్లో ప్రకటించారు. దీంతో బోధన్ ప్రాంత రైతులు, కార్మికులు మళ్లీ సంబరాలు జరుపుకున్నారు. కానీ శంకర్రావు పదవీచ్యుతులు కావడంతో సభా సంఘం సిఫారసుల్లో పురోగతి లేదు. మళ్లీ ఆశలు.. బోధన్‌లోని చక్కెర కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడంతో రైతులు, కార్మికుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నా యి. పైగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగుతుండడం వారి ఆశలకు జీవం పోస్తోంది. ఇప్పుడు కాకపోయినా తెలంగాణ రాష్ట్రంలోనైనా ఫ్యాక్టరీ ప్రభుత్వ పరం అవుతుం దని నమ్ముతున్నారు. మంత్రులు ఒత్తిడి తెచ్చి శాసనసభా సంఘం సిఫారసులు త్వరగా అమలయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
నిజాంషుగర్స్‌పై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్ : నిజాంషుగర్స్ ప్రైవేటీకరణపై తీసుకున్న చర్యలను సమీక్షించేందుకు కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె . మహంతి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. పది రోజుల్లోగా ప్రభుత్వానికి సబ్ కమిటీ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. మంత్రులు ఆనం రాంనారాయణ రెడ్డి, గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డి, గంటా శ్రీనివాసరావు, కె. పార్థసారధి, సునీతా లక్ష్మారెడ్డి, శ్రీధర్‌బాబులతో సబ్‌కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీకి పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి ప్రదీప్ చంద్ర కన్వీనర్‌గా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిజాంషుగర్స్‌ను ప్రభుత్వమే తీసుకోవాలని తెలంగాణ మంత్రులు కోరుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని కొద్దిరోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలోనూ కోరారు. అయితే, దీనిపై నిర్ణయం తీసుకునేందుకు సబ్ కమిటీని ఏర్పాటు చేస్తామని సీఎం హామీనిచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా సబ్‌కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. -
12 నుంచి అసెంబ్లీ
* రాష్ట్ర మంత్రివర్గ భేటీలో నిర్ణయం * ప్రస్తావనకు రాని తెలంగాణ, జీవోఎం * అధికారిక ఎజెండా చర్చలకే పరిమితం * నిజాం సుగర్స్ స్వాధీనానికి తెలంగాణ మంత్రుల పట్టు * పోలవరం ప్రాజెక్టు ‘ప్రారంభం’పై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభ్యంతరం * బ్రిజేశ్ తీర్పుపై సుప్రీంకోర్టులో పోరాడాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: శాసనసభ శీతాకాల సమావేశాలు ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ భేటీలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. 70 రోజుల సుదీర్ఘ విరామం తరువాత జరిగిన ఈ సమావేశం నాలుగున్నర గంటల పాటు కొనసాగింది. రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) కసరత్తు, ముసాయిదా బిల్లుకు తుదిమెరుగులు, ఐదో తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం వంటి కీలకాంశాల నేపథ్యంలో ఈ భేటీలో వాటిపై తీవ్రచర్చ జరగవచ్చని భావించగా.. అవేవీ ప్రస్తావనకు రాకుండానే సమావేశం ముగిసినట్లు తెలిసింది. మంత్రివర్గ భేటీ కోసం 49 అంశాలను ఎజెండాలో చేర్చగా.. అందులో 30కి పైగా అంశాలు ఈ మధ్య కాలంలో ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేయటానికి సంబంధించినవే కావటం విశేషం. ఈ నెల 20వ తేదీ లోపు అసెంబ్లీ భేటీ కావలసి ఉండటంతో మంత్రివర్గం భేటీ చివర్లో సమావేశాల తేదీని ఖరారు చేశారు. సమావేశాలను 13వ తేదీనుంచి ప్రారంభించాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి ప్రతిపాదించగా ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ 12వ తేదీ ఏకాదశి అని.. ఆ రోజు నుంచి ప్రారంభిస్తే మంచిదని సూచించారు. అందుకు సీఎం అంగీకరించటంతో కేబినెట్ ఆమోదించింది. మంత్రుల అసంతృప్తి కేబినెట్ ఆమోదం లేకుండా అధికారులు ముందుగా నిర్ణయాలు తీసుకుంటూ ఆ తరువాత ఆమోదం కోసం కేబినెట్ ముందు పెట్టటంపై పలువురు మంత్రులు అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం. వట్టి వసంతకుమార్, సి.రామచంద్రయ్యలు లేవనెత్తిన ఈ అంశానికి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వివరణ ఇస్తూ.. కొన్ని సందర్భాల్లో కేబినెట్ ఆమోదం వరకు ఎదురుచూస్తే ఇబ్బందులు వస్తున్నాయి కనుక ఆర్థికశాఖ ఆమోదం తెలపాల్సి వస్తోందని చెప్పారు. చిత్తూరు జిల్లాలో రూ. 7,000 కోట్లతో మంజూరు చేసిన మంచినీటి సరఫరా ప్రాజెక్టు అంశంపై బయట విమర్శలు వచ్చినా సమావేశంలో మంత్రులు దీనిపై విమర్శలు చేయలేదు. ఇంత పెద్ద ప్రాజెక్టుపై మంత్రివర్గంలో చర్చించాక మంజూరు చేసి ఉంటే విమర్శలు వచ్చేవి కావని జానారెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే.. నిజాం సుగర్స్ అంశంపై సమావేశంలో తెలంగాణ మంత్రులు ఎక్కువగా పట్టుబట్టారు. ఆ సంస్థను స్వాధీనం చేసుకుంటే ప్రయివేటు సంస్థకు 170 కోట్ల మేర చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. నిజాం సుగర్స్ పరిధిలోని ఎమ్మెల్యేలు, మంత్రులు సమావేశమై ఒక నిర్ణయానికి వస్తే ఆ మేరకు చర్యలు తీసుకుందామని సీఎం వారికి చెప్పారు. కృష్ణా జలాలపై బ్రిజే్శ ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్ర ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని మంత్రివర్గం అభిప్రాయపడింది. ప్రభుత్వం సమర్థంగానే వాదనలు వినిపించినా సరైన న్యాయం జరగలేదని మంత్రులు పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో న్యాయపోరాటం సాగించాలని నిర్ణయించారు. దీనిపై త్వరలోనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేస్తామని, ఆ తరువాత మరోసారి కేబినెట్లో చర్చించి సమర్ధ వాదనలతో సుప్రీంను ఆశ్రయిద్దామని సీఎం పేర్కొన్నారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా పులిచింతల ప్రాజెక్టును ప్రారంభించడం సరికాదని సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇటీవల తుపానులో నష్టపోయిన వారిని ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. కేబినెట్ నుంచి నేరుగా బొత్స పరామర్శకు కేబినెట్ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణ మినహా తక్కిన మంత్రులంతా హాజరయ్యారు. అస్వస్థతకు గురికావడంతో బొత్స బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చేరారు. సమావేశానంతరం సీఎం కిరణ్, పలువురు మంత్రులు ఆస్పత్రికి వెళ్లి బొత్సను పరామర్శించారు. అంతా హైకమాండ్ స్క్రిప్ట్ ప్రకారమే ఈ నెల 12 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని మంగళవారం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడం వెనుక కాంగ్రెస్ అధిష్టానం వ్యూహం దాగి ఉన్నట్లు తెలుస్తోంది. విభ జన బిల్లు విషయంలో కాంగ్రెస్ అధిష్టానం రచించిన స్క్రిప్ట్‌లో భాగంగానే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాల తేదీని ఖరారు చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఈ నెల 5న జరిగే కేంద్ర కేబినెట్లో తెలంగాణ ముసాయిదా బిల్లు ఆమోదం పొందుతుందని.. ఆవెంటనే రాష్ట్రపతి ప్రణ బ్‌ముఖర్జీ ద్వారా అసెంబ్లీకి రావటానికి కనీసం నాలుగైదు రోజుల సమయం పడుతుందనే సమాచారాన్ని సీఎం కిరణ్‌కు పార్టీ హైకమాండ్ పెద్దలు ముందే పంపినట్లు ఆ వర్గాలు వివరిస్తున్నాయి. ‘విభజన బిల్లును రాష్ట్రానికి పంపిన తరువాత అసెంబ్లీ సమావేశాల తేదీని నిర్ణయిస్తే హైకమాండ్ ఆదేశాలకు లోబడి పనిచేస్తున్నాననే వాదనలకు మరింత బలం చేకూర్చినట్లవుతుందని భావించిన కిరణ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కే ంద్ర కేబినెట్ ముందుకు విభజన బిల్లు రాకముందే అసెంబ్లీ సమావేశాల తేదీని ప్రకటించాలని నిర్ణయించారు. ఆమేరకే మంగళవారం కేబినెట్ భేటీని నిర్వహించి ఈ నెల 12న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు’ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ పెద్దలు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీల సంకేతాలను సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు కూడా పంపారని.. ఆ మేరకే తేదీలను ఖరారు చేశారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మూడు రోజుల ముచ్చటే..! ఇదిలావుంటే.. అసెంబ్లీ సమావేశాలను మూడు రోజులకు మించి నిర్వహించకూడదని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ లెక్కన ఈ నెల 12న (గురువారం) అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించి 15న (శనివారం) ముగించాలని షెడ్యూల్ రూపొందించుకున్నారు. విపక్షాలు గట్టిగా పట్టుపడితే మరో రోజు (అవసరమైతే ఆదివారం కూడా సభను కొనసాగించేలా) పొడిగించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. స్వల్పకాల వ్యవధిలోనే విభజన బిల్లుపై అందరి అభిప్రాయాలు తీసుకుని రాష్ట్రపతికి పంపాలని నిర్ణయించినట్లు తెలిసింది.