2జీ స్కాం | Scam, or folklore? on 2G case verdict | Sakshi
Sakshi News home page

2జీ స్కాం

Published Fri, Dec 22 2017 2:49 AM | Last Updated on Tue, Oct 9 2018 4:27 PM

Scam, or folklore? on 2G case verdict - Sakshi

2007 నుంచి 2017

► కేంద్ర టెలికాం మంత్రిగా 2007, మేలో ఏ.రాజా బాధ్యతలు స్వీకరించారు. ఆగస్టులో 2జీ స్పెక్ట్రమ్‌ లైసెన్సుల కేటాయింపునకు నోటిఫికేషన్‌ జారీచేసిన ప్రభుత్వం అదే ఏడాది అక్టోబర్‌ 1లోగా దరఖాస్తు చేసుకోవాలంది. దీంతో 46 సంస్థలు 576 దరఖాస్తులు దాఖలుచేశాయి. లైసెన్స్‌ జారీ ప్రక్రియను నిష్పాక్షికంగా చేపట్టాలని అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మంత్రి రాజాకు నవంబర్‌లో లేఖ రాశారు. 2008, జనవరిలో ‘ముందు వచ్చినవారికి ముందుగా’ ప్రతిపాదికన టెలికాం శాఖ 122 కంపెనీలకు లైసెన్సులు జారీచేసింది.

► ఏడాది తర్వాత 2జీ కేటాయింపుల్లో అవకతవకలపై విచారణ జరపాలని కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ సీబీఐని ఆదేశించింది. 2009, అక్టోబర్‌ 21న సీబీఐ గుర్తుతెలియని టెలికాం అధికారులు, ప్రైవేటు వ్యక్తులు, సంస్థలపై కేసు పెట్టింది.

► టెలికాం లైసెన్సుల జారీలో రూ.70,000 కోట్ల కుంభకోణంపై పది రోజుల్లో స్పందించాలని కేంద్రం, రాజాకు సుప్రీం కోర్టు 2010, సెప్టెంబర్‌లో ఆదేశాలు జారీచేసింది.

► కేటాయింపుల విధానాల వల్ల ఖజానాకు రూ.1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతోందని కాగ్‌ తెలిపింది. దీంతో రాజా నవంబర్‌ 14న తన పదవికి రాజీనామా చేశారు. అదే ఏడాది డిసెంబర్‌లో ఈ కేసు విచారణకు ప్రత్యేక న్యాయస్థానాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. రాజాతో పాటు అప్పటి టెలికాం కార్యదర్శి సిద్ధార్థ బెహురా, రాజాప్రైవేటు కార్యదర్శి రవీంద్ర కుమార్, స్వాన్‌ టెలికాం లిమిటెడ్‌ ప్రమోటర్‌ షహీద్‌ ఉస్మాన్‌ బల్వాలను 2011, ఫిబ్రవరి 2న సీబీఐ అరెస్ట్‌ చేసింది.

► 2011, ఏప్రిల్‌ 2న తొలి చార్జిషీట్లో రాజాతో పాటు రవీంద్రకుమార్, బెహురాలను ప్రధాన నిందితులుగా సీబీఐ పేర్కొంది. రిలయన్స్‌ అడాగ్‌ గ్రూప్‌ ఎండీ గౌతమ్‌ దోసీ, సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ హరి నాయర్, ప్రెసిడెంట్‌ సురేంద్ర పిపారా, స్వాన్‌ టెలికాం ప్రమోటర్లు ఉస్మాన్‌ బల్వా, వినోద్‌ గోయెంకా, యూనిటెక్‌ లిమిటెడ్‌ ఎండీ సంజయ్‌ చంద్రల పేర్లనూ నిందితుల జాబితాలో చేర్చింది. వీరితో పాటు  రిలయన్స్‌ టెలికాం లిమిటెడ్, స్వాన్‌ టెలికాం ప్రై.లిమిటెడ్, యూనిటెక్‌ వైర్‌లైస్‌ ప్రై.లిమిటెడ్‌ సంస్థల పేర్లను కూడా చార్జిషీట్‌లో చేర్చింది.

► అదే ఏడాది అక్టోబర్‌ సమర్పించిన రెండో చార్జిషీట్‌లో డీఎంకే చీఫ్‌ కరుణానిధి కుమార్తె కనిమొళితో పాటు మరో నలుగురి పేర్లను సీబీఐ చేర్చింది. 2జీ కేసుల్ని విచారిస్తున్న ప్రత్యేక జడ్జి ఓపీ సైనీ సీబీఐ వేసిన రెండు కేసుల్ని, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాఖలుచేసిన మరో కేసును విచారణకు స్వీకరించారు.

► ఎస్సార్‌ గ్రూప్‌ ప్రమోటర్లు రవి రుయా, అన్షుమన్‌ రుయా, లూప్‌ టెలికాం ప్రమోటర్లు కిరణ్‌ ఖైతాన్, ఆమె భర్త ఐపీ ఖైతాన్, ఎస్సార్‌ డైరెక్టర్‌ వికాస్‌ సరఫ్‌లతో పాటు లూప్‌ టెలికాం, లూప్‌ మొబైల్‌ ఇండియా, ఎస్సార్‌ టెలీ హోల్డింగ్‌ లిమిటెడ్‌ పేర్లను సీబీఐ మూడో చార్జిషీట్‌లో చేర్చింది.

► ఫిబ్రవరి 2న 9 కంపెనీలకు సంబంధించి 122 టెలికాం లైసెన్సుల్ని రద్దుచేసిన సుప్రీంకోర్టు. సహజ వనరుల్ని ముందు వచ్చినవారికి ముందుగా’ కేటాయించకూడదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. దీంతో విధానపరమైన నిర్ణయాల్లో కోర్టుల జోక్యం, స్పెక్ట్రమ్‌ కేటాయింపు విధానం, తదితర అంశాలను కేంద్రం రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లింది.

► 2012, మేలో ఈ కేసులో రివ్యూ పిటిషన్‌ను ఉపసంహరించుకున్న కేంద్రం. రాష్ట్రపతి నివేదనకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయం. మే 15న రాజాకు బెయిల్‌ మంజూరుచేసిన ప్రత్యేక న్యాయస్థానం.

► అన్ని వనరులకు వేలం తప్పనిసరి కాదనీ.. అన్ని సందర్భాల్లో అత్యధిక రెవిన్యూ సాధన వర్తించదని సుప్రీం కోర్టు సెప్టెంబర్‌ 27న వ్యాఖ్యానించింది.

► రాజకీయ నేతలు, కార్పొరేట్‌ పెద్దలతో లాబియిస్ట్‌ నీరా రాడియా మాట్లాడిన 5,800 ఆడియోటేపుల్ని, వాటి ప్రతులను 2013, జనవరి 8న ఐటీశాఖ సీల్డ్‌ కవర్‌లో సుప్రీం  కోర్టుకు అందజేసింది. దీంతో వీటిని పరిశీలించేందుకు ఆరుగురు జడ్జీలతో ప్రత్యేక బెంచ్‌ను సుప్రీం  ఏర్పాటుచేసింది.

► ఈ కేసుకు సంబంధించి అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు, కేంద్ర మంత్రి చిదంబరానికి సెప్టెంబర్‌ 27న పార్లమెంటరీ కమిటీ క్లీన్‌చిట్‌ ఇచ్చింది.

► రాజాతో పాటు కనిమొళి, షాహీద్‌ బల్వా, వినోద్‌ గోయెంకా, బాలీవుడ్‌ దర్శకుడు కరీమ్‌ మొరానీ, తదితరులపై ఈ కుంభకోణంలో అక్రమ నగదు చెలామణి సంబంధించి 2014, ఏప్రిల్‌ 25న ఈడీ చార్జిషీట్‌ దాఖలుచేసింది. దీంతో పాటు డీఎంకే ఆధ్వర్యంలో నడిచే కలైంజర్‌ టీవీ చానెల్‌కు ఎస్టీపీల్‌ ప్రమోటర్లు రూ.200 కోట్ల మేర చెల్లించారంటూ కరుణానిధి భార్య దయాళు అమ్మాల్‌ పేరును ఈడీ చార్జిషీట్లో చేర్చింది.

► ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న 17 మంది నిందితులకు జడ్జి 225పేజీల ప్రశ్నావళిని అందజేశారు. 2017, ఏప్రిల్‌ 19న ప్రత్యేక న్యాయస్థానంలో ముగిసిన వాదనలు.

► డిసెంబర్‌ 21న ఏ.రాజా, కనిమొళిలతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న 17 మందిని న్యాయమూర్తి నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చారు.  

 –సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement