రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు కుమ్మక్కై దేశ సహజ సంపదను దోపిడీ చేసిన సంఘటనలో సంచలనాలు నమోదు అవుతున్నాయి.
న్యూఢిల్లీ : రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు కుమ్మక్కై దేశ సహజ సంపదను దోపిడీ చేసిన సంఘటనలో సంచలనాలు నమోదు అవుతున్నాయి. భారతీయ పారిశ్రామిక రంగంలో ప్రముఖ వ్యక్తి అయిన కుమార మంగళం బిర్లా పేరును సీబీఐ.. బొగ్గు కుంభకోణం నిందితుల జాబితాలో చేర్చింది.
14వ ఎఫ్ఐఆర్లో బిర్లాతో పాటు ఆయనకు చెందిన హిందాల్కో కంపెనీ పేరును, ప్రభుత్వ రంగ సంస్థ అయిన నాల్కో పేరును కూడా చేర్చింది. ఇందుకు సంబంధించి ఢిల్లీ, కోల్‌కతా, భువనేశ్వర్, ముంబాయి, హైదరాబాద్‌ల్లో సోదాలు జరిపినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. కుమార్ మంగళం బిర్లా కంపెనీకి 2005లో బొగ్గు గనులు కేటాయించడంలో అవకతవకలకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది.
46 ఏళ్ల బిర్లా.. ఈ కేసులో కుట్ర, మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీబీఐ కుమార మంగళం బిర్లాను ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. ఇదే కేసులో బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పి.సి.పరేఖ్ పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. బొగ్గు శాఖ ప్రధానమంత్రి దగ్గర ఉన్న నేపథ్యంలో ఈ కేసుకు చాలా ప్రాధాన్యం ఏర్పడింది. పారదర్శకంగా వేలం పాట నిర్వహించకుండా ఇష్టానుసారం బొగ్గు గనులు కేటాయించడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును త్వరితగతిన విచారణ జరపాలని సీబీఐని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.