నివేదిక ఇలాగేనా?
బొగ్గు స్కాంలో సీబీఐపై ప్రత్యేక న్యాయస్థానం ఆగ్రహం
న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపుల కుంభ కోణానికి సంబంధించిన కేసులో తుది నివేదికను సీబీఐ సరైన పద్ధతిలో సమర్పించక పోవడంపై ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు, కాంగ్రెస్ ఎంపీ నవీన్‌జిందాల్ తదితరులు నిందితులుగా ఉన్న ఈ కేసుకు సంబంధించి సీబీఐపై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సీబీఐకి కోర్టులో నివేదికను ఎలా సమర్పించాలో తెలియదా? అని ప్రత్యేక సీబీఐ న్యాయమూర్తి భరత్ పరాష్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తుది నివేదికను తన ముందు దాఖలు చేసిన తీరును ఆయన తప్పుపట్టారు. నివేదికను సమర్పించిన సీబీఐ ఇన్‌స్పెక్టర్‌ను ఉద్దేశించి న్యాయమూర్తి.. జూనియర్ అధికారి మాదిరిగా వ్యవహరించొద్దని సూచించారు. సరైన ఫార్మాట్‌లో తుది నివేదికను సమర్పించనట్లయితే దానిపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. తొలుత ఈ నివేదికను సరైన ఫార్మాట్‌లో సమర్పించేందుకు న్యాయస్థానం సదరు అధికారికి మూడు రోజుల సమయం ఇచ్చింది. అయితే దానికి అతను నిస్సహాయత తెలియజేయడంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు.