నేను దోషినైతే మన్మోహన్ కూడా దోషే: పరేఖ్
న్యూఢిల్లీ: బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పి.సి.పరేఖ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బొగ్గు కుంభకోణం ఛార్జ్షీటులో తన పేరు చేర్చటంపై ఆయన అభ్యంతరం తెలిపారు. తాను దోషిని అయితే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా దోషేనని పరేఖ్ వ్యాఖ్యానించారు. బొగ్గు కుంభకోణంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా గ్రూపు అధినేత కుమారమంగళం బిర్లా(46)పై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
బొగ్గు కుంభకోణం కేసులో తనను ఇరికిస్తున్నారని పీసీ పరేఖ్ మండిడ్డారు. ప్రభుత్వం తీసుకున్న పాలసీనే తాను అమలు చేశానని అన్నారు. అంతిమ నిర్ణయం తీసుకున్న ఆనాటి బొగ్గు శాఖ మంత్రిని, ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్లను ప్రస్తావించకుండా.... తన పేరురను ఛార్జిషీట్‌లో పేర్కొనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయివేట్ సంస్థలకు లబ్ది చేకూరేలా గనులను కేటాయింపు జరిగిందని సీబీఐ భావిస్తే.... ఆ నిర్ణయం తీసుకున్న అందరిని దోషులుగా పేర్కొనాలని డిమాండ్ చేశారు.
గనుల కేటాయింపులో ఆయనతోపాటు,పీసీ పరేఖ్, కొంతమంది అధికారులు అవినీతి, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ కోర్టులో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. బొగ్గు శాఖ ప్రధానమంత్రి దగ్గర ఉన్న నేపథ్యంలో ఈ కేసుకు చాలా ప్రాధాన్యం ఏర్పడింది.