ఏబీకే ప్రసాద్
రాజ్య వ్యవస్థలోని మూడు విభాగాలు విధి నిర్వహణలో పాటించవలసిన బాధ్యతలకు సంబంధించి ‘ఇబ్బంది’ ఏర్పడినప్పుడల్లా పాలకులు నర్మగర్భంగానూ, బహిరంగంగానూ న్యాయస్థానాల్ని బెదిరించడం ఇటీవలి కాలంలో ‘ముదిరిపోతున్న జబ్బు’. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ తదితరులు ఒకటికి రెండుసార్లు అదే చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పాలకులూ అలాగే ప్రవర్తిస్తున్నారు! రాజ్యాంగ స్ఫూర్తికి, ఆదేశిక సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. న్యాయవ్యవస్థ తప్పుడు చట్టాలపై భాష్యం చెప్పడం గానీ, జోక్యం చేసుకుని సన్మార్గంలో పెట్టడం గానీ సాధ్యపడని ఒక చెడు సంప్రదాయానికి మన పాలకులు క్రమంగా అలవాటు పడుతున్నారు. ఇది ప్రజాస్వామ్య సంప్రదాయాలకు పరమ విరుద్ధమైన పరిణామం.
‘‘దేశ ప్రజలకు ఆర్థిక సమన్యాయం, అందరికీ సమాన అవకాశాలు కల్పిం చడం ద్వారా వర్గరహిత సమాజాన్ని నిర్మించడమే మన తుది లక్ష్యం. మానవా ళిని సమున్నతమైన భౌతిక, సాంస్కృతికస్థాయికి చేర్చగల ప్రణాళికాబద్ధమైన సమాజ నిర్మాణమే ఆ ధ్యేయం. అలాంటి సమాజ నిర్మాణంలో అడ్డుతగిలే ప్రతి పరిణామాన్ని, ప్రతిఘటనను సాధ్యమైనంత వరకు సౌమనస్యంతోనే తొలగించుకోవాలి, అది వీలులేని సందర్భాల్లో ఆ అడ్డుగోడలను బలవంతంగా నైనా కూల్చివేయాలి. ఈ క్రమంలో తరచుగా బలప్రయోగమే అవసరం కావొచ్చు’’
- పండిట్ నెహ్రూ
భారత రాజ్యాంగం ప్రధాన లక్ష్యాన్ని, దేశ అవసరాన్నీ చాలా కాలం క్రితమే నొక్కి చెప్పిన నెహ్రూ మాటల్ని ఉదహరిస్తూ స్వతంత్ర భారత సుప్రీం కోర్టు ధర్మాసనం చైతన్యం వల్లనే ప్రజాప్రయోజనాల రక్షణకు ఒక ‘ఆయుధం’ (‘పిల్’) ప్రజల చేతికి ఒనగూడిందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్ పేర్కొన్నారు. అలాంటి ‘ప్రజాప్రయోజన వ్యాజ్యం’ ఆధారంగానే రాజ్యాంగం, న్యాయవ్యవస్థ అనుమతించిన పరిధులలోనే ఏ మేరకు న్యాయాన్ని ఆవిష్కరించవచ్చునో నిరూపించిన వారు సుప్రసిద్ధ న్యాయ వాది ప్రశాంత్ భూషణ్, సుప్రీంకోర్టూ, దేశ పరిధులలో ఉన్న రేడియో తరం గాలు దేశ వనరులు, ప్రజల ఉమ్మడి సొత్తు. కాబట్టి వాటిని ఏ కొలది దేశ, విదేశ మల్టీనేషనల్ కంపెనీలో తమ లాభాల కోసం దుర్వినియోగం చేయడాన్ని అను మతించరాదంటూ, ‘2-జి’ స్పెక్ట్రమ్ కేసుల్లో ప్రభుత్వ వైఖరిని, కేసుల విచా రణలో సీబీఐ వ్యవహరిస్తూ వచ్చిన తీరునూ సుప్రీం ఘాటుగా విమర్శించింది. ముఖ్యంగా సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా ‘2-జి’ కుంభకోణాల విచారణ సంద ర్భంగా అవినీతికి పాల్పడిన కంపెనీ అధిపతుల్ని కాపాడటానికి ప్రయత్నించా రని ఆధారాలతోసహా ప్రశాంత్ భూషణ్ సమర్పించిన డాక్యుమెంట్లను ధర్మా సనం నమ్మింది, పర్యవసానంగా ‘2-జి’ కేసుల విచారణ నుంచి తప్పుకోవా లని సిన్హాను ఆదేశించింది! సిన్హాను ఎందుకు తప్పించవలసి వచ్చిందో కారణా లను బయట పెట్టడానికి కోర్టు నిరాకరించింది. అయినప్పటికీ ఒక గౌరవ విచారణ సంస్థగా ‘సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’కు (సీబీఐ) ఉన్న ప్రతి పత్తి దృష్ట్యా, దానిపై ప్రజలకింకా కొంత విశ్వాసం ఉన్నందున తమాయించు కోవలసివచ్చిందని ధర్మాసనం హుందాగా ప్రకటించింది.
కదిలిన సీబీఐ డొంక
అంతకుముందు సీబీఐ డెరైక్టర్ సిన్హా తన ఇంటి నుంచి ప్రశాంత్ భూషణ్‌కు సమాచారం అందించిన ‘వేగు’ (విజిల్ బ్లోయర్) పేరు చెప్పాలని పట్టుప ట్టాడు. కోర్టు కూడా కోరగా ప్రశాంత్ భూషణ్ ఒక సీల్డ్ కవర్‌లో ఆ సమాచా రాన్ని కోర్టుకు అందజేశారు. దాన్ని పరిశీలించి, విశ్వసించిన మీదటనే ధర్మాస నం రంగంలోకి దిగింది. స్పెక్ట్రమ్ కుంభకోణాల్లో భాగస్వాములుగా నమోదైన రిలయన్స్ (ఎయిర్‌సెల్ - మాక్సిస్ డీలు), 2-జి కేసులో నిందితుడైన షాహిద్ బల్వాలపైన ఉన్న కేసును బలహీనపర్చడానికి చార్జిషీట్ దాఖలు కాకుండా సిన్హా అడ్డుకుంటున్నాడన్న ప్రశాంత్ భూషణ్ నిరూపణను సుప్రీం విశ్వసించిన దరిమిలానే సీబీఐ డెరైక్టర్ పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించింది. దీనితో ‘సీబీఐ’ డొంక అంతా కదలవలసివచ్చింది! అంతేకాదు, ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్ దత్తా, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ ఎ.కె.సిక్రీలతో కూడిన ధర్మాస నం, విచారణకు ముందు... కేసులో సిన్హా వ్యవహరించిన తీరుకు సంబంధిం చిన సాక్ష్యాధారాలను పరిశీలించడానికి సుప్రీం నియమించిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆనంద్ గ్రోవర్ పిటిషనర్ల సాక్ష్యం సరైనదేనని ధ్రువీకరించింది! అంటే, సీబీఐపై ప్రజల్లో మిగిలి ఉన్న విశ్వాసాన్ని కోర్టు గౌరవించింది. అయితే సీబీఐ చాలా కాలంగా పాలకుల కనుసన్నలలో నడచుకుంటూ, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఏ ప్రత్యర్థులపైన, లేదా ఏ ప్రత్యర్థి రాజకీయ నేతలపైన కేసులు బనాయించాలని ఆదేశిస్తే ఆ తాఖీదుల్ని తలదాల్చేదిగానే వ్యవహరిస్తోందని ప్రజలలో నమ్మకమో, అపనమ్మకమో బలపడుతూ వచ్చింది! పాలకుల ఈ విద్వేషపూరితమైన పాక్షికత వల్లనే కోర్టులలో కేసులు కొలిక్కి రావటం లేదు. ఇది పాత, కొత్త ప్రభుత్వాలన్నిటికీ వర్తిస్తుంది. ఎందుకంటే, 2-జి కుంభకో ణాల కేసులలోని గుత్త కంపెనీలు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాలు చెల్లవని, అవి రద్దుకావలసిందేనని కోర్టు తీర్పు చెప్పిన తరవాతనే బీజేపీ- ఆర్‌ఎస్ ఎస్ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తీర్పును ఆసరా చేసుకుని అది కూడా మా పద్ధతిలో మేమూ వ్యవహరిస్తామని ముందుకు వచ్చింది. అంటే, ‘‘ఎడమ చేయి స్థానంలో పురచేయి’’ ప్రవేశించింది!
‘ముదిరిపోతున్న జబ్బు’
రాజ్య వ్యవస్థలోని మూడు విభాగాలు (ప్రభుత్వ నిర్వాహకులు, న్యాయస్థానం, శాసనవేదిక) విధి నిర్వహణలో పాటించవలసిన బాధ్యతలకు సంబంధించి ‘ఇబ్బంది’ ఏర్పడినప్పుడల్లా పాలకులు నర్మగర్భంగానూ, బహిరంగంగానూ న్యాయస్థానాల్ని బెదిరించడం ఇటీవల కాలంలో ‘ముదిరిపోతున్న జబ్బు’. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, మాజీ మంత్రి కపిల్ సిబల్‌లు ఒకటికి రెండు సార్లు అదే పనిచేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పాలకులూ అలాగే ప్రవర్తిస్తున్నారు! రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, దాని ఆదేశిక సూత్రాలకు వ్యతిరేకంగా, దాని ఉపోద్ఘాతంలో వివరించిన ఆదర్శ సమాజ నిర్మాణ సూత్రా లకు భిన్నంగా పాలకులు వ్యవహరిస్తున్నారు. ధర్మాసన చైతన్యాన్ని నిరుత్సాహ పరచడానికి, కన్నెర్ర చేయడానికి కూడా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ సాహసిస్తు న్నది. ఈ తప్పుడు సంప్రదాయం ప్రకారం న్యాయవ్యవస్థ తప్పుడు చట్టాలపై భాష్యం చెప్పడం గానీ, జోక్యం చేసుకుని సన్మార్గంలో పెట్టడంగానీ సాధ్య పడని ఒక చెడు సంప్రదాయానికి మన పాలకులు క్రమంగా అలవాటు పడుతు న్నారు. ఇది ప్రజాస్వామ్య సంప్రదాయాలకు పరమ విరుద్ధమైన పరిణామం. రాజ్యాంగ నిర్మాతలు భావి పాలకులపై పెట్టుకున్న ఆశలకు నేటి పాలకుల ప్రవర్తన పెద్ద అపవాదు. గాడితప్పిన పాలకుల అవినీతివల్లనే దేశ, విదేశాల్లోని దేశీయ అక్రమార్జనాపరుల నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామన్న వారి శపథాలు నోటి మాటలుగా మిగిలిపోతున్నాయి! ఈ పరిస్థితుల్లో న్యాయస్థానాలపై కూడా రాజకీయ కలుషిత వాతావరణ ప్రభావం అంతో ఇంతో పడకతప్పదు.
సామాజిక దృష్టి కోణంతో న్యాయం
అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో జస్టిస్ వారెన్ నాటి ప్రెసిడెంట్ ఐసెన్ హోవర్‌కు ఒక ఆరోగ్యకర సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ ‘‘ధర్మాసన చైతన్యం ద్వారా దూరదృష్టిగల న్యాయమూర్తులు కూడా సమా జాన్ని మార్చగలర’’ని చెప్పాడు! కాని తరువాతి కాలంలో అదే గాడి తప్పి, జూనియర్ బుష్ రెండవసారి అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినా, అతణ్ణి కాపాడటా నికి అమెరికా సుప్రీంకోర్టు తనకున్న ఒకే ఒక్క మెజారిటీ ఓటును దుర్వినియో గం చేయడానికి సాహసించింది! అందుకే ఒక సందర్భంలో జస్టిస్ కృష్ణయ్యర్ ‘‘న్యాయమూర్తులు ఆచరణలో సమతావాదులుగా, లౌకిక వ్యవస్థ సంరక్షకు లుగా మారితే ప్రజాప్రయోజన వ్యాజ్యానికి విప్లవాత్మకశక్తిని ప్రసాదించగలర’’ న్నారు. కానీ ఆ దశ ఇంకా పరిపూర్ణ స్థాయిలో మన న్యాయవ్యవస్థకు రాలేద న్నారు. ఎందుకంటే దృష్టికోణం మారితేగాని ఆ ఆదర్శం దగ్గరకు చేరదు, నిల దొక్కుకోదు! ఆయనే దాన్ని ఇలా వివరించారు:
‘‘సమాజ దృష్టికోణానికి దూరంగా ఉండే న్యాయమూర్తులు తమ వర్గ పక్షపాతానికి, మల్టీనేషనల్ కంపె నీల, రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతారు లేదా ప్రధానమంత్రి ప్రసంగానికి భయ పడతారు. అంతకన్నా పెద్ద పాపం ఏమంటే - ప్రభువుల స్వార్థ ప్రయోజనాల కొద్దీ చొప్పించే అవినీతికి నింపాదిగా లోబడి పోతారు. ఇది మరింత ప్రమాదకరం’’. గతంలో సరిగ్గా ఇలాంటి వాతా వరణంలోనే ప్రశాంత్ భూషణ్ ఒక అఫిడవిట్‌లో (7-12-2009) సుప్రీం మాజీ ప్రధాన న్యాయమూర్తులు 16 మందిలో ఎనమండుగురు అవినీతికి పాల్పడ్డారని చూపి సంచలనం రేపారు! కృష్ణయ్యర్ న్యాయవ్యవస్థ గురుతర బాధ్యతల్ని ఇలా గుర్తుచేశారు: ‘‘న్యాయ మూర్తులలో సామాజిక పరువు, ప్రవర్తన, నైతిక దారుఢ్యం, స్వతంత్రంగా నిలబడగల సాహసం దిగజారిపోయి ఉంటే, సామాజిక విప్లవం అసంభవం. ఎందుకంటే, ఆర్థిక సంబంధమైన తాత్త్విక చింతన లేదా సామాజిక అభ్యు దయం పట్ల అనురక్తి, అనుకంపన లేని న్యాయవ్యవస్థ - సంస్కరణలకూ ప్రజలలో చైతన్యదీప్తికీ ఆధునిక ప్రాపంచిక దృక్పథానికీ పెద్ద గుదిబండే కాగలదు’’. కనుకనే లార్డ్ జస్టిస్ స్క్రూలున్ ‘‘న్యాయవ్యవస్థలో నిష్పాక్షికతను సాధించడం ఎంత కష్టమైనదో, దాన్ని నిలబెట్టుకోవటమూ అంతే కష్ట సాధ్యమని జోస్యం చెప్పి పోయాడు.