ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగలేదు..
ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగలేదు..
Published Tue, Apr 15 2014 1:21 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
నిజాం షుగర్స్‌పై సభా సంఘం నిర్ధారణలివీ
నిజాం షుగర్స్‌కు చెందిన నాలుగు యూనిట్లు - షక్కర్‌నగర్, మెట్‌పల్లి, ముంబోజిపల్లి చక్కెర మిల్లులు, షక్కర్‌నగర్ డిస్టిలరీల విక్రయం వ్యవహారంలో రెండేళ్ల పాటు విచారణ జరిపిన సభా సంఘం 2006 ఆగస్టులో 350 పేజీల నివేదిక ఇచ్చింది. ఈ యూనిట్ల అమ్మకంలో చంద్రబాబు ప్రభుత్వ అక్రమాలకు అంతేలేదంటూ తూర్పారబట్టింది. ప్రభుత్వ ఖజానాకు రూ. 300 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. చంద్రబాబు నిర్వాకంపై సభా సంఘం తన నివేదికలో నిర్ధారించిన ముఖ్యాంశాలివీ...
* ‘‘నిజాం షుగర్స్ యూనిట్లను అమ్మటానికి ప్రైవేటు వ్యక్తులతో చర్చలు జరపడమనేది ప్రపంచంలో ఇంకెక్కడా జరగని వ్యవహారమని ప్రపంచ బ్యాంకు అధికారులే చెప్పారు. ఈ పద్ధతిలో అమ్మటానికి కేబినెట్ అనుమతి కూడా లేదు. ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై కేబినెట్ సబ్-కమిటీ సొంతంగా ఈ పని కానిచ్చింది. అడ్వొకేట్ జనరల్ సలహాలను సైతం పెడచెవిన పెట్టింది.
* కేబినెట్ సబ్ కమిటీలోని యనమల రామకృష్ణుడు (అప్పటి ఆర్థికమంత్రి), ఇ.పెద్దిరెడ్డి (అప్పటి చక్కెర శాఖ మంత్రి), కె.విద్యాధరరావు (అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి).. ముగ్గురూ ఈ మోసానికి ప్రధాన కారకులు. ఇతర రాజకీయ పార్టీలు, చెరకు రైతులు, ఉద్యోగుల నుంచి ఎన్ని అభ్యంతరాలు వచ్చినప్పటికీ డెల్టా పేపర్ మిల్స్ (డీపీఎం)కే నిజాం షుగర్స్ యూనిట్లు అమ్మేందుకు కేబినెట్ సబ్‌కమిటీ మొండిగా మొగ్గుచూపింది.
* అమ్మకానికి పెట్టిన నిజాం షుగర్స్ యూనిట్ల ఆస్తులలో కొన్నిటికి అతి తక్కువ విలువ కట్టారు. కొన్నిటికి అసలు విలువే కట్టలేదు. అలా ప్రస్తావించని ఆస్తుల విలువ రూ. 40 కోట్లు. దీంతో కొనుగోలు దారులు ఈ నాలుగు యూనిట్లకు చాలా తక్కువ మొత్తానికి బిడ్లు దాఖలు చేశారు.
* డీపీఎం తుది బిడ్‌ను ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్ ఉద్దేశపూర్వకంగా తప్పుడు అంచనా కట్టింది. వారి ధర మిగిలిన వాటికన్నా మెరుగైనదిగా చూపింది.
* నిజాం షుగర్స్ నాలుగు యూనిట్ల భూములను బాబు ప్రభుత్వం నామమాత్రపు ధరకు, భారీ నష్టానికి అమ్మేసింది. అదీ శాసనసభ రద్దయిన తర్వాత. ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉన్న సమయంలో 2003 నవంబర్ 14న సేల్ డీడ్స్ 2004 ఫిబ్రవరి 25న, 2004 మే 20న రిజిస్టరయ్యాయి. కొత్త ప్రభుత్వం కొద్ది రోజుల్లో రానుండగా చంద్రబాబు ప్రభుత్వం హడావుడిగా ఈ తంతు పూర్తిచేసింది. కొత్త ప్రభుత్వానికి తెలియనివ్వకుండానే ఈ భూమి బదిలీ జరిగిపోయింది.
* నాటి ప్రతిపక్ష నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి రాసిన లేఖకు 2002 మే 3న నాటి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు జవాబు రాస్తూ.. ‘‘అదనపు ఆస్తులలోని 101 ఎకరాలకు డీపీఎం రూ. 10 కోట్లు చెల్లిస్తోంది’’ అంటూ అబద్ధమాడారు. నిజానికి డీపీఎం చెల్లించింది రూ. 6.16 కోట్లే.’’
Advertisement
Advertisement