‘బొగ్గు’కథ ఇక కంచికే!
న్యూఢిల్లీ: బిర్లా గ్రూపు సంస్థల అధినేత కుమారమంగళం బిర్లాపై నమోదైన ‘బొగ్గు’కేసు త్వరలోనే కంచికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిర్లాపై కేసును సీబీఐ మూసివేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బిర్లాకు చెందిన హిందాల్కో కంపెనీకి ఒడిశాలోని తలబిరా-2 గని కేటాయింపు సక్రమమేనని, అన్నీ పరిశీలించిన తర్వాతే ప్రధాని ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకున్నారని ప్రధాని కార్యాలయం ప్రకటించడంతో సీబీఐ ఇరకాటంలో పడింది. స్వయంగా ప్రధాని అన్నీ పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకున్నారంటూ పీఎంవో కరాఖండిగా ప్రకటించడంతో ఈ కేసు విషయంలో ఇరకాటంలో పడ్డామని సీబీఐ అధికారులే అంగీకరిస్తున్నారు.
కాగా, హిందాల్కోకు బొగ్గు గని కేటాయిస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ ఆహ్లూవాలియా, దర్యాప్తు విషయంలో ‘మర్యాదకర రీతి’లో వ్యవహరించాలంటూ సీబీఐకి హితవు పలికారు. కుమారమంగళం బిర్లాపై, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్‌పై సీబీఐ కేసు దాఖలు చేయడంతో ఇటు పారిశ్రామిక వర్గాల నుంచి అటు ప్రభుత్వాధికారుల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. పారిశ్రామికవేత్తలను బలిపశువులను చేయరాదంటూ పారిశ్రామిక సంఘా లు గగ్గోలు పెట్టాయి. మరోవైపు, బిర్లాపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినందున ఇప్పటికిప్పుడే కేసును అర్ధంతరంగా మూసివేయలేమని, కేసుతో సంబంధం ఉన్న అందరితోనూ మాట్లాడతామని సీబీఐ అధికారులు చెబుతున్నారు. అయితే, కేసును మూసివేసే అవకాశాలను పరిశీలించేందుకు సైతం సిద్ధంగా ఉన్నామని సీబీఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఏ కేసులోనైనా ఎఫ్‌ఐఆర్ దాఖలు కేవలం ప్రాథమిక చర్య మాత్రమేనని, దర్యాప్తు మొదలైన కేసులను మూసివేసిన ఉదంతాలూ లేకపోలేదని తెలిపారు. దర్యాప్తు కొనసాగుతున్న దశలో కేసును మూసివేసేందుకు సాంకేతికంగా అవకాశాలు లేకపోలేదు. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత కేసును మూసివేయాలని సీబీఐ భావిస్తున్నట్లు సమాచారం.
కుమారమంగళం బిర్లా రెండు రోజుల కిందట ఆర్థిక మంత్రి చిదంబరంతో భేటీ అయ్యారు. హిందాల్కోకు బొగ్గు బ్లాకు కేటాయింపును సమర్థించుకుంటూ పీఎంవో ప్రకటన, ఆ తర్వాత చిదంబరంతో బిర్లా భేటీ దరిమిలా కేసు మూసివేత దిశగా పరిణామాలు చోటు చేసుకుంటుండటం గమనార్హం. అయితే, ‘మా దర్యాప్తు ప్రకారం ప్రభుత్వరంగ సంస్థలకు, హిందాల్కోకు నడుమ కుదిరిన ఒప్పందం, నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు కంపెనీ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంది. బిర్లా, హిందాల్కో, పరేఖ్‌లకు వ్యతిరేకంగా ఏమీ లేనట్లు ఒకవేళ తేలితే కేసు మూసేసేందుకు అవకాశాలు ఉంటాయి’ అని సీబీఐ అధికారి ఒకరు వివరించారు. కాగా, బిర్లా, పరేఖ్‌లపై సీబీఐ కేసు విషయమై తన వైఖరిని వెల్లడిస్తూ అఫిడవిట్ దాఖలు చేసేలా ప్రధానిని ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో ఎంఎల్ శర్మ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.