తప్పనిసరి పరిణామం
అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలన్నీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని శాపాలై వెంటాడుతున్నాయి. ఆ పార్టీ నేతృత్వంవహించిన యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ నిందితుడిగా బోనెక్క బోతున్నారు. ఈ స్కాంను ఆదినుంచీ గమనిస్తున్నవారంతా ఇలాంటి పరిస్థితి ఏర్పడు తుందని ముందే ఊహించారు. దర్యాప్తు చేసిన సీబీఐ మాత్రమే మరోలా భావిం చింది. ఇప్పుడు మన్మోహన్‌సింగ్‌కు సమన్లు అందిన తలబిరా-2 బొగ్గు క్షేత్రాల కేటా యింపు కేసుపై ఆ సంస్థ సుదీర్ఘకాలం దర్యాప్తు చేసింది.
ఈ కేసులో ఎవరూ నేరానికి పాల్పడలేదంటూ ప్రత్యేక న్యాయస్థానానికి నిరుడు ఆగస్టులో ముగింపు నివేదికను సమర్పించింది. ప్రత్యేక న్యాయస్థానం ఆ నివేదికను తిరస్కరించి, దర్యాప్తులోని లొసుగులను ఎత్తిచూపింది. కేసులో ఉన్న కొన్ని అనుమానాలను ఎందుకు నివృత్తి చేసుకోలేదని ప్రశ్నించింది. ముఖ్యంగా మన్మోహన్‌సింగ్‌ను ప్రశ్నించవలసి ఉండగా ఆ పని చేయలేదేమని నిలదీసింది. ఆ తర్వాతే సీబీఐలో కదలిక వచ్చింది.
బొగ్గు క్షేత్రాల కేటాయింపులో ఎన్నో అక్రమాలు చోటుచేసుకున్నాయని మూడేళ్ల క్రితం తొలిసారి కాగ్ వెల్లడించింది. మొత్తం 195 క్షేత్రాల కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని తెలిపింది. ఇందువల్ల ఖజానాకు లక్షా 86 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. స్కాం జరిగిందంటున్న సమయంలో కొంతకాలం బొగ్గు శాఖను స్వయంగా మన్మోహన్‌సింగే పర్యవేక్షించారు. కనుక ఆ స్కాంపై మన్మోహన్‌ను ప్రశ్నించడం తప్పనిసరి. అయినా సీబీఐ ఏ దశలోనూ ఆయనను పిలవలేదు. మన్మోహన్‌సింగ్ వరకూ అవసరం లేదు... ఆ సమయంలో ప్రధాని కార్యాలయం (పీఎంఓ)లో పని చేసిన వారినే ప్రశ్నించలేదు.
తలబిరా-2 బొగ్గు క్షేత్రాల కేటాయింపు వ్యవహారంలో చాలా ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా హిందాల్కో అధిపతి కుమార మంగళం బిర్లా మన్మోహన్‌తో సమావేశమయ్యారని, అటుతర్వాత ఆయనకు రెండు లేఖలు రాశారని వెల్లడైంది. ఇవన్నీ జరిగాక ఆ బొగ్గు క్షేత్రాలను హిందాల్కోకు కేటాయించాలని పీఎంఓనుంచి ఒత్తిళ్లు వచ్చాయని బొగ్గు శాఖ అధికారులు దర్యాప్తులో చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్‌కు తలబిరా-2 బొగ్గు క్షేత్రాలను కేటాయించాలని స్క్రీనింగ్ కమిటీ చేసిన సిఫార్సును తొలుత ఒప్పుకున్న మన్మోహన్ ఆ తర్వాత హిందాల్కోవైపు మొగ్గు చూపారన్నది ప్రధాన ఆరోపణ.
ఇందులో నిజానిజాలేమిటన్నది తేల్చాల్సింది న్యాయస్థానాలే. కుమార మంగళం బిర్లా ప్రధానిని కలవడంలోగానీ, ఆయనకు లేఖలు రాయడంలో గానీ తప్పుబట్టాల్సిందేమీ లేదు. అయితే, ఆ కారణాలవల్లనే ఆ సంస్థకు బొగ్గు క్షేత్రాలు కేటాయించారా, ఇతరత్రా ఆ సంస్థకు ఎలాంటి అర్హతలూ లేవా అన్నది తెలుసుకోవాల్సిన బాధ్యత సీబీఐకి ఉంటుంది. ఇందుకు సంబంధించిన నిజానిజాలేమిటో తెలుసుకుని సందేహాతీతంగా న్యాయస్థానానికి వివరించి ఉంటే వేరుగా ఉండేది. ఆ పనిచేయాలంటే మన్మోహన్‌ను పిలిచి ప్రశ్నించాలి. పీఎంఓలోని ఇతర అధికారులనుంచీ విషయాలు రాబట్టాలి. కానీ, సీబీఐ ఆ పనిచేయలేదు. సందేహాలన్నిటినీ అలాగే మిగిల్చి కేసు మూసేస్తున్నట్టు నివేదిక ఇస్తే ఏ న్యాయ స్థానమైనా ప్రశ్నించకుండా ఎందుకుంటుంది?
మన్మోహన్ బోనెక్కాల్సిరావడం కాంగ్రెస్ పార్టీ అన్నట్టు విచారకరమైన విషయమే. కానీ అందుకు బాధ్యులెవరు? ఆ స్కాంపై ఎన్నోసార్లు పార్లమెంటు స్తంభించిపోయింది. అనేకసార్లు వాయిదా పడాల్సివచ్చింది. ఏ దశలోనూ మన్మోహన్ సందేహ నివృత్తికి ప్రయత్నించలేదు. తన సచ్ఛీలతను నిరూపించుకునే ప్రయత్నం చేయలేదు. అసలు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటుకే ఆ రోజుల్లో యూపీఏ సర్కారు ముందుకు రాలేదు. విపక్షాల ఒత్తిడి తట్టుకోలేక చివరకు దాన్ని నియమించినా ఆ సంఘం ముందుకొచ్చి మన్మోహన్ వివరణనిచ్చే ప్రయత్నం చేయలేదు. వాస్తవానికి బొగ్గు క్షేత్రాల కేటాయింపు సరైంది కాదని, వేలం విధానం ద్వారానే దాన్ని అప్పగించడం మంచిదని స్వయంగా మన్మోహనే ప్రతిపాదించారు.
ఆనాటి బొగ్గు శాఖ కార్యదర్శి పీసీ పరేఖ్ సలహా మేరకు అలాంటి ప్రతిపాదన చేసినా... ఆయనే దాన్ని ఎందుకు పాటించలేకపోయారో, పీఎంఓనుంచి బొగ్గు శాఖపై ఎందుకు ఒత్తిళ్లు వచ్చాయో చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఈ సందేహాలన్నిటికీ మన్మోహన్ మౌనమే సమాధానమైంది. విపక్ష రాష్ట్రాల సీఎంల ఒత్తిడి వల్లనే తాము వేలం విధానాన్ని ప్రారంభించలేక పోయామని ఒక దశలో మన్మోహన్ అన్నారు. కానీ అది బలహీనమైన వాదన. ఎవరో ఒత్తిడి చేశారని ఖజానాకు నష్టం కలిగించే పద్ధతిని కొనసాగిస్తారా? నిజానికి ప్రధానిగా ఆయన అన్ని శాఖల పర్యవేక్షణనూ చూస్తూ, అవి మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు చేయాలి. అలాంటిది తానే స్వయంగా చూసిన శాఖలో అవకతవకలు జరుగుతుంటే ఆయన ఎందుకు మిన్నకుండిపోయారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది.
సిమెంటు, ఉక్కు, విద్యుత్తువంటి ఎన్నో పరిశ్రమలకు బొగ్గు కీలకమైన ముడి సరుకు. దాని సరఫరా అంతంతమాత్రంగా ఉన్నందువల్ల విదేశాల నుంచి దిగుమతులు చేసుకోవాల్సివస్తున్నది. ప్రధాన సరఫరాదారు కోల్ ఇండియా లిమిటెడ్ డిమాండుకు తగ్గ స్థాయిలో అందించలేక పోతున్నదన్న కారణంతో అవసరమైన పరిశ్రమలకు బొగ్గు క్షేత్రాల కేటాయింపు విధానం ప్రారంభించారు. అయితే అందుకు వేలం పద్ధతిని ఎంచుకోకపోవడంవల్ల, పారదర్శకత పాటించనందువల్ల ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లింది. బొగ్గు క్షేత్రాలను అందుకున్న సంస్థలు భారీయెత్తున లాభపడ్డాయి. మన్మోహన్‌ను నిందితుడిగా పరిగణిస్తూ ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీచేయడం అనేకులకు మింగుడుపడని విషయమే. కానీ స్కాం జరిగిన సమయంలో ఆయన బొగ్గు శాఖను చూడటం, ఎన్నో సందేహాలకు సమాధానాలు లభించకపోవడం వంటి కారణాలవల్ల మన్మోహన్ ఈ పాపభారం మోయకతప్పదు.