PC Parakh
-
'ఆత్మ' తక్కువ కథ ఎక్కువ!
దేశంలో ఆత్మకథల పరంపర కొనసాగుతోంది. నట్వర్ సింగ్ వివాదం ఇంకా చల్లారకముందే తెర మీదకు మరో ఆత్మ కథ వచ్చింది. ఇప్పటికే తమ ఆత్మకథలతో సంజయ్‌బారు, పీసీ పరేఖ్, నట్వర్ సింగ్ తదితరులు సంచలనం సృష్టించగా.... తాజాగా మార్గరెట్ అల్వా ఈ జాబితాలో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మార్గరెట్ అల్వా కూడా త్వరలో తన ఆత్మకథ రాయబోతున్నారు. రాజస్థాన్ గవర్నర్ గా పదవీ విరమణ చేసిన ఆమె త్వరలో పెన్ను పట్టుకోనున్నారు. సాధారణ కుటుంబం నుంచి రాజ్ భవన్ వరకూ సాగిన తన పయనం గురించి ఆమె ఈ పుస్తకంలో వివరించనున్నట్లు సమాచారం. అయితే వివాదాలు సృష్టించేందుకు ఈ పుస్తకం రాయటం లేదని మార్గరెట్ స్పష్టం చేయటం విశేషం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వద్ద మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్‌బారు రచించిన 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: ద మేకింగ్, అన్‌మేకింగ్' అప్పట్లో టాక్ ఆఫ్ ది నేషన్ అయిన విషయం తెలిసిందే. మహా భారతంలో భీష్ముడితో మన్మోహన్‌ను పోల్చిన సంజయ్ బారు, సోనియా ఎలా చెబితే అలా మన్మోహన్ నడుచుకున్నారని ఆ పుస్తకంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పేరుకే మన్మోహన్ ప్రధాని అని, సోనియా కనుసన్నల్లోనే ఆయన పాలన సాగించారంటూ విమర్శలు గుప్పించారు. ఇక సంజయ్ బారును స్పూర్తిగా తీసుకున్నారో ఏమో....కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శిగా పని చేసిన పీసీ పరేఖ్ కూడా 'క్రూసేడర్ అండ్ కాన్స్పిరేటర్' పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకం ద్వారా తీవ్ర సంచలనం సంచలనం సృష్టించింది. తన పుస్తకంలో బొగ్గు మసి మొత్తం బయటపెట్టిన ఆయన కోల్గేట్ వ్యవహారంలో ప్రధాని పాత్రపై నిగ్గుతేల్చేందుకు సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఇక అంతకు ముందు బీజేపీ సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ 'మై కంట్రీ.. మై లైఫ్' పేరుతో ఆత్మకథను రాశారు. రాజకీయాల్లో ఉక్కుమనిషిగా తన ఇమేజ్ను పెంచుకునే విధంగా ఈ పుస్తక రచన సాగిందనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. అధికారం అనుభవించిన వారి జీవితాలు ఎప్పుడూ ఆసక్తికరమే. ఎక్కడ రహస్యం ఉంటుందో అక్కడ ఆసక్తి ఉంటుంది. అధికారం అన్నప్పుడు, అధికారం ఉన్నవారి వద్ద పని చేసినప్పుడు.... వారి మధ్య ఎన్నో రహస్యాలు ఇమిడి ఉంటాయి. అలాంటి వారు ఆత్మకథలు రాస్తే అవి మిగతావారికి ఆసక్తిని రేకెత్తించటంలో సందేహం లేదు. అయితే అధికారం చేతులు మారాక... ప్రయివేట్ సంభాషణలను ఆత్మకథల పేరుతో బయట పెట్టడం ఎంత వరకూ సమంజసం. సంచలనాల కన్నా మీడియా మాత్రం మాస్ మసాలా దొరికినట్లే. గతంలో మన్మోహన్పై సంజయ్ బారు, తాజాగా సోనియాపై నట్వర్ సింగ్ వెల్లడించిన విషయాలు అందరికి ముందు నుంచి తెలిసినవే. వారంటూ కొత్తగా చేసిన ఆరోపణలు ఏమాత్రం లేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పుస్తకాల అమ్ముకోవటానికి, వార్తల్లో నిలవటానికి జిమ్మిక్కులని కొట్టి పారేస్తున్నారు. నేతి బీరకాయలో నెయ్యి చందంగా ఆత్మ కథల్లో ...'కథ'లు తప్ప దానిలో ఆత్మ కనిపించటం లేదని వినికిడి. -
'పచ్చ' మచ్చ
-
పుస్తకం చెప్పిన అవినీతి కథ !
-
బాబు అభివృద్ధి వెనుక దాగున్న 'చేదు' నిజం
-
ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగలేదు..
నిజాం షుగర్స్‌పై సభా సంఘం నిర్ధారణలివీ నిజాం షుగర్స్‌కు చెందిన నాలుగు యూనిట్లు - షక్కర్నగర్, మెట్పల్లి, ముంబోజిపల్లి చక్కెర మిల్లులు, షక్కర్నగర్ డిస్టిలరీల విక్రయం వ్యవహారంలో రెండేళ్ల పాటు విచారణ జరిపిన సభా సంఘం 2006 ఆగస్టులో 350 పేజీల నివేదిక ఇచ్చింది. ఈ యూనిట్ల అమ్మకంలో చంద్రబాబు ప్రభుత్వ అక్రమాలకు అంతేలేదంటూ తూర్పారబట్టింది. ప్రభుత్వ ఖజానాకు రూ. 300 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. చంద్రబాబు నిర్వాకంపై సభా సంఘం తన నివేదికలో నిర్ధారించిన ముఖ్యాంశాలివీ... * ‘‘నిజాం షుగర్స్ యూనిట్లను అమ్మటానికి ప్రైవేటు వ్యక్తులతో చర్చలు జరపడమనేది ప్రపంచంలో ఇంకెక్కడా జరగని వ్యవహారమని ప్రపంచ బ్యాంకు అధికారులే చెప్పారు. ఈ పద్ధతిలో అమ్మటానికి కేబినెట్ అనుమతి కూడా లేదు. ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై కేబినెట్ సబ్-కమిటీ సొంతంగా ఈ పని కానిచ్చింది. అడ్వొకేట్ జనరల్ సలహాలను సైతం పెడచెవిన పెట్టింది. * కేబినెట్ సబ్ కమిటీలోని యనమల రామకృష్ణుడు (అప్పటి ఆర్థికమంత్రి), ఇ.పెద్దిరెడ్డి (అప్పటి చక్కెర శాఖ మంత్రి), కె.విద్యాధరరావు (అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి).. ముగ్గురూ ఈ మోసానికి ప్రధాన కారకులు. ఇతర రాజకీయ పార్టీలు, చెరకు రైతులు, ఉద్యోగుల నుంచి ఎన్ని అభ్యంతరాలు వచ్చినప్పటికీ డెల్టా పేపర్ మిల్స్ (డీపీఎం)కే నిజాం షుగర్స్ యూనిట్లు అమ్మేందుకు కేబినెట్ సబ్‌కమిటీ మొండిగా మొగ్గుచూపింది. * అమ్మకానికి పెట్టిన నిజాం షుగర్స్ యూనిట్ల ఆస్తులలో కొన్నిటికి అతి తక్కువ విలువ కట్టారు. కొన్నిటికి అసలు విలువే కట్టలేదు. అలా ప్రస్తావించని ఆస్తుల విలువ రూ. 40 కోట్లు. దీంతో కొనుగోలు దారులు ఈ నాలుగు యూనిట్లకు చాలా తక్కువ మొత్తానికి బిడ్లు దాఖలు చేశారు. * డీపీఎం తుది బిడ్‌ను ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్ ఉద్దేశపూర్వకంగా తప్పుడు అంచనా కట్టింది. వారి ధర మిగిలిన వాటికన్నా మెరుగైనదిగా చూపింది. * నిజాం షుగర్స్ నాలుగు యూనిట్ల భూములను బాబు ప్రభుత్వం నామమాత్రపు ధరకు, భారీ నష్టానికి అమ్మేసింది. అదీ శాసనసభ రద్దయిన తర్వాత. ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉన్న సమయంలో 2003 నవంబర్ 14న సేల్ డీడ్స్ 2004 ఫిబ్రవరి 25న, 2004 మే 20న రిజిస్టరయ్యాయి. కొత్త ప్రభుత్వం కొద్ది రోజుల్లో రానుండగా చంద్రబాబు ప్రభుత్వం హడావుడిగా ఈ తంతు పూర్తిచేసింది. కొత్త ప్రభుత్వానికి తెలియనివ్వకుండానే ఈ భూమి బదిలీ జరిగిపోయింది. * నాటి ప్రతిపక్ష నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి రాసిన లేఖకు 2002 మే 3న నాటి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు జవాబు రాస్తూ.. ‘‘అదనపు ఆస్తులలోని 101 ఎకరాలకు డీపీఎం రూ. 10 కోట్లు చెల్లిస్తోంది’’ అంటూ అబద్ధమాడారు. నిజానికి డీపీఎం చెల్లించింది రూ. 6.16 కోట్లే.’’ -
నిజాం షుగర్స్‌ను అప్పనంగా ఇచ్చేశారు
చంద్రబాబు నిర్వాకాన్ని బయటపెట్టిన మాజీ ఐఏఎస్ ‘క్రూసేడర్ ఆర్ కాన్స్పిరేటర్?’ పుస్తకంలో గుట్టు విప్పిన పరేఖ్ సాక్షి, న్యూఢిల్లీ: తొమ్మిదేళ్ల తన పాలనలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశానని ఊదరగొడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. నిజానికి ముఖ్యమంత్రిగా ఉండగా చేసిన నిర్వాకమేమిటో మచ్చుకు ఒక ఉదంతాన్ని నాటి సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు తన పుస్తకంలో వెల్లడించారు. ప్రభుత్వ రంగంలోని నిజాం చక్కెర కర్మాగారం యూనిట్లను ఎలాంటి టెండర్లు లేకుండా.. ‘రాజకీయ అనివార్యత’ల పేరుతో చంద్రబాబు ప్రైవేటు సంస్థకు ధారాదత్తం చేసిన వైనాన్ని పూసగుచ్చినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి పి.సి.పరేఖ్.. తాను పనిచేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకు ఎదురైన అనుభవాలు, కేంద్ర ప్రభుత్వంలో తాను పనిచేసినప్పుడు ఎదురైన అనుభవాలను ‘క్రూసేడర్ ఆర్ కాన్స్పిరేటర్?.. కోల్ గేట్ అండ్ అదర్ ట్రూత్స్’ (ధర్మయుద్ధ సైనికుడా లేక కుట్రదారుడా? బొగ్గు కుంభకోణం.. ఇతర నిజాలు) అన్న శీర్షికతో గ్రంథస్తం చేశారు. ఈ పుస్తకాన్ని సోమవారం ఢిల్లీలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సింఘ్వీ ఆవిష్కరించారు. ఇందులో ప్రధానంగా బొగ్గు కుంభకోణంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజాం షుగర్స్‌ను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పనంగా కట్టబెట్టిన తీరును ఆయన వివరించారు. అది తప్పుడు నిర్ణయమని తాను అనేకసార్లు వారించినా.. చంద్రబాబు చివరికి అలాంటి నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నిర్ణయం వల్ల ప్రభుత్వానికి ఆనాడే రూ. 308 కోట్ల నష్టం వాటిల్లిందని సభాసంఘం సైతం తప్పుపట్టిన విషయాన్నీ తెలిపారు. నిజాం షుగర్స్ విషయంలో చంద్రబాబు నిర్వాకం గురించి పరేఖ్ తన పుస్తకంలో ఏం రాశారంటే... ప్రపంచబ్యాంకు షరుతులతో షురూ... ‘నేను 2000 సంవత్సరం జూలై సమయంలో ప్రభుత్వ రంగ సంస్థల శాఖలో బాధ్యతలు స్వీకరించాను. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో చాలా వరకు ప్రభుత్వానికి భారంగా మారాయి. అందువల్ల ప్రపంచబ్యాంకు రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించడంలో భాగంగా ఒక షరతు విధించింది. ప్రభుత్వ రంగ సంస్థలను పునర్వ్యవస్థీకరించాలని, నష్టాల్లో ఉన్న వాటిని ప్రయివేటు పరం చేయాలని ఆ షరతుల సారాంశం. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేసేందుకు ఒక కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీకి బ్రిటన్‌కు చెందిన అంతర్జాతీయ అభివృద్ధి విభాగం కూడా సాయం చేసింది. ఈ కమిటీకి నేను ఎక్స్-అఫిషియో చైర్మన్‌గా కూడా ఉన్నాను. ప్రయివేటీకరణ చేయాలనుకున్నవాటిలో ప్రధానమైన కంపెనీ నిజాం షుగర్స్ లిమిటెడ్. దీన్ని హైదరాబాద్ నిజాం 1934లో ఏర్పాటుచేశారు. అప్పట్లో ఇది ఆసియాలోనే పెద్దదని చెప్పేవారు. ఈ కంపెనీకి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కలిపి ఆరు చక్కెర మిల్లులు, రెండు డిస్టిలరీలు ఉండేవి. పక్కనే ఉన్న ప్రయివేటు మిల్లులేమో లాభాల్లో ఉండేవి. కానీ ఇవి మాత్రం నష్టాలు మిగుల్చుతున్నాయి. అనేక ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలించాక వీటన్నింటినీ బహిరంగ వేలం ద్వారా అమ్మాలని నిర్ణయించడమైంది. అడకుండానే ఆఫర్ ఇచ్చిన గోల్డ్‌స్టోన్... రెండు మిల్లులు, ఒక డిస్టిలరీని విజయవంతంగా ప్రయివేటీకరించాం. కన్సల్టెంట్లు నిర్దేశించిన అప్సెట్ ధర కంటే మెరుగ్గానే ధర లభించింది. వీటిని దక్కించుకున్న వారంతా ఆర్థికంగా ఉన్నవారు కావడంతో పాటు షుగర్ పరిశ్రమలో అనుభవం ఉన్నవాళ్లే. యూనిట్లను విడతలవారీగా వేలానికి పెడితే పోటీ బాగా వస్తుందని నమ్మి ఆ మేరకే విడతల వారీగా వేలానికి పెట్టాం. మూడు యూనిట్లను ప్రయివేటీకరించాక శక్కర్‌నగర్‌లోని ప్రధాన యూనిట్‌కు కూడా వాణిజ్య ప్రకటన ఇచ్చే ప్రక్రియను పరిశీలించాం. ఇది పరిశీలనలో ఉండగానే.. మెస్సర్ గోల్డ్‌స్టోన్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి మేం కోరకుండానే ఒక ప్రతిపాదన వచ్చింది. చక్కెర శాఖ మంత్రి ఈ ప్రతిపాదనను అధ్యయనం చేయాలని కోరారు. ప్రయివేటీకరణ ప్రతిపాదనలను అధ్యయనం చేసి ఆమోదించేందుకు ప్రభుత్వం ఒక కేబినెట్ కమిటీని ఆర్థికమంత్రి నేతృత్వంలో ఏర్పాటుచేసింది. ఏ జిల్లాల్లోనైతే చక్కెర కర్మాగారాలు ఉన్నాయో.. ఆ జిల్లాలకు చెందిన మంత్రులు ఈ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. నేను ఈ గోల్డ్‌స్టోన్ ప్రతిపాదనను పరిశీలించాను. కొద్ది మొత్తం పెట్టుబడితో ఆస్తులన్నీ ఇవ్వాలన్నారు... టెండర్ ప్రక్రియ కొనసాగే క్రమంలో కోరకుండానే వచ్చిన ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవడం సరికాదని నేను కేబినెట్ కమిటీకి చెప్పాను. అంతేకాకుండా ఈ కంపెనీకి చక్కెర పరిశ్రమలో ఎలాంటి అనుభవం లేదు. పైగా ఆయన కొద్దిమొత్తం పెట్టుబడితో కంపెనీకి చెందిన భారీ ఆస్తులను తమ కంపెనీకి బదిలీ చేయాలని కోరారు. అమలు కమిటీ కన్సల్టెంట్లు కూడా నా నిర్ణయంతో ఏకీభవించారు. కమిటీ ఈ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుందని భావించా. కానీ కమిటీ చైర్మన్ ఆ కంపెనీ ప్రతినిధిని ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు ఆహ్వానించారు. ఆ ప్రజెంటేషన్ పూర్తయ్యాక కూడా నేను ప్రతిపాదన తిరస్కరణకు నా వద్ద ఉన్న కారణాలను వివరించాను. కానీ కమిటీ మాత్రం గోల్డ్‌స్టోన్ తన ఆఫర్‌ను పెంచాలని సలహా ఇస్తూ పోయింది. ఈ విషయమై కమిటీ దాదాపు 6 సార్లు సమావేశమైంది. ప్రతి సమావేశంలో గోల్డ్‌స్టోన్ కంపెనీ తన ఆఫర్‌ను పెంచుతూ పోయింది. కానీ ప్రతిసారీ నేను ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తూ వచ్చాను. చంద్రబాబు అనూహ్య నిర్ణయం... చివరగా ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్దకు తీసుకెళ్లాలని సలహా ఇచ్చింది. దీంతో చంద్రబాబునాయుడుతో ఒక సమావేశం ఏర్పాటుచేశాం. ప్రతిపాదనపై ముఖ్యమంత్రికి ఆర్థికమంత్రి వివరించారు. ప్రతిపాదనను అంగీకరించాలన్న కేబినెట్ కమిటీ అభిప్రాయాన్ని కూడా వివరించారు. కానీ నేను నా అభిప్రాయానికే కట్టుబడి ఉన్నా. బహిరంగ వేలానికి వెళ్లాలని సూచించా. రెండు వైపులా వాదనలు విన్న ముఖ్యమంత్రి.. కేబినెట్ కమిటీలోని మంత్రులు, చక్కెర యూనిట్లు ఉన్న జిల్లాలకు చెందిన మంత్రులంతా ఈ ప్రతిపాదనకు సమ్మతిస్తున్నప్పడు గోల్డ్సోన్ ఆఫర్‌ను ఆమోదించాలని చెప్పారు. చంద్రబాబు ఈ తీర్పు చెప్తారని నేను ఊహించలేదు. నన్ను బాధ్యతల నుంచి తొలగించాలని లేఖ రాశా... మంత్రులంతా వెళ్లిపోయాక నేను చంద్రబాబుతో చెప్పాను. టెండర్ లేకుండా వచ్చిన ఈ ఆఫర్‌ను ఆమోదిస్తే తప్పవుతుందని చెప్పాను. అప్పటికే అమలులో ఉన్న పారదర్శకమైన ఓపెన్ టెండర్ విధానాన్ని పాటించాల్సి ఉందని వివరించాను. చంద్రబాబునాయుడు దాన్ని అంగీకరించినా.. ‘రాజకీయ అనివార్యతల వల్ల మీ సిఫారసులకు వ్యతిరేకంగా వెళ్లాల్సి వస్తోంద’ని నాతో చెప్పారు. చంద్రశేఖర్‌రావు తెలంగాణ పార్టీ పెట్టారని, పంచాయతీ ఎన్నికలు సమీపంలోని ఉన్నాయని, ఈ సందర్భంలో తెలంగాణకు చెందిన మంత్రుల మాటకు అవునన కుండా తాను ముందుకు వెళ్లలేనని చెప్పారు. ఆ తరువాత నేను ఆఫీసుకు వచ్చిన మరుక్షణమే చీఫ్ సెక్రటరీకి లేఖ రాశాను. కేబినెట్ కమిటీ నన్ను విశ్వాసంలోకి తీసుకోనందున ఈ బాధ్యతల నుంచి నన్ను తొలగించాలని, అందుకు తగిన మరో అధికారిని నియమించాలని కోరాను. అలాగే రెండు నెలల పాటు సెలవుకు దరఖాస్తు చేసుకున్నాను. కేబినెట్ మంత్రులందరినీ ఎలా ఒప్పించారో..! నాకు ఇప్పటికీ అంతుబట్టని విషయమేమిటంటే.. గోల్డ్‌స్టోన్ కంపెనీ కేబినెట్ కమిటీలోని మంత్రులందరినీ ఎలా ఒప్పించగలిగిందనే ది! ఆ తరువాతి పరిణామాల నేపథ్యంలో నిజాం షుగర్స్ ప్రయివేటీకరణ ఒక ప్రధాన రాజకీయ అంశం అయ్యింది. దీనిపై సభాసంఘం ఏర్పాటైంది. కేబినెట్ కమిటీ గోల్డ్‌స్టోన్ కంపెనీ ప్రతిపాదనను ఆమోదించడాన్ని సభాసంఘం తీవ్రంగా తప్పుబట్టింది. 2006 ఆగస్టు 31న సభాసంఘం సంబంధిత అక్రమాలపై నివేదిక ఇచ్చింది. సభాసంఘం నా వైఖరిని ప్రశసించింది. గోల్డ్‌స్టోన్ ప్రతిపాదనను ఆమోదించడం కారణంగా రూ. 308 కోట్లు నష్టం వాటిల్లిందని పేర్కొంది...’ అని పరేఖ్ తన పుస్తకంలో సమగ్రంగా వివరించారు. -
మంత్రిత్వ శాఖలోనే బొగ్గు మాఫియా!: పీసీ పరేఖ్
న్యూఢిల్లీ: హిందాల్కోకు బొగ్గు గనుల కేటాయింపుపై వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్‌కు శుక్రవారం కేబినెట్ మాజీ కార్యదర్శి, ప్రణాళికా సంఘం సభ్యుడు బీకే చతుర్వేది మద్దతు పలికారు. పరేఖ్ నిజాయితీగల అధికారి అని, దాని కారణంగానే ఆయన పదవీ విరమణ వరకూ పదవిలో కొనసాగారని పేర్కొన్నారు. గతంలో పరేఖ్ రాసిన లేఖ ఒకటి తాజాగా వెలుగు చూసిన నేపథ్యంలో చతుర్వేది స్పందించారు. పరేఖ్‌కు క్లీన్చిట్ ఇచ్చారు. బొగ్గు మాఫియా ఎక్కడో లేదని, ఆ మంత్రిత్వ శాఖలోనే ఉందని తన లేఖలో పరేఖ్ పేర్కొన్నారు. బొగ్గు శాఖ మంత్రులు ప్రజాప్రయోజనాలు పట్టించుకోకుండా మౌఖిక ఆదేశాలు జారీ చేసేవారని, ప్రజా ప్రయోజనాల మేరకు కాకుండా తమకు అనుకూలంగా నోట్ ఫైళ్లు కోరేవారని తెలిపారు. దీనిపై తాను బొగ్గు శాఖ మంత్రికి పలు సూచనలు చేశానని, ఆ నిర్ణయాలు హేతుబద్ధంగా, నిజాయితీగా, ప్రజాప్రయోజనం కలిగించేవిగా ఉండాలని సూచించానని, అది ఆ శాఖ కార్యదర్శిగా తన హక్కు, బాధ్యతగా పేర్కొన్నారు. తన సూచనలను ఆమోదించడం, ఆమోదించకపోవడం అనేది మంత్రి ఇష్టమని అన్నారు. 2005లో బొగ్గు శాఖ మంత్రి శిబూసొరెన్ తనపై పలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో వాటిపై వివరణ ఇస్తూ తాను అప్పటి కేబినెట్ కార్యదర్శి చతుర్వేదికి లేఖ రాసినట్లు పరేఖ్ శుక్రవారం తెలిపారు. పరేఖ్‌ను బదిలీ చేయాలని కోరుతూ అప్పట్లో శిబూ సొరేన్ కేబినెట్ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. కాగా హిందాల్కోకు బొగ్గు గనుల కేటాయింపు నిర్ణయం సబబేనని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటించడం ఆయన ఔన్నత్యానికి నిదర్శనమని పరేఖ్ అన్నారు. కేసుకు సంబంధించిన అంశాలను అవగాహన చేసుకోవడంలో సీబీఐ విఫలమైందని విమర్శించారు. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా.. ప్రధాని మన్మోహన్‌ను, తనను కలిసిన తర్వాత బొగ్గు గనుల నిర్ణయం మారిందన్న సీబీఐ ఆరోపణల్లో ఎక్కడా నేర కోణం కనిపించడం లేదన్నారు. హిందాల్కో ఫైళ్లు సీబీఐకి ఇచ్చిన పీఎంవో ఇలావుండగా హిందాల్కో కంపెనీకి బొగ్గు గనుల కేటాయింపునకు సంబంధించిన ఫైళ్లను ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) సీబీఐకి సమర్పించింది. ‘‘తలబిరా బొగ్గు గనులకు సంబంధించిన అన్ని ఫైళ్లను సీబీఐకి అందించాం. ఒక రసీదు కూడా తీసుకున్నాం. భవిష్యత్తులో ఏవైనా వివరాలు కావాలంటే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సీబీఐకి తెలిపాం’’ అని పీఎంవో వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. హిందాల్కోకు బొగ్గు గనుల కేటాయింపునకు సంబంధించిన ఫైళ్లను ఇవ్వాలని సీబీఐ.. మంగళవారం పీఎంవోకు లేఖ రాసిన విషయం తెలిసిందే. మరోవైపు 14 బొగ్గు క్షేత్రాల వద్ద పనులు, బొగ్గు వెలికితీత తీరుతెన్నులను అంతర మంత్రిత్వశాఖల అధికారుల బృందం (ఐఎంజీ) శుక్రవారం సమీక్షించింది. జైప్రకాశ్ అసోసియేట్స్, మాన్నెట్ ఇస్పాత్ ఎనర్జీ, జిందాల్ స్టీల్, పవర్ లిమిటెడ్ తదితర సంస్థలకు కేటాయించిన బొగ్గు బ్లాకులను సమీక్షించినట్టు ఐఎంజీ వర్గాలు తెలిపాయి. ప్రధాని రాజీనామా చేయాల్సిందే: బీజేపీ బొగ్గు కుంభకోణంలో సీబీఐ విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రధానమంత్రి ప్రకటించడంలో అర్థం లేదని బీజేపీ పేర్కొంది. ప్రధాని గద్దె దిగితేనే ఈ విషయంలో నిష్పాక్షిక దర్యాప్తు జరుగుతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ శుక్రవారం నాడిక్కడ పేర్కొన్నారు. వాస్తవాలను దాచి మన్మోహన్ గతంలో చేసిన ప్రకటనలనే మళ్లీమళ్లీ చేస్తున్నారని విమర్శించారు. ప్రధానికి రాజీనామా చేయడం మినహా మరోమార్గం లేదని అన్నారు. రాజీనామా చేసిన తర్వాతే సీబీఐ ఎదుట హాజరుకావాలని చెప్పారు. -
రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి: ఐఏఎస్‌ల సంఘం
సాక్షి, హైదరాబాద్: ఐఏఎస్ అధికారుల విధుల నిర్వహణకు తగిన వాతావరణం కల్పించడంతో పాటు భద్రత కల్పించాలని, ఇందులో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ఐఏఎస్‌ల సంఘం తీర్మానం చేసింది. బొగ్గు కుంభకోణం విషయంలో బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్‌పై సీబీఐ కేసు నమోదు చేసిన నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఐఏఎస్ సంఘం సమావేశ మై పలు తీర్మానాలను ఆమోదించింది. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ సంఘం కార్యదర్శి రేమాండ్ పీటర్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. రాజకీయ నాయకులను వదిలేసి బొగ్గు కుంభకోణంలో సీబీఐ.. పీసీ పరేఖ్‌పై కేసు నమోదు చేయడాన్ని సంఘం తీవ్రంగా తప్పుపట్టింది. పరేఖ్ నిబద్ధతగల వ్యక్తి అని కొనియాడింది. ఆయనకు మద్దతుగా నిలవాలని తీర్మానం చేసింది. ప్రభుత్వంలోని రాజకీయ నేతలను పట్టించుకోకుండా సీనియర్ ఐఏఎస్ అధికారులపై క్రిమినల్ కేసులను నమోదు చేయడంతో పాలనకు ఆటంకం కలుగుతుందని, అంతేకాకుండా ప్రభుత్వంలోని అన్ని స్థాయిల్లో విధానపరమైన నిర్ణయాలు స్తంభించిపోతాయని తీర్మానంలో పేర్కొన్నారు. ఐఏఎస్‌లను ఇష్టం వచ్చినట్లు విచారణ సంస్థలు నిందించకుండా చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సంఘం కోరింది. పదవీ విరమణ చేసిన ఐఏఎస్‌లపై కేసు నమోదు చేయాలంటే ముందుగా అనుమతి తీసుకునేలా అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19కు సవరణలు తీసుకురావాలని తీర్మానించింది. ప్రతిపాదిత సివిల్ సర్వెంట్స్ ప్రమాణాలు, జవాబుదారీ బిల్లులో.. అధికారులు తీసుకునే నిర్ణయాలకు తగిన రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు, బిజినెస్ రూల్స్ పట్ల అవగాహన, అనుభవంగల వారు సీబీఐ విచారణ టీంలో ఉండేలా చూడాలని సంఘం పేర్కొంది. -
నేను దోషినైతే మన్మోహన్ కూడా దోషే: పరేఖ్
-
నేను దోషినైతే మన్మోహన్ కూడా దోషే: పరేఖ్
న్యూఢిల్లీ: బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పి.సి.పరేఖ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బొగ్గు కుంభకోణం ఛార్జ్షీటులో తన పేరు చేర్చటంపై ఆయన అభ్యంతరం తెలిపారు. తాను దోషిని అయితే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా దోషేనని పరేఖ్ వ్యాఖ్యానించారు. బొగ్గు కుంభకోణంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా గ్రూపు అధినేత కుమారమంగళం బిర్లా(46)పై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. బొగ్గు కుంభకోణం కేసులో తనను ఇరికిస్తున్నారని పీసీ పరేఖ్ మండిడ్డారు. ప్రభుత్వం తీసుకున్న పాలసీనే తాను అమలు చేశానని అన్నారు. అంతిమ నిర్ణయం తీసుకున్న ఆనాటి బొగ్గు శాఖ మంత్రిని, ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్లను ప్రస్తావించకుండా.... తన పేరురను ఛార్జిషీట్లో పేర్కొనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయివేట్ సంస్థలకు లబ్ది చేకూరేలా గనులను కేటాయింపు జరిగిందని సీబీఐ భావిస్తే.... ఆ నిర్ణయం తీసుకున్న అందరిని దోషులుగా పేర్కొనాలని డిమాండ్ చేశారు. గనుల కేటాయింపులో ఆయనతోపాటు,పీసీ పరేఖ్, కొంతమంది అధికారులు అవినీతి, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ కోర్టులో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. బొగ్గు శాఖ ప్రధానమంత్రి దగ్గర ఉన్న నేపథ్యంలో ఈ కేసుకు చాలా ప్రాధాన్యం ఏర్పడింది.