నిజాం షుగర్స్‌ను అప్పనంగా ఇచ్చేశారు | Nizam Sugar factory given without hesitation to Private Company: PC Parakh | Sakshi
Sakshi News home page

నిజాం షుగర్స్‌ను అప్పనంగా ఇచ్చేశారు

Published Tue, Apr 15 2014 1:08 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

నిజాం షుగర్స్‌ను అప్పనంగా ఇచ్చేశారు - Sakshi

నిజాం షుగర్స్‌ను అప్పనంగా ఇచ్చేశారు

చంద్రబాబు నిర్వాకాన్ని బయటపెట్టిన మాజీ ఐఏఎస్ 
 ‘క్రూసేడర్ ఆర్ కాన్‌స్పిరేటర్?’ పుస్తకంలో గుట్టు విప్పిన పరేఖ్
 
 సాక్షి, న్యూఢిల్లీ: తొమ్మిదేళ్ల తన పాలనలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశానని ఊదరగొడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. నిజానికి ముఖ్యమంత్రిగా ఉండగా చేసిన నిర్వాకమేమిటో మచ్చుకు ఒక ఉదంతాన్ని నాటి సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు తన పుస్తకంలో వెల్లడించారు. ప్రభుత్వ రంగంలోని నిజాం చక్కెర కర్మాగారం యూనిట్లను ఎలాంటి టెండర్లు లేకుండా.. ‘రాజకీయ అనివార్యత’ల పేరుతో చంద్రబాబు ప్రైవేటు సంస్థకు ధారాదత్తం చేసిన వైనాన్ని పూసగుచ్చినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి పి.సి.పరేఖ్.. తాను పనిచేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకు ఎదురైన అనుభవాలు, కేంద్ర ప్రభుత్వంలో తాను పనిచేసినప్పుడు ఎదురైన అనుభవాలను ‘క్రూసేడర్ ఆర్ కాన్‌స్పిరేటర్?.. కోల్ గేట్ అండ్ అదర్ ట్రూత్స్’ (ధర్మయుద్ధ సైనికుడా లేక కుట్రదారుడా? బొగ్గు కుంభకోణం.. ఇతర నిజాలు) అన్న శీర్షికతో గ్రంథస్తం చేశారు. ఈ పుస్తకాన్ని సోమవారం ఢిల్లీలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సింఘ్వీ ఆవిష్కరించారు. ఇందులో ప్రధానంగా బొగ్గు కుంభకోణంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజాం షుగర్స్‌ను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పనంగా కట్టబెట్టిన తీరును ఆయన వివరించారు. అది తప్పుడు నిర్ణయమని తాను అనేకసార్లు వారించినా.. చంద్రబాబు చివరికి అలాంటి నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నిర్ణయం వల్ల ప్రభుత్వానికి ఆనాడే రూ. 308 కోట్ల నష్టం వాటిల్లిందని సభాసంఘం సైతం తప్పుపట్టిన విషయాన్నీ తెలిపారు. నిజాం షుగర్స్ విషయంలో చంద్రబాబు నిర్వాకం గురించి పరేఖ్ తన పుస్తకంలో ఏం రాశారంటే...
 
 ప్రపంచబ్యాంకు షరుతులతో షురూ...
 ‘నేను 2000 సంవత్సరం జూలై సమయంలో ప్రభుత్వ రంగ సంస్థల శాఖలో బాధ్యతలు స్వీకరించాను. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో చాలా వరకు ప్రభుత్వానికి భారంగా మారాయి. అందువల్ల ప్రపంచబ్యాంకు రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించడంలో భాగంగా ఒక షరతు విధించింది. ప్రభుత్వ రంగ సంస్థలను పునర్‌వ్యవస్థీకరించాలని, నష్టాల్లో ఉన్న వాటిని ప్రయివేటు పరం చేయాలని ఆ షరతుల సారాంశం. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేసేందుకు ఒక కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీకి బ్రిటన్‌కు చెందిన అంతర్జాతీయ అభివృద్ధి విభాగం కూడా సాయం చేసింది. ఈ కమిటీకి నేను ఎక్స్-అఫిషియో చైర్మన్‌గా కూడా ఉన్నాను. ప్రయివేటీకరణ చేయాలనుకున్నవాటిలో ప్రధానమైన కంపెనీ నిజాం షుగర్స్ లిమిటెడ్. దీన్ని హైదరాబాద్ నిజాం 1934లో ఏర్పాటుచేశారు. అప్పట్లో ఇది ఆసియాలోనే పెద్దదని చెప్పేవారు. ఈ కంపెనీకి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కలిపి ఆరు చక్కెర మిల్లులు, రెండు డిస్టిలరీలు ఉండేవి. పక్కనే ఉన్న ప్రయివేటు మిల్లులేమో లాభాల్లో ఉండేవి. కానీ ఇవి మాత్రం నష్టాలు మిగుల్చుతున్నాయి. అనేక ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలించాక వీటన్నింటినీ బహిరంగ వేలం ద్వారా అమ్మాలని నిర్ణయించడమైంది. 
 
 అడకుండానే ఆఫర్ ఇచ్చిన గోల్డ్‌స్టోన్...
 రెండు మిల్లులు, ఒక డిస్టిలరీని విజయవంతంగా ప్రయివేటీకరించాం. కన్సల్టెంట్లు నిర్దేశించిన అప్‌సెట్ ధర కంటే మెరుగ్గానే ధర లభించింది. వీటిని దక్కించుకున్న వారంతా ఆర్థికంగా ఉన్నవారు కావడంతో పాటు షుగర్ పరిశ్రమలో అనుభవం ఉన్నవాళ్లే. యూనిట్లను విడతలవారీగా వేలానికి పెడితే పోటీ బాగా వస్తుందని నమ్మి ఆ మేరకే విడతల వారీగా వేలానికి పెట్టాం. మూడు యూనిట్లను ప్రయివేటీకరించాక శక్కర్‌నగర్‌లోని ప్రధాన యూనిట్‌కు కూడా వాణిజ్య ప్రకటన ఇచ్చే ప్రక్రియను పరిశీలించాం. ఇది పరిశీలనలో ఉండగానే.. మెస్సర్ గోల్డ్‌స్టోన్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి మేం కోరకుండానే ఒక ప్రతిపాదన వచ్చింది. చక్కెర శాఖ మంత్రి ఈ ప్రతిపాదనను అధ్యయనం చేయాలని కోరారు. ప్రయివేటీకరణ ప్రతిపాదనలను అధ్యయనం చేసి ఆమోదించేందుకు ప్రభుత్వం ఒక కేబినెట్ కమిటీని ఆర్థికమంత్రి నేతృత్వంలో ఏర్పాటుచేసింది. ఏ జిల్లాల్లోనైతే చక్కెర కర్మాగారాలు ఉన్నాయో.. ఆ జిల్లాలకు చెందిన మంత్రులు ఈ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. నేను ఈ గోల్డ్‌స్టోన్ ప్రతిపాదనను పరిశీలించాను. 
 
 కొద్ది మొత్తం పెట్టుబడితో ఆస్తులన్నీ ఇవ్వాలన్నారు... 
 టెండర్ ప్రక్రియ కొనసాగే క్రమంలో కోరకుండానే వచ్చిన ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవడం సరికాదని నేను కేబినెట్ కమిటీకి చెప్పాను. అంతేకాకుండా ఈ కంపెనీకి చక్కెర పరిశ్రమలో ఎలాంటి అనుభవం లేదు. పైగా ఆయన కొద్దిమొత్తం పెట్టుబడితో కంపెనీకి చెందిన భారీ ఆస్తులను తమ కంపెనీకి బదిలీ చేయాలని కోరారు. అమలు కమిటీ కన్సల్టెంట్లు కూడా నా నిర్ణయంతో ఏకీభవించారు. కమిటీ ఈ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుందని భావించా. కానీ కమిటీ చైర్మన్ ఆ కంపెనీ ప్రతినిధిని ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు ఆహ్వానించారు. ఆ ప్రజెంటేషన్ పూర్తయ్యాక కూడా నేను ప్రతిపాదన తిరస్కరణకు నా వద్ద ఉన్న కారణాలను వివరించాను. కానీ కమిటీ మాత్రం గోల్డ్‌స్టోన్ తన ఆఫర్‌ను పెంచాలని సలహా ఇస్తూ పోయింది. ఈ విషయమై కమిటీ దాదాపు 6 సార్లు సమావేశమైంది. ప్రతి సమావేశంలో గోల్డ్‌స్టోన్ కంపెనీ తన ఆఫర్‌ను పెంచుతూ పోయింది. కానీ ప్రతిసారీ నేను ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తూ వచ్చాను. 
 
 చంద్రబాబు అనూహ్య నిర్ణయం...
 చివరగా ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్దకు తీసుకెళ్లాలని సలహా ఇచ్చింది. దీంతో చంద్రబాబునాయుడుతో ఒక సమావేశం ఏర్పాటుచేశాం. ప్రతిపాదనపై ముఖ్యమంత్రికి ఆర్థికమంత్రి వివరించారు. ప్రతిపాదనను అంగీకరించాలన్న కేబినెట్ కమిటీ అభిప్రాయాన్ని కూడా వివరించారు. కానీ నేను నా అభిప్రాయానికే కట్టుబడి ఉన్నా. బహిరంగ వేలానికి వెళ్లాలని సూచించా. రెండు వైపులా వాదనలు విన్న ముఖ్యమంత్రి.. కేబినెట్ కమిటీలోని మంత్రులు, చక్కెర యూనిట్లు ఉన్న జిల్లాలకు చెందిన మంత్రులంతా ఈ ప్రతిపాదనకు సమ్మతిస్తున్నప్పడు గోల్డ్‌సోన్ ఆఫర్‌ను ఆమోదించాలని చెప్పారు. చంద్రబాబు ఈ తీర్పు చెప్తారని నేను ఊహించలేదు. 
 
 నన్ను బాధ్యతల నుంచి తొలగించాలని లేఖ రాశా... 
 మంత్రులంతా వెళ్లిపోయాక నేను చంద్రబాబుతో చెప్పాను. టెండర్ లేకుండా వచ్చిన ఈ ఆఫర్‌ను ఆమోదిస్తే తప్పవుతుందని చెప్పాను. అప్పటికే అమలులో ఉన్న పారదర్శకమైన ఓపెన్ టెండర్ విధానాన్ని పాటించాల్సి ఉందని వివరించాను. చంద్రబాబునాయుడు దాన్ని అంగీకరించినా.. ‘రాజకీయ అనివార్యతల వల్ల మీ సిఫారసులకు వ్యతిరేకంగా వెళ్లాల్సి వస్తోంద’ని నాతో చెప్పారు. చంద్రశేఖర్‌రావు తెలంగాణ పార్టీ పెట్టారని, పంచాయతీ ఎన్నికలు సమీపంలోని ఉన్నాయని, ఈ సందర్భంలో తెలంగాణకు చెందిన మంత్రుల మాటకు అవునన కుండా తాను ముందుకు వెళ్లలేనని చెప్పారు. ఆ తరువాత నేను ఆఫీసుకు వచ్చిన మరుక్షణమే చీఫ్ సెక్రటరీకి లేఖ రాశాను. కేబినెట్ కమిటీ నన్ను విశ్వాసంలోకి తీసుకోనందున ఈ బాధ్యతల నుంచి నన్ను తొలగించాలని, అందుకు తగిన మరో అధికారిని నియమించాలని కోరాను. అలాగే రెండు నెలల పాటు సెలవుకు దరఖాస్తు చేసుకున్నాను.
 
 కేబినెట్ మంత్రులందరినీ ఎలా ఒప్పించారో..!
 నాకు ఇప్పటికీ అంతుబట్టని విషయమేమిటంటే.. గోల్డ్‌స్టోన్ కంపెనీ కేబినెట్ కమిటీలోని మంత్రులందరినీ ఎలా ఒప్పించగలిగిందనే ది! ఆ తరువాతి పరిణామాల నేపథ్యంలో నిజాం షుగర్స్ ప్రయివేటీకరణ ఒక ప్రధాన రాజకీయ అంశం అయ్యింది. దీనిపై సభాసంఘం ఏర్పాటైంది. కేబినెట్ కమిటీ గోల్డ్‌స్టోన్ కంపెనీ ప్రతిపాదనను ఆమోదించడాన్ని సభాసంఘం తీవ్రంగా తప్పుబట్టింది. 2006 ఆగస్టు 31న సభాసంఘం సంబంధిత అక్రమాలపై నివేదిక ఇచ్చింది. సభాసంఘం నా వైఖరిని ప్రశసించింది. గోల్డ్‌స్టోన్ ప్రతిపాదనను ఆమోదించడం కారణంగా రూ. 308 కోట్లు నష్టం వాటిల్లిందని పేర్కొంది...’ అని పరేఖ్ తన పుస్తకంలో సమగ్రంగా వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement