బొగ్గు కుంభకోణంలో సీబీఐ మళ్లీ సోదాలు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ మళ్లీ సోదాలు నిర్వహిస్తోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్, కోల్కతా, ముంబయిలలో సీబీఐ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఇక ఈ కుంభకోణంలో చార్జీషీట్లో తాజాగా ఆదిత్యా బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా పేరును ఛార్జీషీట్లో చేర్చింది. అలాగే బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పి.సి. పరేఖ్ పేరు కూడా చార్జీషీట్లో నమోదు చేసింది.
ఇక యుపిఎ-1 హయాంలో ప్రధాని మన్మోహన్‌సింగ్ స్వయంగా బొగ్గు మంత్రిత్వశాఖను పర్యవేక్షించిన కాలంలో చోటుచేసుకొన్న భారీ బొగ్గు కేటాయింపుల కుంభకోణంతో ప్రభుత్వ ఖజానాకు దాదాపు పది లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆదాయ నష్టం జరిగిందని కంట్రోలర్, ఆడిటర్ జనరల్ కాగ్ వెల్లడించిన వైనం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 2 జి స్పెక్ట్రమ్ కేసులో లక్ష డెబ్బై వేల కోట్ల నష్టం జరిగిందని వెలుగులోకి తెచ్చిన కాగ్ ఆతర్వాత బొగ్గు గనుల కేటాయింపులో వేలం పాటలు నిర్వహించనందున పదిలక్షల డెబ్బైవేల కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని లెక్కగట్టింది.