12 నుంచి అసెంబ్లీ | Andhra Pradesh legislature winter session from December 12 | Sakshi
Sakshi News home page

12 నుంచి అసెంబ్లీ

Published Wed, Dec 4 2013 2:14 AM | Last Updated on Mon, Jul 23 2018 7:01 PM

12 నుంచి అసెంబ్లీ - Sakshi

12 నుంచి అసెంబ్లీ

* రాష్ట్ర మంత్రివర్గ భేటీలో నిర్ణయం
* ప్రస్తావనకు రాని తెలంగాణ, జీవోఎం
* అధికారిక ఎజెండా చర్చలకే పరిమితం
* నిజాం సుగర్స్ స్వాధీనానికి తెలంగాణ మంత్రుల పట్టు
* పోలవరం ప్రాజెక్టు ‘ప్రారంభం’పై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభ్యంతరం
* బ్రిజేశ్ తీర్పుపై సుప్రీంకోర్టులో పోరాడాలని నిర్ణయం
 
సాక్షి, హైదరాబాద్: శాసనసభ శీతాకాల సమావేశాలు ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ భేటీలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. 70 రోజుల సుదీర్ఘ విరామం తరువాత జరిగిన ఈ సమావేశం నాలుగున్నర గంటల పాటు కొనసాగింది. రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) కసరత్తు, ముసాయిదా బిల్లుకు తుదిమెరుగులు, ఐదో తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం వంటి కీలకాంశాల నేపథ్యంలో ఈ భేటీలో వాటిపై తీవ్రచర్చ జరగవచ్చని భావించగా.. అవేవీ ప్రస్తావనకు రాకుండానే సమావేశం ముగిసినట్లు తెలిసింది.

మంత్రివర్గ భేటీ కోసం 49 అంశాలను ఎజెండాలో చేర్చగా.. అందులో 30కి పైగా అంశాలు ఈ మధ్య కాలంలో ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేయటానికి సంబంధించినవే కావటం విశేషం. ఈ నెల 20వ తేదీ లోపు అసెంబ్లీ భేటీ కావలసి ఉండటంతో మంత్రివర్గం భేటీ చివర్లో సమావేశాల తేదీని ఖరారు చేశారు. సమావేశాలను 13వ తేదీనుంచి ప్రారంభించాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి ప్రతిపాదించగా ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ 12వ తేదీ ఏకాదశి అని.. ఆ రోజు నుంచి ప్రారంభిస్తే మంచిదని సూచించారు. అందుకు సీఎం అంగీకరించటంతో కేబినెట్ ఆమోదించింది.

మంత్రుల అసంతృప్తి
కేబినెట్ ఆమోదం లేకుండా  అధికారులు ముందుగా నిర్ణయాలు తీసుకుంటూ ఆ తరువాత ఆమోదం కోసం కేబినెట్ ముందు పెట్టటంపై పలువురు మంత్రులు అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం. వట్టి వసంతకుమార్, సి.రామచంద్రయ్యలు లేవనెత్తిన ఈ అంశానికి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వివరణ ఇస్తూ.. కొన్ని సందర్భాల్లో కేబినెట్ ఆమోదం వరకు ఎదురుచూస్తే ఇబ్బందులు వస్తున్నాయి కనుక ఆర్థికశాఖ ఆమోదం తెలపాల్సి వస్తోందని చెప్పారు.

చిత్తూరు జిల్లాలో  రూ. 7,000 కోట్లతో మంజూరు చేసిన మంచినీటి సరఫరా ప్రాజెక్టు అంశంపై బయట విమర్శలు వచ్చినా సమావేశంలో మంత్రులు దీనిపై విమర్శలు చేయలేదు. ఇంత పెద్ద ప్రాజెక్టుపై మంత్రివర్గంలో చర్చించాక మంజూరు చేసి ఉంటే విమర్శలు వచ్చేవి కావని జానారెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే.. నిజాం సుగర్స్ అంశంపై సమావేశంలో తెలంగాణ మంత్రులు ఎక్కువగా పట్టుబట్టారు. ఆ సంస్థను స్వాధీనం చేసుకుంటే ప్రయివేటు సంస్థకు 170 కోట్ల మేర చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

నిజాం సుగర్స్ పరిధిలోని ఎమ్మెల్యేలు, మంత్రులు సమావేశమై ఒక నిర్ణయానికి వస్తే ఆ మేరకు చర్యలు తీసుకుందామని సీఎం వారికి చెప్పారు. కృష్ణా జలాలపై బ్రిజే్‌శ ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్ర ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని మంత్రివర్గం అభిప్రాయపడింది. ప్రభుత్వం సమర్థంగానే వాదనలు వినిపించినా సరైన న్యాయం జరగలేదని మంత్రులు పేర్కొన్నారు.

సుప్రీంకోర్టులో న్యాయపోరాటం సాగించాలని నిర్ణయించారు. దీనిపై త్వరలోనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేస్తామని, ఆ తరువాత మరోసారి కేబినెట్లో చర్చించి సమర్ధ వాదనలతో సుప్రీంను ఆశ్రయిద్దామని సీఎం పేర్కొన్నారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా పులిచింతల ప్రాజెక్టును ప్రారంభించడం సరికాదని సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇటీవల తుపానులో నష్టపోయిన వారిని ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.
 
 కేబినెట్ నుంచి నేరుగా బొత్స పరామర్శకు
 కేబినెట్ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణ మినహా తక్కిన మంత్రులంతా హాజరయ్యారు. అస్వస్థతకు గురికావడంతో బొత్స బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చేరారు.  సమావేశానంతరం సీఎం కిరణ్, పలువురు మంత్రులు ఆస్పత్రికి వెళ్లి బొత్సను పరామర్శించారు.
 
అంతా హైకమాండ్ స్క్రిప్ట్ ప్రకారమే
ఈ నెల 12 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని మంగళవారం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడం వెనుక కాంగ్రెస్ అధిష్టానం వ్యూహం దాగి ఉన్నట్లు తెలుస్తోంది. విభ జన బిల్లు విషయంలో కాంగ్రెస్ అధిష్టానం రచించిన స్క్రిప్ట్‌లో భాగంగానే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాల తేదీని ఖరారు చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఈ నెల 5న జరిగే కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ ముసాయిదా బిల్లు ఆమోదం పొందుతుందని.. ఆవెంటనే రాష్ట్రపతి ప్రణ బ్‌ముఖర్జీ ద్వారా అసెంబ్లీకి రావటానికి కనీసం నాలుగైదు రోజుల సమయం పడుతుందనే సమాచారాన్ని సీఎం కిరణ్‌కు పార్టీ హైకమాండ్ పెద్దలు ముందే పంపినట్లు ఆ వర్గాలు వివరిస్తున్నాయి.

‘విభజన బిల్లును రాష్ట్రానికి పంపిన తరువాత అసెంబ్లీ సమావేశాల తేదీని నిర్ణయిస్తే హైకమాండ్ ఆదేశాలకు లోబడి పనిచేస్తున్నాననే వాదనలకు మరింత బలం చేకూర్చినట్లవుతుందని భావించిన కిరణ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కే ంద్ర కేబినెట్ ముందుకు విభజన బిల్లు రాకముందే అసెంబ్లీ సమావేశాల తేదీని ప్రకటించాలని నిర్ణయించారు. ఆమేరకే మంగళవారం కేబినెట్ భేటీని నిర్వహించి ఈ నెల 12న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు’ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ పెద్దలు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీల సంకేతాలను సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు కూడా పంపారని.. ఆ మేరకే తేదీలను ఖరారు చేశారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
 
మూడు రోజుల ముచ్చటే..!
ఇదిలావుంటే.. అసెంబ్లీ సమావేశాలను మూడు రోజులకు మించి నిర్వహించకూడదని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ లెక్కన ఈ నెల 12న (గురువారం) అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించి 15న (శనివారం) ముగించాలని షెడ్యూల్ రూపొందించుకున్నారు. విపక్షాలు గట్టిగా పట్టుపడితే మరో రోజు (అవసరమైతే ఆదివారం కూడా సభను కొనసాగించేలా) పొడిగించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. స్వల్పకాల వ్యవధిలోనే విభజన బిల్లుపై అందరి అభిప్రాయాలు తీసుకుని రాష్ట్రపతికి పంపాలని నిర్ణయించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement