న్యాయం జరిగింది: కనిమొళి
2జీ స్పెక్ట్రం కేటాయింపుల కేసులో న్యాయం గెలిచిందని నిర్దోషిగా బయటపడిన డీఎంకే ఎంపీ కనిమొళి అన్నారు. గత ఆరేళ్లు తనకు చాలా కష్టంగా గడిచాయని, ఎంతో మనోవేదన మిగిల్చాయని పేర్కొన్నారు. ‘ఈరోజు కోసం ఆరేళ్లుగా ఎదురుచూస్తున్నా. ఇంతకాలం ఎంతో మనోవేదన అనుభవించా. ఏదో ఒకరోజు ఈ కష్టాల నుంచి బయటపడతానని అనుకున్నాను. కఠిన సమయంలో మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలకు రుణపడి ఉంటా’ అని కోర్టు తీర్పు వెలువడిన అనంతరం కనిమొళి భావోద్వేగంగా మాట్లాడారు.
కట్టుకథలని తేలింది: రాజా
2జీ కేటాయింపుల వల్ల ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందన్న ఆరోపణలు కట్టుకథలేనని కోర్టు తీర్పుతో రుజువైందని అప్పటి టెలికాం మంత్రి ఎ.రాజా అన్నారు. జాతీయ టెలికాం విధానం, ట్రాయ్ సిఫార్సులకు అనుగుణంగానే స్పెక్ట్రం కేటాయింపు నిర్ణయాలు తీసుకున్నా మని చెప్పారు. ‘దేశ ప్రయోజనాలను దృష్టి లో ఉంచుకునే ఆనాడు నిర్ణయాలు తీసుకున్నాం. టెలికాం రంగంలో పోటీ వాతావరణం తీసుకురావడం వల్ల కాల్ చార్జీలు దిగి వచ్చాయి. నా నిర్ణయాలపై, న్యాయ వ్యవస్థపై ఎప్పుడూ విశ్వాసం కోల్పోలేదు. అవే ఈ రోజు నిజమయ్యాయి. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చా. గొప్ప పనులు చేసిన వారిని చరిత్రలో నేరగాళ్లుగా చూడటం కొత్తేమీ కాదు’ అని రాజా వ్యాఖ్యానించారు.
క్షమాపణ చెప్పాలి: కాంగ్రెస్
స్పెక్ట్రమ్ కుంభకోణంపై తీర్పు ఇచ్చిన ఉత్సాహంతో కాంగ్రెస్ బీజేపీపై ఎదురుదాడికి దిగింది. ఎట్టకేలకు సత్యం గెలిచిందని, తమపై తప్పుడు ప్రచారం చేసిన ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. 2జీ స్పెక్ట్రం కేటాయింపులను అతిపెద్ద కుంభకోణంగా అభివర్ణించిన అప్పటి కాగ్ వినోద్‌రాయ్‌ని బాధ్యుణ్ని చేయాలని పేర్కొంది. తమ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని తేల్చిన కోర్టు తీర్పును గౌరవించాలని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. యూపీఏ హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన పి.చిదంబరం స్పందిస్తూ...యూపీఏ 2 ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వ్యక్తులు ఈ కుంభకోణంలో చిక్కుకున్నారన్న ఆరోపణలు నిజం కాదని నిరూపితమైందని అన్నారు. కోర్టు తీర్పుతో బీజేపీ సాధించిందేం లేదని, తన వాదనే నెగ్గిందని టెలికాం మాజీ మంత్రి కపిల్ సిబల్ పేర్కొన్నారు.
ఆ కేటాయింపులు
లోపభూయిష్టమే: కేంద్రం
యూపీఏ హయాంలో జరిగిన 2జీ స్పెక్ట్రం కేటాయింపులు లోపభూయిష్టం, అవినీతిమయమని కేంద్రం పేర్కొంది. పరిమితంగా ఉన్న వనరులను వేలం వేయడమే ఉత్తమ మార్గమని, యూపీఏ ప్రభుత్వం ఆచరించిన ‘ముందొచ్చిన వారికి ప్రాధాన్యత’ విధానం సరైనది కాదని టెలికాం మంత్రి మనోజ్ సిన్హా అభిప్రాయపడ్డారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ...స్పెక్ట్రం కేటాయింపులో యూపీఏ నిర్హేతుకంగా వ్యవహరించిందని, కొద్ది మందికే ప్రయోజనం కలిగించేలా నిర్ణయాలు తీసుకుందని అన్నారు. ఈ కేసులో అవినీతి జరిగిందని నొక్కిచెప్పడానికి సుప్రీంకోర్టు గత ఆదేశాలను ఉటంకించిన జైట్లీ...విచారణ కోర్టు తీర్పును కాంగ్రెస్ గౌరవ సూచకంగా భావిస్తోందని ఎద్దేవా చేశారు.
హైకోర్టుకెళ్తాం: సీబీఐ
2జీ కేసులో ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేస్తామని సీబీఐ వెల్లడించింది. సాధారణంగా ఉన్నత న్యాయ స్థానాల్లో అప్పీల్‌కు వెళ్లే ముందు కోర్టు ఉత్తర్వులను క్షణ్నంగా అధ్యయనం చేసే సీబీఐ ఈసారి మాత్రం వెంటనే ఈ నిర్ణయం తీసుకుంది. ‘ 2జీ కేసు తీర్పును ప్రాథమికంగా పరిశీలించాం. ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలను కోర్టు సరైన రీతిలో పరిగణలోకి తీసుకోలేదు. ఈ విషయంలో న్యాయపరంగా దిద్దుబాటు చర్యలు చేపడతాం’ అని సీబీఐ అధికార ప్రతినిధి అభిషేక్ దయాల్ తెలిపారు. తీర్పును పరిశీలించిన తరువాత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని ఈడీ కూడా చెప్పింది.
క్లీన్‌చిట్ కాదు: బీజేపీ
ఈ కేసులో నిందితులను సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించడం కాంగ్రెస్‌కు క్లీన్‌చిట్ ఇచ్చినట్లు కాదని బీజేపీ పేర్కొంది. అప్పటి యూపీఏ ప్రభుత్వం చార్జిషీటును ప్రభావితంచేయడం వల్లే వారు నిర్దోషులుగా బయటపడ్డారని కేంద్ర మంత్రి జవదేకర్ ఆరోపించారు.
ఏచూరీ లేఖతో వెలుగులోకి
2జీ కుంభకోణాన్ని బయటపెట్టింది ఎవరు? అని ప్రశ్నిస్తే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) అనే ఎక్కువ మంది బదులిస్తారు. అయితే ఈ దీన్ని వెలికి తీయడంలో అసలు సూత్రధారి మాత్రం సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరీ. టెలికం లైసెన్సుల వేలంలో అక్రమాలు జరిగాయని నాటి ప్రధాని మన్మోహన్‌కు ఆయన రాసిన లేఖతో 2జీ వ్యవహారం వెలుగుచూసింది. ఆ లేఖకు మన్మోహన్ జవాబివ్వకపోయినా.. పరిశీలన కోసం టెలికం శాఖకు పంపారు. అప్పుడు యూపీఏ సర్కారుకు సీపీఎం వెలుపలి నుంచి మద్దతిస్తోంది. ఆ తర్వాత మాజీ మంత్రి సుబ్రమణ్యస్వామి కూడా 2జీ కేటాయింపులపై ఆరోపణలు చేస్తూ.. 2008 నవంబర్ నుంచి ప్రధానికి అనేక ఉత్తరాలు రాశారు. అనంతరం ఏచూరి కూడా మరో రెండు సార్లు 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని మన్మోహన్ సింగ్‌కు లేఖలు రాశారు.
Comments
Please login to add a commentAdd a comment