న్యూఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను రౌస్ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరిచింది సీబీఐ. ఈ కేసులో ఆయనను విచారించేందుకు ఐదు రోజుల కస్టడీ ఇవ్వాలని కోరింది. తాము అడిగే ప్రశ్నలకు సిసోడియా సరిగ్గా సమాధానాలు ఇవ్వడం లేదని, మొబైల్ ఫోన్లు కూడా మార్చారని కోర్టుకు చెప్పింది. ఈ కేసులో ఆయనదే కీలక పాత్ర అని పేర్కొంది.
'ఢిల్లీ లిక్కర్ పాలసీలో చాలా ప్రణాళికాబద్ధంగా ,రహస్యంగా కుట్ర పన్నారు. ఈ కేసులో మనీష్ సిసోడియాను మరింత లోతుగా విచారించాల్సి ఉంది. ఆయన ఒకేసారి అనేక మొబైల్ ఫోన్లను మార్చారు. నిందితులతో మాట్లాడిన సాక్ష్యాలను చెరిపివేసారు. లిక్కర్ పాలసీలో చివరి నిమిషంలో మార్పులతో లైసెన్స్లు పొందిన వారికి లబ్ది చేకూర్చారు. లిక్కర్ పాలసీలో కమీషన్ను 5 శాతం నుంచి ఏకంగా 12 శాతానికి పెంచారు. సిసోడియా జనవరి 2020 నుంచి ఉపయోగిస్తున్న ఫోన్ కోసం అడుగుతున్నాము.' అని సీబీఐ తరఫు న్యాయవాది ఆరోపించారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన నిందితులు ఇచ్చిన స్టేట్‍మెంట్‌లను ప్రస్తావించారు.
అయితే సిసోడియాను అక్రమంగా అరెస్టు చేశారని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది దయన్ కృష్ణన్ వాదించారు. ఆయనకు తక్షణమే బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ' ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేకపోయినా సీబీఐ అరెస్ట్ చేసింది. న్యాయ నిబంధనలకు వ్యతిరేకంగా అరెస్ట్ చేశారు. సిసోడియాను కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదే సీబీఐ కేసులో విజయ్ నాయర్ ఇప్పటికే బెయిల్ పొందారు. సీబీఐ అధికారులకు సిసోడియా తన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ డివైజ్‌లను అప్పగించారు . ఇప్పటికే సీబీఐ పలుమార్లు చేసిన సోదాల్లో ఎటువంటి ఆధారాలు లభించలేదు. లెఫ్టినెంట్ గవర్నర్ లిక్కర్ పాలసీని ఆమోదించారు.
మళ్ళీ ఎందుకు సీబీఐకి రిఫర్ చేశారు. మనీష్ రిమాండ్‌కు గల కారణాలు చట్టంలో ఏమాత్రం సమర్థనీయం కాదు. ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, మీటింగ్‌లు ఏవీ మనీష్కి సంబంధించినవి కావు. సిసోడియా నాలుగు ఫోన్లు ఉపయోగించారని, వాటిలో మూడు ధ్వంసమయ్యాయని సీబీఐ చెప్పింది . సీబీఐ వచ్చి నన్ను అరెస్ట్ చేస్తుందని ఊహించి ఆ ఫోన్లు ఉంచాలా? సీబీఐకి అన్నివిధాలుగా సహకరించారు. ఇంట్లొ సోదాలు చేశారు. ఫోన్లు వారి వద్దే ఉన్నాయి. బ్యాంక్ లాకర్స్ సోదాలు చేశారు. సీబీఐ ప్రతి నోటీసుకు సిసోడియా హాజరయ్యారు.' అని దయన్ కృష్ణన్ కోర్టుకు తెలిపారు.
వాడీవేడీగా సాగిన వాదనలు విన్న న్యాయస్థానం ఉత్తర్వులను రిజర్వు చేసింది. అనంతరం కాసేపటి తర్వాత సిసోడియాకు ఐదు రోజుల కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి సిసోడియాను ఆదివారం 8 గంటలపాటు ప్రశ్నించింది సీబీఐ. అనంతరం ఆయనను అరెస్టు చేసింది. ఈ చర్యను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. సిసోడియాకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరనసలు చేపట్టింది. ఈ క్రమంలో ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద నిరసనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. పోలీసులు, ఆప్ మద్దతుదారుల మధ్య తోపులాట జరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో సిసోడియాను కట్టుదిట్టమైన భద్రత నడుమ కోర్టులో హాజరుపరిచారు సీబీఐ అధికారులు.
చదవండి: ఎమ్మెల్యేల ఎర కేసు విచారణ.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment