కవిత కస్టడీ పిటిషన్‌లో సీబీఐ ఆరోపణలు
భూ కొనుగోలు డీల్ ద్వారా ఈ విషయం వెల్లడైంది
లిక్కర్ స్కామ్‌లో ఆమె బెదిరింపులకు పాల్పడ్డారు
ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలన్న దర్యాప్తు సంస్థ
కవితను అన్యాయంగా అరెస్టు చేశారన్న ఆమె న్యాయవాది
మూడు రోజులు కస్టడీకి అనుమతించిన న్యాయమూర్తి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒకానొక సమయంలో బెదిరింపులకు కూడా పాల్పడ్డారంటూ సీబీఐ సంచలన ఆరోపణలు చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన శరత్‌చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డిలను కవిత భయపెట్టినట్లు కోర్టుకు తెలిపింది. కుంభకోణంలో కవితను సూత్రధారి, పాత్రధారిగా పేర్కొంది. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి కవితను ఐదు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా మూడు రోజులపాటు కవితను సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు తిరిగి కవితను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు.
విజయ్‌నాయర్‌కు హవాలా రూపంలో డబ్బులు
లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ కేసులో తీహార్ జైలులో ఉన్న కవితను శుక్రవారం అధికారులు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఐదు రోజుల పాటు కవిత కస్టడీ కోరుతూ సీబీఐ, సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను న్యాయమూర్తి విచారించారు. ఈడీ తరఫు న్యాయవాది పంకజ్ వాదనలు వినిపిస్తూ.. ‘లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన దర్యాప్తులో అనేక సంచలన విషయాలు బహిర్గతమయ్యాయి. ఈ కేసులో ఒక నిందితుడైన విజయ్ నాయర్ (కేజ్రీవాల్ అనుచరుడు)కు రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు మరో నిందితుడైన దినేష్ అరోరా ద్వారా హవాలా రూపంలో చెల్లించారు.
ఈ నేరపూరిత కుట్రకు అనుగుణంగా ఇండో స్పిరిట్స్‌లో 65 శాతం వాటా, రూ.29.29 కోట్లను సౌత్‌గ్రూపులోని నిందితులకు బదిలీ చేశారు. గోవా ఎన్నికల సమయంలో ఆప్ ఎన్నికల ప్రచారం నిమిత్తం రూ.44.45 కోట్లు వినియోగించారు. కవిత మాజీ ఆడిటర్ బుచి్చబాబు ఫోన్ వాట్సాప్ చాట్‌లు, భూ కొనుగోలు ముసుగులో సొమ్ము లావాదేవీలు బహిర్గతం అయ్యాయి. ఆమ్ ఆద్మీ పారీ్టకి రూ.100 కోట్లు వసూలు చేసి ఇవ్వడానికి పన్నిన నేరపూరిత కుట్రలో కల్వకుంట్ల కవిత కీలక పాత్రధారిగా ఉన్నట్లు సదరు భూ కొనుగోలు డీల్ ద్వారా వెల్లడైంది..’అని చెప్పారు.
కవితతో మద్యం వ్యాపారి భేటీ
దక్షిణాదికి చెందిన ఓ మద్యం వ్యాపారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారని వెల్లడైంది. ఢిల్లీలో మద్యం వ్యాపారం చేయడానికి తనకు మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రిని వ్యాపారి కోరగా.. ఎమ్మెల్సీ కవిత సంప్రదిస్తారని కేజ్రీవాల్ చెప్పినట్లు వెలుగులోకి వచ్చింది. తర్వాత సదరు వ్యాపారి కవితతో ఆమె నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే ఆమ్ ఆద్మీ పారీ్టకి రూ.100 కోట్లు సమకూర్చాల్సి ఉందని, దాంట్లో రూ.50 కోట్లు సదరు వ్యాపారి అందజేయాల్సి ఉంటుందని, తద్వారా మీరు వ్యాపార భాగస్వామి అవుతారని కవిత ఆయనకు తెలిపారు.
అనంతరం బుచి్చబాబు డిమాండ్ మేరకు తన కుమారుడి ద్వారా కవిత అనుచరులకు రూ.25 కోట్లు వ్యాపారి చెల్లించారు. ఈ చెల్లింపులకు గానూ వ్యాపారి కుమారుడికి ఇండో స్పిరిట్స్‌లో 32.5 శాతం వాటా దక్కింది. విజయ్‌నాయర్‌కు రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్లు చెల్లించినట్లుగా మరో నిందితుడు అభిషేక్ బోయినపల్లి తనకు చెప్పాడని అప్రూవర్ దినేష్ అరోరా తన వాంగ్మూలంలో వెల్లడించాడు. అభిõÙక్ బోయినపల్లి ఆదేశాల మేరకు హవాలా మార్గంలో గోవాకు భారీగా నగదు బదిలీ చేసినట్లు అప్పటి కవిత పీఏ అశోక్ కౌశిక్ చెప్పాడు. కౌశిక్ ద్వారా రూ.25 కోట్లు బదిలీ అయినట్లు రికార్డులు నిర్ధారించాయి. ఇండో స్పిరిట్స్‌లో తన ప్రాక్సీ అరుణ్ పిళై ద్వారా కవిత భాగస్వామ్యం కలిగి ఉన్నట్టు బుచ్చిబాబు ఫోను ద్వారా వెల్లడైంది..’అని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.
భూ కొనుగోలు డీల్ ముసుగులో రూ.14 కోట్లు!
భూ కొనుగోలు డీల్ ముసుగులో శరత్‌చంద్రారెడ్డికి చెందిన సంస్థల ఖాతాల నుంచి కల్వకుంట్ల కవితకు రూ.14 కోట్లు చేరాయి. నగదు బదిలీ ఒప్పందం అయితే జరిగింది కానీ అసలు భూమి బదిలీ కాలేదు. డిమాండ్ చేసిన మొత్తాన్ని చెల్లించడానికి శరత్‌చంద్రారెడ్డి ఆసక్తి చూపకపోవడంతో ఢిల్లీ, తెలంగాణలో వ్యాపారాలు దెబ్బతీస్తానని కవిత బెదిరించినట్లు వెల్లడైంది. పలువురు స్టేట్‌మెంట్ల ఆధారంగా కేసులో ప్రధాన కుట్రదారుల్లో కవిత ఒకరిగా తేలింది. దీంతో ఆమెను నిందితురాలిగా పరిగణనలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. తదనంతర పరిణామాల్లో కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేసింది. తర్వాత కోర్టు అనుమతితో కవితను ఈ నెల 6న తీహార్ జైలులో విచారించాం. కుంభకోణంలో తన పాత్ర గురించి అడిగిన ప్రశ్నలకు ఆమె సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేదు. ఐదు రోజులు కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి..’అని పంకజ్ చెప్పారు.
న్యాయ ప్రక్రియను ఉల్లంఘించారు: కవిత న్యాయవాది
కవిత అరెస్టు విషయంలో న్యాయ ప్రక్రియను ఉల్లంఘించారని కవిత తరఫు సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి తెలిపారు. ఇప్పటికే కస్టడీలో ఉన్న కవితను అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సాక్షుల వాంగ్మూలాలు, ఇతరత్రా రూపంలో ఇప్పటికే తమ వద్ద ఉన్న అంశాలతో అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపించారు. దర్యాప్తు సంస్థ చూపిన కస్టడీ కారణాలు చట్ట విరుద్ధంగా ఉన్నాయన్నారు. కవిత విషయంలో ప్రాథమిక హక్కులు ఉల్లంఘించిన నేపథ్యంలో సీబీఐ పిటిషన్ కొట్టివేయాలని కోరారు.
కవిత పిటిషన్ కొట్టివేత
ఇరు పక్షాల వాదనల అనంతరం న్యాయమూర్తి కావేరి బవేజా.. తొలుత సీబీఐ పిటిషన్‌లో తీర్పు రిజర్వు చేశారు. మధ్యాహ్నం కవిత దాఖలు చేసిన సవాల్ పిటిషన్‌ను విచారించారు. కవిత పిటిషన్‌ను కొట్టివేస్తూ 22 పేజీలతో కూడిన ఆదేశాలు జారీ చేశారు. ‘వాస్తవాలు, కేసు పరిస్థితులు, వాదనలు పరిశీలించాక కవితను ఈ నెల 15 వరకూ సీబీఐ కస్టడీకి అనుమతిస్తున్నా. సీబీఐ అరెస్టును రద్దు చేయాలని కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నా. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సీసీ టీవీ పర్యవేక్షణలో కవితను విచారించాలి.
ప్రతిరోజూ సాయంత్రం 6– 7 గంటల మధ్య అరగంట సేపు తన న్యాయవాది మోహిత్‌రావుతో మాట్లాడే అవకాశం కవితకు ఇవ్వాలి. భర్త అనిల్‌కుమార్, సోదరుడు కల్వకుంట్ల తారక రామారావు, పీఏ శరత్‌చంద్రలు ఆ సమయంలోనే 15 నిమిషాలు మాట్లాడొచ్చు. నిందితురాలికి ఇంటి భోజనం, జపమాల, దుస్తులు, మేట్రస్, బెడ్ షీట్లు, తువ్వాళ్లు, దిండులను సీబీఐ అధికారులు అనుమతించాలి. ఆమె కోరిన పుస్తకాలు అనుమతించాలి..’అని న్యాయమూర్తి తన ఆదేశాల్లో స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment